ఇది పక్కా లోకేష్ లెక్క!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ముద్దుల తనయుడు లోకేష్‌బాబు ఎవరూ అడగకుండానే తమ ఆస్తులు ప్రకటించారు. పక్కా లోకేష్ లెక్కతో మీడియా ముందుకొచ్చారు. నిజాయితీకి పెదబాబు నిలువుటద్దమైతే..తాను నిజాయితీకి బ్రాండ్ అంబాసిడర్‌ను అని ఆస్తుల ప్రకటన ద్వారా చాటారు. అయితే లెక్కల్లో వీకైన ఏపీ జనాలకు కాస్త తిక్క లేచింది. చంద్రబాబు సీఎం అయితే లోకేష్ షాడో అని ఇప్పటికే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జరుగుతున్న సంఘటనలు కూడా షాడో సీఎం వైపే వేలు చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక […]
BY sarvi28 Sept 2015 4:44 AM GMT
X
sarvi Updated On: 28 Sept 2015 4:44 AM GMT
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ముద్దుల తనయుడు లోకేష్‌బాబు ఎవరూ అడగకుండానే తమ ఆస్తులు ప్రకటించారు. పక్కా లోకేష్ లెక్కతో మీడియా ముందుకొచ్చారు. నిజాయితీకి పెదబాబు నిలువుటద్దమైతే..తాను నిజాయితీకి బ్రాండ్ అంబాసిడర్‌ను అని ఆస్తుల ప్రకటన ద్వారా చాటారు. అయితే లెక్కల్లో వీకైన ఏపీ జనాలకు కాస్త తిక్క లేచింది. చంద్రబాబు సీఎం అయితే లోకేష్ షాడో అని ఇప్పటికే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జరుగుతున్న సంఘటనలు కూడా షాడో సీఎం వైపే వేలు చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక సీఎం ఆస్తుల వివరాలు.. ఏ పదవీలేని, ప్రభుత్వంతో సంబంధంలేని లోకేష్ ప్రకటించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పెదబాబు లెక్క ఎందుకు తగ్గిందంటే!
చినబాబు చెప్పినదాని ప్రకారం పెదబాబు అదేనండి చంద్రబాబు గతేడాది ఆస్తుల విలువ రూ. 71 లక్షలు, ఈ ఏడాది రూ.42.40 లక్షలట. సీఎంగా బిజీగా ఉండడం వల్ల బాబు సంపాదించలేకపోయారనుకుందాం.కా నీ ఉన్న లక్షలు ఎలా తరిగిపోయాయనేదే ఇప్పుడు జనాల మదిని తొలిచేస్తున్న ప్రశ్న. బాబు సింగపూర్ టూర్లకు ప్రభుత్వ ఖజానా నుంచి తీసిన మొత్తం 8 కోట్లకు పైనే. బాబు నిద్రపోయే బస్సు ఖరీదు 5 కోట్లపైనే.. ఒక సీఎంగా వస్తున్న జీతం..అలవెన్సులకు అదనంగా బాబు 24/7 ఖర్చులన్నీ ప్రభుత్వ ఖజానాకు జమవుతాయి. బాబు జేబులోంచి మరి పదిపైసలు కూడా ఖర్చు కానప్పుడు 71 లక్షల ఆస్తి 42 లక్షలకు ఎలా తగ్గిందనేదే ఇప్పుడు మిస్టరీ. అలాగే బాబు ఆస్తి అయిన 71 లక్షలకు బ్యాంకు వడ్డీ లెక్కేసుకున్నా.. నెలకు 71 వేలు వస్తుంది. 12 నెలలకు 8 లక్షల 50 వేలకు పైనే వడ్డీ వస్తుంది. మరి బాబు ఆస్తికి వడ్డీ జమవ్వాలి కానీ.. ఆస్తి ఎలా తరిగిందనేది చినబాబు చెప్పనే లేదని కొంటె లెక్కలు వేసే వాళ్లు అడుగుతున్న మాట.
తండ్రిది తరిగి..తనయుడిది పెరిగి..
