Telugu Global
Others

నిప్పుతో చెలగాటం

“నిప్పితోడ చెలగాటమాడితే ముప్పులు తిప్పలు తప్పవురా పల్లెరుగాయలు చల్లిన చోటుల మల్లెలు జాజులు పూయవురా” అన్నాడు గజ్జెల మల్లారెడ్డి. కోరలు పెరికేసిన బీజేపీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ పరిస్థితి ఇలాగే ఉంది. రాజకీయ సిద్ధాంత నిబద్ధత ఎలా ఉన్నా బయటకు కనిపించడానికైనా అటల్ బిహారీ వాజపేయి లాంటి వారి నాయకత్వంలో బీజేపీ ఎదగడానికి అవకాశం లేదనుకున్న సమయంలో అద్వానీ బీజేపీ నాయకుడయ్యారు. ఆయన రథమెక్కి దేశమంతా కలియ తిరిగి జనానికి రామ మందిర నిర్మాణ జ్వరమెక్కించి […]

నిప్పుతో చెలగాటం
X

RV Ramaraoనిప్పితోడ చెలగాటమాడితే
ముప్పులు తిప్పలు తప్పవురా
పల్లెరుగాయలు చల్లిన చోటుల
మల్లెలు జాజులు పూయవురా

అన్నాడు గజ్జెల మల్లారెడ్డి. కోరలు పెరికేసిన బీజేపీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ పరిస్థితి ఇలాగే ఉంది. రాజకీయ సిద్ధాంత నిబద్ధత ఎలా ఉన్నా బయటకు కనిపించడానికైనా అటల్ బిహారీ వాజపేయి లాంటి వారి నాయకత్వంలో బీజేపీ ఎదగడానికి అవకాశం లేదనుకున్న సమయంలో అద్వానీ బీజేపీ నాయకుడయ్యారు. ఆయన రథమెక్కి దేశమంతా కలియ తిరిగి జనానికి రామ మందిర నిర్మాణ జ్వరమెక్కించి చివరకు 1992 డిసెంబర్ ఆరున అయోధ్యలోని బాబరీ మసీదును నేలమట్టం చేసే క్రతువును పూర్తి చేశారు. రాజకీయాల నుంచి విడదీసి చూస్తే ప్రస్తుతం బీజేపీ అగ్ర నాయకులైన నరేంద్ర మోదీ, అమిత్ షా కన్నా అద్వానీ పోలికే లేనంత సౌమ్యుడు. అద్వానీ రథయాత్ర సందర్భంగా చేసిన భావోద్వేగ పూరితమైన ప్రసంగాలు విన్న యువకులు మైలారభటుల అవతారమెత్తి బాబరీ మసీదు రాయి రాయి విడగొడుతుంటే అద్వానీలోని సంస్కారపూరితమైన హృదయం ఆయన చేత కంట తడి పెట్టించింది. కానీ ఏం లాభం జరగాల్సింది జరిగి పోయింది. 450 ఏళ్లనాటి బాబరీ మసీదు నేలమట్టమై పోయింది.

అక్కడ రామ మందిరం నిర్మించాలన్న విశ్వహిందూ పరిషత్తు కల 23 ఏళ్లైనా నెరవేరలేదు. అయితేనేం పార్లమెంటులో బీజేపీ బలం అంతకంతకూ పెరిగింది. అధికారమూ దక్కింది. అద్వానీ ఉపప్రధాని అయిపోయారు. కాని రామ మందిర నిర్మాణ సంకల్పంలాగే రాజకీయ పరమపద సోపాన పటంలో పెద్ద నిచ్చెన ఎక్కాలనుకున్న అద్వానీ కాల ఆఖరి మెట్టుకు చేరుకున్న దశలో కూలిపోయింది. ఆయన కలకు శాశ్వతంగా తెర పడింది. జీవిత సంధ్యా సమయంలో ఇప్పుడు అద్వానీకి తీరికే తీరిక. ఈ తీరిక సమయంలో ఆయన గతంలో చేసిన పొరపాట్లు సరిదిద్దుకోలేక పోవచ్చు కాని సవ్యంగా ఆలోచించే అలవాటు మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు. అద్వానీ సంస్కారాన్ని రాజకీయలతో ముడి పెట్ట కూడదు. ఆయన వ్యక్తిత్వం వేరు. రాజకీయాలు వేరు.

