Telugu Global
POLITICAL ROUNDUP

కత్తిదూసే గంటా గతాన్ని మరిచారా?

ప్రత్యేక హోదాపై జగన్ దీక్షకు ప్రభుత్వం అడ్డుపడడాన్ని రాజకీయ వైరంగా భావించి సర్దుకుపోవచ్చు. కానీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడే మేధావులు, ప్రొఫెసర్లనూ బెదిరించేందుకు  ప్రభుత్వ పెద్దలు సిద్ధపడడమే ప్రజాస్వామ్యంలో ఆందోళనకరం. విశాఖ ఆంధ్రా యూనివర్శిటీ ప్రొఫెసర్ ప్రసాద్ రెడ్డి విషయంలో మంత్రి గంటా శ్రీనివాసరావు అనుసరిస్తున్న వైఖరి ఇందుకు నిదర్శనం.  ఇటీవల ఏయూలో ప్రత్యేక హోదాపై జగన్ నిర్వహించిన విద్యార్థి యువభేరి కార్యక్రమానికి ప్రొఫెసర్ ప్రసాద్ రెడ్డి కూడా హాజరయ్యారు. ప్రత్యేక హోదా లాభాలను విద్యార్థులకు […]

కత్తిదూసే గంటా గతాన్ని మరిచారా?
X
ప్రత్యేక హోదాపై జగన్ దీక్షకు ప్రభుత్వం అడ్డుపడడాన్ని రాజకీయ వైరంగా భావించి సర్దుకుపోవచ్చు. కానీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడే మేధావులు, ప్రొఫెసర్లనూ బెదిరించేందుకు ప్రభుత్వ పెద్దలు సిద్ధపడడమే ప్రజాస్వామ్యంలో ఆందోళనకరం. విశాఖ ఆంధ్రా యూనివర్శిటీ ప్రొఫెసర్ ప్రసాద్ రెడ్డి విషయంలో మంత్రి గంటా శ్రీనివాసరావు అనుసరిస్తున్న వైఖరి ఇందుకు నిదర్శనం.
ఇటీవల ఏయూలో ప్రత్యేక హోదాపై జగన్ నిర్వహించిన విద్యార్థి యువభేరి కార్యక్రమానికి ప్రొఫెసర్ ప్రసాద్ రెడ్డి కూడా హాజరయ్యారు. ప్రత్యేక హోదా లాభాలను విద్యార్థులకు వివరించేందుకు ఒక సీనియర్ ప్రొఫెసర్‌గా ప్రసాద్ ప్రయత్నించారు. ఆయన ప్రసంగంలో ఎక్కడా కూడా పాలకులను వ్యక్తిగతంగా దూషించిన దాఖలాలు కనిపించవు. కేవలం ప్రభుత్వాల వైఖరి కారణంగా రాష్ట్రానికి జరుగుతున్న నష్టాన్ని మాత్రమే వివరించారు. తన యూనివర్శిటీకి వచ్చిన వ్యక్తికి సముచితంగా ఆహ్వానం పలకాలన్న ఉద్దేశంతో ఈ శతాబ్దపు మోస్ట్ డైనమిక్ అపొజిషన్ లీడర్ అంటూ జగన్ ను ఉద్దేశించి ఓ వ్యాఖ్య మాత్రమే చేశారు. బహుశా అక్కడే గంటా గారికి కోపం వచ్చిందేమో. వెంటనే ప్రసాద్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆఘమేఘాల మీద వీసీకి గంటా ఆదేశాలు జారీ చేయడమే అందరినీ ఆశ్చర్యపరిచింది.
గంటా నిబంధనలు పూర్తిగా చదవలేదా?
రూల్స్ తెలిసిన వారు మాత్రం మంత్రి అవగాహనా రాహిత్యంతోనే ప్రసాద్ రెడ్డిపై చర్యలకు ఆదేశించారని అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ప్రజాచైతన్య కార్యక్రమాల్లో ప్రొఫెసర్లు పాల్గొనవద్దని యూజీసీ నిబంధనల్లో ఎక్కడా లేదు. పైగా మేధావి వర్గానికి చెందిన ఆచార్యులు ప్రజాచైతన్య కార్యక్రమాల్లో పాల్గొనడాన్ని సమాజం ఎప్పటి నుంచో స్వాగతిస్తూనే ఉంది.
ఆ ప్రొఫెసర్లు కనిపించలేదా? అశోక్‌బాబు ఫత్వా జారీలు మరిచారా?

ప్రజాచైతన్య కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రసాద్ రెడ్డితో ప్రారంభం కాలేదు. విభజన ఉద్యమ సమయంలో తెలంగాణ జేఏసీని నడిపిన కోదండరాం, సమైక్యాంధ్ర జేఏసీ కన్వీనర్ శ్యామూల్ కూడా ప్రొఫెసర్లే. అప్పుడు కూడా మంత్రిగా ఉన్న గంటాగారు ఉద్యమంలో పాల్గొన్న ప్రొఫెసర్లపై చర్యలకు ఎందుకు డిమాండ్ చేయలేదు?. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఇదే యూనివర్శిటీలో టీడీపీ సభ్యత్వనమోదు కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహిస్తే దానికి వీసీ కూడా హాజరైతే అప్పుడెందుకు గంటా మౌనంగా ఉన్నారన్న ప్రశ్న సహజంగా ఎదురవుతుంది.
ప్రభుత్వం దగ్గర జీతం తీసుకుంటూ, శాసన వ్యవస్థ నిర్ణయాలను అమలు చేయాల్సిన అశోక్ బాబు సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో అదే శాసన వ్యవస్థను నడుపుతున్న ముఖ్యమంత్రి, మంత్రులకే ఫత్వాలు జారీ చేయలేదా?. పాలకులు పలానా దారిలో నడవకుంటే అదిచేస్తాం ఇది చేస్తామంటూ అశోక్ బాబు తన పరిధి మించి ప్రవర్తించినప్పుడు తప్పుగా అనిపించలేదా?. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆనాడు అశోక్‌బాబు చేసింది సరైనదే అయితే ఈ రోజు ఏపీ ప్రత్యేక హోదా కోసం ప్రసాద్ రెడ్డి మాట్లాడిన దాంట్లో తప్పేంటన్న ప్రశ్నకు గంటా సమాధానం చెప్పగలడా?. బీజేపీ సీనియర్ నేత మురళీమనోహర్ జోషి అలహాబాద్ యూనివర్శిటీ ప్రొఫెసర్‌గా ఉంటూనే ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలకు హాజరయ్యేవారు.
ఇప్పటికీ సీనియర్ ప్రొఫెసర్లు కొందరు టీవీ చర్చల్లో పాల్గొంటూ ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలను విమర్శిస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసే సాహసం గంటా గారు గానీ, ఏపీ ప్రభుత్వం గానీ చేయగలదా?. అందరిపైనా సమానంగా ప్రయోగించేదాన్నే నిబంధన అంటారు. అలా కాకుండా కొందరిని మాత్రమే నియంత్రించేందుకు వాడే దాన్ని నిబంధన అనలేం. నియంతృత్వం అని మాత్రం అనవచ్చు.
First Published:  29 Sept 2015 12:50 AM GMT
Next Story