Telugu Global
Others

పరిష్కారం చూపని సుప్రీం కోర్టు తీర్పు

న్యాయ మూర్తుల నియామకానికి సంబంధించి ఎన్.డి.ఎ. ప్రభుత్వం రూపొందించిన చట్టాన్ని, దానికి సంబంధించిన 99వ రాజ్యాంగ సవరణను సుప్రీం కోర్టు గత శుక్రవారం కొట్టేసింది. ఈ చట్టం న్యాయ వ్యవస్థ “స్వతంత్రత”ను దెబ్బ తీస్తుందని సుప్రీం కోర్టు భావించింది. న్యాయ వ్వవస్థ “స్వతంత్రత” కొనసాగాలన్న అభిప్రాయంలో విప్రతిపత్తికి తావు లేదు. అయితే ఎన్.డి.ఎ. ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం చెల్లదని, రాజ్యాంగ సవరణ చెల్లదని తీర్పు ఇచ్చిన అత్యున్నత న్యాయస్థానం న్యాయమూర్తుల నియామకంలో లోపరహితమైన విధానాన్ని సూచించడంలో మాత్రం […]

పరిష్కారం చూపని సుప్రీం కోర్టు తీర్పు
X

RV Ramaraoన్యాయ మూర్తుల నియామకానికి సంబంధించి ఎన్.డి.ఎ. ప్రభుత్వం రూపొందించిన చట్టాన్ని, దానికి సంబంధించిన 99వ రాజ్యాంగ సవరణను సుప్రీం కోర్టు గత శుక్రవారం కొట్టేసింది. ఈ చట్టం న్యాయ వ్యవస్థ “స్వతంత్రత”ను దెబ్బ తీస్తుందని సుప్రీం కోర్టు భావించింది. న్యాయ వ్వవస్థ “స్వతంత్రత” కొనసాగాలన్న అభిప్రాయంలో విప్రతిపత్తికి తావు లేదు. అయితే ఎన్.డి.ఎ. ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం చెల్లదని, రాజ్యాంగ సవరణ చెల్లదని తీర్పు ఇచ్చిన అత్యున్నత న్యాయస్థానం న్యాయమూర్తుల నియామకంలో లోపరహితమైన విధానాన్ని సూచించడంలో మాత్రం విఫలమైంది. న్యాయ మూర్తుల నియామకంలో న్యాయవ్యవస్థకే ప్రాధమ్యం ఉండాలన్న అంశానికే అత్యధిక ప్రాద్యాన్యత ఇచ్చినందువల్ల గతంలో అనేక విమర్శలు ఎదుర్కున్న “కొలీజియం” వ్యవస్థే కొనసాగుతుందని తీర్పు చెప్పింది.

రాజ్యాంగం ఆమోదించిన తర్వాత న్యాయమూర్తుల నియామకం రాష్ట్రపతి సిఫార్సుల మేరకు, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించిన తర్వాత జరిగేవి. రాష్ట్రపతి సిఫార్సు అన్న మాట పిండితార్థం ప్రభుత్వ సిఫార్సు అనే. ప్రభుత్వ నిర్ణయాన్నే రాష్ట్రపతి సిఫార్సు చేయడం మన వ్యవస్థలో కొనసాగుతున్న తీరు. ఈ పద్ధతి 1950 నుంచి 1993 దాకా కొనసాగింది. కాని న్యాయ మూర్తుల నియామకంలో రాజకీయాలు చోటు చేసుకోవడం, ప్రతిభను, సీనియారిటీని పక్కన బెట్టి తమకు అనువైన వారిని న్యాయమూర్తులుగా నియమించడానికి ఈ విధానం దిగజారిన తర్వాత న్యాయ వ్యవస్థ 1993లో న్యాయమూర్తుల నియమాకాన్ని తానే స్వీకరించింది.

