Telugu Global
POLITICAL ROUNDUP

ఎంత పేద‌రిక‌మో...అంత స్ఫూర్తి!

ఆ పిల్లాడి పేరు హరేంద్ర సింగ్ చౌహాన్‌, వయసు 13, ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడా, సెక్టార్ 51 లో హోషియార్ పూర్ అనే గ్రామం అతనిది. వాళ్ల ఇల్లు 8,7 అడుగుల పొడవు వెడల్పులున్న ఒక గది. తొమ్మిదో తరగతి చదువుతున్న హరేంద్ర కు పెద్దయ్యాక పెద్ద ఆర్మీ ఆఫీసర్ కావాలని కల. పేద‌రికంతో ఈతిబాధ‌లు ప‌డుతూ, ప‌డుతూ లేస్తూ చ‌దువుని సాగిస్తున్నాడు. అయితే ఆ కుర్రాడికి అనుకోకుండా అదృష్టం క‌లిసొచ్చింది. అత‌ని క‌ల‌ని నెర‌వేర్చుకునే మార్గం […]

ఎంత పేద‌రిక‌మో...అంత స్ఫూర్తి!
X

ఆ పిల్లాడి పేరు హరేంద్ర సింగ్ చౌహాన్‌, వయసు 13, ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడా, సెక్టార్ 51 లో హోషియార్ పూర్ అనే గ్రామం అతనిది. వాళ్ల ఇల్లు 8,7 అడుగుల పొడవు వెడల్పులున్న ఒక గది. తొమ్మిదో తరగతి చదువుతున్న హరేంద్ర కు పెద్దయ్యాక పెద్ద ఆర్మీ ఆఫీసర్ కావాలని కల. పేద‌రికంతో ఈతిబాధ‌లు ప‌డుతూ, ప‌డుతూ లేస్తూ చ‌దువుని సాగిస్తున్నాడు. అయితే ఆ కుర్రాడికి అనుకోకుండా అదృష్టం క‌లిసొచ్చింది. అత‌ని క‌ల‌ని నెర‌వేర్చుకునే మార్గం దొరికింది. స్వ‌యానా యు పి ముఖ్య‌మంత్రి అఖిలేష్ యాద‌వే పిలిచి మ‌రీ ఐదు ల‌క్ష‌ల రూపాయ‌ల స‌హాయం అందించారు.

ఇంతకీ ఏం జరిగింది…ఐదారురోజుల క్రితం నోయిడా సిటీ సెంటర్ మెట్రో స్టేషన్ బయట పేవ్‌మెంట్‌మీద కూర్చుని హరేంద్ర వీధిదీపం వెలుగులో హోం వర్క్ చేసుకుంటున్నాడు. అతని పక్కన పరచి ఉన్న తెల్లని క్లాత్‌పై బరువు కొలిచే మిషన్ ఉంది. దానిద్వారా అతను సంపాదించిన డబ్బులు కూడా ఆ క్లాత్ మీద ఉన్నాయి. ఆ దారిన వెళుతున్నవారెవరో ఆ దృశ్యాన్ని సెల్‌ఫోన్లో బంధించి ఫేస్‌బుక్‌లో పెట్టారు. నోయిడాలోని సెక్టార్ 122లో శ్రీకృష్ణా ఇంటర్ కాలేజిలో తొమ్మిదో తరగతి చదువుతున్న హ‌రేంద్ర‌ తన స్కూలు ఫీజుకి, ఇంటి అవసరాలకు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో, పట్టుదలగా చదువుతూ, పనిచేస్తున్నాడు. కొన్నినెల‌లుగా అత‌ను ఇలాగే క‌ష్ట‌ప‌డుతున్నాడు.

గ‌త ఏడాది జూన్ నెల‌లో హ‌రేంద్ర తండ్రి రామ్‌గోపాల్‌కి ఉద్యోగం పోయింది. అత‌ను పోలియో బాధితుడు కావ‌డం వ‌ల‌న ఎక్కువ స‌మ‌యం నిల‌బ‌డ‌లేడు. అలా అత‌నికి మ‌రొక ఉద్యోగం వెతుక్కోవ‌డం క‌ష్ట‌మైంది. అలాంటి స‌మ‌యంలో సెల‌వుల్లో ఇచ్చిన హోం వ‌ర్క్ పూర్తి చేసేందుకు హ‌రేంద్ర‌కు కొన్ని రంగులు, షీట్స్, ఫైల్ కావాల్సి వ‌చ్చింది. తండ్రి వ‌ద్ద డ‌బ్బులేద‌ని తెలుసు. అప్పుడే ఇంట్లో ఉన్న వెయింగ్ మిష‌న్ అత‌నికి ఓ ప‌రిష్కారంగా క‌నిపించింది. అంతే ఆరోజు నుండి స్కూలు నుండి తిరిగి రాగానే వెయింగ్ మిష‌న్‌తో ఎంతోకొంత సంపాదించ‌డం మొద‌లుపెట్టాడు. ఆ డ‌బ్బు త‌న చ‌దువుకే కాక ఇంటి అవ‌స‌రాల‌కు సైతం ప‌నికొస్తోంది. బాగా బేరం ఉన్న రోజు అర‌వై నుండి డెభై రూపాయ‌ల వ‌ర‌కు సంపాదిస్తుంటాడు. రాని రోజు ఒక్క పైసా కూడా రాదు.

