Telugu Global
POLITICAL ROUNDUP

తెలుగు తెర‌పై అంద‌మైన అమ్మ‌లు… నాన్న‌లు!

ఇప్పుడు మ‌న  సినిమాల్లో ఒక మార్పు చాలా స్ప‌ష్టంగా క‌న‌బడుతోంది. హీరో హీరోయి న్ల‌ గ్లామ‌ర్‌కి దీటుగా వారి త‌ల్లిదండ్రుల పాత్ర‌ల‌ను ద‌ర్శ‌కులు తీర్చిదిద్దుతున్నారు. దాంతో  హీరో ఇమేజ్ ని మ‌రింత పెంచే బ‌ల‌మైన విలన్ల‌తో పాటు, హీరో కుటుంబాన్ని చూపించాల్సి వ‌చ్చిన‌పుడు తెర‌మీద అందంగా, డిగ్నిఫైడ్ గా క‌నిపించ‌గ‌ల మ‌ధ్య‌వ‌య‌సు న‌టీన‌టుల అవ‌స‌రం పెరిగింది.  స‌మాజంలో ధ‌న‌వంతులు, అప్ప‌ర్ మిడిల్ క్లాస్‌, మిడిల్ క్లాస్ పెరుగుతున్న‌ట్టుగానే సినిమాల్లోనూ వారిని ప్ర‌తిబింబించే ఇళ్లూ, పాత్ర‌లూ ఉంటున్నాయి. కాలంతో […]

తెలుగు తెర‌పై అంద‌మైన అమ్మ‌లు… నాన్న‌లు!
X

ఇప్పుడు మ‌న సినిమాల్లో ఒక మార్పు చాలా స్ప‌ష్టంగా క‌న‌బడుతోంది. హీరో హీరోయి న్ల‌ గ్లామ‌ర్‌కి దీటుగా వారి త‌ల్లిదండ్రుల పాత్ర‌ల‌ను ద‌ర్శ‌కులు తీర్చిదిద్దుతున్నారు. దాంతో హీరో ఇమేజ్ ని మ‌రింత పెంచే బ‌ల‌మైన విలన్ల‌తో పాటు, హీరో కుటుంబాన్ని చూపించాల్సి వ‌చ్చిన‌పుడు తెర‌మీద అందంగా, డిగ్నిఫైడ్ గా క‌నిపించ‌గ‌ల మ‌ధ్య‌వ‌య‌సు న‌టీన‌టుల అవ‌స‌రం పెరిగింది. స‌మాజంలో ధ‌న‌వంతులు, అప్ప‌ర్ మిడిల్ క్లాస్‌, మిడిల్ క్లాస్ పెరుగుతున్న‌ట్టుగానే సినిమాల్లోనూ వారిని ప్ర‌తిబింబించే ఇళ్లూ, పాత్ర‌లూ ఉంటున్నాయి. కాలంతో పాటు వ‌స్తున్న మార్పు ఇది. ఇప్పుడు పేద‌రికాన్ని తెర‌మీద చూపిస్తే చూసేంత ఓపిక ఎవ‌రికీ లేదు. మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాల ఆశ‌ల‌న్నీ తెర‌మీద కూడా స్ప‌ష్టంగా క‌న‌బ‌డుతున్నాయి. అందుకే పాత్ర‌ల రూపురేఖ‌లూ, అవి ప్ర‌వ‌ర్తించే తీరూ మారిపోతున్నాయి.

ఎన్‌టి రామారావు, నాగేశ్వ‌ర‌రావుల కాలంలో పండ‌రీబాయి, పుష్ప‌ల‌త‌, అంజ‌లి లాంటివాళ్లు త‌ల్లులుగా తెర‌మీద మితిమీరిన వృద్ధాప్య‌భారంతో క‌న‌బ‌డుతుండేవారు. య‌వ్వ‌నంలో ఉన్న హీరో త‌ల్లి, అంత వృద్ధురాలు ఎలా అవుతుంది అనే ఔచిత్యాన్ని నాటి ద‌ర్శ‌కులు ప‌క్క‌న పెట్టేసి, హీరోల‌కు త‌గిన‌ట్టుగా, నాటి సామాజిక వాతావ‌ర‌ణాన్ని ప్ర‌తిబింబించేలా త‌ల్లులు తండ్రుల‌ పాత్ర‌లను తీర్చిదిద్దేవారు.