న్యాయమూర్తుల నియామకంలో రాజకీయాల ప్రమేయం ఉండడం ప్రతిఘటించవలసిన అంశమే. రాజ్యాంగ నిర్దేశం అది కాదు. కాని న్యాయమూర్తుల నియామక చట్టాన్ని తప్పుబట్టిన సుప్రీం కోర్టు ఇది రాజ్యాంగ వ్యతిరేకమైందని చెప్పింది కాని కొలీజియం ప్రస్తావన రాజ్యాంగంలో లేనే లేదు అన్న అంశాన్ని విస్మరించింది. అలాంటప్పుడు కొలీజియం వ్యవస్థ రాజ్యాంగ విహితమైంది ఎలా అవుతుందో అంతుబట్టదు. కార్యనిర్వాహక వర్గం న్యాయమూర్తులను నియమించడం అంటే న్యాయ వ్యవస్థ “స్వతంత్ర ప్రతిపత్తిని” దెబ్బతీయడమేనని సుప్రీం తీర్పు సారాంశం. ఇది అధికారాల విభజన సూత్రానికి విఘాతం కలిగిస్తుందని కూడా సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.

మన రాజ్యవ్యవస్థలో చట్ట సభలు, శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ అన్న మూడు ప్రధానాంగాలకు “స్వతంత్రత” ఉంది. దీని అర్థం ఒక వ్యవస్థ వ్యవహారాల్లో మరొక వ్యవస్థ జోక్యం చేసుకోకూడదనే తప్ప పరస్పరం సంబంధం లేకుండా వ్యవహరించడం అని కాదు. ఈ మూడు వ్యవస్థలూ పరస్పరాధారితాలు. ఈ అంశాన్ని సుప్రీం కోర్టు తీర్పు పరిగణనలోకి తీసుకున్నట్టు లేదు.

ఒక రకంగా శుక్రవారం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమందే. అయితే ఈ చరిత్రాత్మకత న్యాయమూర్తుల నియామక జాతీయ కమిషన్ లోని లోపాలను తోసిపుచ్చడానికే పరిమితం కాలేదు. కొలీజియం వ్యవస్థ పునరుద్ధరణ ఏ విధంగా చూసినా చరిత్రాత్మకం కాదు. తీర్పు వెలువరించిన సమయంలో కొలీజియం వ్యవస్థను మెరుగు పరచడానికి సూచనలు ఆహ్వానిస్తున్నామని చెప్పడమే దీనికి నిదర్శనం. మెరుగు పరచడానికి అత్యున్నత న్యాయస్థానం సిద్ధంగా ఉంది కాని తమ నిర్ణయంపై పునఃపరిశీలనకు ససేమిరా అంటోంది. ఈ తీర్పును విస్త్రుత పీఠానికి నివేదించాలన్న అభ్యర్థనను కూడా అయిదుగురు న్యాయమూర్తులతో కూడిన బెంచి అంగీకరించలేదు. అంటే కొలీజియం వ్యవస్థ కొనసాగుతుందని ఆఖరి మాట చెప్పేసినట్టే.

సుప్రీం కోర్టు రాజ్యాంగ సవరణలను కొట్టేసిన సందర్భాలు చాలా తక్కువ. ఈ తీర్పు ద్వారా మన న్యాయవ్యవస్థ చరిత్రలో రాజ్యాంగ సవరణను నిరాకరించడం ఇది అయిదో సారి మాత్రమే. ఇరవై ఏళ్ల కాలంలో ఇదే మొదటి సారి. అందువల్ల ఈ తీర్పు చరిత్రాత్మకమైందే. న్యాయమూర్తుల నియామకానికి చట్టం చేయడం “రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని” మార్చడమేనని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ఎంత వెదికినా రాజ్యాంగ మౌలిక స్వరూపంలో కొలీజియం వ్యవస్థ ఎక్కడా కనిపించదు. దీనికి సుప్రీం కోర్టు సమాధానం చెప్పలేదు. సుప్రీం కోర్టు చెప్పింది మాత్రమే రాజ్యాంగ మౌలిక స్వరూపమే అయ్యేటట్టయితే అలాంటి స్వరూపం ఏదీ లేనట్టే లెక్క.

