Telugu Global
Cinema & Entertainment

ఈ మరణవార్త ఎంతమాత్రం ‘....ఓకె’ కాదు

కొండ వ‌ల‌స   సినీ రంగంలోకి రాక ముందు విశాఖ పోర్ట్ ట్రస్ట్‌లో ఉద్యోగం చేశారు. రంగస్థలంపై కొన్ని వందల కొద్దీ నాటక ప్రదర్శనలిచ్చిన కళాకారుడాయన. రంగస్థలంపై ఆయన ప్రతిభ చూసి, ప్రముఖ ఛాయాగ్రాహకుడు ఎం.వి. రఘు తన దర్శకత్వంలో తీసిన ‘కళ్ళు’ (1988) చిత్రంలో రౌడీ పాత్ర ద్వారా కొండవలసను సినీ రంగానికి పరిచయం చేశారు. ఆ తొలి చిత్రం తరువాత చాలా కాలం గ్యాప్ వచ్చిన కొండవలస మళ్ళీ వంశీ దర్శకత్వంలోని ‘ఔను… వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు’ […]

ఈ మరణవార్త ఎంతమాత్రం ‘....ఓకె’ కాదు
X

కొండ వ‌ల‌స సినీ రంగంలోకి రాక ముందు విశాఖ పోర్ట్ ట్రస్ట్‌లో ఉద్యోగం చేశారు. రంగస్థలంపై కొన్ని వందల కొద్దీ నాటక ప్రదర్శనలిచ్చిన కళాకారుడాయన. రంగస్థలంపై ఆయన ప్రతిభ చూసి, ప్రముఖ ఛాయాగ్రాహకుడు ఎం.వి. రఘు తన దర్శకత్వంలో తీసిన ‘కళ్ళు’ (1988) చిత్రంలో రౌడీ పాత్ర ద్వారా కొండవలసను సినీ రంగానికి పరిచయం చేశారు. ఆ తొలి చిత్రం తరువాత చాలా కాలం గ్యాప్ వచ్చిన కొండవలస మళ్ళీ వంశీ దర్శకత్వంలోని ‘ఔను… వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు’ (2002)తో రీ-ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాలోని ‘అయితే… ఓకె’ అనే డైలాగ్‌తో సినీరంగంలో స్థిరమైన స్థానం సంపాదించారు. గడచిన పదమూడేళ్ళుగా దాదాపు 200 పై చిలుకు చిత్రాల్లో కమెడియన్‌గా రాణించి, ప్రేక్షకులను నవ్వించారు. ఆయన నటించిన చిత్రాల్లో ‘కబడ్డీ… కబడ్డీ’, ‘ఎవడి గోల వాడిది’, ‘రాఖీ’, ‘రాధా గోపాళం’, ‘సైనికుడు’ లాంటి పాపులర్ సినిమాలు అనేకం ఉన్నాయి.

సినీ రంగంలో కొండవలసగా ప్రసిద్ధులైన కొండవలస లక్ష్మణరావు స్వగ్రామం – శ్రీకాకుళం జిల్లాలోని కొండవలస అనే పల్లెటూరు. ఆ ఊరి పేరే ఆయన ఇంటిపేరు కూడా. కొండవలస తండ్రి రైల్వే ఉద్యోగి. తండ్రి ఉద్యోగ రీత్యా ఆయన కొన్నాళ్ళు ఒడిశాలోని కంటాబంజీలో కూడా ఉన్నారు. అక్కడకు వచ్చే బుర్రకథ బృందాలు చూసి, చిన్నప్పుడే కొండవలస ప్రేరణ పొందారు. విజయనగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రసిద్ధమైన కుమ్మరి మాస్టారు బుర్రకథ చూసి ఆయననూ, అలాగే ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు చూసినప్పుడు వాళ్ళనూ అనుకరించడం ద్వారా కొండవలస నటన వైపు బుడిబుడి అడుగులు వేశారు.

విశాఖపట్నంలో కాలేజీలో చదువుకొనే రోజుల్లో ‘సవతి తల్లి’ అనే నాటికలో ద్విపాత్రాభినయం చేసి, బహుమతి అందుకున్న కొండవలస ఆ తరువాత నాటకాల వైపు మొగ్గారు. విశాఖలోని ఏ.వి.ఎన్. కాలేజీలో డిగ్రీ చదువుతున్నప్పుడు కాలేజీలో విస్తృతంగా నాటకాలు వేస్తూ వచ్చారు. డిగ్రీ పూర్తవగానే పోర్ట్ ట్రస్ట్‌లో క్లర్కు ఉద్యోగం రావడంతో, అందులో చేరిపోయారు. పోర్ట్ ట్రస్ట్‌లో ఏటా జరిగే నాటికల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు కొండవలసకు బాగా కలిసి వచ్చాయి. రాష్ట్రస్థాయి నాటకాల పోటీల్లో పాల్గొని, బహుమతులు అందుకున్నారు. ‘స్వార్థం బలి తీసుకుంది’, ‘హెచ్చరిక’, ‘స్వాగతం’ అనే మూడు నాటకాలు కూడా రాసిన ఆయన, స్వయంగా మేకప్ వేయడం కూడా నేర్చుకున్నారు. ముగ్గురు అక్కచెల్లెళ్ళు, నలుగురు అన్నదమ్ములతో కూడిన పెద్ద కుటుంబం ఆయనది. ఆ కుటుంబ బాధ్యతలు తీర్చడానికి అప్పులు కూడా చేయాల్సి వచ్చేది. ఆ పరిస్థితుల్లో మేకప్ చేయడం ద్వారా వచ్చే సంపాదన కూడా కొంత ఉపయోగపడిందని కొండవలస ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు.

డైరెక్ట‌ర్ వంశీ, ఇ.వి.వి. సత్యనారాయణ లాంటి ప్రసిద్ధ హాస్య చిత్రాల దర్శకులందరితో పనిచేసిన కొండవలస రంగస్థల నటనను స్వర్గీయ జంధ్యాల కూడా మెచ్చుకున్నారు. రంగస్థల అభినయానికి జంధ్యాల నుంచి బహుమతి అందుకున్నప్పటికీ సినిమాల్లో మాత్రం ఆయన వద్ద నటించలేకపోవడం తనకు తీరని వెలితేనని కొండవలస ఎప్పుడూ అంటూ ఉండేవారు. ఇప్పుడు కొండవలస మృతితో తెలుగు హాస్య కుటుంబానికి వచ్చిన వెలితి కూడా ఇప్పుడిప్పుడే తీరేది కాదు! సినీ హాస్య ప్రియులకు ఈ మరణవార్త ఎంతమాత్రం ‘….ఓకె’ కాదు!!

First Published:  2 Nov 2015 11:07 PM GMT
Next Story