Telugu Global
Others

సరిహద్దు కాల్పులకు స్వస్తి.. భారత్‌, పాక్‌ అంగీకారం

తొలిరోజు సుహృద్భావ వాతావరణంలో ముగిసిన చర్చలు ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని కొనసాగించాలని, సరిహద్దులనుంచి ఉగ్రవాదుల చొరబాట్లను నియంత్రించాలన్న ముఖ్యమైన అంశాలపై భారత్‌, పాక్‌ సరిహద్దు భద్రతా దళాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. ‘‘ఇప్పటిదాకా జరిగింది చాలు. ఇకపై కాల్పుల విరమణ ఒప్పందాన్ని నిక్కచ్చిగా పాటిద్దాం. ఉల్లంఘనలకు తెర దించుందాం’’ అని ఉభయ దేశాల ప్రతినిధులు భావించారు. పాక్ నుంచి ఉగ్రవాదుల చొరబాటు అంశాన్ని సదస్సులో సరిహద్దు భద్రతా దళాల అధికారులు పేర్కొంటూ.. గురుదాస్‌పూర్, ఉధంపూర్ ఘటనలను […]

సరిహద్దు కాల్పులకు స్వస్తి.. భారత్‌, పాక్‌ అంగీకారం
X
తొలిరోజు సుహృద్భావ వాతావరణంలో ముగిసిన చర్చలు
ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని కొనసాగించాలని, సరిహద్దులనుంచి ఉగ్రవాదుల చొరబాట్లను నియంత్రించాలన్న ముఖ్యమైన అంశాలపై భారత్‌, పాక్‌ సరిహద్దు భద్రతా దళాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. ‘‘ఇప్పటిదాకా జరిగింది చాలు. ఇకపై కాల్పుల విరమణ ఒప్పందాన్ని నిక్కచ్చిగా పాటిద్దాం. ఉల్లంఘనలకు తెర దించుందాం’’ అని ఉభయ దేశాల ప్రతినిధులు భావించారు. పాక్ నుంచి ఉగ్రవాదుల చొరబాటు అంశాన్ని సదస్సులో సరిహద్దు భద్రతా దళాల అధికారులు పేర్కొంటూ.. గురుదాస్‌పూర్, ఉధంపూర్ ఘటనలను ఉదాహరించారు. జమ్మూకశ్మీర్‌ వెంబడి కొన్ని కీలకమైన, వ్యూహాత్మక ప్రాంతాల్లో ఉమ్మడిగా గస్తీ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. బీఎస్‌ఎఫ్‌ డైరెక్టర్స్‌ జనరల్‌, పాకిస్థాన్‌ రేంజర్ల మధ్య ఢిల్లీలో జరిగిన చర్చలు ఇలా సుహృద్భావ వాతావరణం మధ్య సాగాయి. కాల్పుల విరమణ ఉల్లంఘనకు ఒకరినొకరు నిందించుకుంటూనే… భవిష్యత్తులో సానుకూల దృక్పథం ప్రదర్శించాలని నిర్ణయించుకున్నారు. మూడు రోజులపాటు జరగాల్సిన చర్చలను… మరో రోజు పొడిగించడంపైనా దృష్టి సారించినట్లు సమాచారం. 2013 తర్వాత ఇరు దేశాల సరిహద్దు బలగాలు చర్చలు జరపడం ఇదే తొలిసారి.
రష్యా పర్యటనలో భారత్-పాక్ ప్రధానులు మోడీ, షరీఫ్‌లు.. ఇరు దేశాల మధ్య సుహృద్భావ సంబంధాలు పెంచేందుకు మూడు ఉన్నత స్థాయి సమావేశాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈ క్రమంలో జాతీయ సలహాదారుల సమావేశం జరగాల్సి ఉన్నా.. కాశ్మీర్ వేర్పాటువాదులను పాక్ సలహాదారు సర్తాజ్ అజీజ్ కలిసేందుకు అనుమతి ఇవ్వబోమని భారత్ స్పష్టం చేసింది. దీంతో సలహాదారుల సమావేశం రద్దయ్యింది. పాక్ ప్రతినిధి బృందానికి పాకిస్థాన్ రేంజర్స్ డైరెక్టర్ జనరల్ (పంజాబ్) మేజర్ జనరల్ ఉమర్ ఫరూఖ్ బర్కీ నేతృత్వం వహిస్తుండగా.. బృందంలో సింధ్ రేంజర్స్ ఉన్నతాధికారులు, హోంశాఖ ప్రతినిధులు, సర్వే ఆఫ్ పాకిస్థాన్, యాంటీ నార్కోటిక్స్, ఇమ్మిగ్రేషన్ అధికారులు ఉన్నారు. భారత్ తరఫున బీఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్ పాటక్, 23మంది అధికారులు సదస్సులో పాల్గొన్నారు. పాక్‌ రేంజర్లకు గురువారం రాత్రి భారత అధికారులు పసందైన విందు ఇచ్చారు. శాసీ్త్రయ సంగీతమైన కథక్‌, పంజాబీ జానపద నృత్యాలతో కళాకారులు అలరించారు. వీనుల విందైన హిందీ పాటలూ వినిపించారు. సూఫీ సంగీతంతో పాక్‌ అధికారులను మైమరిపింప చేశారు.
First Published:  10 Sep 2015 9:18 PM GMT
Next Story