ఈ తీర్పులో గమనించవలసిన ముఖ్యమైన అంశం ఏమిటంటే ఇది ఏకగ్రీవ తీర్పు కాదు. మెజారిటీ తీర్పు మాత్రమే. నలుగురు న్యాయమూర్తులు కార్య నిర్వాహక వర్గానికి న్యాయమూర్తుల నియామక బాధ్యత అప్పగించడం న్యాయ వ్యవస్థ స్వేచ్ఛకు, రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భంగం కలుగుతుందని భావిస్తే ఒక న్యాయ మూర్తి ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం, రాజ్యాంగ సవరణ చెల్లుతాయని ప్రకటించారు. ఈ తీర్పు వెలువరించింది న్యాయమూర్తులు జె.ఎస్.కేహార్, ఎం.బి.లోకూర్, కురియన్ జోసెఫ్, ఏ.కె. గోయల్, జాస్తి చలమేశ్వర్. ఇందులో న్యాయమూర్తి చలమేశ్వర్ మిగతా నలుగురు న్యాయమూర్తుల తీర్పుతో ఏకీభవించలేదు. ఏకీభవించిన న్యాయమూర్తులూ ఒకే తీర్పు వెలువరించకుండా ఎవరి తీర్పు వారు రాశారు. ఇది అసాధారణం ఏమీ కాక పోయినా మెజారిటీ తీర్పుతో అసమ్మతి వ్యక్తం చేసిన స్పష్టమైన తీర్పు ఉన్నప్పుడు 11 మంది న్యాయమూర్తులతో కూడిన విస్త్రుత ధర్మాసనానికి నివేదించడానికి నిరాకరించడంలో సబబేమిటో అంతుపట్టదు. అసమ్మతి వ్యక్తం చేసిన న్యాయమూర్తి అభిప్రాయానికి ఏ విలువా లేనట్టేనా?

శుక్రవారం నాటి తీర్పు ద్వారా సుప్రీం కోర్టు కొలీజియం వ్యవస్థను పునరుద్ధరించింది తప్ప న్యాయమూర్తుల నియామకంలో ఉన్న లోపాలను సరిదిద్దడానికి ఏ మాత్రం ప్రయత్నించలేదు. అంటే సంస్కరణకు అత్యున్నత న్యాయస్థానం సిద్ధంగా లేనట్టేనా? మరి కొలీజియం వ్యవస్థ మీద ఉన్న విమర్శలకు సమాధానం చెప్పకుండానే పునరుద్ధరణే కొనసాగుతుందనేగా!

వెయ్యి పేజీలకు పైగా ఉన్న తీర్పులో దాదాపు 500 పేజీలు న్యాయమూర్తి కేహార్ రాసిందే. పరిపాలన రంగాలు వేటితోనూ న్యాయవ్యవస్థకు సంబంధం లేకుండా ఉంటేనే పౌరుల హక్కులు కాపాడగలుగుతామని కేహార్ అభిప్రాయపడ్డారు. ఈ మాటను ఎవరూ వ్యతిరేకించరు. కాని న్యాయమూర్తులను న్యాయమూర్తులే నియమించుకోవడం మాత్రమే దీనికి నిష్క్రుతి అంటే ఎలా? న్యాయమూర్తి చలమేశ్వర్ అసమ్మతి తీర్పులో ఈ విషయమే లేవనెత్తారు. కొలీజియం వ్యవస్థ పూర్తి నిగూఢమైందని, కొలీజియం తీసుకునే నిర్ణయాలను కనీసం పరిశీలించే అవకాశం ఇతర న్యాయమూర్తులకు లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

న్యాయమూర్తుల నియామకంలో లోపాలకు కేవలం ఆ వ్యవస్థే కారణం కాదని, కార్యనిర్వాహక వర్గానికీ ఈ లోపాలలో బాధ్యత ఉందని న్యాయమూర్తి లోకూర్ చెప్పారు. కొలీజియం వ్యవస్థ అమలులోకి వచ్చినదగ్గర నుంచి కార్యనిర్మాహక వర్గం పాత్రే లేదుగా! అప్పుడు బాధ్యత ఎలా ఉంటుంది? కొలీజియం వ్యవస్థలో “గ్లాస్ నస్త్” (దాపరికం లేని విధానం) “పెరిస్త్రోయిక” (పునర్నిర్మాణం, సంస్కరణ) అవసరమని న్యాయమూర్తి కురియన్ అన్నారు. సుప్రీం కోర్టులోని ఇతర న్యాయమూర్తులకే కొలీజియం వ్యవస్థతో సంబంధం లేనప్పుడు వీటికి చోటు ఎక్కడిది? కొలీజియం వ్యవస్థ బాధ్యతాయుతమైంది కాదని, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యే అదృష్టం పట్టని న్యాయమూర్తులకు రికార్డులను పరిశీలించే అవకాశం కూడా లేదు కనక కురియన్ అభిప్రాయం అమలయ్యే అవకాశమే లేదు. న్యాయవ్యవస్థకు ప్రాథమ్యం ఉండడం ద్వారా మాత్రమే ప్రజల హక్కులు కాపాడగలమని చెప్పలేమని కూడా చలమేశ్వర్ అన్నారు. ఇతర ఏ వ్యవస్థల ప్రమేయం లేకుండా న్యాయ వ్యవస్థ మాటే చెల్లాలనడం రాజ్యాంగ చరిత్రకే విరుద్ధమని చలమేశ్వర్‌ అంటున్నారు.

