Telugu Global
Arts & Literature

నాకు నచ్చిన నాకథ

తల్లిపేగు ఆర్తనాదం… వాల్తేరత్త ఈ కథ రాసేనాటికి 'విశాఖపట్నం' అంటే నాకు విపరీతమైన ఇష్టం, ప్రేమ, పిచ్చి, మైకం, మోజు … ఇన్ని మాటలెందుగ్గాని, ఆ ఊరి యాసలో కాస్తా మొరటుగా చెప్పాలంటే 'సెడ్డ రోకు'! చలంగారి లాంటి మహానుభావుడినే కుదిపి కుదిపి వెర్రివాణ్ణి చేసిన సౌందర్యం దానిది. నేనేపాటి? అది విరజిమ్మే కాంతిరేఖ తాకిడికే కాలి బూడిదయ్యే శలభాన్ని. ఇంతగా విశాఖ నిన్నెందుకు ఆవహించిందని మీరడిగితే ఏం చెప్పాలి? అమ్మ కడుపులోంచి బాహ్య ప్రపంచంలోకి రాగానే […]

నాకు నచ్చిన నాకథ
X
gorusu jagadeeshwar reddy
గొరుసు జగదీశ్వరరెడ్డి

తల్లిపేగు ఆర్తనాదం… వాల్తేరత్త

ఈ కథ రాసేనాటికి 'విశాఖపట్నం' అంటే నాకు విపరీతమైన ఇష్టం, ప్రేమ, పిచ్చి, మైకం, మోజు … ఇన్ని మాటలెందుగ్గాని, ఆ ఊరి యాసలో కాస్తా మొరటుగా చెప్పాలంటే 'సెడ్డ రోకు'! చలంగారి లాంటి మహానుభావుడినే కుదిపి కుదిపి వెర్రివాణ్ణి చేసిన సౌందర్యం దానిది. నేనేపాటి? అది విరజిమ్మే కాంతిరేఖ తాకిడికే కాలి బూడిదయ్యే శలభాన్ని.

ఇంతగా విశాఖ నిన్నెందుకు ఆవహించిందని మీరడిగితే ఏం చెప్పాలి?
అమ్మ కడుపులోంచి బాహ్య ప్రపంచంలోకి రాగానే విశాఖ మట్టిని ముద్దాడి నందుకా? మా బంధుజనం పటాలం ఆ ఊరి నిండా ఉన్నందుకా? ఆకాశానికెగబాకిన యారాడకొండా? దిగంతాలకు పాకిన సముద్రమా? భీమ్లీ నరసింహాస్వామా? సింహా చలం సంపెంగలా? సిమ్మాద్రి అప్పన్నా? కనకమాలచ్చిమా? సొర్రపిట్టు రుచా? పూర్ణా మార్కెట్టా? ఎల్లమ్మతోటా? చావుల మదుఁవా? షిప్పియార్డా? కాల్టెక్సా? ఆంధ్రా యూనివర్సిటీయా? శాంతి ఆశ్రమమా? గవర్నర్‌ బంగ్లా? ఆశీలుమెట్ట జంక్షనా? సెంట్రల్‌ జైలా? ఎర్రమట్టి దిబ్బలా? సీతమ్మధారా? కెజీహెచ్చా? కలెక్టరాఫీసా? భీమ్లీ డచ్చీ స్తూపాలా? ముడసల్లోవ అందాలా? అరకు రైలు ప్రయాణమా? రిషికొండా? తొట్లకొండా? భీమ్లీ బీచ్‌ రోడ్డా? కైలాసగిరా? రావిశాస్త్రి, శ్రీశ్రీలు దోగాడిన నేలా? ఏదని చెప్పాలి? ఎవరని చెప్పాలి? పెగ్గు పెగ్గుకీ నిషా అంచెలంచెలుగా నషాళానికెక్కినట్టు… ఆ ఊరికి వెళ్లిన ప్రతిసారీ ఒక్కక్కటీగా నన్ను ఆవహించి పిచ్చివాణ్ణి చేసిన విశాఖ అది. అమ్మో! అది అందమా? కళ్లు చిట్లిపోయి, గుండె పిట్లిపోయే సౌందర్యం. దాన్ని భరించాలంటే మనిషన్నవాడికి మనసుండకూడదు. ఉన్నా దానికి విశ్వమంత కళాపోసనుండాలి? నక్షత్ర మండ లానికి రెట్టింపు కళ్లుండాలి! కొండంత గుండె నిబ్బరం కావాలి!!

* * *

ఉమా (ఆర్‌.ఎం.) హైద్రాబాద్‌ 'ఆంధ్రజ్యోతి ఆదివారం' సంచికకు ఇన్‌ఛార్జ్‌గా పనిచేసే రోజుల్లో బతిమాలి, బామాలి, తిట్టి, గిల్లి, కసిరి, కొట్టేంత పనిచేసి కొందరితో కథలు రాయించినట్టే నా చేత కూడా 'జలగలవార్డు', 'గజ ఈతరాలు' లాంటి రెండు, మూడు కథలు రాయించి, హఠాత్తుగా బదిలీ చేయించుకుని (1999-2000 ప్రాంతాల్లో) తిరుపతి వెళ్లిపోయాడు. తర్వాత మిత్రుడు పారుపల్లి శ్రీధర్‌ ఆ పోస్టులో (తాత్కాలికంగా) ఉండగా నన్నో కథ రాసిమ్మని అడగడంతో అప్పటికే నాలో సంవత్సరాలుగా నలుగుతున్న 'వాల్తేరత్త' కథకి శ్రీకారం చుట్టాల్సి వచ్చింది. ఈ కథానేపథ్యం చెప్పాలంటే కనీసం నాలుగు దశాబ్దాల కాలాన్ని నేను వెనక్కి తిప్పాలి. డాగులు పడి, మసకబారిన నా బాల్యపు అద్దాన్ని తళతళ మెరిసేలా రుద్దాలి.

* * *

నాకు ఊహ తెలిసింది పాలమూరు జిల్లాలో. నాన్న ఉద్యోగరీత్యా మహబూబ్‌నగర్‌ టౌన్‌లో ఉండేవాళ్లం. అప్పటికి ప్రతి మనిషికి ఒక స్వంత ఊరనేది ఒకటుంటుందనే విషయం కూడా తెలీదు. నా ఎనిమిదేళ్ల వయసప్పుడు వేసవి సెలవులకి (1967-68ల్లో) తొలిసారి అమ్మ, అన్నయ్య లతో కలిసి ఇప్పట్లా 8 గంటల్లో కాదు, దాదాపు రెండు రోజులు ప్రయాణం చేసి విశాఖపట్నం వెళ్లాను. అక్కడకి వెళ్లాకే తెలిసింది, మా అమ్మానాన్నలకూ స్వంత ఊరనేది ఒకటుందని, అదే విశాఖపట్నం అని. అక్కడి మా బంధువర్గాన్ని చూసి అదిరిపోయాను. అమ్మమ్మ, తాత, పెద్దమ్మ, పిన్నులు, అత్తలు, మేనమామలు, చిన్నాన్నలు, పెదనాన్నలు, బావలు, బామ్మరుదులు, మర దళ్లు, వదినలు… వాళ్ల పిల్లలూ, జల్లలూ అబ్బో… అప్పటికే వందమంది దాకా ఉంది పటాలం. ఒక పిన్ని మద్దిలిపాలెంలో ఉంటే, ఒక మామయ్య రేసవానిపాలెంలో, పెద్దమ్మ భీమ్లీలో, మిగతా మరికొందరు ఇసకతోట పరిసర ప్రాంతాల్లోనేఉండేవారు. నాన్న తరపువాళ్లంతా తగరపువలస దగ్గర్లో ఉన్న అమనాంలో. ఎవరి కుటుంబం వాళ్లదే. అమ్మమ్మ తాతలు మా చిన్న మేనమామ ఇంట్లో ఉండేవారు. ఆ పక్కనే ఉన్న మరో ఇంట్లో మా అమ్మ చిన్న చెల్లెలు ఎల్లయ్యమ్మ తన ఆరుమంది సంతానంతో ఉండేది. చినాన్న పోర్టు ఉద్యోగి. మిగతా బంధువుల్లో ఎవరెవరు ఏ ఏ వరస అవుతారో మొదట్లో అంతా గందరగోళంగా ఉండేది. తాత ఇంటికి కూతవేటు దూరంలో ఉండే పొలంలో (ప్రస్తుతం కృష్ణా కాలేజీ ఏరియా) కౌలు చేస్తూ గంట్లూ, సోళ్లూ, చిలగడదుంపలూ పండించేవాడు.

ఒకటి రెండుసార్లు వేసవి సెలవుల్లో విశాఖపట్నం వెళ్లి రావడంతో వాళ్లంతా నాకేమవుతారో కొద్దికొద్దిగా బోధపడింది. విశాఖపట్నం చుట్ట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే పల్లెల్లో మరికొంతమంది బంధువులు కూడా ఉన్నారని తెలిసింది. ఎప్పుడు విశాఖపట్నం వెళ్లినా మా పెద్దమ్మ వాళ్ల ఇంటికి (భీమ్లీ) మాత్రం తప్పకుండా వెళ్లేవాళ్లం. భీమ్లీ ద్వీపకల్పంలా … మా పెద్దమ్మ వాళ్ల ఇంటి నుండి చూస్తే మూడు వైపులా సముద్రమే కనిపించేది. రాక్షసుడి ఉఛ్వాస నిశ్వాసల్లా దాని ¬రు మాత్రం క్షణం ఆగకుండా చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉండేది. అప్పటికి సాహిత్యం గురించి నాకు ఓనమాలు కూడా తెలీకపోయినా, భీమ్లీలో ప్రముఖ రచయిత్రి ద్వివేదుల విశాలాక్షిగారి ఇల్లు కెరటాలని తాకుతూ ఉండేదని, వాళ్లింటి పనిమనిషి మా పెద్దమ్మ ఇంటి పక్కనుండే పాకలోనే ఉండేదని చెప్పుకునేవారు. 'రచయిత్రి అంటే ఏంటని' అడిగేవాణ్ణి మా పెద్దమ్మ కూతుళ్లని. 'కథల్రాస్తార్రా … 'రెండు కుటుంబాల కథ' సినిమా చూశావా? ఆ కథ ('వారధి' నవల) విశాలాక్షిగారు రాసిందే, పైగా ఆవిడ షావుకారు జానకిగారికి వియ్యపురాలని చెప్పేవారు. ఆ వయసులో ఆ మాటలు నాకెంతపూర్తి అర్థమయ్యేవో ఏమోగానీ ఒ¬ అని తలూపేవాణ్ణి.