కాలం గ‌డిచే కొద్దీ త‌ల్లిదండ్రుల పాత్ర‌ల‌కు వృద్ధాప్య చిహ్నాలు త‌గ్గుతూ వ‌చ్చాయి. ఇక ఇప్ప‌టి ప‌రిస్థితి అయితే చెప్పాల్సిన ప‌నిలేదు. గ్లామ‌ర్ ప్ర‌పంచంలో డీ గ్లామ‌ర్ పాత్రలేమిటి…అన్న‌ట్టుగా, హీరో హీరోయిన్ల త‌ల్లులు, తండ్రులు.. మా పిల్ల‌ల అందానికి మూల‌కార‌ణం మేమే అనేంత‌ అందంగా ఆక‌ర్ష‌ణీయంగా క‌న‌బ‌డుతున్నారు. ఇదివ‌ర‌క‌టిలా తెలుగు సినిమాల్లో … పేద‌రికం, బాధ‌లు, అంగ‌వైక‌ల్యంతో బాధ‌ప‌డే ఆప్తులు వంటి సినిమా క‌ష్టాలు, భావోద్వేగ భారాలు‌ క‌నిపించ‌డం లేదు కాబ‌ట్టి, వాటిని తెర‌పై స‌హ‌జంగా చూపించాల్సిన న‌టుల అవ‌సరం ఇప్పుడు అంత‌గా లేదు. హీరో హీరోయిన్ల కుటుంబాలు ఆడుతూ పాడుతూ, అందంగా క‌నిపించ‌డం, కొండ‌క‌చో కాస్త బాధ్య‌తాయుతంగా, నాలుగు సీరియ‌స్ డైలాగులు చెబితే చాలు.

తెలుగు తెర‌పై తండ్రులు, అన్న‌ల కొర‌త…
మారుతున్న క‌థా క‌థ‌నాల నేప‌థ్యంలో తెలుగు సినిమాకు అంద‌మైన, హుందా అయిన తండ్రులు, అన్న‌లుగా, ముఖ్యంగా హీరో తండ్రి పాత్ర‌లో మెప్పించ‌గ‌ల న‌టుల కొర‌త చాలా ఉంది. అస‌లు ఒకానొక స‌మ‌యంలో సినిమాకు కీల‌క‌మై, ప‌రిణితి చెందిన న‌ట‌న‌ను చూపాల్సిన తండ్రి పాత్ర కు ప్ర‌కాష్‌రాజ్ త‌ప్ప ఇంకెవ‌రున్నారు…అంటే స‌మాధాన‌మే లేని ప‌రిస్థితి. అందుకే ఆయ‌న ఒక సంద‌ర్భంలో మ‌హాత్మా గాంధీ త‌రువాత నేనే ఫాద‌ర్ ఆఫ్ ద నేష‌న్ అని చ‌మ‌త్క‌రించారు కూడా.

కోట శ్రీనివాస‌రావు, గిరిబాబు, చ‌ల‌ప‌తి రావు, త‌నికెళ్ల భ‌ర‌ణి లాంటి వారికి మించి… ఓ భిన్న కోణ‌మున్న తండ్రి లేదా ఓ ముఖ్య‌మైన స‌పోర్టు పాత్ర‌తో, హీరో స్ట్రెంత్‌ని తెర‌మీద ఆవిష్క‌రించాల్సిన ప‌రిస్థితి ఉంటే ఈ కొర‌త మ‌రింత‌గా క‌న‌బ‌డుతోంది. ఈ నేప‌థ్యంలోనే రాజేంద్ర ప్ర‌సాద్‌, జ‌గ‌ప‌తిబాబు, రావు ర‌మేష్ లాంటి వారు ఆ లోటుని కొంత‌వ‌ర‌కు పూడుస్తున్నారు. స‌త్య‌రాజ్‌, సంప‌త్‌రాజ్ , ప్ర‌భు, ర‌ఘు, కార్తీక్‌, ఆనంద్‌, ఉపేంద్ర లాంటి ప‌ర‌భాషా న‌టులూ క‌న‌బ‌డుతున్నారు. షాయాజీ షిండే, ముఖేష్ రుషి, నాజ‌ర్ లాంటి వార‌యితే సంద‌ర్భానికి త‌గిన‌ట్టుగా అటు విల‌నిజం, ఇటు మంచి తండ్రి పాత్ర‌లు పోషిస్తూ తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌ర‌వుతున్నారు. కొన్నిసార్లు ఆహుతి ప్ర‌సాద్‌, శ్రీహ‌రి లేని లోటు కూడా స్ప‌ష్టంగా క‌న‌బ‌డుతోంది.

గ్లామ‌ర‌స్ అమ్మ‌లు…అత్త‌లు చాలామంది…
మ‌న సినిమాల్లో మ‌హిళా పాత్ర‌లకు నామ మాత్ర‌పు ప్రాధాన్య‌తే ఉంటుంది. అందుకే వారి కొర‌త ఎక్కువ‌గా క‌నిపించ‌దు. త‌మిళ తెలుగు న‌టీమ‌ణుల‌తో క‌లిసి అలాంటి పాత్ర‌ల్లో ఆక‌ట్టుకుంటున్న వారు మ‌న‌కు చాలామంది ఉన్నారు. వారంతా గ్లామ‌ర‌స్‌ అమ్మ‌లు, అత్త‌లు, అక్క‌లు, వ‌దిన‌లుగా క‌న‌బ‌డుతున్నారు. ప్ర‌గ‌తి, తులసి, న‌దియా, ప‌విత్రా లోకేష్ (స‌న్నాఫ్ స‌త్య‌మూర్తిలో అల్లు అర్జున్ త‌ల్లి), శ‌ర‌ణ్య‌, సుధ‌, స‌న‌, హేమ‌, రోహిణి, సీత‌, సితార‌….ఇటీవ‌ల శ్రీమంతుడులో మ‌హేష్‌బాబుకి త‌ల్లిగా న‌టించిన సుక‌న్య వ‌ర‌కు వీరంతా….తెలుగింటి ధ‌న‌వంతులైన మ‌హిళ‌లు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి త‌ల్లులు, అత్త‌ల పాత్ర‌ల్లో ఒదిగిపోతున్నారు. వ‌దిన‌లు అక్క‌లు లాంటి పాత్ర‌ల‌కు సురేఖా వాణి, సింధుతులానీ లాంటివారూ ఉన్నారు. ఇంకాస్త ప్ర‌త్యేక పాత్ర అయితే ర‌మ్య కృష్ణ, సుహాసిని, రోజా, మీనా లాంటివారూ ముందుకొస్తున్నారు.

