Telugu Global
Others

రేవంత్, ఎర్రబెల్లి మధ్య వార్ ఓపెన్

టీటీడీపీలో అధిపత్యపోరు తారాస్థాయికి చేరింది. రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు మధ్య పోరు ఒకరినొకరు గౌరవించుకోని స్థాయికి చేరింది. ఈ అధిపత్యపోరు అధినేత నుంచి పార్టీ నేతల వరకు అందరికీ తెలిసే జరుగుతోంది. ఇటీవల వరంగల్ జిల్లా పాలకుర్తిలో మంత్రి కడియం శ్రీహరి పర్యటన సందర్భంగా టీఆర్ఎస్, టీడీపీ శ్రేణులకు మధ్య తీవ్రస్థాయి ఘర్షణ జరిగింది. అడ్డువచ్చిన స్థానిక ఎస్ఐపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఆ సమయంలో ఎర్రబెల్లి దయాకర్ రావు […]

రేవంత్, ఎర్రబెల్లి మధ్య వార్ ఓపెన్
X

టీటీడీపీలో అధిపత్యపోరు తారాస్థాయికి చేరింది. రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు మధ్య పోరు ఒకరినొకరు గౌరవించుకోని స్థాయికి చేరింది. ఈ అధిపత్యపోరు అధినేత నుంచి పార్టీ నేతల వరకు అందరికీ తెలిసే జరుగుతోంది. ఇటీవల వరంగల్ జిల్లా పాలకుర్తిలో మంత్రి కడియం శ్రీహరి పర్యటన సందర్భంగా టీఆర్ఎస్, టీడీపీ శ్రేణులకు మధ్య తీవ్రస్థాయి ఘర్షణ జరిగింది. అడ్డువచ్చిన స్థానిక ఎస్ఐపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఆ సమయంలో ఎర్రబెల్లి దయాకర్ రావు అక్కడే ఉన్నారు. దీంతో ఎర్రబెల్లిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పార్టీ నేతలంతా వెళ్లి ఎర్రబెల్లిని పరామర్శించారు. రేవంత్ రెడ్డి మాత్రం ఆ పనిచేయలేదు. టీటీడీఎల్పీ నేత అరెస్ట్ అయితే పరామర్శించకపోవడం సరికాదని … జనంలోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని కొందరు నేతలు రేవంత్ రెడ్డిని ఒప్పించే ప్రయత్నం చేశారు. అయినా రేవంత్ రెడ్డి మాత్రం లెక్కచేయలేదట. పరామర్శ అవసరం లేదులే అంటూ తిరస్కరించారని పార్టీ నేతలు చెబుతున్నారు.

ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన శ్రీశైలం ప్రాజెక్టు బాధితులతో కలిసి ఎర్రబెల్లి ధర్నా చేశారు. సొంత జిల్లా వారు కావడంతో శ్రీశైలం బాధితులకు మద్దతు తెలపాలని రేవంత్ అనుకున్నారట. కానీ ఎర్రబెల్లి సీన్‌లోకి రావడంతో ఆయన మీద ఉన్న కోపంతో సొంత జిల్లాకు చెందిన శ్రీశైలం బాధితులను కూడా రేవంత్ రెడ్డి పరామర్శించలేదని పార్టీ నేతలు చెబుతున్నారు. రేవంత్ తీరు పట్ల ఎర్రబెల్లి వర్గీయులు కూడా మండిపడుతున్నారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి అరెస్టయిన సమయంలో తమ నేత అర్థరాత్రి వరకు ఏసీబీ కార్యాలయం ముందు ఆందోళన చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అలాంటి ఎర్రబెల్లిపై రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న తీరు ఆక్షేపణీయమంటున్నారు.

రేవంత్,ఎర్రబెల్లి మధ్య చాలాకాలంగా విభేదాలున్నా టీటీడీపీ అధ్యక్షుడి ఎంపిక‌ విషయంలో వీరి మధ్య విభేదాలు తీవ్రమయ్యాయని చెబుతున్నారు. తెలంగాణ టీడీపీకి అధ్యక్షుడు కావాలని రేవంత్ రెడ్డి భావించారు. అయితే రేవంత్ ప్రయత్నాలకు ఎర్రబెల్లి గండికొట్టారని యువనేత వర్గం అనుమానం వ్యక్తం చేస్తోంది. రేవంత్‌ను అధ్యక్షుడిగా చేస్తే పార్టీలో తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయని అధినేతకు ఎర్రబెల్లి వర్గం సిగ్నల్స్ పంపిందట. ఎర్రబెల్లి వేసిన అడ్డుపుల్లల వల్లే రేవంత్ రెడ్డికి అధ్యక్ష పదవి దక్కలేదని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. తనకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవితో సరిపెట్టబోతున్నారన్న విషయం కొద్ది రోజుల క్రితమే రేవంత్‌కు అర్థమైందని… అందుకే ఆయనీ మధ్య పెద్దగా యాక్టివ్‌గా ఉండడం లేదని చెబుతున్నారు. రేవంత్, ఎర్రబెల్లి మధ్య అధిపత్యపోరు ఇంతలో ఆగే సూచనలు కూడా లేవని అంచనా వేస్తున్నారు.

First Published:  30 Sept 2015 10:50 PM GMT
Next Story