ఇక ఈ కథలోని వరాలమ్మకి ప్రేరణ మాత్రం మా ఎల్లయ్యమ్మ పిన్నే. చిన్నాన్న తను సంపా దించిన జీతం డబ్బులన్నీ పేకాటలో పెట్టేసేవాడు. తప్పని పరిస్థితుల్లో సంసారాన్ని తన భుజ స్కంధాలపై వేసుకుని ఒకవైపు బడ్డీకొట్టు నడుపుతూ, మరోవైపు వడ్డీలకు తిప్పుతూ నెట్టుకొచ్చేది పిన్ని.

విశాఖలో ఉన్న ఆ వేసవి రెండు నెలల్లో పిన్నిని బాగా గమనించేవాడిని. ఇంట్లో పెద్ద పెద్ద ట్రంకు పెట్టెలుండేవి. వాటినిండా కుదవబెట్టిన సామానుండేది. వాచీలు, రేడియోలు, ఇత్తడి గిన్నెలు, బిందెలతోపాటు చెవికమ్మలు, ముక్కుపుడకలు, పుస్తెలతాళ్లు, పట్టగొలుసులు, గాజులు, ఉంగరా ల్లాంటి నగలైతే సర్వసాధారణం. ఆమె దగ్గర చిత్రగుప్తుడి చిట్టాలాంటి పెద్ద రిజిస్టరు. ఎవరెవరికి ఎంతెంత డబ్బులు ఇచ్చింది? ఎంత వడ్డీ? వాళ్లు కుదవపెట్టిన వస్తువు లెక్కలన్నీ రాసేది అందులో. వాళ్లిచ్చిన వస్తువుకు పూర్తి వివరాలు రాసిన ఒక 'టాగ్‌' కట్టేది. ప్రతిరోజూ సూర్యోదయం కాకముందే ఒకరో ఇద్దరో ఇంటిముందు నిద్రకళ్లతో ఏదో ఒక వస్తువుతో పాటు డబ్బు కోసం రెడీగా నిల్చుని ఉండేవారు. ఎక్కువగా 'రెల్లి' వాళ్లు. కూరగాయలు, పళ్లూ, రకరకాల చిల్లర వ్యాపారాలు చేసేవారు కాబట్టి తరచూ డబ్బు అవసరం ఉండేది వాళ్లకి. పిన్నికి తోడుగా మా అమ్మమ్మ సపోర్టు. ఒక్కోసారి జమిలిగా వడ్డీ వ్యాపారం చేసేవారు. పిన్ని వాళ్ల పెద్దబ్బాయిని వడ్డీ వసూళ్లకు పంపేది. వసూలు చేసిన డబ్బులతో వాడు సినిమాలు, షికార్లు చేసేవాడు. ఒక్కోసారి కుదవ పెట్టిన నగోనట్రో కాజేసి, అమ్మేసి, ఆ డబ్బుతో రాజమండ్రి పారిపోయి జల్సా చేసి వచ్చేవాడు.

మరో పిన్ని మద్దిలిపాలెంలో ఉండేది కాబట్టి ఈ కథలోని పరిసరాలకు ఆమె ఇంటిని వాడుకున్నాను. ఆ చిన్నాన్న మాత్రం తాగడంలో 'దేవదాసు'కు బ్రదరే. కథలో సౌలభ్యం కోసం పేకాట చిన్నాన్నని తాగుబోతుగా మార్చేశాను. నా పాత్రని బంధుత్వం లేకుండా అవుట్‌ సైడర్‌గా, ఇంట్లో అద్దెకున్న వారి అబ్బాయి రమణగా, వరాలమ్మ రోజువారి దినచర్యను గమనిస్తున్నట్టు కథను అల్లుకున్నాను.

నా ఎనిమిదేళ్ల వయసు నుండి దాదాపు 20 ఏళ్లపాటు విశాఖ వెళ్లినప్పుడల్లా పరిసరాల్లో, అక్కడి మనుషుల్లో వచ్చిన మార్పుని, ముఖ్యంగా విశాఖ యాసని గమనించేవాణ్ణి. నేను తొలిసారి వెళ్లినప్పుడు ఊరు మొత్తానికి పదిలోపు సినిమాహాళ్లు మాత్రమే ఉండేవి. ప్రభాత్‌, రామకృష్ణ, సరస్వతి, లీలామహల్‌, అలంకార్‌, పూర్ణ, నవరంగ్‌, దసపల్లా వారి చిత్రాలయ లాంటివి. ఆ తర్వాత 'జగదాంబ'తో పాటు ఎన్నో హాళ్లు వెలిశాయి. ఇసకతోట పక్కనే ఇప్పుడున్న ఎం.వి.పి. కోలనీ అప్పట్లో జీడి, జామ తోటలతో రెల్లి వాళ్ల పరిరక్షణలో ఉండేది. ఇల్లెక్కితే పెదవాల్తేరు మీదుగా సముద్రం కనిపించేది. బీచ్‌కు వెళ్లాలంటే శివాజీపాలెం తాటిపెండలం ఇరుకు దారిలోంచి బిక్కుబిక్కుమంటూ భయంభయంగా వెళ్లేవాళ్లం. అంత నిర్మానుష్యంగా ఉండే నిర్జన ప్రదేశం మార్గం అది.

భీమ్లీలో ఉన్నప్పుడంతా పెద్దమ్మకు తోడుగా చేపల మార్కెట్‌కు వెళ్లేవాడిని. రంగురంగుల పీతలు… రకరకాల చేపలు… ఇసకతోటలో కూడా సాయంత్రం అవగానే విధిగా చేపల మార్కెట్టుకి ఆడవాళ్లంతా వెళ్లడం, వాళ్లని నేను ఫాలో అవడం. చేపలమ్మే (ఆడ) బెస్తవాళ్ల హావభావాల్ని పరిశీలించడంలో గొప్ప సరదా ఉండేది. మాటలోని యాస, అందులోనూ సాగతీత, వాళ్ల 'మ్యాన రిజం' నిజంగా హైలైట్‌. చేపల్లో అన్ని రకాలుంటాయిని కూడా అప్పుడే తెలిసింది.

మా పిన్ని వాళ్ల పిల్లలతో పాటు జామ, జీడి తోటల్లో కాయల దొంగతనానికి వెళ్లడం, జీడి పిక్కలు ఏరుకుని రావడం, వాటిని కాల్చడం, రెల్లివాళ్లతో తిట్లు తినడం… ఆ బాల్యాన్ని కూడా కథలో వాడుకున్నాను. విశాఖ అనగానే సింహాచలం సంపెంగల పరిమళం… వాటికి భిన్నంగా ఉండే చేపల నీచువాసన. ఎర్రటి మట్టిదిబ్బలు… అనంత జలరాశి నీలవర్ణం… లంగరేసిన పెద్ద పెద్ద ఓడలు, పచ్చదనంతో మెరిసే పెద్ద పెద్ద కొండలు… అలా ఒకటీ ఒకటీ నా మస్కిష్కంలో నిక్షిప్తమైపోయేవి. పిన్ని వడ్డీవ్యాపారాన్ని కేంద్రంగా కథ అల్లుకుని, విశాఖ సౌందర్యాన్ని నాకు చేతనైనంతలో కథలో నిబిడీకృతం చేశాను.

కాలక్రమంలో మా పిన్ని వడ్డీ వ్యాపారం చేసి, చీటీలు వేసి తన ఆరుగురి పిల్లల్ని ప్రయో జకుల్ని చేసింది. అందరికీ పెళ్లిళ్లు చేసింది. మునిమనవల్ని కూడా ఎత్తుకుంటోంది. ఆమె బతుక్కే కాదు, ఎందరో బతుక్కి వడ్డీ వ్యాపారం ఆసరా అవుతున్నా, దానివల్ల నష్టపోయినవాళ్లూ ఉన్నారు. చీటీలు పాడేసుకున్నాక పారిపోయేవాళ్లు, ఆ డబ్బులు కట్టడానికి నగా, నట్రా, ఇల్లు, పొల్లు అమ్ము కున్నవాళ్లను కూడా చూశాను. డబ్బు మూలంగా సొంతవాళ్లతో పేచీలు, తిట్లు, గొడవలూ, కొట్టుకో వడాలూ చూశాను. ముఖ్యంగా మొగుళ్ల బాధ్యతారాహిత్యం కుటుంబాన్ని ఎలా అతలాకుతలం చేస్తుందో చెప్పే ప్రయత్నంతో పాటు, వడ్డీ, చీటీల వ్యాపారంలో చితికిపోయిన జీవితాలు, పాతికేళ్ల కాలంలో మారుతూ వచ్చిన విశాఖను కథాపరిథిలోకి తీసుకుని అల్లిన కథ వాల్తేరత్త. చివర్లో వరాలత్త కొడుకు నగలు తీసుకుని పారిపోయినట్టు … వాడికోసం తల్లిగా ఆమె నిరీక్షణ, వాడొస్తాడనే తపన మాతృప్రేమకు పరాకాష్టగా, కథకు కొంత నాటకీయత కూడా అద్దాలి కాబట్టి సృష్టించుకోక తప్పలేదు.

* * *

నాన్న మహబూబ్‌నగర్‌లో (అమ్రాబాద్‌) రిటైర్డ్‌ అయ్యాక, భూమి గుండ్రంగా ఉందని నిరూపిస్తూ తిరిగి విశాఖ వెళ్లి అమ్మమ్మవాళ్లు మా అమ్మకు పసుపుకుంకుమ కింద ఇచ్చిన స్థలంలో ఇల్లు కట్టుకున్నారు. ఎప్పుడో యాభైల తొలినాట నిజాం పాలన పోలీసుశాఖలో ఉద్యోగిగా చేరిన నాన్న, తెలంగాణ ప్రాంతంలోనే పూర్తి జీవితాన్ని గడిపి, మా అన్నదమ్ములిద్దరికీ ఒక దారి చూపించి, అవసానంలో వానప్రస్థానం వెదుక్కుంటూ విశాఖ చేరిపోయారు. కట్టుకున్న ఇంట్లో పట్టుమని పదేళ్లయినా తృప్తిగా జీవించకుండా కాటికి తరలి, కాష్టమై కడలిలో కరిగి, ధూళై గాలిలో కలిసి కనుమరుగయ్యాడు నాన్న. ఆయన్ని వెతుక్కుంటూ అమ్మకూడా మరో మూడేళ్లకు…

ఒకప్పుడు తన సౌందర్యంతో నన్ను పిచ్చెక్కించి మత్తెక్కించి మరులుగొలిపిన విశాఖంటే ఇప్పుడు ఆనాటి మోజూ లేదు, ఏలాంటి రోకూ లేదు!!

* * *

వాల్తేరత్త (కథ)

– గొరుసు జగదీశ్వరరెడ్డి

విజయనగరం దగ్గర్లోని కోరుకొండ సైనిక్‌ స్కూల్‌ లో మా రెండో వాడికి సీట్‌ రావడంతో పాతికేళ్ళ తర్వాత మళ్ళీ ఇలా విశాఖపట్నం మీదుగా వెళ్ళబోతున్నందుకు గొప్ప థ్రిల్‌గా వుంది.

