Telugu Global
Others

2,5,11,15,20,43..... ఈ నెంబ‌ర్లు…. ఆనందానికి ద‌గ్గ‌ర దార్లు!

ల‌క్కీ ‌నెంబ‌ర్లు అనే భావాన్ని చాలామంది న‌మ్ముతుంటారు. ఏ సంద‌ర్భంలో అయినా త‌మ అదృష్ట సంఖ్య క‌న‌బ‌డితే చాలు, ఇక ఏ ఆటంకాలు లేకుండా ప‌న‌యిపోతుంద‌ని  సంబ‌ర‌ప‌డ‌తారు. పైన క‌న‌బ‌డుతున్న‌వి కూడా ల‌క్కీ నెంబ‌ర్లే. కానీ ఏ కొద్దిమందికో కాదు…, అంద‌రికీ. ఎందుకంటే ఈ నెంబ‌ర్ల‌లో కొన్ని రంగాల్లో నిపుణులైన వ్య‌క్తులు  మ‌న‌కందిస్తున్న అద్భుత‌మైన స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇమిడి ఉన్నాయి. ఈ నెంబ‌ర్ల‌ని గుర్తుంచుకుంటే ఒత్తిడి లేకుండా అనుకున్న‌ది ఆనందంగా సాధించ‌వ‌చ్చ‌ని వారు చెబుతున్నారు. ఇంత‌కీ ఎమిటీ నెంబ‌ర్ల క‌థ అంటారా…ఇవీ ఆ […]

2,5,11,15,20,43..... ఈ నెంబ‌ర్లు…. ఆనందానికి ద‌గ్గ‌ర దార్లు!
X

ల‌క్కీ ‌నెంబ‌ర్లు అనే భావాన్ని చాలామంది న‌మ్ముతుంటారు. ఏ సంద‌ర్భంలో అయినా త‌మ అదృష్ట సంఖ్య క‌న‌బ‌డితే చాలు, ఇక ఏ ఆటంకాలు లేకుండా ప‌న‌యిపోతుంద‌ని సంబ‌ర‌ప‌డ‌తారు. పైన క‌న‌బ‌డుతున్న‌వి కూడా ల‌క్కీ నెంబ‌ర్లే. కానీ ఏ కొద్దిమందికో కాదు…, అంద‌రికీ. ఎందుకంటే ఈ నెంబ‌ర్ల‌లో కొన్ని రంగాల్లో నిపుణులైన వ్య‌క్తులు మ‌న‌కందిస్తున్న అద్భుత‌మైన స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇమిడి ఉన్నాయి. ఈ నెంబ‌ర్ల‌ని గుర్తుంచుకుంటే ఒత్తిడి లేకుండా అనుకున్న‌ది ఆనందంగా సాధించ‌వ‌చ్చ‌ని వారు చెబుతున్నారు. ఇంత‌కీ ఎమిటీ నెంబ‌ర్ల క‌థ అంటారా…ఇవీ ఆ విశేషాలు-

