Telugu Global
Arts & Literature

రామాయణానికి అక్షరాంజలి సమర్పించిన... పూసపాటి పరమేశ్వరరాజు

”వాన వచ్చింది. ప్రకృతి వెల్లివిరిసింది. ఇంద్రచాపం శోభాయమానంగా తన రూపాన్ని ప్రదర్శిస్తుంది. ఇటువంటి సమయంలో జపనీయుడెవడైనా ఇంట్లో ఉండగలడా? బయటకు వెళ్ళి, ప్రకృతి ఒడిలో కలం పట్టుకుని హైకూలు వ్రాస్తాడు, లేదా కుంచెపట్టుకుని చిత్రాలు వేస్తాడు” అని అంటాడొక కవి. ఇది జపనీయుల సౌందర్యకాంక్షను వెల్లడిస్తుంది. వారు అంతగా సౌందర్య దాసులు కావడానికి వారి భాష కొంత వరకూ కారణం. క్షరము కానిది అక్షరము. ఆ అక్షరమే ప్రస్తుతం లిపిగా ధ్వనికి సంకేతంగా వాడబడుతుంది. ఇది ప్రపంచంలోని […]

రామాయణానికి అక్షరాంజలి సమర్పించిన... పూసపాటి పరమేశ్వరరాజు
X
poosapati
పూసపాటి పరమేశ్వరరాజు

”వాన వచ్చింది. ప్రకృతి వెల్లివిరిసింది. ఇంద్రచాపం శోభాయమానంగా తన రూపాన్ని ప్రదర్శిస్తుంది. ఇటువంటి సమయంలో జపనీయుడెవడైనా ఇంట్లో ఉండగలడా? బయటకు వెళ్ళి, ప్రకృతి ఒడిలో కలం పట్టుకుని హైకూలు వ్రాస్తాడు, లేదా కుంచెపట్టుకుని చిత్రాలు వేస్తాడు” అని అంటాడొక కవి. ఇది జపనీయుల సౌందర్యకాంక్షను వెల్లడిస్తుంది. వారు అంతగా సౌందర్య దాసులు కావడానికి వారి భాష కొంత వరకూ కారణం.

క్షరము కానిది అక్షరము. ఆ అక్షరమే ప్రస్తుతం లిపిగా ధ్వనికి సంకేతంగా వాడబడుతుంది. ఇది ప్రపంచంలోని కొన్ని భాషలకు మాత్రమే వర్తిస్తుంది. జపాను, చైనా భాషలకు వర్తించదు. చైనా, జపాన్‌ భాషలో అక్షరాల స్ధానాన్ని పదాలు ఆక్రమిస్తాయి. ఈ పదాలు, అక్షర సమూహాలు, ఈ పద సంకేతాలు చిత్రాలనుంచి వచ్చినవే. వీటిని వ్రాసే విధానం ఒక కళాత్మక వ్యాపకంగా సాగుతుంది. అందుచేతనే అక్కడ ‘లిపికళ’ కలిగ్రఫీ అనే పేరుతో రూపుదిద్దుకుంది.001కాగితం తయారుచేసే విధానం చైనా, జపాన్‌ ఖైదీల నుంచి తెలుసుకున్న అరబ్‌లు దానిని ముస్లిం ప్రపంచానికి పరిచయం చేశారు. కాగితం విరివిగా ఉపయోగంలోనికి వచ్చిన తరువాత అరబిక్‌, పర్షియన్‌, ఉర్దూ అక్షరాలు కూడా అందంగా రూపుదిద్దుకున్నాయి. పదకొండవ శతాబ్దం తరువాత, ముస్లిం దండయాత్రతో కాగితం భారత దేశం ప్రవేశించింది. భారతీయ తాళపత్రాలు, ఘంటాలు వెనక్కి వెళ్ళాయి. కాగితాలు, కలాలు, కుంచెలు ముందుకొచ్చాయి. ‘లిపికళ’ ఉర్దూతో బాటుగా దేవనాగరిని కూడా సౌందర్యవంతం చేసింది. పాశ్చాత్య లిపులలో ఇంగ్లీషు భాషతో పాటుగా అన్ని భాషల్లోనూ ఈ లిపికళ ఒక ఉన్నతమైన సౌందర్యస్థాయిని అందుకుంది. ఇంగ్లీషులో మొదట కలిగ్రఫీకు చాలా ప్రాముఖ్యత ఉన్నా, వ్రాత ఉపయోగం ఇబ్బడి ముబ్బడిగా పెరగటంతో లిపికి మూడు, నాలుగు బడులు అనేవి కొత్తగా ఏర్పడ్డాయి. కలిగ్రఫీలో అక్షరాలు చూడడానికి స్థిరంగా ఉండక కదలిక కలిగినట్లుగా భ్రాంతి కలిగిస్తుంది. కాగితంపై అక్షరాలు లయాత్మకంగా నృత్యం చేస్తున్నట్లు ఉంటాయి.002
ఈ కలిగ్రఫీలో అక్షరాలతో పాటు అందమైన రేఖా చిత్రాలనూ జమిలిగా వేయటం జరుగుతుంది. ఒక్కోసారి అక్షరాలు డిజైన్‌లో మమేకమవుతాయి. ఇది చిత్రకళలో ఒక ప్రత్యేకమైన శాఖగా శోభిల్లుతున్నా, దీనిలో కృషి చేసిన వారు చాలా తక్కువ. వారిలో ఎక్కువ మంది దీనిలోని అక్షర శోభకు మాత్రమే పరిమితమవుతున్నారు.