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు బయల్దేరే ముందు కూడా అమ్మానాన్నలిద్దరు వంతపాడినట్లు, "రమణా… ఎట్లాగూ అంత దూరం వెళ్తున్నావు. తిరుగు ప్రయాణంలో నైనా విశాఖపట్నంలో దిగి వరాలత్త ఇంటికి వెళ్ళిరా," అంటూ మరీమరీ చెబుతూ, ఆ ఇంటి గుర్తులు కొన్ని చెప్పారు.

వాళ్ళు చెప్పిన గుర్తులే కాకుండా, నాకు మరికొన్ని గుర్తున్నాయి. నాకు ఊహ తెలిసిన దగ్గర్నుండి… మేం హైద్రాబాద్‌ వచ్చేవరకూ, కనీసం పన్నెండు సంవత్సరా లయినా ఆ పరిసరాల్లో పెరిగుంటాను – ఆ ఇల్లూ, వీధి ఇంకా కళ్ళకు కట్టినట్టు ఉన్నాయి. మద్దిలిపాలెంలోని రామాలయం, ఆ కోవెల పక్కనే కూరగాయలు మొదలు కొని మాంసం, చేపలు, పెండలం దుంపలు, రకరకాల తినుబండారాల్ని అమ్మే మార్కెట్టు, దాన్ని దాటి కాస్త ముందుకు వెళితే పెద్ద చేదబావి ఆ బావి చుట్టూ ఆడ వాళ్ళు పెద్ద, పెద్ద ఇత్తడి బిందెల్లోకి నీళ్ళు తోడుతున్న దృశ్యం… అక్కడికి కనుచూపు మేరలో పెంకుటిల్లు. అదే వరాలత్త ఇల్లు. అందులోని ఒక భాగంలో మేం అద్దెకు వుండేవాళ్ళం. పోనీ! అంతగా వరాలత్త ఇంటిని గుర్తించలేకపోయినా, ఆ వీధిలో ఎవర్నడిగినా ఇట్టే చూపిస్తారు. వరాలత్తని ఎరగని వారెవరు? మద్దిలిపాలెంలోనే గాక, ఆ చుట్టుపక్కల నక్కవాని పాలెం, రేసవాని పాలెం, పీతలవాని పాలెం, సీతమ్మధార, ఇసకతోట జనాలకు వరాలత్త బాగా తెలుసు. ఇంకా నాకు తెలియని వీధు ల్లోని వారికి… వరాలత్త పేరు 'నోటెడ్‌'. అందుకు గల ఒకే కారణం వరాలత్త చేసే 'వడ్డీ వ్యాపారం'.

వరాలత్త వడ్డీ వ్యాపారం చేస్తే మటుకు ఇన్ని వీధుల్లోని వాళ్ళకు తెలియాల్సిన అవసరం ఏమిటన్న ప్రశ్నకి సవాలక్ష కారణాలు లేకపోవచ్చును గానీ, 'డబ్బు' అవసరం వున్న మనిషి అప్పు వాసనని పసిగట్టినట్లు అంచెలంచెలుగా అలా పాకుతూ వరాలత్త వాకిట్లోకి చేరేవాడు.

వరాలత్త ఇంటి చుట్టూ ప్రహారీ గోడ, లోపల కొబ్బరి, జామ, మునగ, చెట్లున్నట్టు గుర్తు… ఎంచేతంటే.. ఆ చెట్లకాయల్ని వీధిలోని జనాలకు అమ్మేది వరాలత్త. అప్పుడు నాన్న ఆంధ్రా యూనివర్శిటీలో ఉద్యోగం చేసేవాడు.

వరాలత్త నేపథ్యంలోకి మరికాస్త వెళ్తే. ఆమెతో పాటూ ఆ ఇంట్లో మరో రెండు జీవా లుండేవి. వరాలత్త మొగుడు నూకరాజు, పుత్రరత్నం సింహాచలం.

నూకరాజు యూనివర్శిటీలోనే అటెండర్‌గా చేసేవాడు. ఆ విధంగా… నాన్నకి వాళింట్లో ఖాళీగా మేం వున్న పోర్షన్‌ను చూపించాడట.

రోజు వారీగా తాగటం అతగాడి హాబీ. తాగినప్పుడు నిప్పుకోడిలా నిటారుగా వుండి, పల్లె పదాల్ని వల్లెవేస్తూ, చిందులేసే నూకరాజు తాగనప్పుడు వానకు తడిసిన కోడిపెట్టెలా ముడుచుకు పోయి, వణికిపోయినట్లు, భయంగా, బేలగా వుంటాడు. వరాలత్తకి నోరు పెద్దదని, గయ్యాళనీ, రాకాసనీ, చమత్కారనీ, జగడాల మారనీ, మందరనీ, కైకనీ… అబ్బో! రకరకాల పేర్లు పెట్టి వరాలత్త చాటుగా చెవులు కొరుక్కునే వాళ్ళు జనం. వడ్డీ వ్యాపారం చేయటం వలన కాబోలు మనిషి ధీమాగా, కాస్త కరుకుగా, ఎదుటి మనిషిని సవాల్‌ చేస్తున్నట్లుగా వుండేది. నూకరాజు కన్నా అంగుళం పొడువు ఎక్కువగా వుండి, ఎత్తుకు తగ్గ లావుతో, గుండ్రని పసుపు రాసుకున్న ముఖంతో నుదుట రూపాయి కాసంత ఎర్రనిబొట్టుతో దివిటిలా వెలుగుతున్నట్లుండేది నా కళ్ళకి.

నిజానికి వరాలత్త నాకు అత్త వరసవదు. మా అమ్మా నాన్నల్ని అన్నయ్యా, వదినా అని పిలవటంతో నేనూ అత్త వరసపెట్టి పిలిచేవాణ్ణి. వరాలత్తకి రాయటం, చదవటం తెలుసును. తనకు చదువు ఎలా వచ్చిందో చెప్పినప్పడు గొప్ప అనుభూతికి లోనయ్యేది.

"మా సిన్నప్పుడు భీముడిపట్నం ద్గగిర్నుండీ ఉప్పుగల్లీలోని ఉండీవోరిమి. మా నాన్న జవానుగా వుజ్జోగం సేసీ వోడక్కడ… అల్లక్కడ ఉప్పు పండించీవోరు. సీమదొరలు, దొరసాన్లు వొచ్చీ వోరక్కడికి. పంతుల్నెట్టి మాకు సదుమతే సెప్పించీవోరు. అదేటో.. ఈ మాయదారి సదువకుతే గొప్ప బయ్యిం. పంతుల్ని సూడగానే జడిసిపోయి మాయమ్మ సోళ్ళు, గంట్లూ పోసుకునీ గాదెల్లో దాగుండీదాన్ని. అయితేటి! సదుం వచ్చీదాక వుచ్చోయించీసీవోడు పంతులు. అదిగలాగొచ్చిన గునింతాల సదుం నాను ఒడ్డీయాపారం సేయనందకి పనికొచ్చినాది…"

వరాలత్త కొడుకు సింహాచలం రమారమి నా ఈడు వాడే. నక్కవాని పాలెం స్కూల్‌లో చదివేవాడు. నేనప్పుడు డైరీ ఫారానికి, 'జూ'కీ మధ్య నున్న విశాఖ వేలీలో చదవేవాణ్ణి. అయితే, ఒకే ఇంట్లో ఉండటం వలన కాబోలు మేం బాగా స్నేహంగా వుండేవాళ్ళం. వరాలత్తకి ఆ ఊళ్ళో చాలా బంధువర్గం ఉంది. మద్దిలిపాలెంలోనే కాస్త దూరంలో వరాలత్త అన్నయ్య, ఇద్దరు తమ్ముళ్ళూ ఉండేవారు. వరాలత్తకి తండ్రి లేడు. కానీ తల్లి మాత్రం చిన్నకొడుకు దగ్గరుండి, తక్కిన ఇద్దరు కొడుకులు ఇచ్చే నెల భత్యం డబ్బుల్ని జాగ్రత్తగా తెచ్చి వరాలత్త చేతిలో పెట్టి వడ్డీకి తిప్పమనేది. ఆ వయసులో ముసలమ్మకు వడ్డీయావ వుండటం ఆశ్చర్యం కల్గించేది.

"మా ఇంట్లోని దొబ్బి తినీసి, డబ్బులొట్టికెళ్లి కూతురుకిత్తాది ముసిల్కండి," వరాలత్త చిన్న మరదలు కయ్యిమని అరిచేది అప్పుడప్పుడు.

నేనెక్కువగా సింహాచలంతో ఆడుకోవటం వలన, వాళ్లింట్లోనే ఎక్కువ సమయం గడపటంతో, వరాలత్త దినచర్య పరిశీలించేవాణ్ణి. తెల్లవారింది మొదలు, రాత్రి నిద్రపోయే దాకా, ఎవరో ఒకరు వచ్చి, వరాలత్తని బతిమాలి అప్పు పుట్టించుకు వెళ్ళేవారు.

వరాలత్త దగ్గర డబ్బుల్ని తీసుకోవాలంటే, తప్పనిసరిగా ఏ వస్తువో తాకట్టు పెట్టాల్సిందే. నోట్లు రాయించుకొని డబ్బుల్ని ఇవ్వటం చాలా అరుదు.

ఎక్కువగా నగల్ని తీసుకువచ్చేవారు… లేదంటే అప్పటికప్పుడు ఒంటిపై నున్న నగల్ని వొలిచి ఇచ్చేసేవారు. జడబిళ్ళ మొదలు.., పాపిట బిళ్ళలు, చెవి దుద్దులు, బుట్టలు, ముక్కు పుడకలు, కాడలు, బులాకీలు, మెడలోని గొలుసులు, పుస్తుల తాడు, బంగారమో, వెండో.. తప్పనిసరి.

నగల్ని తేలేని వాళ్లు చేతి వాచీలు, రేడియోలు, టేపు రికార్డర్లు, బిందెలు, ఇత్తడి చెంబులు, డేగిషాలు లాంటి రాగి వస్తువులు తెచ్చేవారు.

ఇలాంటి సామానుతో వరాలత్త ఇంట్లోని మచ్చు కిక్కిరిసిపోయేది. వస్తువు ఖరీదు కన్నా అసలుకి వడ్డీ ఎక్కువయిపోవటంతో చాలమంది వస్తువుల్ని వదిలేసేవారు. అలా ఇంట్లో ఇత్తడి, రాగి వస్తువులు పేరుకుపోయి వుండేవి.

