Telugu Global
Others

అబద్ధాల పునాదిపై అమరావతి

“రాష్ట్ర విభజనతో మనకు హైదరాబాద్ లేకుండా పోయింది. ఇక మనం హైదరాబాద్ కన్నా వంద రెట్లు మెరుగైన కొత్త రాజధాని నిర్మిద్దాం.” ఇటీవల ఒక కళాశాలలో జరిగిన ఉత్సవానికి హాజరైనప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్న మాటలివి. ఈ మాటలు వింటే హైదరాబాద్ మనకు దక్కకుండా పోయిందే అన్న విపరీతమైన బాధతో పాటు హైదరాబాద్ ను తలదన్నే ఆ మాటకొస్తే వంద సార్లు తలదన్నే రాజధాని నిర్మించి కసి తీర్చుకోవాలన్న ఆరాటం చంద్రబాబు నాయుడులో కొట్టిచ్చినట్టు […]

అబద్ధాల పునాదిపై అమరావతి
X

RV Ramarao“రాష్ట్ర విభజనతో మనకు హైదరాబాద్ లేకుండా పోయింది. ఇక మనం హైదరాబాద్ కన్నా వంద రెట్లు మెరుగైన కొత్త రాజధాని నిర్మిద్దాం.” ఇటీవల ఒక కళాశాలలో జరిగిన ఉత్సవానికి హాజరైనప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్న మాటలివి. ఈ మాటలు వింటే హైదరాబాద్ మనకు దక్కకుండా పోయిందే అన్న విపరీతమైన బాధతో పాటు హైదరాబాద్ ను తలదన్నే ఆ మాటకొస్తే వంద సార్లు తలదన్నే రాజధాని నిర్మించి కసి తీర్చుకోవాలన్న ఆరాటం చంద్రబాబు నాయుడులో కొట్టిచ్చినట్టు కనిపిస్తోంది.

మంచైనా చెడైనా చరిత్రలో నిలిచిపోవాలన్న పట్టుదల చంద్రబాబులో మెండు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కొత్త రాజధానిని ఓ దశకు తీసుకొచ్చి తన పేరు చరితార్థం చేసుకోవాలన్నది ఆయన ఆరాటం. ఆంధ్ర ప్రదేశ్ కు రాజధాని ఉండాల్సిందే. ఎవరూ కాదనరు. అది దివ్యంగా మహత్తరంగా ఉంటే ఎవరికీ ఇబ్బంది ఉండాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ ను మించిన రాజధాని నిర్మించడం ఈ రోజుల్లో ఆసాధ్యం ఏమీ కాదు. అయితే హైదరాబాద్ అమాంతం ఆకాశం మీంచి ఊడిపడలేదు. వందల సంవత్సరాల కాలంలో క్రమంగా అభివృద్ధి చెందింది, విస్తరించింది. ఆ క్రమంలో విరూపమూ అయింది.

రెండు రాష్ట్రాలకు పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగే అవకాశాన్ని రాష్ట్ర విభజన బిల్లులోనే కల్పించారు. రాజధాని నిర్మాణానికి అంత సమయం పడుతుంది. అంత కన్నా ఎక్కువ సమయం పట్టడమూ అసహజమేమీ కాదు. ఆంధ్రప్రదేశ్ కు కొత్త రాజధానిని ఎక్కడ నిర్మిస్తే బాగుంటుందో పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసే వెసులుబాటు కూడా రాష్ట్ర విభజన బిల్లులోనే ఉంది. ఆ మెరకు శివరామకృష్ణన్ కమిటీ ఏర్పడింది. ఆ కమిటీ వివిధ ప్రాంతాలను అనేక కోణాల నుంచి పరిశీలించి కొన్ని సూచనలు చేసింది.

రాజధాని నిర్మాణానికి అనువైన ప్రాంతాలేవో, కానివేవో వివరించింది. ప్రస్తుతం రాజధాని నిర్మించాలనుకుంటున్న విజయవాడ, గుంటూరు మధ్య ప్రాంతం ఎందుకు అనువైన చోటు కాదో అర్థమయ్యేటట్టే చెప్పింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కమిటీ నివేదికను ఏమాత్రం పట్టించుకున్నట్టు లేదు. ఒక వేళ తీసుకుని ఉంటే ఆ కమిటీ సిఫార్సులను ఎలా పరాస్తం చేయాలో ఆలోచించడానికి మాత్రమే పరిశీలించినట్టు కనిపిస్తోంది.

రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడుకు అధికారం దక్కింది. చరిత్రను ప్రజలు నిర్మించరు తనలాంటి ముఖ్యమంత్రులే నిర్మిస్తారన్న అభిప్రాయం బలంగా ఉన్న చంద్రబాబు విజయవాడ-గుంటూరు మధ్య కొత్త రాజధాని నిర్మించాలని ఏకపక్షంగా తీర్మానించేశారు. ఆయన నాయకత్వంలోని పార్టీలోని వారు ఏకేశ్వరోపాసలు కనక కిమ్మనకుండా తలూపేశారు. 2014 జూన్ లో అధికారం చేపట్టిన చంద్రబాబు 2014 ఆగస్టు 15న గుంటూరు-విజయవాడ మధ్య కొత్త రాజధాని నిర్మిస్తామని చెప్పేశారు. 2015 ఏప్రిల్ ఒకటిన కొత్త రాజధానికి “అమరావతి” అని నామకరణం కూడా చేసేశారు. ఈ రాజధాని వాస్తుకు అనువుగా ఉంటుందని కూడా దృవీకరించారు. భవనాల నిర్మాణానికి ఓ శాస్త్రం ఉంటుంది. ఉండాల్సిందే. చంద్రబాబు నమ్మే శాస్త్రం వాస్తు. మనది సెక్యులర్ వ్యవస్థ. ఆ వ్యవస్థను రాజకీయ నాయకులు తమ నమ్మకాల మేరకు వాస్తు సీసాల్లోకి దించేస్తుంటారు.

చంద్రబాబుది విశాలమైన దృష్టి. దూరపు చూపు ఉన్న వారికి దగ్గరి చూపు తక్కువగా ఉండే అవకాశం ఉంది. సకల శాస్త్రాలకు మన దేశమే పుట్టిల్లు అని నమ్మే రాజకీయపక్షం పంచలో రెండో సారి చేరిన చంద్రబాబు వాస్తు నిర్ణ్ణయానికి మాత్రమే స్వదేశీ పరిజ్ఞానం వినియోగించుకున్నారు. అసలు నిర్మాణ కార్యక్రమానికి రాష్ట్రంలో, దేశవ్యాప్తంగా ఉన్న నిపుణులు ఆయన దూరపు చూపు కారణంగా కనిపించలేదు. ఆయన కళ్లు తెరిస్తే సింగపూర్ కనిపిస్తుంది. అందుకే సింగపూర్ నమూనాలో కొత్త రాజధాని నిర్మించడానికి కార్యొన్ముఖుడయ్యారు.

“అమరావతి” రూపు రేఖా విలాసాలు ఎలా ఉండాలో బృహద్ ప్రణాళికలు రూపొందించే మహత్తర బాధ్యతను సింగపూర్ లోని సుర్బన ఇంటర్నేషనల్ కన్సల్టెంట్స్, జురోంగ్ కన్సల్టెంట్స్ అనే రెందు సంస్థల భుజాల మీద మోపారు. ఈ సలహాదారులు ఇప్పటికి మూడు ప్రతిపాదనలు రూపొందించారు. ఇవి ఒక దానికొకటి ప్రత్యామ్నాయం కావు. ఒకదానికొకటి పొడిగింపు మాత్రమే. మొదటి నివేదిక-ముసాయిదా రాజధాని ప్రాంత ప్రణాళిక 2015 మార్చిలో అందితే రెండో నివేదిక 2015 జులైలో, మూడో నివేదిక సైతం జులై 2015లో సిద్ధమై పోయాయి. తధాస్తు!

ఎంత కాదన్నా ఈ సలహా సంస్థలకు వృత్తి నైపుణ్యం ఉంటుది. తమ వృత్తి నియమాలకు అనుగుణంగా పని చేస్తాయి. రాజధాని ప్రాంతంలో 80 శాతం సస్యశ్యామలమైన వ్యవసాయ భూములున్నాయని, ఈ ప్రాంతంలో 81 శాతం వరదలు రావడానికి అవకాశం ఉన్న ప్రాంతమని నిర్మొహమాటంగానే చెప్పాయి. రెండవ సారి అందించిన నివేదికలో “అమరావతి” వెలవనున్న చోట 391 చదరపు కిలోమేటర్ల ప్రాంతం మౌలికంగా వ్యవసాయం చేస్తున్న ప్రాంతమని స్పష్టం చేశారు. ఆ ప్రాంతంలో వరి, చెరకు, పప్పు ధాన్యాలు మొదలైనవి పండుతాయి. అక్కడ పారిశ్రామిక కార్యకలాపాలు, సేవారంగ కార్యకలాపాలు నామమాత్రమైనవని రెండో నివేదికలో అనుమానాలకు తావు లేకుండా చెప్పారు.