కళకు సరిహద్దులు చెరిపి వేసి వాటిని మరింత ముందుకు తీసుకొని వెడుతూ, కలిగ్రఫీలోని దేవనాగరి లిపితో చిత్రకళను సంయమనం చేస్తూ తనదైన శైలిని వృద్ధి చేసినవారు విజయనగర వాస్తవ్యులు, రాజ బంధువయిన పూసపాటి పరమేశ్వరరాజు. వీరు 1961వ సంవత్సరములో జన్మించారు. తండ్రి పూసపాటి అప్పలరాజు. ఆయన వృత్తి రీత్యా డాక్టరు. భారతీయ మిలటరీలో లెఫ్టినెంట్‌ కల్నల్‌గా పని చేశారు. తండ్రి మిలటరీ అధికారి కావటం వల్ల రాజుగారి బాల్యమంతా ఆంధ్ర రాష్ట్రానికి బయటే సాగింది. ఆయన తమిళనాడు, పుణేల నుంచి సైనిక స్కూలులో ప్రాథమిక విద్యను పూర్తిచేసుకుని, తన అభిరుచిని అనుసరించి ఔరంగాబాదు లోని ప్రభుత్వ లలిత కళాశాలలో పట్టభద్రులైనారు (1980- 85). చిత్రకళలో కలిగ్రఫీ ఆయనకి ఇష్టమయిన విషయం. మనం ఇక్కడ చూస్తున్నది 25 సంవత్సరాల ఆయన స్వయం కృషి ఫలితం. ఈ కళకు ఉపయోగించబడే అన్నిరకాల పెన్నులు, ఇంకులు, ఇంగ్లండులోని Willson and Redd కంపెనీవి మాత్రమే ఆయన వాడతారు. ఈ పెన్ను పాళీలు చివర చదరంగా ఉంటూ వ్రాస్తున్నపుడు మణికట్టు చేతివేళ్ళ కదలికలతో ఒంపులు తిరుగుతూ, కొన్నిచోట్ల దళసరిగా, కొన్నిచోట్ల సన్నటి రేఖలుగా ఒకే స్ట్రోక్‌లో రూపుదిద్దుకుంటాయి. వీటిని గీస్తున్నపుడు చూడటం కూడా ఒక కళే. ఈ పాళీలో ఎడమవైపు సానబెట్టబడేవి, కుడివైపు సానబెట్టబడేవి, అని రెండు విధాలుగా ఉంటాయి.

003ఒకటి ఉర్దూలాంటి కుడి నుంచి ఎడమకు నడిచే భాషల కోసం, మరొకటి దేవనాగరి లాంటి ఎడమ నుంచి కుడికి నడిచే భాషలకోసం. రాజుగారు బెంగుళూరులో మార్కెటింగ్‌ కన్సల్టెంట్‌గా జీవితాన్ని ప్రారంభించారు. అహ్మదాబాద్‌ కేంద్రంగా పనిచేసే ముద్రా కమ్యూనికేషన్‌లో ఆర్ట్‌ డైరెక్టరుగా పనిచేశారు. 2005వ సం||లో పొట్టిశ్రీరాములు విశ్వవిద్యాలయంలో స్టేట్‌ అవార్డ్‌ గ్రహీత. ఆ తరువాత హైదరాబాద్‌ వచ్చి ఇక్కడ వివిధ కంపెనీలలో ఆర్ట్‌ సలహాదారునిగా పనిచేశారు. నాగార్జునా ఫెర్టిలైజర్స్‌లో డిజైన్‌ డైరెక్టరుగా పనిచేశారు. పరమేశ్వరరాజు అనేక పురస్కారాలు అందుకున్నారు. కర్నాటక టూరిజం డిపార్ట్‌మెంట్‌ టీమ్‌ మెంబరుగా దేశంలోని ఎన్నో లలితకళాశాలలకు విజిటింగ్‌ ప్రొఫెసర్‌గా తమ సేవలందిస్తున్నారు.తెలుగు భాషలో అక్షర ఫాంటుకు గత కొద్ది కాలంగా మార్పులు చేకూర్చటం తప్ప మరే విధమైన కొత్తరకపు కృషి రాలేదు. తెలుగులో కూడా కలిగ్రఫీని పెంపొందించ వలసిన అవసరం ఎంతయినా ఉంది. ఈ విషయమై కృషి చేయవలసినదిగా నేను కోరినపుడు ”మానాన్నగారు మిలటరీలో ఉండటం వలన నా బాల్యమంతా ఆంధ్రప్రదేశ్‌కు దూరంగా గడచి పోయింది. తెలుగు మాట్లాడతాను. తెలుగు వర్ణక్రమం నాకు తెలియదు.” అని చెప్పారు.

(సప్తపర్ణి నుంచి)

– కాండ్రేగుల నాగేశ్వరరావు

First Published:  21 Oct 2015 7:02 PM GMT
Next Story