ఏ వస్తువును తీసుకున్నా వెంటనే తెల్లని కాగితం ముక్కపై తాకట్టు పెట్టిన వాళ్ళ ఇంటి పేరుతో సహా, తీసుకున్న తేదీని రాసి అతికించడమో, దారంతో ఆ వస్తువుకు కట్టడమో చేసేది. ఇక వీటన్నింటి వివరాల్ని చిత్రగుప్తుడి చిట్టాలాంటి తెల్ల కాగితాల పుస్తకంలో రాసేది. బంగారు నగల్ని పెద్ద ఇత్తడి మరచెంబులో వేసి, మూత బిగించి, దాన్ని ఇంట్లో వున్న రంగంపెట్టెలో దాచేది. వరాలత్త నగను బట్టి వచ్చిన వాళ్ల అవసరాన్ని తెలుసుకొని వడ్డీ రేటు మార్చేది.

ఎవరొచ్చి డబ్బులడిగినా, 'నా దగ్గర నేవు,' అంటూనే వాళ్ళతో బ్రతిమాలించుకొని మరీ ఇచ్చేది. 'డబ్బు' దేనికవసరమో….జనం చెబుతుంటే ఆశ్చర్యం కల్గేది.

"వరాలప్పా… పలాస నుండి మా యీరకోడూ, యీరగత్తే వచ్చేరు. మాయమ్మి పురుడయి వోరం అవ్వింది కదా, ఆళ్లకి మనవన్ని సూన్నందకి వుప్పుడు తీరుబాటయ్యింది వచ్చినోరికి మరేద సెయ్యాల, ఇంట్లోని దమ్మిడీ నేదమ్మా, నీ మీదొట్టు!…మీ అన్నయ్య కరగపూరెల్లాడు. కోడ్ని కోసి, గార్లొండెట్టనేకపోతే సిన్నతనం కాదేటప్పా, కమ్మ కట్టీరూ… రెండొందలుంటే సూడుమీ."

అది! అలాంటి చిన్నాచితకా అవసరాల కోసం నగల్ని తాకట్టు పెట్టేవారు. వరాలత్త ఎంత ఖచ్చితంగా డబ్బులిచ్చేదో, అంత ఖచ్చితంగా వడ్డీ, అసలు వసూలు చేసేది. నెల మొదటివారంలో చాలా బిజీగా వుండేది. మొదటి తారీఖున మాత్రం ఎన్ని పనులున్నా గబగబ చేసుకొని, యూనివ ర్శిటీకి వెళ్ళేది. మొగుడికి వచ్చే జీతంకోసం ఆ రోజంతా అక్కడే వుండిపోయేది. వరాలత్త వెళ్ళ లేదంటే.. ఆ జీతం డబ్బుల్లో సగం తాగేసి, ఏ జంక్షన్‌ దగ్గరో దొర్లుతాడు. 'పలాన దగ్గర మీ ఆయన రోడ్డుకి అడ్డంగా తాగేసి పడిపోయా,'డని చెబితే మొగున్ని తిట్టుకుంటూ ఇంటికి ఈడ్చుకు వచ్చేది. పరామర్శించడానికి వాళ్ళమ్మ వస్తే, వరాలత్తకి కోపం నషాలానికి ఎక్కి, ముసలమ్మని సంచి దులిపినట్లు దులిపేది.

"ఈ తాగు ముచ్చోడ్ని నాక్కట్టబెట్టి నాబతుకులోని నిప్పులోసేవు నాయార్లా, ఈ తాగుబోతు సచ్చినోడుతో కాపరం సేయలేనమ్మో, ఇనేవరిసిటీలోని వుజ్జోగు వున్నాదని సూసినావు గాని, ఆడు తాగుబోతెదవో, ముండల ముఠాకోరో, జూదగుండోడో ఏదీ సూడకుంట నా నోట్లోని బుగ్గోసినావే రంకు ముండా." పెద్ద పెద్ద కేకల్తో కలకత్తా కాళయ్యేది వరాలత్త.

కోపంలో ఎన్ని తిట్టినా, తల్లంటే చాలా ప్రేమ వరాలత్తకి. తల్లిని ఏ కోడలయినా తిట్టిందని తెలిస్తే, కొంగు నడుముకు బిగించి, గొడవ పెట్టుకోడానికి వెళ్ళేది.

ముసలమ్మ ఏ వేళప్పుడు వచ్చినా, ఇంట్లో వున్నదేదో తినడానికి పెట్టేది. మొగుడి జీతం అందిన మర్రోజు నుండీ, ఊరి మీదికి వడ్డీ వసూళ్ల కోసం బయల్దేరేది.

"పూర్ణా మార్కెటులోని పళ్ళమ్మీ దాలియమ్మ ఆర్నెళ్లబట్టి వడ్డీ కట్నందకి రానేదు. ఇయ్యాల దాని కొప్పొట్టుకు నాక్కురానా"

"కాల్టెక్సునోని కనకారావు వడ్డీ కట్టకంటన్నాడు. ఆడి కాల్రొట్టుకునాగీనేకపోతే నాను ఒరాలమ్మనే కాదూ…" అంటూ,

"అమ్మా, సిప్పియాడు సిన్నారావు అసలూ, వడ్డీ ఇత్తానన్నాడు. ఎళ్ళీసొత్తాను" వాళ్ళమ్మని ఇంటికి కాపలా వుంచి,

"ఒలమ్మా, సావులు మదుం సన్నాసమ్మ వడ్డీ కట్నందకి వత్తానన్నాదే. పూరాగా మూడొందల పాతిక. జాగర్తగా లెక్కెట్టు సుమీ" ఆవిడకి వసూళ్ళ పని పురమాయిస్తూ, వెళ్లి, సాయంత్రానికి తిరిగి, తిరిగి అలిసిపోయి వచ్చేది వరాలత్త. ఆశీలు మెట్టమేకల కబేళ దగ్గరున్న సారాకొట్టును దర్శించుకొని, ఏ రాత్రికో తూలుతూ వచ్చేవాడు నూకరాజు. మేమంతా నిద్రకు ఉపక్రమించే వేళప్పుడు.

హరి హరి నారాయణా,

ఆది నారాయణా….

కరుణించి మమ్మేలు….

కమల లోచనుడా….

గొంతెత్తి పాడుతూ, తప్పటడుగులు వేస్తూ వచ్చే నూకరాజుకి తోడుగా వీధిలోని కుక్కలన్ని వంత పాడినట్టు చుట్టూ చేరి మొరిగేవి.

వడ్డీ వ్యాపారంతో వరాలత్త, తాగుడులో నూకరాజూ తలమునకలవడం తప్ప సింహాచలం ఏం చదువుతున్నాడో పట్టేది కాదు.

వరాలత్తకి మొగుడయినా, కొడుకయినా 'డబ్బు' తర్వాతే! ఒక్కక్షణం తీరిక లేనట్లు ఇంటి పనుల్లో, వడ్డీ పనుల్లో విశ్రాంతి లేకుండా ఉండే వరాలత్తని చూస్తే, ఒక్కోసారి జాలివేసేది. సరిగ్గా సింహాచలం స్కూల్‌ నుండి వచ్చేసరికి ఇంటి దగ్గర కాపలాగా ఉండే వాళ్ళ అమ్మమ్మ కన్పించేది.

'తిన్నందుకొచ్చావా' అంటూ ముసలమ్మని వెక్కిరించేవాడు సింహాచలం. "ఏట్రా ఇరగబడి పోతన్నావూ… నాను నా కూతురింట్లోని తిన్నందకొచ్చానేట్రా, నీ మావయ్యలు నాక్కూడెట్టకంటా తగిలీసినారంతావా, సచ్చినోడా, నీ అయ్య బేవార్సీ. ఆడు తిరవైనోడయితే నా కూతురికిన్ని పాట్లే టిరా, నీడ పట్టు నుండి సంసారం సేసును. ఆ బాబుకి తగ్గ గండడివి," ముసలమ్మ పెద్ద నోటితో సింహాచలంతో తగువేసుకుని, గొడవను పొడిగించేది. ఇంటి వసారాలోని మెట్లపైన కూర్చోని, మా అమ్మకు ఫిర్యాదులు చేసేది. "సూడుమీ, సిన్నా పెద్దానేకంట ఎనాగ పెల్లిబడిపోతన్నాడో, సిగురు లమ్డీకొడుకు, సీమ్మిరపకాయంత నేడు. నా మీదకి తిరగబడగతన్నాడు…"

మనవడితో తగువాడి, అలిసిపోయేది ముసలమ్మ. ఆ తర్వాత మా అమ్మ నుద్దేశించి "సాయిత్రమ్మా, పొయ్యిలోని బుగ్గేసినావేటి? సిన్నగ్గినిప్పొట్రమ్మీ, సుట్ట కాల్చుకుంతాను," అంటూ, ఆ పని నాకు చెప్పేది. పొయ్యిలోంచి కాలుతున్న కర్రని తెచ్చి ముసలమ్మకి ఇవ్వడమూ, పొడుగాటి సుట్టను పెదాల మధ్య బిగించి, నిప్పుతో వెలిగించుకొని, గుప్పుగుప్పుమని పొగ వదిలి పక్కనున్న పాదుల్లోకి తుపుక్కుమని ఉమ్మి, చుట్టని తిరగేసి, కాల్తున్న వైపు నోట్లో పెట్టేసి, అడ్డపొగ పీలుస్తూ నా వైపు చూసి కళ్ళతో నవ్వేది.

ముసలమ్మని చిత్రంగా చూడటం నాకలవాటు. ఆమె ముక్కుకి రెండువైపులా కాడలు వుండి, మధ్య దూలానికున్న కన్నంలోంచి, పై పెదవి వరకూ జారినట్లుండే బులాకీ చూస్తే, ఏనుగు దంతాల మధ్య వేలాడే తొండం గుర్తొచ్చేది. జాకెట్టు వేసుకునేది కాదు. శుభ్రంగా చీరను చుట్టుకొని, తల వెంట్రుకల్ని ఆముదంతో తడిపేసి, కుడి చెవికి దగ్గరగా కొప్పును కట్టేది. మోచేతుల వరకూ ముగ్గులపచ్చని పొడిపించుకున్నట్లుగా ఆ ముడతలిడిన చర్మంలో కన్పించేవి. తలపోటని మందార ఆకుల్ని, ఉసిరిపప్పును, దంచుకొని వెంట్రుకలకి పట్టించేది. గంధం అరగదీసి నుదుటికి పూసు కునేది. 'ఒళ్ళు సలుపులమ్మా' అంటూ పాలుగారే పిచ్చి చెట్ల ఆకులు తుంచి, ఆ పాలను ఒళ్ళంతా రాసుకునేది. తాపీగా చుట్ట కాలుస్తూ, మా అమ్మతో కబుర్లలోకి దిగేది.