  • 2 నిముషాల సూత్రం………. గెట్టింగ్ థింగ్స్ డ‌న్ అనే పుస్త‌కాన్నిరాసిన డేవిడ్ అలెన్ …రెండు నిముషాల్లో పూర్త‌యిపోయే ప‌నులేమ‌న్నా వాయిదా వేస్తుంటే వెంట‌నే ఒక్క క్ష‌ణం కూడా ఆల‌స్యం చేయ‌కుండా వాటిని చేసేయండి అంటున్నారు. ఈ రెండు నిముషాల సూత్రం చాలా చిన్న‌గానే క‌న‌బ‌డుతుంది కానీ మీరు చేయాల్సిన చాలా ప‌నుల‌ను త‌క్ష‌ణం పూర్త‌య్యేలా చేస్తుందంటున్నారు ఈయ‌న‌.
  • 5 నిముషాల సూత్రం……..ఇంట్లోనో, ఆఫీస్‌లోనో చాలా క‌ష్ట‌మైన ప‌ని ఒక‌దాన్ని చాలా రోజులుగా వాయిదా వేస్తూ వ‌స్తున్నారా…. ఎన్నాళ్ల‌యినా దాన్ని మొద‌లుపెట్టేందుకే మ‌న‌సు స‌హ‌క‌రించ‌డం లేదా…అలాంట‌ప్పుడు ఈ అయిదు నిముషాల సూత్రం దివ్యంగా ప‌నిచేస్తుంద‌నేది, దిస్ ఇయ‌ర్ ఐ విల్‌…అనే పుస్త‌కాన్ని రాసిన ఎమ్‌జె ర‌యాన్ ఐడియా. అయిదు నిముషాలు మాత్ర‌మే ఈ ప‌నిచేస్తాను, త‌రువాత ఆపేస్తాను… అనే నిర్ణ‌యం తీసుకుని ప‌నిని మొద‌లుపెట్టాలి. ఈ ఐడియా మ‌నం చేయ‌లేని ప‌నుల‌ను బ్ర‌హ్మాండంగా చేయిస్తుంద‌ని చెబుతున్నారు ఈ ర‌చ‌యిత‌. ఒక‌సారి మొద‌లుపెట్టాక అయిదు నిముషాలు పూర్తి కాగానే, మీకు ఇంకాస్త పొడిగించాల‌ని అనిపిస్తే స‌రిగ్గా మ‌రో అయిదు నిముషాల్లో ఆపేస్తాను అనుకుని కొన‌సాగించాలి. మ‌రో అయిదు నిముషాలు…ఇలా క‌చ్ఛితంగా అయిదు నిముషాల్లో ఆపేయ‌వ‌చ్చ‌నే ఉద్దేశంతో ప‌ని చేయ‌డం వ‌ల‌న, ఆ ప‌నివ‌ల‌న ఇంత‌కుముందు ఫీల‌యిన ఒత్తిడి త‌గ్గుతుంద‌ని, ప‌నిని పూర్తి చేసే అవ‌కాశ‌మే ఎక్కువ ఉంటుంద‌ని ఈ ర‌చ‌యిత అంటున్నారు.
  • 11 నిముషాల సూత్రం…..వ్యాయామం ఎంతో మేలు చేస్తుంద‌ని చాలాసార్లు విన్నారు…చ‌దివారు…త‌ప్ప‌కుండా చేయాలి…అనుకుంటున్నారు, కానీ చేయ‌లేకపోతున్నారు. అలాంటి వారికోస‌మే ఈ 11 నిముషాల సూత్రం. ఇదేమిటంటే క‌నీసం రోజుకి ప‌ద‌కొండు నిముషాలైనా వ్యాయామం చేస్తే ఒక సంవ‌త్స‌రం ఎనిమిది నెల‌ల జీవిత‌కాలం పెరుగుతుంద‌ని హార్వ‌ర్డ్ మెడిక‌ల్ స్కూల్ వైద్య నిపుణుడు ఐ-మిన్ లీ అంటున్నారు. ఆయ‌న ఎన్నో ప‌రిశోధ‌న‌లు చేసి ఈ విష‌యాన్ని క‌నుక్కున్నారు. కేవ‌లం 11 నిముషాలంటే చాలా ప‌రిమిత కాలం. కాబ‌ట్టి ఎవ‌రైనా బ‌ద్ద‌కించ‌కుండా చేయ‌గ‌లుగుతారు. పైగా టైం లేదు అనే సాకు కూడా చెప్ప‌లేరు. దీంతోనే ఇంత ప్ర‌యోజ‌నం ఉంటే ఇక ఆ కాలాన్ని పొడిగిస్తే ఇంకెంత‌ ప్ర‌యోజ‌నం ఉంటుందో ఊహించుకోమంటున్నారు ఈ నిపుణుడు. ఈ నెంబ‌ర్ చిట్కా కూడా బాగా ప‌నిచేసేదే. ఎందుకంటే 11 నిముషాలే క‌దా అని మొద‌లుపెట్టిన వ్యాయామం ఎంతో కొంత పొడిగిస్తాం క‌దా…అందుక‌ని.