ప్రపంచానికి అరచేతిలో విజన్ చూపించగల మార్గదర్శినని చెప్పుకునే చంద్రబాబు ఏపీ సీఎం అయితే .. అతని ఆస్తి సగానికి సగం తగ్గింది. అదే సమయంలో సీఎం తనయుడు ఆస్తులు భారీగా పెరిగాయి. ఇక్కడే అసలు లెక్క ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తండ్రి పరోక్షంలో పనులన్నీ చక్కబెడుతున్నది లోకేషే అనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. కాంట్రాక్టులు ఇప్పించడం, ప్రాజెక్టులు మంజూరు చేయడం, బదిలీలు, ప్రమోషన్లు అన్నీ చినబాబు కనుసన్నల్లో జరుగుతున్నాయని టీడీపీలోని అసంతృప్త నేతలు బాహాటంగానే చెబుతున్నారు. ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలా బాబు ఆస్తులు విలువ పెరగలేదు..చినబాబు ఆస్తులు పెరిగాయి..ఇదే చినబాబు చేతివాటానికి నిదర్శనమని ప్రతిపక్షాలకు చెందిన నేతలు ఆరోపిస్తున్నారు.
కొన్ననాటి లెక్క అంతే..
లోకేశ్ ఆస్తుల ప్రకటన చాలా పకడ్బందీగా, పక్కా లెక్క ప్రకారం సాగింది. తన తల్లి భువనేశ్వరి దేవి రూ. 33 కోట్లు, తన ఆస్తుల విలువ రూ. 7.56 కోట్లు, తన భార్య బ్రాహ్మణి ఆస్తుల విలువ రూ.5.14 కోట్లు ఉందని లోకేశ్ ప్రకటించారు. అలాగే తన అప్పు ఐదుకోట్లు తగ్గిందని చెప్పుకొచ్చారు. అప్పు ఐదుకోట్లు తగ్గిందంటే..అది ఆస్తి కిందే లెక్క. ఐదు కోట్లను అప్పు కింద చూపడంలో చినబాబు చాణక్యం ప్రదర్శించారు. వీటన్నిటి కంటే అసలైన ట్విస్టు ఏంటంటే.. ఈ ఆస్తులు కొన్నప్పుడు విలువ ప్రకారం అనే షరతును ఉటంకించారు లోకేశ్. అది అశ్వత్థామ హతఃకుంజరః అనేలా ఎవరికీ వినపడలేదు. ఈ లెక్కన 1992లో హెరిటేజ్ స్థాపించారు. అంటే 23 ఏళ్ల కిందన్న మాట. అప్పుడు హైదరాబాద్‌లో గజం 100 రూపాయలకు కొన్న భూమి..ఇప్పుడు గజం 10 వేలు దాటిపోయింది. ఈ లెక్కన వంద రెట్లు పెరిగిన ఆస్తి విలువను చూపించకుండా దశాబ్దాల క్రితం కొన్న ఆస్తులు, సంపాదించిన భూముల విలువ చూపడంలో లోకేష్ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడని నిపుణులు చెబుతున్నారు.
ఎందుకీ ఆస్తుల వెల్లడి ప్రహసనం?
చంద్రబాబును కానీ, ఆయన తనయుడు లోకేష్‌ను గానీ ఆస్తులు ప్రకటించడమని ఎవ్వరూ అడగలేదు. కోర్టుల్లో కేసులు దాఖలు కాలేదు. ఆదాయపన్నుశాఖాధికారులు నోటీసులు ఇవ్వలేదు. ప్రతిపక్షాలు కూడా బాబు ఆస్తులపై విచారణ కోరలేదు. కానీ ఎందుకీ ఆస్తుల ప్రకటన ప్రహసనం అనేది ఎవ్వరికీ అర్థం కాలేదు. అయితే దీని వెనుక కూడా చాలా పెద్ద స్కెచ్చే ఉందట! తన తండ్రి, తాను, తన కుటుంబం సచ్ఛీలురమని, అనుకూల మీడియాతో ప్రచారం చేసుకునే లక్ష్యం ఉందట. దీంతోపాటు అక్రమాస్తులపై ఎవ్వరూ మారు మాట్లాడకుండా తామే ముందు ఆస్తుల ప్రకటన చేసి నోరు మూయించాలనేది మరో ఎత్తుగడట. వీటన్నింటి కంటే..భవిష్యత్‌లో తన తండ్రి పదవి పోతే.. అక్రమాస్తుల విచారణను ఎదుర్కోవాల్సి వస్తుందని, అందుకే దీనికి ప్రిపరేషన్ గా ప్రతి ఏటా ఆస్తులు ప్రకటిస్తూ తాము పారదర్శకంగా వ్యవహరించామని చెప్పుకునేందుకు కూడా ఉపయోగపడుతుందని చినబాబు ఆలోచనట. మొత్తానికి ఆస్తుల ప్రకటన వెనుక ఇంత స్కెచ్ ఉందా అని తెలిసినవాళ్లు నోరెళ్లబెడుతున్నారు.
Next Story