"సాయిత్రమ్మా, వుప్పుడేటో ఎంత సంపాదిత్తన్నా ఒవుళికీ సాలకంటన్నాది. నా పెనిమిటి మిలటరీలోని ఉండీ తప్పుడు పదకండు రూపాయిల జీతం తెచ్చీవోడు. నా నలుగురు పిల్లల్ని ఎలాగ సూసీదాన్నో! గంటన్నవూ, సల్ది గెంజి, పిండొడిం… శాన, జరుగుబాటయిపోయీది. వుప్పుడు మాయదారి కాలవొచ్చి పడిపోనాది, మావు వుప్పుగల్లీలో వుండీ తప్పుడు కానీకి, అర్థణాకీ… సేట నిండా సందువాలూ, ఇంతేసి రొయ్యలూ వొచ్చీవి. సీమ దొరలు రాజ్జియేలీ తప్పుడు డబ్బ తక్కవ గానీ, తిన్నందకి కొదవుండీది కాదమ్మా…" అలా తన ప్లాష్‌బ్లాక్‌లోకి వెళ్ళిపోయి వినేవాళ్ళ బుర్ర తినేసేది. మనకు స్వాతంత్య్రం రాకముందు కథల్ని, బ్రిటీష్‌ వాళ్ళ పాలనలోని సంగతుల్ని సినిమా రీళ్ళలా తిప్పేది.

సెలవురోజు వచ్చిందంటే నేనూ సింహాచలం ఆడుకుంటూ అలా… ఇసకతోటకూ వెంకోజీ పాలేనికీ మధ్యనున్న జీడి మామిడి, జామతోటల్లోకి వెళ్ళిపోయేవాళ్లం. ఆ తోటలకు రెల్లివాళ్ళు కాపలా ఉండేవారు. వాళ్ల కన్నుగప్పి కాయల్ని దొంగిలించడం మా పని. మమ్మల్ని వాళ్ళు గమనించ కుండా వుండటంకోసం నేలకు చాలా దగ్గరగా వంగి ఉండే జీడిమామిడి కొమ్మల కిందగా దూరి, పాకుతూ కాయల్ని తెంపేవాళ్లం. పొరపాటున వాళ్లు మమ్మల్ని గమనిస్తే లేడి పిల్లల్లా దౌడుతీస్తూ బీచ్‌వైపు పరిగెత్తేవాళ్లం. సన్నటి సరివిడి కర్రల్ని పట్టుకొని మా వెనక పరిగెత్తుకొస్తూ… వాళ్ళ రెల్లి భాషలో-

అరెరెరే….. బారిజెల్లి బారిజెల్లి దరుగుండ్రే

గొచ్చిరి కాయలు తిరుగురె సిండి పిల్లుసురే

అంటూ అరిచేవాళ్ళు 'కాయల్ని కోసుకెళ్తున్నారు, పట్టుకోండని' దాని అర్థమట. అదీ సింహాచలమే చెప్పేడు. ఇంకా వాళ్ళ రెల్లిభాషలో చాలా బూతులు తిట్టేవారని, అవి నాతో చెప్పటం తనకిష్టం లేదనేవాడు. వాళ్ళ భాష నాకు తెలీకపోవటంతో నాకవి తిట్లలా అన్పించేవి కావు.

జీడిపండ్లని తినేసి, జీడిపిక్కల్ని జేబుల్లోదాచి, జామకాయల్ని కొరుకుతూ సముద్రం ఒడ్డుకు చేరేవాళ్ళం. సముద్ర ఘోషని వింటూ, ఎండకు తళతళ మెరిసే సన్నటి ఇసుకలో కాళ్లు కాల్తున్నా అలాగే నడుస్తూ, తెల్లని పాలనురగలు కక్కుతూ మాకన్నా ఎత్తుగా వచ్చే కెరటాల్ని చూస్తూ, ఒడ్డునున్న కన్నాల్లోకి పీతల్ని పోనీకుండా, ఆ రంధ్రాలు కప్పెడుతూ, గవ్వలూ, శంకులూ, అందమైన రాళ్ళు ఏరుతూ…చీకూ, చింతాలేని రోజులవి.

అలా బీచ్‌లో నడుస్తూ జాలారిపేట దగ్గరికి వచ్చేసరికి, జాలర్లు తల్లీ, పిల్లా అంతా కలిసి సముద్రంలోంచి ఒడ్డుకు చేరబోతున్న పడవల్ని కలిసికట్టుగా లాగి, వలలో పడిన చేపల్ని ఇసకలో కుప్పలుగా పోసేవారు.

సూర్యకిరణాలు తెల్లని పొలుసుపైన పడి, చేపలన్నీ వెండి బిళ్ళల్లా ధగధగ మెరిసేవి. సిగ్గు బిళ్ళలూ, నల్లపూసలు తప్పించి ఒంటిమీద నూలుపోగయినా లేని మా ఈడు జాలర్ల ఆడ, మగపిల్లల్ని చూసి గొప్ప సిగ్గేసి, మా తెరచిన నోళ్ళమీద అరచేతితో చప్పుడు రాకుండా బాదు కుంటూ నవ్వుకునేవాళ్ళం. జాలారిపేట నుండి ముందుకు వెళ్తుంటే, విశాలమైన ఆ నల్లటి సముద్రంలో దూరంగా పెద్ద, ఓడలు లంగరు వేసి కన్పించేవి. అవి కదలక మెదలక వుండటం ఏమిటో అప్పుడు అర్థం అయ్యేది కాదు. చీకటి పడే సమయానికి ఎదురుగా వున్న యారాడ కొండపైని లైట్‌హౌస్‌ విశాఖ నగరకన్యను కాపలాకాసే ఒంటికన్ను రాక్షసుడిలా తిరుగుతూ కన్పించేది.

సాయంత్రం వరకూ, తిరిగి, అలిసి, రామకృష్ణ బీచ్‌ మీదుగా, మహారాణి పేట నుండి కె.జి.హెచ్‌. 'అప్పెక్కి' ఎ.వి.ఎన్‌. కాలేజీ 'డౌన్‌' దిగి కొత్తరోడ్‌ వచ్చి, మా దగ్గరున్న చిల్లర డబ్బుల్తో సిటీబస్‌ ఎక్కి మద్దిలపాలెంలో దిగేవాళ్లం.

విశాఖలో ఎక్కువగా తాటి చెట్లు, కొబ్బరిచెట్లు ఉండటం, సింహాచలంతో వాటిని ఎలా ఎక్కాలో, ఎక్కి ఎలా ఆ కాయల్ని దొర్లించాలో నేర్చుకున్నాను. తాటికాయల్ని కొట్టి చూపుడు వేలితో బొటనవేలితో ముంజని ఎలా తీయాలో తినాలో సింహాచలమే నేర్పేడు.

తోటల్లోంచి దొంగిలించి తెచ్చిన జీడికాయల్ని దొంగచాటుగా కర్రల్ని ఏరి, నిప్పు రాజేసి అందులో వేసేవాళ్లం. అవి రసం కక్కుతూ, పట్‌పట్‌ అని శబ్దం చేస్తూ ఎగిరేవి. నల్లగా కాలిన జీడిపిక్కల్ని ఎలా నిలువుగా కొట్టాలో, ఎంత నేర్పుగా ముక్కలవకుండా జీడిపప్పుని తీయాలో సింహాచలమే చెప్పేవాడు.

పూర్ణామార్కెట్‌కి వెళ్ళినప్పుడు కూడా ఇలాగే పనసపిక్కల్ని దాచి, తెచ్చి కాల్చుకు తినేవాళ్ళం.

అప్పుడప్పుడూ సింహాచలం కొండకి అమ్మ, నాన్నల్తో వెళ్ళేవాణ్ణి.

కొండపై నుండి కన్పించే ప్రకృతి రమణీయత ఇంకా నా మనసులో మెదులుతూనే వుంది. కొండనిండా పెద్ద, పెద్ద సంపెంగ వృక్షాలు. తర్వాత నాకు ఎక్కడ సంపెంగలు కన్పించినా సింహా చలమే గుర్తొచ్చేది.

వరాలత్తతో కలిసి అనకాపల్లి నూకాలమ్మ జాతరకీ, విజయనగరం పైడితల్లమ్మ జాతరకీ వెళ్ళేవాణ్ణి. విశాఖలో ఉన్నప్పుడు వరాలత్తతో చేపలు కొనడానికి వెళ్ళటం గొప్ప సరదాగా వుండేది. మా అమ్మతో వెళ్తే, వాళ్ళు చెప్పిన రేటుకే కొనేది. వరాలత్త అలా కాదు. గీచిగీచి బేరం ఆడుతూ, వాళ్ళ మాటల్లో మాట కలుపుతూ, వాళ్ళకి కోపం తెప్పించేది.

చాలామంది జాలార్లు వరాలత్తకి బాగా తెలుసును.

"గురమ్మా, ఈ వాలుగ ఎంతకిస్తావూ, ఈ వొంజరం ఎలాగ? ఈ కానాకడతలేటి ఇలాగ్గుండ యిపోనాయి. పీతలేటమ్మా… వోసనేస్తన్నాయి?" వరాలత్త ప్రశ్నలకు మండిపడేవారు. ముఖాలు చిట్లించుకొని కొరకొర చూసేవాళ్ళు. రెండు చేతుల్లో చేపని పట్టుకొని కత్తిపీటలపై బలం చూపిస్తూ, గొంతుక్కూర్చున్న వాళ్ళ తీరూ నవ్వు తెప్పించేది.

'ఓలమ్మా… వడ్డీల వరాలప్పా, కొన్నావుశాన, ఎల్లోలమ్మా, బేరవాడనందకొచ్చినాది సవతకారి తల్లి" ప్రతి అక్షరాన్ని విడదీసి, రాగం తీస్తూ వరాలత్త చేతిలోని చేపల్ని విసురుగా లాక్కుని తాటి బుట్టల్లో వేసుకునేవారు. దూరంగా వున్నప్పుడు మనకేసి చూస్తూ, "రా బాబూ, రాయోలమ్మ, సందువాలు కొన్నందకిరా బాబూ, జెల్లిసూడుమీ… ఏక్నాసుగెనాగున్నాదో… ఎగస్టా ముక్కేత్తాను రా బాబూ" అంటూ ఇంగ్లీషు పదాలు వల్లిస్తూ పిలిచి, బేరం చెడిపోతే, తిట్లకు దిగుతారు. చేపల బజారు సరదాగా అన్పించేది.

వరాలత్త వడ్డీ వ్యాపారం మూడు పువ్వులు, ఆరుకాయలుగా వుంది. దాంతో పాటు చీటీలు వేయాలనే ఆలోచన కూడా వచ్చినట్లు అన్పించింది. తన అన్నతమ్ముళ్ళతో ఎక్కువగా మాట్లాడేది కాదు వరాలత్త. వాళ్ళు ముగ్గురూ తనకన్నా బాగా డబ్బు వున్న వాళ్ళన్న ఆత్మన్యూనత. వాళ్ళ కన్నా ఎక్కువగా డబ్బు సంపాదించి, దర్జాగా బతకాలన్న వరాలత్త ఆలోచన పెనుభూతంలా మారబోతున్నట్లనిపించేది.

