Telugu Global
Others

ఆ రోడ్డు ప్ర‌వాహాల‌ను తాగేస్తుంది!

చినుకుప‌డితే చాలు హైదారాబాద్‌లో రోడ్లు వాగుల‌వుతాయ‌ని, రోడ్ల‌మీద ప‌డ‌వ‌లు వేసుకుని తిర‌గాల్సిందేన‌ని…వ‌ర్షాకాలంలో వార్త‌ల్లో త‌ర‌చుగా విన‌బ‌డుతుంటుంది…క‌న‌బ‌డుతుంటుంది. ఒక్క హైద‌రాబాదే కాదు, వాన‌లొస్తే  ఇళ్ల‌లో మోకాళ్ల‌లోతు నీళ్లు నిల‌వుండిపోవ‌డం, మోరీలు, నాలాల్లో ప‌డి మ‌నుషులు ప్రాణాలు పోగొట్టుకోవ‌డం లాంటి దుర్భ‌ర ప‌రిస్థితులు మ‌న‌చుట్టూ ఉన్నాయి. ఇలాంట‌పుడు ప‌డిన చుక్కని ప‌డిన‌ట్టుగా రోడ్డు పీల్చేస్తే బాంగుడును క‌దా…అనిపిస్తుంది. కానీ అది సాధ్య‌మా… అంటే… సాధ్య‌మేన‌ని ఒక భిన్న‌మైన కాంక్రీటు నిరూపిస్తోంది.  ఫేస్‌బుక్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్న ఒక వీడియో అలాంటి కాంక్రీటు […]

ఆ రోడ్డు ప్ర‌వాహాల‌ను తాగేస్తుంది!
X

చినుకుప‌డితే చాలు హైదారాబాద్‌లో రోడ్లు వాగుల‌వుతాయ‌ని, రోడ్ల‌మీద ప‌డ‌వ‌లు వేసుకుని తిర‌గాల్సిందేన‌ని…వ‌ర్షాకాలంలో వార్త‌ల్లో త‌ర‌చుగా విన‌బ‌డుతుంటుంది…క‌న‌బ‌డుతుంటుంది. ఒక్క హైద‌రాబాదే కాదు, వాన‌లొస్తే ఇళ్ల‌లో మోకాళ్ల‌లోతు నీళ్లు నిల‌వుండిపోవ‌డం, మోరీలు, నాలాల్లో ప‌డి మ‌నుషులు ప్రాణాలు పోగొట్టుకోవ‌డం లాంటి దుర్భ‌ర ప‌రిస్థితులు మ‌న‌చుట్టూ ఉన్నాయి. ఇలాంట‌పుడు ప‌డిన చుక్కని ప‌డిన‌ట్టుగా రోడ్డు పీల్చేస్తే బాంగుడును క‌దా…అనిపిస్తుంది. కానీ అది సాధ్య‌మా… అంటే… సాధ్య‌మేన‌ని ఒక భిన్న‌మైన కాంక్రీటు నిరూపిస్తోంది.

ఫేస్‌బుక్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్న ఒక వీడియో అలాంటి కాంక్రీటు రోడ్డుని మ‌న క‌ళ్ల‌ముందుకి తెచ్చింది. ఓ డ్ర‌మ్ముని దొర్లిస్తే ప‌డేంత స్థాయిలో నీటిని టాంకరు నుండి కింద‌కి పోసిన‌పుడు మామూలుగా అయితే ఆ ప్రాంత‌మంతా జ‌ల‌మ‌య‌మై పోతుంది. కానీ టాప్‌మిక్స్ పేరుతో త‌యారైన, ఈ అత్యంత వేగంగా నీటిని పీల్చుకునే కాంక్రీటు రోడ్డు, నీటిని ఒడిసిప‌ట్టి ప్ర‌వ‌హించ‌కుండా ఆపింది. ఏదో మాయ‌లా నీళ్ల‌ను పీల్చే సింది. త‌న‌లోకి ఇంకింప‌చేసుకుంది. స్పాంజ్ కంటే వేగంగా ఈ కాంక్రీటు రోడ్డు నీటిని పీల్చి వేయ‌డం ఈ వీడియోలో మ‌న‌కు క‌న‌బ‌డుతుంది.

నిముషానికి 880 గేల‌న్ల (ఒక్క గేల‌ను 3.79 లీట‌ర్లు) నీటిని ఈ రోడ్డు తాగేస్తుంద‌ని అంచ‌నావేశారు. కాంక్రీటు పైపొర‌ని ఇలా నీళ్ల‌ని పీల్చేలా రూపొందించారు. ఈ నీరు వృథా కాదు కూడా. ఇదంతా నేల అడుగుకి చేరుతుంది. దాంతో ఈ రోడ్లు వేసిన ప్రాంతాలు తారు రోడ్ల‌కంటే చ‌ల్ల‌గానూ ఉంటాయి. ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల్లో రోడ్లు జ‌ల‌మ‌యం కాకుండా, సుర‌క్షితంగా, శుభ్రంగా ఉండాలంటే ఈ కాంక్రీటుని ఉప‌యోగించుకుంటే స‌రిపోతుంద‌ని దీని త‌యారీదారులు చెబుతున్నారు. ఈ కాంక్రీటు ప‌నిచేసే విధానాన్ని చూపిస్తూ తీసిన ఒక నిముషం వీడియోని ఫేస్‌బుక్‌లో ఇప్ప‌టివ‌ర‌కు నాలుగుకోట్ల‌మందికి పైగా వీక్షించారు. ప్ర‌కృతి శ‌క్తికి, మ‌నిషి మేధ‌స్సుకి మ‌ధ్య జ‌రిగే నిరంతర పోటీ ప్ర‌క్రియ‌లో ఆవిష్కృత‌మైన మ‌రొక అద్భుతం ఇది.

First Published:  28 Sep 2015 4:36 AM GMT
Next Story