  • 15 నిముషాల సూత్రం…..మ‌ద్యం, సిగ‌రెట్‌, చాక్‌లెట్లు…దేనికైనా స‌రే మాన‌లేనంత‌గా అడిక్ట్ అయిపోయిన‌వారికి ఇది భ‌లేమంచి సూత్రం. లోలోప‌ల వాటిని నియంత్రించే శ‌క్తి అస‌లు లేన‌పుడు ప‌ట్టుద‌ల‌గా స‌రిగ్గా ప‌దిహేను నిముషాలు ఆగిచూడండి, ఆ తీవ్ర‌త త‌గ్గిపోతుంది అంటున్నారు… వ్య‌స‌నాల‌ను త‌గ్గించి పునఃస్థితికి చేర్చ‌డంలో నిపుణుడు అల‌న్ మ‌ర్లాట్. ఒక్క పావుగంట‌లో ఆ కోరిక తాలూకూ తీవ్ర‌త అల‌లా కింద‌కు దిగిపోతుంద‌ని, కాక‌పోతే ఆ ప‌దిహేను నిముషాలు అసౌక‌ర్యంగా ఉంటుంద‌ని, ఒక మంచి ల‌క్ష్యం కోసం కాసేపు ఇబ్బంది ప‌డ‌వ‌చ్చు క‌దా అంటున్నారాయ‌న‌.
  • ‍20 నిముషాల సూత్రం….ఏదో ఒక స‌మస్యని గురించి తీవ్రంగా ఆలోచిస్తుంటారు, లేదా ఒక విష‌యంపై వెంట‌నే నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంది… కానీ మంచి ఆలోచ‌న రావ‌డం లేదు. అలాంట‌పుడు క్ష‌ణం కూడా ఆగ‌కుండా ఆలోచించే బ‌దులు ఓ ఇర‌వై నిముషాల పాటు బ్రేక్ తీసుకోవాలి. దాని గురించి అస‌లేమాత్రం ఆలోచించ‌కుండా, దానికేమాత్రం సంబంధం లేని ప‌నిచేయాలి. న‌డ‌వ‌డ‌మో, చిన్న కునుకు తీయ‌డ‌మో, ఇంకే ర‌కంగా అయినా మెద‌డుని దాన్నుండి మ‌ళ్లించాలి. దీనివ‌ల‌న అద్భుతం జ‌రుగుతుంద‌ని చెబుతున్నారు హోర్బ‌ర్ట్ బెన్స‌న్‌, విలియం ప్రొక్టార్ అనే ప‌రిశోధ‌కులు. ప‌జిల్స్ పూర్తి చేస్తున్న‌పుడు, ఆలోచించ‌డం ఆపాక స‌డ‌న్‌గా ఆన్స‌ర్ త‌ట్టే గ‌మ్మ‌త్త‌యిన అనుభ‌వం చాలామందికి ఎదుర‌య్యే ఉంటుంద‌ని వారు గుర్తు చేస్తున్నారు. ఇలా కావాల‌ని కాసేపు విరామం తీసుకున్న‌పుడు మ‌న మెద‌డు ఒత్తిడిని త‌ట్టుకుని ప్ర‌శాంత‌త క‌లిగించే ర‌సాయ‌నాల‌ను విడుద‌ల చేస్తుంద‌ట‌. ఆ ప్ర‌శాంత‌త‌ని అనుభ‌విస్తున్న‌పుడు మెద‌డు మ‌రింత సృజ‌నాత్మ‌కంగా ప‌నిచేసి ఆన్స‌ర్‌ని రాబ‌డుతుంద‌ని ఆ ఇరువురు శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. దీన్ని వారు విరామ సూత్రంగా పేర్కొన్నారు.
  • 43 నిముషాల సూత్రం….ఇంత‌కుముందు 11 నిముషాల వ్యాయామం గురించి చెప్పుకున్నాం క‌దా…రోజుకి 11 నిముషాల‌కే ఒక సంవ‌త్సరం ఏనిమిది నెల‌ల జీవిత‌కాలం పెరిగితే మ‌రి వ్యాయామం ద్వారా అత్య‌ధికంగా జీవిత‌కాలాన్ని పెంచుకోవాలంటే ఎంత స‌మ‌యం అందుకు వెచ్చించాలి…అనే సందేహం, కుతూహ‌లం మ‌న‌కు త‌ప్ప‌కుండా క‌లుగుతాయి క‌దా. ఆ స‌మాధానం 43 నిముషాలు. రోజుకి ఈ మాత్రం స‌మ‌యం వ్యాయామం చేయ‌డం వ‌ల‌న 4.2 సంవ‌త్స‌రాల జీవిత‌కాలం పెరుగుతుంద‌ట‌. మ‌రింత వ్యాయామానికి మ‌రింత జీవిత‌కాలం పెరుగుతుంది కానీ ఆ పెరుగుద‌ల‌ త‌క్కువ స్థాయిలో ఉంటుంది. రోజుకి 22 నిముషాలు వ్యాయామం చేసినా 3.4 సంవ‌త్స‌రాల జీవిత‌కాలం పెరుగుతుంది. అంతేకాదు, వ్యాయామంతో అనారోగ్యాలు లేకుండా ఆనందంగా జీవించ‌వ‌చ్చు కూడా.

-వి. దుర్గాంబ‌

First Published:  14 Oct 2015 12:46 AM GMT
Next Story