తనకున్న బంగారాన్ని తీసుకెళ్ళు బ్యాంకుల్లో ఉంచి, దానిపైన తక్కువ వడ్డీకి డబ్బు తెచ్చి, బయట వడ్డీలకు తిప్పేది.

చిట్టీలు వేసే కార్యక్రమంలో… తనే ఏజంట్‌. ముందుగా మొదటి నెల, పాట లేకుండానే చీటీ ఎత్తి, మళ్ళీ ప్రతినెలా తన వంతు కమీషన్‌ తీసుకునేది.

ముందుగా చిన్న చీటీలు వేస్తూ పదిమందితో మొదలెట్టి, అరవైమందిని తయారుచేసింది. పదివేల చీటీ నుండి… లక్ష వరకూ ఉన్నట్లు గుర్తు. చీటీల్లో తన ముగ్గురన్న దమ్ముల్ని కలుపుకుంది. ఒక పక్క వడ్డీ వ్యాపారం, మరో పక్క చీటీలు… ఇంటికి ఎప్పుడూ వచ్చీపోయే జనం. "డబ్బు" అనే మాట ఆ ఇంట్లో రామ జపమైపోయింది. ఊరి పైకి వెళ్ళి వడ్డీ వసూలు చేయడానికి వీలు దొరికేది కాదు. సింహాచలాన్ని వడ్డీ వసూళ్ళకి పంపడం మొదలెట్టింది వరాలత్త. బడి ఎగ్గొట్టి వడ్డీ వసూళ్ళ కోసం తిరుగుతున్న సింహాచలాన్ని గురించి మా అమ్మ బెంగపడేది. నాన్నతో ఒకసారి విషయాన్ని కదిపింది.

"సింహాచలం స్కూల్‌ మానేసి ఇలా వెళ్తే, వాడి భవిష్యత్‌ మాటేమిటని' అడిగింది. 'అదంతా వాళ్ళ స్వంత విషయం. మనం జోక్యం కల్పించుకోరా,'దని చెప్పేడు నాన్న.

తల్లి పురమాయించే పనుల్లో వాడు వడ్డీలు చెల్లించే వాళ్ళ ఇళ్ళకు ఉదయమే వెళ్లి పోయేవాడు. తెచ్చిన డబ్బుల్ని లెక్కకట్టి ఒప్పచెప్పేవాడు మొదట్లో.

ఆ తర్వాత వరాలత్త పని చెప్పకపోయినా, బడి ఎగ్గొట్టేసి ఊరి మీద తిరిగే వాడు. సింహా చలం లీలామహల్లో కన్పించాడనీ, నవరంగ్‌ సినిమాహాలు ముందు తిరుగుతున్నాడని నాకూ, వాడికీ తెలిసిన మిత్రులు చెప్పటంతో…. వాడిపైన ఏదో అనుమానం పొడసూపింది.

సరిగ్గా స్కూల్‌ వదిలే సమయానికి పుస్తకాల్తో ప్రత్యక్షమయ్యేవాడు.

ఒకరోజు రాత్రి మేం అన్నాలు తింటున్నప్పుడు వరాలత్త ఇంట్లోంచి ఏదో గొడవ విని పించడంతో ఎంగిలి చేతుల్తోనే అలా పరిగెత్తాము. వరాలత్త కర్ర తీసుకొని సింహాచలాన్ని బాదు తోంది. సింహాచలం మూలకు ఒదిగిపోయి తలదిండు అడ్డు పెట్టుకొని, దెబ్బల్ని తప్పించుకుంటూ ఏడుస్తున్నాడు.

మా అమ్మ గబగబా వెళ్ళి, వరాలత్త చేతిలోన కర్ర లాక్కుంది. శివమెత్తినట్లు గట్టిగా అరుస్తూ… సింహాచలం పైకి వెళ్తోంది. అమ్మ అడ్డుగా వెళ్ళి-"ఏం జరిగింది? ఎందుకలా గొడ్డును బాదినట్లు బాదుతున్నావ్‌," అంది. "నీకు తెల్దు సావిత్రొదినా…ఈ గుంట లమ్డీకొడుకు ఏటిసేసాడో సూడుమీ…. ఇనేవర్సిటీలోని సీపరు పద్దాలు దగ్గిర వడ్డీ డబ్బులు రెండొందలు వసూలుసేసి, నాకు అది ఈనేదని సెప్పాడు. తీరామోసి నాను ఇయ్యాలటుకాసెల్నాను. 'మీ అయ్య నిన్నని వడ్డీ డబ్బులిచ్చానాడేటి వరాలప్పా' అంది పద్దాలు కన్పించి. 'ఆ డబ్బులేయరా' అంతే బస్సులోని పోనాయంతన్నాడు. ఆ ముక్కనిన్నని సెప్పనేదు. యీడి మాట ఎనాగనమ్మీదమ్మా… నా తాగుబోతు మొగుడితో పడతన్నాను సాల్దా. యీడు తయారాతన్నాడు నన్ను ముంచీడాన్కి"

"ఏదో తెలీక చేసేడు… వాడిని వడ్డీల వసూళ్ళకి పంపకు. బుద్దిగా స్కూల్‌కి పంపు" అంటూ వరాలత్తని కాస్త మందలించబోయింది అమ్మ.

సింహాచలం నావైపు చూసి సిగ్గుపడినట్లు మొహాన్ని గోడకేసి తిప్పుకున్నాడు. మళ్ళీ ఒకరోజు ఉదయమే మేం నిద్ర లేవకముందే సింహాచలం పెడబొబ్బలు పెడ్తున్నాడు. వరాలత్త కొబ్బరి చీపురుతో వాణ్ణి వాయిస్తోంది.

"ఒరేయ్‌, నాను నీ నుంచి సచ్చీదా? బతికీదా? నాను పాపారావు గోడికి ఏటి సెప్పీదిరా," నూకరాజు అడ్డుకోబోయాడు కానీ, అతన్ని ఒకపక్కకి లాగేసింది వరాలత్త.

అమ్మ, నాన్న ఇద్దరూ వరాలత్తని శాంతపరచాలని చూశారు.

"ఏటన్నియ్యా.. ఈ పోరంబోకు సచ్చినోడితో నాకు ఉరయిపోనాది. కంచరపాలెం పాపా రావు నా దగ్గిర వోచీ ఎట్టాడు. నిన్నని ఆడొచ్చి 'అసలు, వడ్డీ తెచ్చేను వోచీ ఇచ్చీమన్నాడు. మచ్చు మీదని ఇత్తడి గలాసులో నెట్టినాను… ఏదీ! అగుపించనేదు. ఇల్లంతా ఎతికీసినాను. దొరకనేదు. ఈ బేవార్సోడ్ని అడిగితే… నాకు తెలీకంట మొన్ననెప్పుడో సేతికి ఎట్టుకెళ్ళాడంత.. బడిలో నుండి ఇంటికొచ్చీతప్పుడు దారిలోని పడిపోనాదని సెపతన్నాడు… దాన్ని ఒవుడికి దొబ్బెట్టీసినాడో…. నేనా పాపారావుకి ఏటి సెప్పదన్నియ్యా… నిన్నని దొరకనేదంటే యియ్యాలొత్తానని ఎల్నాడు…" అమ్మ, నాన్నకి కూడా ఏం సమాధానం చెప్పాలో పాలుపోలేదు. సింహాచలం ఏడుపు ఆపేసి ఎన్ని దెబ్బలు తినడానికైనా సిద్దమన్నట్లు చూస్తున్నాడు. మొండిగా వున్న వాడిని చూస్తే… ఎందుకో భయమేసింది నాకు.

రోజులు గడుస్తున్నాయి. వరాలత్తకు రాబడి పెరుగుతోంది. చీటీల వలన మంచి లాభాలు వస్తున్నాయి. ఒకటో తారీఖున చీటీపాటల్లో మునిగి తేలేది. వచ్చిన వాళ్ళందరి మధ్యా లీడర్‌లా వ్యవహరించే వరాలత్త తీరు చాలా హుందాగా కన్పించేది.

చదువు లేకపోయినా, డిగ్రీలు చదవకపోయినా వరాలత్తకున్న లౌక్యం, దానికి తోడు ధైర్యం ఆమెను ముందుకు నడిపిస్తున్నాయనిపించేది.

ఆ పెంకుటిల్లు తీసి, పెద్దగా రెండతస్తుల డాబా కట్టాలని కలలు కనేది వరాలత్త. ఆమెకు వచ్చే రాబడిని బట్టి చూస్తే… ఆ పని త్వరలో చేసి తీరుతుందని అన్పించేది నాకు.

అలా కాలం గడుస్తోన్న క్రమంలో… నాన్నకి ప్రమోషన్‌ పైన హైద్రాబాద్‌కి బదిలీ అవటం జరిగింది. నాకు ఊహ తెలిసిన దగ్గర్నుండి పెరిగిన విశాఖపట్నం వదిలి వెళ్ళాలంటే ఏడుపొచ్చింది. రోజూ కన్పించే సింహాచలం, వరాలత్త, చుట్టలు కాల్చే ముసలమ్మ విశాఖ బీచి, కొండలు, పండిన అనాసలు.. సంపెంగలు. 'రెల్లివాళ్ళ తిట్లు, యారడకొండా, జీడితోటలు, తాటితోపులూ, చేపల మార్కెట్టూ…. వరాలత్త పెంకుటిల్లూ… వీటన్నిటిని వదిలిన రోజు మనసంతా మబ్బు పట్టినట్లుగా… చాలా దిగులేసింది.

వరాలత్త కూడా మేం వెళ్తున్నామని తెలియగానే కాస్త చిన్నబోయింది. "రమణా… మళ్ళీ ఒప్పుడొత్తావు. నాక్కూతురునేకపోయింది గానీ, వుంటే నీక్కట్టబెట్టీసి, ఇల్లరికం వుంచీసుకొని నా వొడ్డీ యాపారవంతా అప్పచెప్పీద్దును నీకు," అంది.

మేం ఇల్లు ఖాళీచేసి రైల్వేస్టేషన్‌కు వచ్చినప్పుడు మాతోపాటే వరాలత్తా, సింహాచలం వచ్చేరు. రైలు కదిలే వరకూ మా దగ్గరే వున్నారు. రైలు కదలబోతున్నప్పుడు అమ్మ, వరాలత్త కళ్ళొత్తుకున్నారు. వరాలత్త కనుమరుగైన దాకా కిటికీలోంచి చూస్తూ, చేయి ఊపేను. చివరగా నాకు కన్పించినవి స్టేషన్‌లో రాసిన 'వాల్తేరు' అక్షరాలు.