ఇప్పుడు అద్వానీకి కనీసం భీష్ముడి పాత్ర కూడా లేదు. అయినా నవతరం బీజేపీ నాయకత్వంలో తాను పార్లమెంటులో సుస్థిరం చేసిన బీజేపీ అదుపు లేకుండా పోతోందనుకున్నప్పుడు అడక్కపోయినా మంచి సలహాలే ఇస్తున్నారు. ఆయన హృదయం ఆయన జీవిత మలి సంధ్యలోనైనా ప్రజాస్వామ్యం కోసం పరితపిస్తోంది.

అద్వానీకి సన్నిహితుడైన సుధీంద్ర కులకర్ణి మీద శివ సైనికులు ఇవ్వాళ సిరా పోసి ఆయన ముఖాన్ని విరూపం చేశారు. సుధీంద్ర కులకర్ణి అద్వానీకి సన్నిహితుడే కావచ్చు. సంఘ్ పరివార్ లో భాగస్వామే కావచ్చు. కాని పాకిస్తాన్ తో సంబంధం ఉన్న ఏ కార్యక్రమం ముంబైలో జరిగినా శివసైనికులు ఆగ్రహిస్తారు. పాకిస్తాన్ విదేశాంగ శాఖ మాజీ మంత్రి ఖుర్షీద్ కసూరి “నైదర్ ఎ హాక్, నార్ ఎ డవ్ – ఆన్ ఇన్సైడర్స్ అకౌంట్ ఆఫ్ పాకిస్తాన్స్ ఫారెన్ పాలసీ” అన్న గ్రంథం రాశారు. ఈ గ్రంథావిష్కరణ సభలో సుధేంద్ర కులకర్ణి సమన్వయకర్తగా వ్యవహరించాల్సి ఉంది. పాకిస్తాన్ తీవ్రవాదానికి మద్దతు ఇస్తోంది కనక వోర్లీ లోని కేంద్రంలో ఈ ఆవిష్కరణ సభ జరగడానికి వీలు లేదని శివ సేన ముందే హెచ్చరించింది. అయినా నిర్వాహకులు ఈ హెచ్చరిక ఖాతరు చేయలేదు. బహుశః ఈ సాయంత్రం ఆవిష్కరణ సభ జరగా వచ్చు. రభసా జరగొచ్చు.

కాని ఇదంతా జరగక ముందే శివసైనికులు ఉదయమే సుధేంద్ర కులకర్ణీ ఇంటి దగ్గరకెళ్లి ఆయన ముఖం మీద నల్ల రంగు పోశారు. ఈ సభకు కావాల్సిన భద్రత ఏర్పాటు చేస్తామని మహరాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హామీ ఇచ్చారు. అయినా సుధేంద్ర కులకర్ణి అవమానం పాలు కావాల్సి వచ్చింది. గుడ్డిలో మెల్ల ఏమిటంటే శివసైనికుల నిర్వాకం తర్వాత కులకర్ణి గానీ, పాక్ విదేశాంగ శాఖ మాజీ మంత్రి కసూరి కాని బెసకకుండా ఆవిష్కరణ సభ జరుపుతామనే అంటున్నారు. ఫడ్నవీస్ మాటల్లోనూ మెలిక లేకపోలేదు. ఆ సభలో భారత్ వ్యతిరేక మాటలు దొర్లితే సహించబోం అని కసూరీకి, ఆ సభ నిర్వాహకులకు, మీదు మిక్కిలి కులకర్ణికి అన్యాపదేశ హెచ్చరిక కూడా జారీ చేశారు.