ఈ ప‌నికార‌ణంగా త‌న చ‌దువు సాగ‌డం లేద‌నే ఉద్దేశంతో వెయింగ్ మిష‌న్‌తో పాటు స్కూలు బ్యాగుని సైతం ఆ ప్ర‌దేశానికి తీసుకువెళ్ల‌టం అల‌వాటుగా మార్చుకున్నాడు. వెయింగ్ మిష‌న్, ప‌క్క‌నే స్కూలు బ్యాగుతో శ్ర‌ద్ధ‌గా చ‌దువుకుంటున్న కుర్రాడు….ఈ దృశ్యం ఆక‌ర్షించి, ఆ దారిన‌పోయే వ్య‌క్తి ఒక‌రు హ‌రేంద్ర ఫొటోని తీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. ఆ క్ష‌ణం నుండి ఆ కుర్రాడి పట్టుదల, అంకితభావాల‌కు లైక్‌ల‌ ద్వారా
అభినందనలు వెల్లువెత్తాయి. ఇది ఇక్క‌డితో ఆగ‌లేదు. హ‌రేంద్ర ఇంటికి ముఖ్య‌మంత్రి కార్యాల‌యం నుండి పిలుపు వ‌చ్చింది. త‌న తండ్రితో క‌లిసి ల‌క్నో రావాల్సిందిగా.

అయితే కుమారుడి ద్వారా త‌మ‌కు వ‌చ్చిన అవ‌కాశంపై స్పందిస్తూ రామ్‌గోపాల్, త‌న కొడుక్కి చ‌దువుపై ఇంత శ్ర‌ద్ధ ఉన్నా, తాను చ‌దివించ‌లేక‌పోతున్నందుకు సిగ్గుగా ఉంద‌న్నాడు. పిల్ల‌ల‌ను ప్ర‌యివేటు స్కూళ్ల‌లో చ‌దివించాల‌ని ఉన్నా స్థోమ‌త లేక ప్ర‌భుత్వ స్కూళ్ల‌లో చ‌దివిస్తున్నాన‌ని మీడియాకు చెప్పాడు. హ‌రేంద్ర‌తో పాటు అతనికి మ‌రో ఇద్ద‌రు కొడుకులు ఉన్నారు. గ‌త‌ ఆదివారం హ‌రేంద్ర ముఖ్య‌మంత్రి అఖిలేష్ యాద‌వ్‌ని క‌లిశాడు. స్వ‌యంగా ముఖ్య‌మంత్రి చేతుల మీదుగా ఐదుల‌క్ష‌ల రూపాయ‌ల చెక్కుని అందుకున్నాడు.

అత‌ని చ‌దువు నిరాటంకంగా సాగేందుకు వీలుగా అత‌నికి ఈ స‌హాయాన్ని అందిస్తున్న‌ట్టుగా అఖిలేష్ ప్ర‌క‌టించారు. హ‌రేంద్ర‌ని పేవ్‌మెంట్‌మీద వెయింగ్ మిష‌న్‌తో చూసిన మ‌రొక వ్య‌క్తి అత‌ని తండ్రికి ఉద్యోగం వ‌చ్చేందుకు స‌హాయం చేస్తాన‌ని మాట ఇచ్చాడు. దీంతో ఆ కుటుంబ క‌ష్టాలు తీరిన‌ట్టే అనుకోవ‌చ్చు. ఇది నిజంగా సినిమాటిక్‌గా అనిపిస్తున్న పాజిటివ్ స్టోరీ. హ‌రేంద్ర‌కు అన్ని విధాలుగా మంచి జ‌ర‌గ‌డం అనేది నిజంగా మంచి విష‌యం. అత‌ను ఓ మంచి ఆర్మీ ఆధికారి కావాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుందాం.