హైద్రాబాద్‌కు వచ్చేసినా తర్వాత చాల్రోజుల వరకూ వరాలత్తని వాల్తేరత్తగా సంభోదించు కుంటూ, వాళ్ళతో గడిపిన జీవితాన్ని, ముచ్చట్లనీ… ఎన్నాళ్ళో నెమరువేసుకున్నాం.

* * *

కోరుకొండ సైనిక్‌ స్కూల్‌లో అడ్మిషన్ల పని ముగించుకొని, విశాఖ బయల్దేరాను. పాతికేళ్ల క్రితం వాల్తేరుకి ఇప్పటి విశాఖకీ చాలా తేడా కన్పించింది. ఎల్లమ్మ తోట జంక్షన్‌ కాస్తా జగదాంబ సెంటర్‌గా మారింది. మేం చిన్నతనంలో ఆడుకున్న వెంకోజీపాలేనికీ, ఇసకతోటకీ మధ్యనున్న జీడిమావిడి తోట మాయమై ఎమ్‌.వి.పి. కోలనీగా వెలసింది. గాజువాక దగ్గర్లోని గంట్యాడ మొదలు… బాలచెరువు, నెల్లిముక్కు, గంగవరం వరకు వ్యాపించి వుండిన అందమైన పల్లెలు, పొలాలూ మట్టిలో కలిసిపోయి, స్టీల్‌ ప్లాంట్‌ అవతరించింది.

విశాఖ జల సముద్రం పెరిగినట్లు లేదు కానీ, విశాఖ జనసముద్రం ఈ పాతికేళ్ళలో పదివంతులు పెరిగినట్లుంది.

అలా… ముందురోజు విశాఖ అంతా కలదిరిగి, మర్రోజు ఆటో తీసుకొని వరాలత్త ఇంటికి బయల్దేరాను. ఆటోని రామాలయం దగ్గరే ఆపించి, నడుస్తూ ముందుకు వెళ్తున్నాను. గతం కళ్ల ముందు గిరికీలు కొడుతోంది. అనిర్వచనీయమైన ఆనందం. నా నరనరాల్లోకి వ్యాపిస్తోన్న తెప్పరిల్లే వీలుకాని భావోద్వేగం.

అదే చేద బావి. నీళ్ళని తోడేవాళ్ళు ఎవరూ లేరు. బావిలోకి తొంగి చూసేను. బావిలో నీటి చుక్కలేదు. ఎండిపోయిన అడుగు కనిపిస్తోంది. అక్కడ్నుంచే వరాలత్త ఇంటి కోసం చుట్టూ చూసాను. ఆశ్చర్యం! పెంకుటిల్లు మాటేలేదు. అన్నీ డాబాలే కన్పించేయి. వరాలత్త ఇల్లనుకొన్న స్థానంలో మూడంతస్తుల అందమైన మేడ కన్పించింది. దాన్ని చూడగానే గొప్ప సంతోషం కల్గింది.

నన్ను వరాలత్త గుర్తిస్తుందా? నన్ను నేను ఎలా పరిచయం చేసుకోవాలి? అందమైన డాబా…. అనుకున్న లక్ష్యాన్ని సాధించిన వరాలత్త వడ్డీలతో, చీటీలతో లక్షల్ని గడించి వుంటుంది. ఆ ఠీవి, దర్పం మరింత వన్నె తిరిగి వుంటాయి. సింహాచలం ఈ వయసులో ఎలా వుంటాడు? ఉద్యోగం లాంటిది చేయాల్సిన కర్మ లేకుండా వరాలత్త అన్నీ సమకూర్చి వుంటుంది. నూకరాజు సారా మానేసి, విస్కీల్లో తేలిపోతూ ఉంటాడు కాబోలు.

రకరకాల ఆలోచనల హోరు. తడబడే అడుగులతో ఉద్వేగభరితంతో వరాలత్త డాబా ఇంటి ముందుకు వచ్చి నిల్చున్నాను.

గేట్‌ దగ్గరున్న కాలింగ్‌బెల్‌ స్విచ్‌ పైన చూపుడు వేలితో నొక్కేను. తెల్లటి జూలుతో వున్న కుక్క 'భౌ' మంటూ పరిగెత్తుకొచ్చింది. ఆ వెనుక నుండి ఒక ఆడమనిషి. బహుశా సింహాచలం భార్యేమో….

"ఎవరండి…."

"వరాలమ్మగారి ఇల్లు ఇదే కదండీ," లోపల్నుండి వరాలత్త వస్తుందేమోనని చూసేను. "ఆ పేరు గల వారెవరూ ఈ ఇంట్లో లేరండి…" అంటూ నన్ను అనుమానంగా చూడటం గమనించి తత్తరపాటుతో-

"పాతికేళ్ళ క్రితం ఇక్కడో పెంకుటిల్లు ఉండేదండీ…." నసిగినట్లన్నాను. "మేం ఈ ఇంట్లో అద్దెకుంటున్నాం. ఈ ఇంటి గలవాళ్లు డాబాగార్డెన్స్‌లో వుంటారు. మీరు చెప్పిన వాళ్ళ తాలూకు కావచ్చు. అదిగో ఆ ముందుని కన్పించే మునగచెట్టు కేసి తిన్నగా వెళ్ళండి. అక్కడున్న కమ్మరింట్లో ముసలమ్మ వుంటుంది. వరాలమ్మ ఆవిడేననుకుంటాను…" అదిరిపడినట్లు అటుకేసి చూసేను.

ఆమె చెప్పే మాటలు చేదుగా విన్పించేయి. మనసంతా వికారమై పోయింది. నమ్మలేని నిజంలా తోచింది.

మారు మాట్లాడకుండా….. మునగ చెట్టున్న వైపు అడుగులు వేసేను. వరాలత్త ఈ పాకలో ఎందుకుందో, ఉండాల్సిన కర్మ ఏమిటో అర్థంకాలేదు. ఒంటిరాట తాటి కమ్మరిల్లు, ద్వారం కూడా తెలీకుండా కిందనున్న చూరు… నా అడుగుల చప్పుడికి, "ఎవరదీ?" అన్న మాటలు విన్పించేయి లోపల్నుండి.

ఒక్కసారిగా ఒళ్ళు జలదరించింది. ఆ మాటతీరు, కంఠ స్వరం వరాలత్తదే! నిలబడి ఉన్న నేను కాస్త వంగి పాక చూరు కిందగా చూసేను. చూరు కిందున్న నులక మంచం పైనుండి లేచి బయటికి వచ్చింది వరాలత్త.

వరాలత్తని చూడగానే నా మతిపోయింది.

"ఎవరు బాబూ…. ఒవులింటికొచ్చినావూ….." ఆ ప్రశ్నకు సమాధానం కూడా చెప్పే స్థితిలో లేనట్లు వరాలత్తను ఆపాదమస్తకం ఆశ్చర్యపోతూ చూస్తున్నాను.

గుండెలోంచి తన్నుకొచ్చిన ఒక దుఃఖపు అల నా కళ్ళను కప్పేసింది. చందమామలా గుండ్రంగా వుండి, పసుపు రాసుకున్న ఆ ముఖంలో రూపాయి బిళ్ళంతా ఎర్రనిబొట్టు…. నిండయిన విగ్రహం…. ఏదీ? నూకరాజు చనిపోయాడా?

చిక్కి శల్యమయిన శరీరం. ముగ్గుబట్టలా తెల్లబడిపోయిన తల, లోతైన కనుగుడ్లు ఎముకలు తేలిన దవడలు, ఒళ్ళంతా ముడతల్తో వంగిన నడుము.

నాలోంచి నేను తేరుకోలేని స్థితిలో….

"ఎవరు బాబూ…? అంది వరాలత్త.

"నేను వరాలత్తా… రమణని" నా మాట దుఃఖంతో పూడుకుపోయింది.

"ఏ రవణా..?" భృకుటి ముడుస్తూ, నా కళ్ళలోకి చూసింది.

"నా చిన్నతనంలో మీ ఇంట్లో అద్దెకు ఉండేవాళ్ళం, సింహాచలం నేనూ ఆడుకునేవాళ్ళం. అమ్మ- సావిత్రమ్మ. నాన్న యూనివర్శిటిలో ఉద్యోగం చేసేవాడూ…"

ఒక్కసారిగా కంపించినట్టుగా, వణుకుతున్న చేతులతో నా రెండు భుజాలని పట్టి ఊపుతూ-

"రవణబాబూ… యీ వొరాలత్త గేపకమున్నాదేటి?" వరాలత్త కళ్ళు తటాకాలయ్యాయి. దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. పెద్దగా ఏడుస్తూ నా ఒళ్ళు తడుముతోంది. నా అరచేతిని వరాలత్త వీపుపై వుంచి, ఆమెను అలా కాస్సేపు వదిలేసాను. దుఃఖం నుండి తేరుకొని నా చెయ్యి పట్టుకొని ఇంట్లోకి తీసుకెళ్ళి నులకమంచం పైన కూర్చోబెట్టింది. ఇంటిని పరిశీలనగా చూసేను.

నేను కూర్చున్న నులకమంచం, నా చిన్నతనంలో నే చూసిన రంగంపెట్టె, మూలగా పొయ్యి, నాలుగయిదు పాత్రలు, దండెం పైన రెండు చీరలు, మరికొద్ది సామాను- అంతకన్నా ఎక్కువగా ఏమీ లేవు. చితికిపోయిన వరాలత్త బతుకు నేపథ్యం గురించి ఆతృతతో అడిగాను.

"బోల్డు జరిగిపోనాయి రవణబాబూ…. నా బతుకు యీదికుక్కల పాలయిపోనాది. నా నోట్లోని బుగ్గోసీసినారు మంద. నా కడుపు కాలిపోనాది నాయనా… నా సిమ్మాసిలం నాక్కాకంట ఎలిపోనాడు రవణబాబూ…" ఒక్కక్షణం ఆగింది వరాలత్త.

నాకు ఏం జరిగిందో అర్థంకావటం లేదు. సింహాచలం ఏమయ్యాడో తెలీదు. పెళ్ళి చేసుకొని వేరుగా కాపరం పెట్టి, వరాలత్తని చూడకుండా వున్నాడా?…

కొద్దిసేపు మౌనంగా ఉండి మొదలెట్టింది.