కర్యనిర్వాహక వర్గానికి న్యాయమూర్తుల నియామకంలో ఎలాంటి పాత్రా ఉండకూడదనడం ప్రజాస్వామ్య పరిపాలనా సూత్రాలకే విరుద్ధమైంది.

ఎన్.డి.ఎ. ప్రభుత్వం 2014లో ఆమోదించిన చట్టంలో అనేక లొసుగులున్న మాట వాస్తవం. న్యాయమూర్తుల నియామక కమిషన్ చట్టం ప్రకారం న్యాయమూర్తుల ఎంపిక కమిటీలో మొత్తం ఆరుగురు సభ్యులు ఉండాలనుకున్నారు. ఈ కమిటీకి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షత వహిస్తారు. మరో ఇద్దరు సీనియర్ న్యాయ మూర్తులు, న్యాయశాఖ మంత్రి, ఇద్దరు ప్రముఖులు సభ్యులుగా ఉంటారు. న్యాయ శాఖ మంత్రి, ఇద్దరు ప్రసిద్ధులు సభ్యులుగా ఉండడాన్ని సుప్రీం కోర్టు అంగీకరించలేక పోయింది. న్యాయశాఖ మంత్రి కమిటీలో ఉండడం అంటే రాజకీయ జోక్యమేనని భావించింది. ఇద్దరు ప్రముఖులు ఎవరో ప్రధాని, ప్రతిపక్ష నాయకుడు సూచించే పద్ధతి కూడా సుప్రీం కోర్టుకు రుచించలేదు. ఆ ప్రముఖులకు ఉన్న అర్హత ఏమిటి అని ప్రశ్నించడం ద్వారా న్యాయ వ్యవస్థలో పౌర సమాజానికి పాత్రే ఉండగూడదని అంటోంది.

అన్నింటికన్నా అభ్యంతరకరమైంది ఏమిటంటే ఆరుగురిలో ఏ ఇద్దరు వీటో చేసినా ఆ నిర్ణయం అమలు కాదన్న నిబంధన. ఇది కచ్చితంగా ప్రభుత్వ ఆధిపత్యాన్ని కొనసాగించడానికి చేర్చిన నిబంధనే. దీనికి సుప్రీం కోర్టు అభ్యంతర పెట్టడాన్ని తప్పు పట్టలేం. ఈ వీటో అధికారమే ఉంటే ఏ దశలోనైనా న్యాయమూర్తుల అభిప్రాయాన్ని బేఖారతు చేయడానికి వీలుంటుంది.

కార్యనిర్వాహక వర్గమే న్యాయమూర్తులను నియమించేటట్టయితే “ఇచ్చిపుచ్చుకునే” ధోరణి ప్రబలుతుందన్నది సుప్రీం కోర్టు భయం. దానికి అవకాశం లేకపోలేదు కనక నివారణోపాయాలు ఆలోచించాలి కాని గుండుగుత్తగా కమిషన్ నే తోసిపుచ్చడం సరైన పద్ధతి అనిపించుకోదు. ఉన్నత న్యాయస్థానల్లో దాఖలయ్యే కేసుల్లో ఎక్కువ భాగం ప్రభుత్వం దాఖలు చేసేవే ఉంటాయి కనక ప్రభుత్వ ఆశీస్సులతో నియుక్తులైన వారు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే ప్రమాదం ఉంటుంది. ఇది వినాశనానికి దారితీస్తుందన్నది సుప్రీం కోర్టు భయం.