ఆ విష‌యాన్ని ప‌క్క‌నుంచితే ఒక్క‌సారి మ‌నం వెన‌క్కువెళ్లి…వాళ్ల ఇంట్లో ఆ మిష‌న్ లేక‌పోయినా, దాన్ని బ‌య‌ట‌కు తెచ్చి సంపాదించ‌వ‌చ్చ‌నే ఆలోచ‌న ఆ కుర్రాడికి రాక‌పోయినా, అత‌డి ఫోటో తీసి ఫేస్‌బుక్‌లో పెట్టాల‌ని ఆ బాట‌సారికి అనిపించ‌క‌పోయినా, అది ముఖ్య‌మంత్రి దృష్టికి వెళ్ల‌క‌పోయినా…ఏం జరిగి ఉండేది…అనే విష‌యం గురించి ఆలోచిద్దాం. ఎప్ప‌టిలాగే హ‌రేంద్ర జీవితం ఒడిదుడుకుల‌తో సాగేది. అత‌ని చ‌దువు
దిన‌దిన గండంగా మారేది. దాన్ని నివారిస్తూ, ఏ కొద్ది మంది నిరుపేద‌ల జీవితాల్లోనో అనుకోకుండా జ‌రిగే అద్భుతం హ‌రేంద్ర జీవితంలో జ‌రిగింది. అత‌నిలాగే ఎన్నో ఆశ‌లు ఉండి చ‌దువుకోలేని పిల్ల‌లు మ‌న‌దేశంలో ఇంకా చాలామంది ఉన్నారు. వారంద‌రి స‌మ‌స్య‌ల‌కూ ఇలాంటి శుభం కార్డు ప‌డ‌డం జ‌ర‌గ‌దు.

ప్ర‌భుత్వాలు స్పందించి, అలాంటివారంద‌రినీ గుర్తించి, అంద‌రినీ ఆదుకునే అవ‌కాశం ఎప్ప‌టికీ రాదు కాబ‌ట్టి…ఎంత పేద‌రికంలో ఉన్నా నిరాశ‌ప‌డ‌కుండా, ఆశ‌ని పోగొట్టుకోకుండా ప్ర‌య‌త్నిస్తూనే ఉండండి…ప‌నిచేస్తూనే ఉండండి…క‌ష్ట‌ప‌డేవాడికి ఫ‌లితం వ‌చ్చి తీరుతుంది… చివ‌రివ‌ర‌కు నిజాయితీగా, అంకిత‌భావంతో శ్ర‌మిస్తూనే ఉండండి… మ‌న‌సుంటే మార్గ‌ముంటుంది…లాంటి స్లోగ‌న్లు మ‌న స‌మాజంలో ఎక్కువ‌గా
విన‌బ‌డుతుంటాయి. ఇవ‌న్నీ కూడా చేయాల్సిన ప‌నులే. వీటిలో త‌ప్పేంలేదు. కానీ ఎంత క‌ష్ట‌ప‌డినా చివరి వ‌ర‌కు య‌ధాత‌థంగా పేద‌రికంలో మ‌గ్గుతున్న జీవితాలున్న‌పుడు, మ‌నం క‌ళ్లారా చూస్తున్న‌ప్పుడు ఈ విష‌యం మీద కాస్త పొడిగించి ఆలోచించాల్సివ‌స్తోంది.

స‌మాజంలో పేదా గొప్పా తేడాలు ఎప్ప‌టికీ మ‌రింత పెరుగుతాయే త‌ప్ప త‌గ్గ‌వు క‌నుక‌, సంప‌ద పంప‌కంలో సమతుల్యం అనేది రానే రాదు క‌నుక‌, అంద‌రికీ అవ‌కాశాలు అంద‌వు క‌నుక‌, మ‌న‌కు ఇలాంటి స్ఫూర్తినిచ్చే క‌థ‌నాలు ఎక్కువ‌. ఇలాంటి క‌థ‌నాలు మ‌నిషిలో ఎంతోకొంత స్ఫూర్తిని నింపినా, ఒక విధంగా మ‌భ్య‌పెడుతుంటాయి. మ‌నం వెనుక‌బ‌డి పోవ‌డానికి కార‌ణం కేవ‌లం మ‌న దుర‌దృష్టం, కేవ‌లం మ‌న‌చేత‌కాని త‌నం…మ‌న తెలివిత‌క్కువ‌త‌నం…మ‌నం క‌ష్ట‌ప‌డి సాధించ‌లేక‌పోవ‌డమే…అనే భ్ర‌మ‌లో ఉంచుతాయి. అలాంటి భ్ర‌మ‌లే పేద‌వాడు ప్ర‌శ్నించ‌కుండా ఎల్ల‌కాలం ఒబీడియంట్ ఓట‌రుగా మిగిలిఉండేలా చేస్తాయి.

హ‌రేంద్ర జీవితంలో జ‌రిగిన అద్భుతం… లాంటి సంఘ‌ట‌న‌లు, ఎప్పుడో ఒక‌సారి జ‌రిగేవిగా కాకుండా, అవ‌స‌రం ఉన్న ప్ర‌తి చోటా, స‌ర్వ‌సాధార‌ణంగా జ‌రుగుతుంటే…. ఈ క‌థ‌నాన్ని మ‌నం ఇలా రాసుకుని చ‌దువుకునే వాళ్లం కాదు…దీంట్లో ఉన్న స్ఫూర్తి సాక్షిగా… మ‌రెంతోమంది క‌ష్టాలు ప‌డుతూ ఉండే ప‌రిస్థితులు మ‌న చుట్టూ ఉండేవి కావు.

-వ‌డ్ల‌మూడి దుర్గాంబ‌

First Published:  30 Sep 2015 4:09 AM GMT
Next Story