Telugu Global
Others

వైఎస్ ఆర్ కాంగ్రెస్ స్టాండ్ మారుతోందా?

తెలంగాణ‌లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ స్టాండ్ మారుతోందా? ఇంత‌కాలం టీ ఆర్ ఎస్ తో స‌న్నిహితంగా మెదులుతూ వ‌స్తోన్న ఈ పార్టీ క్ర‌మంగా ప్ర‌భుత్వ వ్య‌తిరేక స్వ‌రం బ‌య‌ట‌పెడుతోంది. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా టీఆర్ ఎస్ మ‌ద్ద‌తు కోర‌గా.. వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత అందుకు అంగీక‌రించిన‌ విషయం తెలిసిందే. కొంత‌కాలంగా తెలంగాణ‌లో రైతుల ఆత్మ‌హ‌త్య‌లు, నీటి ప్రాజెక్టుల‌పై ప్ర‌భుత్వ హామీల‌ను ఎండ‌గ‌డుతూ సాక్షి దిన‌ప‌త్రిక‌లో వ‌ర‌స క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ఇంత‌కాలం ప్ర‌భుత్వంతో స‌ఖ్య‌త‌గా మెదులుతూ వ‌చ్చిన […]

వైఎస్ ఆర్ కాంగ్రెస్ స్టాండ్ మారుతోందా?
X

తెలంగాణ‌లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ స్టాండ్ మారుతోందా? ఇంత‌కాలం టీ ఆర్ ఎస్ తో స‌న్నిహితంగా మెదులుతూ వ‌స్తోన్న ఈ పార్టీ క్ర‌మంగా ప్ర‌భుత్వ వ్య‌తిరేక స్వ‌రం బ‌య‌ట‌పెడుతోంది. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా టీఆర్ ఎస్ మ‌ద్ద‌తు కోర‌గా.. వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత అందుకు అంగీక‌రించిన‌ విషయం తెలిసిందే. కొంత‌కాలంగా తెలంగాణ‌లో రైతుల ఆత్మ‌హ‌త్య‌లు, నీటి ప్రాజెక్టుల‌పై ప్ర‌భుత్వ హామీల‌ను ఎండ‌గ‌డుతూ సాక్షి దిన‌ప‌త్రిక‌లో వ‌ర‌స క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ఇంత‌కాలం ప్ర‌భుత్వంతో స‌ఖ్య‌త‌గా మెదులుతూ వ‌చ్చిన ఆ పార్టీ కూడా ఇప్పుడు దూరం జ‌రుగుతోంది. తాజాగా ప్ర‌తిప‌క్షాలు ఈనెల 10న ఇచ్చిన బంద్‌కు వైఎస్సార్ సీపీ మ‌ద్ద‌తు ప‌ల‌క‌డం విశేషం. ప్ర‌భుత్వం రైతుల స‌మ‌స్య‌ల‌ను, ఆత్మ‌హ‌త్య‌ల‌కు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, అసెంబ్లీలో ప్ర‌తిప‌క్షాల గొంతు నొక్కింద‌ని వైఎస్ ఆర్ కాంగ్రెస్ తెలంగాణ ఇన్‌చార్జి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి విమ‌ర్శించారు. అందుకే ప్ర‌తిప‌క్షాల‌తో క‌లిసి బంద్ లో తాము కూడా పాల్గొంటున్నామ‌ని తెలిపారు.

స్వంతంగా బ‌ల‌ప‌డేందుకేనా?
ఏ పార్టీ అయినా.. స్వంతంగా బ‌ల‌ప‌డే క్ర‌మంలో స్థానికంగా భావ‌సారూప్య‌త ఉన్న పార్టీల‌తో తొలుత చెలిమి చేస్తుంది. క్రియాశీల‌క నాయ‌కుల సంఖ్య పెరిగి, స్థానికంగా కేడ‌ర్ బ‌ల‌ప‌డిన త‌రువాత సొంతంగా పోటీకి స‌ముఖ‌త చూపుతుంది. రాజ‌కీయాల్లో ఇదంతా స‌హ‌జం. ఇప్పుడు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే బాట‌లో ప‌య‌నిస్తోంది. తెలంగాణ వ్య‌తిరేక పార్టీగా ముద్ర‌ప‌డిన నేప‌థ్యంలో ఇంత‌కాలం కేసీఆర్‌కు వ్య‌తిరేకంగా ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌లేదు. కానీ తెలంగాణ‌లో ష‌ర్మిల ప‌రామ‌ర్శ యాత్రలో భాగంగా రాష్ట్రం మొత్తం దాదాపుగా ప‌ర్య‌టించింది. ఈ ప‌ర్య‌ట‌న చావుబ‌తుకుల మ‌ధ్య ఉన్న పార్టీ కేడ‌ర్‌లో కాస్తోకూస్తో ఆశ‌లు రేపింది. యాత్ర విజ‌య‌వంతం కావ‌డంతో పార్టీ మెల్లిగా క్రియాశీల‌కం అవుతోంది.

గ్రేట‌ర్ ఎన్నిక‌లు స‌మీపిస్తున్నందుకేనా?
డిసెంబ‌రులో హైద‌రాబాద్‌లో గ్రేట‌ర్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. పార్టీల మ‌ధ్య హోరాహోరీ పోరు త‌ప్ప‌దు. టీఆర్ ఎస్‌, కాంగ్రెస్‌, టీడీపీల మ‌ధ్య త్రిముఖ పోరు జ‌రుగుతుంది. మ‌రి వైఎస్సార్ సీపీ మాటేంటి? 2014 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ – వైఎస్సార్ సీపీ క‌లిపి రాష్ట్ర విభ‌జ‌న‌కు మ‌ద్ద‌తిచ్చాయ‌ని టీడీపీ చేసిన ఆరోప‌ణ‌ల‌ను జ‌నం న‌మ్మారు. ఫ‌లితంగా ఆ పార్టీ త‌ర‌ఫున బ‌ల‌మైన అభ్య‌ర్థులు పోటీ చేసినా.. రాజ‌ధానిలో ఒక్క సీటు కూడా గెల‌వ‌లేదు. టీఆర్ ఎస్‌తో చెలిమి తెంచుకోకుంటే.. మ‌రోసారి భంగ‌పాటు త‌ప్ప‌ద‌ని ముందుగానే జాగ్ర‌త్త ప‌డుతున్నార‌ని, అందుకే ప్ర‌భుత్వం వ్య‌తిరేక స్వ‌రం పెంచుతున్నార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. పైగా పార్టీ అధినేత జ‌గ‌న్ ఏపీ ప్ర‌త్యేక హోదా కోసం చేప‌ట్టిన దీక్ష కూడా గ్రేట‌ర్‌లోని సీమాంధ్రుల్లో త‌మ పార్టీ ప‌ట్ల ఆద‌ర‌ణ పెంచుతుంద‌ని నాయ‌కులు విశ్వ‌సిస్తున్నార‌ని స‌మాచారం.

First Published:  8 Oct 2015 11:32 PM GMT
Next Story