స‌మాజంలో చోటు చేసుకుంటున్న మార్పుని బ‌ట్టే ఈ మార్పు తెర‌మీద క‌న‌బ‌డుతున్న‌ద‌న‌వ‌చ్చు. ఇప్ప‌టి సినిమాల‌న్నీ అయితే హీరోయిజం, లేదా ప్రేమ ఈ రెండింటి చుట్టూ మాత్ర‌మే తిరుగుతున్నాయి క‌నుక, ఫ్యామిలీ వాతావ‌ర‌ణం కోసం అందంగా, రిచ్‌గా క‌నిపించ‌గ‌ల‌ త‌ల్లిదండ్రులు, అన్నా వ‌దిన‌లు, అక్కా బావ‌లు ఉంటే చాలు. ఎప్పుడ‌న్నావీరే, మ‌ధ్య వ‌య‌సున్న మ‌ధ్య త‌ర‌గ‌తిని ప్ర‌తిబింబిస్తున్నారు. నిజ జీవితాల్లోని నిజ‌మైన ప‌రిస్థితులు, సంద‌ర్భాల‌ను ఆవిష్క‌రించే క‌థ‌లు త‌గ్గిపోవ‌డం వ‌ల‌న వీరంద‌రూ క‌లిసి ఒకే పాత్ర‌ని పోషిస్తున్న‌ట్టుగా ఉంటుంది. అంటే హీరో కుటుంబం లేదా హీరోయిన్ కుటుంబం అంతే.

ఈ వ‌రుస‌లో మ‌రో న‌టి తిస్కా చోప్రా
ఇప్పుడు తెలుగులో ఉన్న అంద‌మైన అమ్మ‌, ఆంటీల‌కు తోడు మ‌రొక నూత‌న న‌టి వ‌స్తోంది. రామ్ చ‌ర‌ణ్ సినిమా బ్రూస్‌లీ కోసం శ్రీను వైట్ల ఆమెని తెలుగుతెర‌మీదకు తెస్తున్నారు. హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో పుట్టి ఢిల్లీ యూనివ‌ర్శిటీలో ఇంగ్లీష్ లిట‌రేచ‌ర్ చ‌దువుకున్న ఆ న‌టి పేరు తిస్కా చోప్రా. తొమ్మిది భాష‌ల్లో నైపుణ్యం ఉన్న ఈమె భిన్న భాషా చిత్రాల్లో అల‌వోక‌గా న‌టించేస్తుంటారు. హిందీలో మంచి ద‌ర్శ‌కులు, ర‌చ‌యిత‌లు ఉన్నా అంత‌ర్జాతీయ స్థాయి సినిమాలు రావ‌డం లేద‌ని, అందుకే తాను హిందీతో పాటు భిన్న భాషా చిత్రాల్లో న‌టిస్తున్నాన‌ని తిస్కా చెబుతున్నారు. శ్రీను వైట్ల త‌న‌కు ఇచ్చిన పాత్ర రిచ్‌, స్ట్రాంగ్‌, ప‌వ‌ర్‌ఫుల్ ఉమెన్ క్యార‌క్ట‌ర్ అని తిస్కా తెలిపారు. ఇంత‌కంటే ఎక్కువ చెబితే క‌థ బ‌య‌ట‌కు వ‌చ్చేస్తుంద‌ని, త‌న‌దొక ప్ర‌త్యేక పాత్ర అని ఆమె అంటున్నారు. అసిస్టెంట్ ద‌ర్శ‌కుని స‌హాయంతో త‌న డైలాగులు ఎలా ప‌ల‌కాలో నేర్చుకుంటున్నారు. ఎక్కువ‌గా ఆర్ట్ చిత్రాల్లో న‌టిస్తున్న తాను ఇక‌పై క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లో న‌టించాల‌ని అనుకుంటున్న‌ట్టుగా ప్ర‌క‌టించారు. క‌నుక తెలుగు తెర‌కు మ‌రో అంద‌మైన ఆంటీ రానున్న‌ద‌న్న‌మాట‌.

-వి. దుర్గాంబ‌

First Published:  16 Sep 2015 12:40 AM GMT
Next Story