"రవణబాబూ… తవరీ వూరొగ్గీసి ఎలిపోనాక…. ఏటి జరిగినాదంతే ఏటి సెప్మంతావు నాయనా.. సీటీల మీద సీటీలేసినారు… జనం. వడ్డీ యాపారవూ జరుగుబాటుగే సాగినాది. నా సిమ్మసెలవు నన్నోగ్గీసి ఎలిపోనాడు రవణబాబూ.. నా రంగంపెట్టిలోని మర సెంబులో దాసిని తాకట్టు సొమ్మొట్టుకు పారిపోన్డు…. ఊరి జనవంతా నా మీద కెళిపొచ్చినారు…

"నా కన్నోరు, కట్టుకున్నోడూ… అంతా నన్నే తిట్టేరు. నానుండే నా సిమ్మాసెలవు పారిపోనా డన్నారు. నాను సేసిన తప్పేటి? ఆడ్ని వడ్డీలు వసూలు చేయనందకి పంపి, డబ్బు రుసి సూపినా నని నన్ను కాకుల్లా పొడిసీసినారు. నా సిమ్మాసెలాన్ని ఎంత ఎతికించినా నాబం నేకపోనాది. వడ్డీ లీయిటుం, సీటీలేయిటుం తప్పో, ఒప్పో నాకు తెల్దు.

"నా మొగుడు తాగుబోతోడై… తెచ్చిందంతా తాగుడికి తగలేసేసి…. తీరమోసి సారాకి నన్నే డబ్బులడిగీవోడు. మాకేటున్నాయి బూకువా! పుట్రా! డబ్బా! దస్కవా! ఏటీనేదు. మాయమ్మ సచ్చి ఏసొరగానున్నాదో గానీ అదిచ్చిని పసుకుంకాల జాగావులో నాను వడ్డీ యాపారంలో గడించి, పెంకుటిల్లు ఏసాను. దాని సలవ్వల్లే గెంజి తాగినాం. పెళ్ళాం సంపాదన కాసించీ మొగుడూ… మగోడేనా బాబూ… నానూ అందర్నాగ దర్జాగా బతకాలనుకున్నాను. బతకనందకి ఈ పాపిట్టి యాపారం సేయికూడదని తెలిసినా…. తప్పనేదు. నా మొగుడు సంపాదిత్తే… నాకీ కరమ్మేటి రమణ బాబూ, నా సిమ్మసెలం నాకాడే వుండునూ, ఆడెలిపోనాక, ఏడాదికి తాగితాగి… నా పెనిమిటీ సచ్చిపోనాడు.

"ఆనక, నా మీద పడ్డాది బాబూ పిడుగు నాటి దెబ్బ. మరి కోలుకోనేక పోన్ను. నా దగ్గిర సీటీలేసి న్నంజి…. నన్ను దగా సేస్సి రెండు నచ్చల సీటీ పాడీసుకుని పారిపోనాది మొగుడూ, పిల్లా అంతా మాయవయిపోన్రు. నాను ఎనాగై పోనానో బాబూ… సిమ్మాసెలం ఎత్తికెళ్ళిపోయి న్నగలన్నీ సేయించి ఊరోళ్ళందరికి ఇచ్చీసరికి నాకాడ ఏటీ మిగల్నేదు.

"ఆ రెండు నచ్చిలు ఎత్తుకెళ్ళిని నంజి ఎక్కడున్నాదో…. తెలీకంటయిపోనాది. శికాకుళమెళ్ళి పతి ఏయించినాము. అది డబ్బొట్టుకొని దేశం దాటీసిందన్నారు మరికనేటి సేసి ఏట్నాబం? ఏడిత్తే వత్తాదా?

"సీటీనోన ఆకారుగా నా తమ్ముడుండిపోనాడు. ఆ నంజి ఎల్పోగానే ఒవులూ సీటీలు కట్నందకి రానేదు. ఇచ్చీవోరికీ ఏనాగివ్వాలో తెలీనేదు… ఊరిజనం దిగిపోనారు…. ఇల్లు తనకా ఎట్టయినా ఇత్తానన్నాను. 'ఊరు మొగుల్లికి ఇల్లిచ్చేత్తే… మరి నా సంగతేటప్పా' అన్నాడు నా తమ్ముడు. ఆడికి గూడమొయ్యా డబ్బున్నా, ఆపదనోనున్నాదప్ప…. దాన్ని యిబ్బందుల్లో ఎట్టీడం ఎందుకన్నేదు రమణబాబూ….. అప్పనని సూడకంటా నంజా, నమిడీ అనీసి బూతులాడీసినాడు. పోలీసుటేసిన్లో నన్నెట్టిత్తానన్నాడు… ఏటి బాబూ…. డబ్బు దగ్గిర అప్పేటి? సెల్లేటి? నన్నా ఇంట్నోంచి బయటకీడ్సీసినాడు. నా సావానంతా ఇసిరీసినాడు… ఆడ్నెప్పుడు ఎర్నమ్మెత్తుకు పోతాదోగానీ… అనాగ రాలిపోనాడు బాబూ… అడ్డొచ్చి నాదని మాయమ్మని తన్నీసినాడు… నాయిల్లు తన పేర రాసీసుకున్నాడు. నా నొంటరిదాన్ని, ఏటి సెయగల్ను బాబూ… నానుండే మంచవట్టేసింది మాయమ్మ. 'నా కూతురు బతుకు బుగ్గయిపోనాదని' కునుకునేక కునుకునేక ఏకంగొక్కపాలే మంచంనోనే కునికీసింది బాబూ… మాయమ్మ సచ్చిపోనాక దిక్కుతోచకంట ఒంటరి పచ్చినయి పోనాను."

వరాలత్త నాతో మాట్లాడుతుండగానే ఎవరో ఆడమనిషి చెవి దుద్దులు తెచ్చి, డబ్బు కావాలని అడగటమూ, వరాలత్త రంగంపెట్టి తెరిచి, డబ్బు తీసి ఇవ్వటమూ జరిగిపోయాయి.

ఆశ్చర్యపోతూ నోరు తెరిచాను. తనిలా చితికిపోవటానికి కారణభూతమైన వడ్డీ వ్యాపారాన్ని ఇంకా వదల్లేకపోవటం….! నా ఆలోచనల్ని పసిగట్టినట్లు, "రవణబాబూ, నాను బతకనందకి ఏ ఆదరువు నేకపోతే ఎనాగ? నా కాడకి వడ్డీలకి వచ్చీ జనం పూరాగా తగ్గిపోనారు. వొయిజాగు యీదీదినోనీ పయినాన్సు కంపినీలు, చిట్టుపండులూ…. పుట్టగొడుగుల్లా నెగిసిపోనాయి. అయినా నాకాడ పెట్టుబడీనేదు. ఏయమ్మో నామ్మీదయున్నమ్మ అప్పుడప్పుడొత్తాది… నాకు తెలీకడగతాను బాబూ, పెళ్ళాన్ని, పిల్లల్ని సూడకంట పేకాటకీ, తాగుడుకీ, ముండలకీ జీతవంతా కరుస్సేస్సి, ఇంట్లోకి దమ్మిడీ ఇయికంట ఏడిపిత్తే…. కడుపుని కాసుకున్న దానికి, పిల్లలు పస్తులుంతే పేనం ఎంతుసూరుమంతాదో నీకెరికినేదా బాబూ….. దయిరుం లేనిదాయి సత్తాది, నాలాటి దాయి ఏ వడ్డీ యాపారవో, కూరగాయిలు కొట్టో, కిల్లీ కొట్టో…. మరేటో, మరేటో, సివార్ని పడుసుకోనైనా పిల్లలకి కూడెడతాది. ఏటంతావు బాబూ…. నా మొగుడు తాగనందకి ఆపీసునోని నోన్లు తీస్సి, బయట్ని అప్పులు మీదప్పులు సేసాడనీ నాకానక తెలిసింది. అప్పిచ్చినోరు వల్లకుంతారా బాబూ…. ఆడికొచ్చీ పించినీనంతా జమ కట్టించు కుంతన్నారు. వుప్పుడు నాగ్గెంజోసీవోరేరి? రేపుట్నాడు నా సిమ్మాసెలం వచ్చీసి, ఓలమ్మా, నాకేటి దాసినావే? నాకేటి సంపాదించినావే?' అనంతే నానేటి సెప్పీది బాబూ, ఆడికోసవనే కూడేత్తన్నాను… ఇదిగో రవణబాబూ, నా సిమ్మాసెలం బేగొచ్చియాలని అనకాపల్లి నూకాలమ్మ తల్లికీ, యిజీనగరం పైడితల్లమ్మకీ, మా వూరి కనకమాలచ్చింకీ, బెజోడ కనకదుర్గమ్మకీ ముడుపుల్ని కట్టేను. నా సిమ్మాసెలం నన్నొగ్గీసెల్లిందగ్గిర్నుండీ యీనాగే ముడుపులు కడతన్నానుగానీ, అయమ్మోర్లికి నామ్మీదయినేదు. నానేనూతిలోనో పడిపోయి పేనాలొగ్గీద్దును. కానీ, రేపో, ఎల్లుటో నా సిమ్మాసెలం వొత్తాడని పానాలుగ్గ బట్టుకోనున్నాను. నాన్నేకపోతే ఆడు వొంటరయిపోడేటి బాబూ….

"నానెంత వడ్డీ యాపారం సేసినా నానూ మడిసిజలమే ఎత్తాను. ఆడపుట్టకే పుట్టి పాలిచ్చే పెంచాను. నా పేగు తీసి వొవులికి అరదమవుతాది బాబూ… నా సిమ్మాసెలం ఒచ్చేత్తాడొచ్చేత్తాడని నా మనసంతాది బాబూ. ఆడెక్కడున్నాడో గానీ… ఆడి పేగోసన అప్పుడప్పుడు నా ముక్కుకి తగలతాది బాబూ…" ఇక వినలేకపోయాను. వరాలత్త మాటలు వింటుంటే దుఃఖం తెరలు తెరలుగా కమ్ముకొస్తుంది. ఎక్కువసేపు ఉండలేననిపించింది ఆ వాతావరణంలో, అయినా ఆమె దుఃఖంలోంచి తెప్పరిల్లే వరకు ఉండి, మెల్లిగా లేచి నిల్చున్నాను. వరాలత్త దగ్గర సెలవు తీసు కున్నాను. తలెత్తి వరాలత్త కళ్ళల్లోకి చూడకుండా గబగబా అడుగులు వేస్తూ, రామాలయం వైపు నడిచాను.

రైల్లో ప్రయాణిస్తున్నా…. కళ్ళ ముందు ఆ అభాగ్యురాలే- విశాఖపట్నం నుండి ఒక చేదు అనుభవాన్ని హైదరాబాద్‌కు మోసుకుపోవాలనిపించక, ఆనాటి వాల్తేరు వరాలత్తనే నెమరు వేసు కుంటూ కళ్ళు మూసుకున్నాను…. మనోనేత్రంలో మాత్రం నేటి వరాలత్త వాస్తవరూపం కదలాడుతూ నన్ను భయపెడుతోంది.

సింహాచలం బతికి ఉన్నాడో! లేడో! చివరికి వస్తాడో! రాడో! తెలీదు కానీ…. ఆ తల్లి పేగు మాత్రం కడదాకా కొడుకు కోసం దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తూనే ఉంటుందేమో!

*

First Published:  5 May 2022 8:15 AM GMT
Next Story