సహజ వనరుల కేటాయింపునకు సంబంధించిన అనేక కేసులు కోర్టులకెక్కుతుంటాయి. వీటిలో డబ్బు అంశం ఉంటుంది కనక ప్రభుత్వ ప్రాపకంతో నియుక్తులైన న్యాయమూర్తులు ఉండడం వినాశకరమన్న సుప్రీం కోర్టు వాదన సమంజసమైందే అయినా న్యాయమూర్తులను న్యాయమూర్తులు మాత్రమే నియమించడం దీనికి పరిష్కారం కాదు.

ప్రధాన మంత్రుల మీద, మాజీ ప్రధానుల మీద, ముఖ్య మంత్రుల మీద, మాజీ ముఖ్యమంత్రుల మీద కూడా అభియోగాలు దాఖలవుతాయి గనక న్యాయమూర్తుల నియామక కమిటీలో న్యాయ శాఖ మంత్రి ఉండడం శ్రేయస్కరం కాదని తీర్పులో పేర్కొన్నారు. ఈ అవకాశం ఉన్న మాట వాస్తవమే అయినా కొలీజియం నియమించిన న్యాయమూర్తులు ఒత్తిడికి లొంగబోరన్న హామీ ఎవరు ఇవ్వగలరు? అదే నిజమైతే న్యాయవ్యవస్థలోనూ అవినీతి చొరబడిందన్న విమర్శలకు తావుండేదే కాదుగా!

1993, 1998 నాటి న్యాయమూర్తుల కేసులను పునః పరిశీలనకు ససేమిరా అనడంలో ఔచిత్యం లేదు. తాము ఖరారు చేసిన మరణ దండనల్లో కొన్ని అపసవ్యమైనవని న్యాయమూర్తులే అంగీకరించిన చోట నలుగురు న్యాయమూర్తుల తీర్పు తిరుగులేనిదని చెప్పడం సబబు ఎలా అవుతుంది?

అన్నింటినీ మించి సుప్రీం కోర్టు న్యాయమూర్తులను సుప్రీం కోర్టు, హై కోర్టుల న్యాయమూర్తులను, భారత ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి రాష్ట్రపతి నియమిస్తారు అని రాజ్యాంగంలోని 124(2) అధికరణ స్పష్టం చేస్తోంది. అలాగే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని, సంబంధిత రాష్ట్ర గవర్నరును సంప్రదించి హైకోర్టు న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తారు అని 217వ అధికరణం చెప్తోంది. “సంప్రదించి” అన్న మాటకు న్యాయమూర్తుల కేసులో సుప్రీం కోర్టు “సమ్మతి” అన్న వ్యాఖ్యానం చెప్పింది. కొలీజియం వ్యవస్థకు అదే మూలం. తాజాగా కొలీజియం వ్యవస్థే కొనసాగుతుంది అని చెప్పడం రాజ్యాంగ నిర్దేశాలను పట్టించుకోకపోవడమే. కొలీజియం తయారు చేసిన జాబితా మీద రాష్ట్రపతి మారు మాట లేకుండా సంతకం చేయాలని బలవంతపెట్టడమే. ఇది సమంజసం కాదు. కొలీజియం వ్యవస్థను ఎవరూ తప్పుపట్టకూడదని నిర్బంధించడమే.

న్యాయమూర్తుల నియామక కమిషన్ చట్టం లోపభూయిష్టమైంది కావచ్చు. అది నిజం కూడా. అందులో న్యాయవ్యవస్థను ప్రభుత్వ గుప్పిట్లో పెట్టుకోవాలన్న దురుద్దేశం లేక పోలేదు. ఈ తంత్రాన్ని అడ్డుకుని సుప్రీం కోర్టు మంచి పనే చేసింది. కాని దానికి పరిష్కారం కొలీజియం వ్యవస్థను పునరుద్ధరించడం కాదు. లోప రహితమైన వ్యవస్థను ఏర్పరచడంలో సుప్రీం కోర్టు సహాయపడి ఉంటే బాగుండేది. కార్యనిర్వాహక వర్గాల లోపాలను సరిదిద్దడానికి న్యాయవ్యవస్థ తనకు తానే ఎదురులేని అధికారాలు కట్టబెట్టుకోవడం ఏ రకంగానూ సరైంది కాదు.

– ఆర్వీ రామారావ్

First Published:  21 Oct 2015 1:02 PM GMT
Next Story