Telugu Global
Others

Wonder World 37

చెట్టే ఆమె కాన్వాస్‌…!! చెట్టు కనిపిస్తే చాలు ఆమె అక్కడ ఆగిపోతుంది. రంగులు, కుంచె ఆమె వెంట సిద్ధంగా ఉంటాయి. ఆ చెట్టు కాండంపై ఏదో ఒక చోట ఒక అందమైన బొమ్మను ఆవిష్కరిస్తుంది. వృక్షో రక్షతి రక్షిత: అన్న సూక్తి ఈ చైనా యువతి నరనరాన జీర్ణించుకుపోయింది. వృక్షాల పరిరక్షణ కోసం తన వంతు ప్రయత్నంగా ఇలా బొమ్మలు వేయడాన్ని పనిగా పెట్టుకున్నది. చైనా లోని షిజియాఝువాంగ్‌ నగరంలో వాంగ్‌ యూ అనే 23 ఏళ్ల […]

Wonder World 37
X

చెట్టే ఆమె కాన్వాస్‌…!!

చెట్టు కనిపిస్తే చాలు ఆమె అక్కడ ఆగిపోతుంది. రంగులు, కుంచె ఆమె వెంట సిద్ధంగా ఉంటాయి. ఆ చెట్టు కాండంపై ఏదో ఒక చోట ఒక అందమైన బొమ్మను ఆవిష్కరిస్తుంది. వృక్షో రక్షతి రక్షిత: అన్న సూక్తి ఈ చైనా యువతి నరనరాన జీర్ణించుకుపోయింది. వృక్షాల పరిరక్షణ కోసం తన వంతు ప్రయత్నంగా ఇలా బొమ్మలు వేయడాన్ని పనిగా పెట్టుకున్నది. చైనా లోని షిజియాఝువాంగ్‌ నగరంలో వాంగ్‌ యూ అనే 23 ఏళ్ల యువతి చెట్లపై అందమైన బొమ్మలను వేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నది. కోటిమంది జనాభా ఉన్న ఈ నగరంలో కాలుష్యం బాగా పెరిగిపోయింది. ప్రపంచంలో కాలుష్యం ఎక్కువగా ఉన్న నగరాలలో షిజియాఝువాంగ్‌ కూడా ఒకటి. కాలుష్యం నుంచి మనలను మనం కాపాడుకోవాలంటే చెట్లను పెంచడం తప్ప మరో మార్గం లేదని వాంగ్‌ యూ అంటోంది. చెట్లకు ఉన్న ప్రాధాన్యతను గుర్తించబట్టే వాటిని నరికేయకుండా ఉంచడం కోసం తాను వాటిపై బొమ్మలు వేస్తున్నానని వాంగ్‌ యూ చెబుతుంటుంది. బొమ్మ వేయడం కోసం చెట్టు కాండాన్ని చెక్కి చదును చేయడం వంటి పనులేవీ వాంగ్‌ యూ చేయదు. అసలు చెట్టుకు ఎలాంటి హానీ చేయదు. బొమ్మ వేయాలనుకున్న చెట్టు కాండంపై అందుకు అనువుగా ఉండే ప్రాంతాన్ని ఎంచుకుని అక్కడ బొమ్మను వేసేస్తుంది. ఒక్కో బొమ్మ వేయడానికి ఆమెకు రెండు గంటల సమయం పడుతుందట. వాంగ్‌ యూ బొమ్మల వల్ల గానీ, ఆమె బొమ్మలకు వేస్తున్న రంగుల వల్ల గానీ చెట్టుకు ఏమైనా హాని జరుగుతుందా అని పర్యావరణ వేత్తలు, స్థానిక అధికారులు అనేక రకాల పరీక్షలు జరిపారు. చివరకు వాటి వల్ల చెట్లకు ఎలాంటి ఇబ్బందీ లేదని తెలుసుకుని ఓ సర్టిఫికెట్‌ కూడా ఇచ్చేశారు. అంటే వాంగ్‌ యూ ఇక నగరంలో ఏ చెట్టుపైనైనా బొమ్మ వేసేయవచ్చన్నమాట. వాంగ్‌ యూ కృషిని చైనా మీడియా చాలా బాగా ప్రశంశిస్తోంది. మీడియానే కాదు షిజియాఝువాంగ్‌ నగర ప్రజలు కూడా ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. వాంగ్‌ యూ కృషిని మనమూ అభినందిద్దామా.

First Published:  24 Sep 2015 1:04 PM GMT
Next Story