ఈ సభ జరగడం జరగక పోవడం పెద్ద విషయం కాదు. ఎందుకంటే పాకిస్తాన్ తీవ్రవాదానికి మద్దతిస్తున్నంత కాలం పాకిస్తాన్ ప్రముఖులు, కళాకారులకు సంబంధించిన ఏ కార్యక్రమాన్న్ని అయినా సాగనివ్వబోమని శివ సేన అడపా దడపా హెచ్చరిస్తూనే ఉంది. ఇటీవలే శివ సేన హెచ్చరిక పర్యవసానంగా పాకిస్తానీ గాజల్ గాయకుడు గులాం అలీ కచేరీ జరగడానికి వీలు లేదని హుంకరిస్తే ఆ కచేరీ రద్దయింది కదా! ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఏం చేయగలిగారు గనక! శివ సేన కార్యకర్తలు ఆగ్రహిస్తే ఏమైనా చేయగలరు. పాకిస్తాన్ క్రికెట్ క్రీడాకారులు ముంబైలో అడుగు పెట్ట గూడదంటే పెట్టగూడదంతే. అలా కుదరనప్పుడు వాంఖడే స్టేడియం తవ్వేశారా లేదా. దేవేంద్ర ఫడ్నవీస్ మంత్రివర్గంలో శివ సేన కూడా భాగస్వామే గనక ఆ ప్రభుత్వంలో ఒక బలమైన వర్గం వ్యతిరేకిస్తే పాపం ముఖ్యమంత్రి మాత్రం ఏం చేయగలరు. పుస్తకావిష్కరణ కోసం ప్రభుత్వాధికారాన్ని వదులుకోలేరు కదా. శాంతి భద్రతలను కాపాడే క్రమంలో శివ సేనతో వైరం తెచ్చుకోలేరు గదా!

ఇక్కడ ఫడ్నవీస్ ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేయలేదు అన్నది ప్రశ్న కాదు. “ఇటీవల అసహనం బాగా పెరిగి పోతోంది. ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. ఈ పని (సుధేంద్ర కులకర్ణీ మీద నల్ల రంగు పులమడం) ఎవరూ చేసినా నేను ఖండిస్తున్నాను. అది ఒక సంస్థ అయినా సరే” అన్న అద్వానీ బాధాతప్త హృదయంతోనే అసలు బాధంతా. సమాజాన్ని మతాల వారీగా చీల్చడంలో ఆయన పాత్ర లేదని ఆయనైనా అనగలరా? గతంలో ఆయన పెంచి పోషించిన మతతత్వ భావాల అంకురం ఇప్పుడు మహా వృక్షమై వెర్రి తలలు వేయడాన్ని ఆపే శక్తి ఆయనకు ఉందా? విత్తు ఒకటి నాటితే చెట్టొకటి మొలుస్తుందని నమ్మేంతటి అమాయకత్వం అద్వానీలో ఉందా? ఆయన వ్యక్తిగత సంస్కారం తానే పెంచి పోషించిన విద్వేషాగ్నిని చల్లార్చగలదా?

అద్వానీ, ఆయన పూర్వీకులు, ఇప్పుడు వారసులు చేసిన, చేస్తున్న పని విద్వేషాగ్ని విస్తరించడానికి కాక సహనానికి, ప్రజాస్వామ్య సంప్రదాయాలకు దోహదం చేస్తుందనుకుంటే నమ్మగలమా! సంస్కారం వ్యక్తిగతంగా మిగిలితే లాభం ఉండదు. అది అస్థిగతం కావాలి. అది ఆ కుదురుకు సాధ్యమయ్యే పని కాదు. ఫలితం అనుభవించాల్సిందే. ఆ ఫలితం జాతి జాతంతా అనుభవించాల్సి రావడమే విషాదం.

– ఆర్వీ రామారావ్

First Published:  12 Oct 2015 5:58 AM GMT
Next Story