ఈ ప్రాంతం ఎలాంటిదో విపత్తుల నిర్వహణా వ్యవస్థ కూడా పరిశీలించింది. ఈ ప్రాంతం వరదలు రావడానికి అవకాశం ఉన్న ప్రాంతమని ఆ నివేదికలో పేర్కొన్నారు. సింగపూర్ సలహాదారులు రూపొందించిన ముసాయిదాలో కూడా ఈ ప్రాంతంలో ఏడు శాతం వరదలు రావడానికి అత్యంత ఎక్కువ అవకాశం ఉన్న ప్రాంతమని, 31 శాతం వరదలు రావడానికి అవకాశం ఉన్న ప్రాంతమని, 43 శాతం ఓ మోస్తరుగా వరదలు రావడానికి ఆస్కారం ఉన్న ప్రాంతమని కూడా కంటికి కనిపించేట్టే చెప్పారు. వెరసి వరదలు రావడానికి అవకాశం లేని ప్రాంతం కేవలం 19 శాతం మాత్రమే ఉంది. కొత్త రాజధాని వెలువనున్న ప్రాతం ద్వారా కృష్ణా నదికి ఉపనది అయిన కొండవీటి వాగు ప్రవహిస్తుంది. ఇక్కడ వర్షా కాలంలో ప్రతి ఏటా వరదలొస్తాయి. ఈ ప్రాంతంలో 13,500 ఎకరాల మేర వరదలొస్తుంటాయి. ఇందులో 10,600 ఎకరాల ప్రాంతం కొత్త రాజధాని పరిధిలో ఉంది.

వరదల ముప్పు తప్పించడానికి సలహాదార్లు కొన్ని సలహాలు కూడా ఇచ్చారు. అందులో కృష్ణా నది పొడవున ఉన్న కట్టల ఎత్తు పెంచడం ఒకటైతే, అసలు వరదలు రావడానికి ఆస్కారం ఉన్న నేల ఎత్తును రెండు మీటర్ల ఎత్తున పెంచడం. ఈ రెండు పనులకు రూ. 1500 కొట్లు ఖర్చవుతుందని అంచనా. ఇది సాధ్యమేనా, గిట్టుబాటయ్యే వ్యవహారమేనా అన్న విషయాన్ని సాకల్యంగా పరిశీలించిన దాఖలాలు లేవు.

కొత్త రాజధాని నిర్మిచే ప్రాంతంలో వరదలొచ్చే పల్లపు ప్రాంతాలను, సస్య శ్యామలమైన వ్యవసాయ భూములను పరిరక్షించాలని కోరుతూ స్థానికుడైన పండలనేని శ్రీమన్నారాయణ కోర్టుకెక్కారు. రాజధాని నిర్మించే ప్రాంతాన్ని కచ్చితంగా తేల్చేదాకా, అక్కడ రాజధాని నిర్మించడం వల్ల కలిగే ప్రభావం ఏమిటో అంచనా వేసే దాకా నిర్మాణ కార్యకలాపాలను నిలిపి వేయాలని కూడా శ్రీమన్నారాయణ అభ్యర్థించారు. ఈ వ్యాజ్యం ప్రస్తుతం నేషనల్ గ్రీన్ ట్రిబునల్ పరిశీలనలో ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రాజధానిని వరదలొచ్చే పల్లపు ప్రాంతాలలో నిర్మించడం లేదని, మాగాణి భూముల్లో నిర్మించడం లేదని, సుసంపన్నమైన వ్యవసాయ భూముల్లో నిర్మించడం లేదని ట్రిబ్యునల్ కు విన్నవించింది. ఇందులో ప్రతి మాట అబద్ధమేనని నిర్ధారించడానికి పెద్దగా శ్రమపడనవసరం లేదు.

చంద్రబాబు నాయుడుకు సింగపూర్ సలహాదార్లు చూపించిన అద్భుత దృశ్యాలే కనిపించాయి. సింగపూర్ కు పోటీగా అవతరించబోయే నూతన రాజధానే సాక్షాత్కరించింది. ఆకాశ హార్మ్యాలే దృగ్గోచరమయ్యాయి. ఆ ప్రాంత నేల ఆకాశ హార్మ్యాల నిర్మాణానికి అనువైంది కాదని ఎంత మంది చెప్పినా వినిపించుకునే వినికిడి శక్తి చంద్రబాబుకు లేదు. అబద్ధాల పునాదుల మీద అమరావతి నిర్మించాలనుకునే వారికి అవేవీ కనిపించవు, వినిపించవు. అక్తోబర్ 22న నూతన రాజధానికి శంకుస్థాపన కార్యక్రమం ఖరారైపోయింది.
ప్రధాని ఈ కార్యక్రమానికి హాజరు కావడానికి పెట్టె బేడా సర్దుతున్నారు. బాబు తాంబూలాలిచ్చేశారు మరి!

– ఆర్వీ రామారావ్

First Published:  16 Oct 2015 1:15 PM GMT
Next Story