Telugu Global
Family

పరిచయంలేని స్నేహితులు (Devotional)

ఒక గ్రామంలో పేదవాడు ఉండేవాడు.  అతనికి ఉన్న ఆస్తి అంతా ఒక గుడిసె.  అందులో అతను, అతని భార్య ఉండేవాళ్లు.  కూలి చేసుకుని బతికేవాళ్లు.  ఆ పేదవాడు ఎంతో సౌమ్యుడు. ఆశలేనివాడు.  పైగా తనకున్న దాంట్లో ఇతరులకు దానం చేశేవాడు.  ఇతర్లని ఆదుకునేవాడు.  ఒకరోజు చీకటి పడింది.  భోంచేసి భార్యాభర్తలు నిద్రకు ఉపక్రమించారు.  అంతలో ఉన్నట్లుండి ఉరుములు,మెరుపులు మొదలయ్యాయి.  వర్షం ఆరంభమయ్యింది.  అంతలో ఎవరో తలుపు తట్టారు.  ఆ పేదవాడు లేచి కూర్చుని భార్యతో ”బయట బాగా […]

ఒక గ్రామంలో పేదవాడు ఉండేవాడు. అతనికి ఉన్న ఆస్తి అంతా ఒక గుడిసె. అందులో అతను, అతని భార్య ఉండేవాళ్లు. కూలి చేసుకుని బతికేవాళ్లు. ఆ పేదవాడు ఎంతో సౌమ్యుడు. ఆశలేనివాడు. పైగా తనకున్న దాంట్లో ఇతరులకు దానం చేశేవాడు. ఇతర్లని ఆదుకునేవాడు. ఒకరోజు చీకటి పడింది. భోంచేసి భార్యాభర్తలు నిద్రకు ఉపక్రమించారు. అంతలో ఉన్నట్లుండి ఉరుములు,మెరుపులు మొదలయ్యాయి. వర్షం ఆరంభమయ్యింది. అంతలో ఎవరో తలుపు తట్టారు. ఆ పేదవాడు లేచి కూర్చుని భార్యతో ”బయట బాగా వర్షం పడుతున్నట్టుంది. ఎవరో తలుపు తడుతున్నట్లున్నారు. బహుశా పరిచయం లేని స్నేహితుడు” అన్నాడు. భర్త తత్త్వం తెలిసిన ఆమె ”ఈ గుడిసె మనిద్దరం పడుకోవడానికే సరిపోతుంది. ఇంకోకరు వస్తే ఇరుకవుతుంది” అంది.

పేదవాడు ”అలా అనకు. నీ మనసు పెద్దదయితే ఈ గుడిసె కూడా రాజ భవనంలా ఉంటుంది. నీ మనసు సంకుచితమైతే రాజభవనం కూడా గుడిసెలా ఉంటుంది. వెళ్లి తలుపు తియ్యి. వర్షంతో అతను ణికిపోతున్నాడు. మనిషిని ఆదుకోవడం మనిషి ధర్మం” అన్నాడు. ఆమె వెళ్లి తలుపు తీసింది. ముద్దగా తడిచిపోయిన ఆ వ్యక్తి లోపలికి వచ్చాడు. బట్టలు పిండుకున్నాడు. మంట రగిలిస్తే చలి కాచుకున్నాడు. మిగిలిన అన్నం పెడితే తిన్నాడు. ముగ్గురూ కూచుని మాట్లాడుకుంటూ ఉన్నారు. వర్షం కురుస్తూనే ఉంది. ఇప్పట్లో ఆగే సూచనలు కనిపించడంలేదు. అంతలో ఎవరో తలుపు తట్టారు. ఈసారి పేదవాడి భార్య ఏమీ మాట్లాడలేదు. ఆశ్రయం పొందిన వ్యక్తి ”ఇక్కడ మనం ముగ్గురమే కూచోడానికి స్థలం ఉంది. బయట ఇద్దరున్నట్లున్నారు. వాళ్లు వస్తే మనం నిల్చోవాలి. కాబట్టి తలుపు తియ్యకపోవడమే మేలు” అన్నాడు. దానికి పేదవాడు. ”అయ్యా! అలా అనకు, ఈ ఇంట్లో ప్రేమ ఉంది. కాబట్టి నీకు స్థలం దొరికింది. ఇప్పటికీ ఆ ప్రేమ అలాగే ఉంది. నువ్వు వచ్చావు కాబట్టి ప్రేమ తరిగి పోలేదు. ప్రేమ అన్నది ఇచ్చే కొద్దీ పెరిగేదే కానీ తరిగేది కాదు. పైగా వాళ్లు లోపలికి వచ్చారనుకో, మనందరం దగ్గరిగా ఇరుక్కుని కూచోవచ్చు. బాగా చలిగా ఉండడంవల్ల మనకు వెచ్చగానూ ఉంటుంది. నువ్వు తలుపు దగ్గరగా ఉన్నావు కాబట్టి వెళ్ళి తలుపు తీయి” అన్నాడు.

అతను వెళ్లి తలుపు తీశాడు. భోరున కురుస్తున్న వర్షంలో తడిచిన తక్కిన ఇద్దరూ లోపలికి వచ్చారు. తలలు తుడుచుకున్నారు. తినడానికి ఏమీ లేకున్నా ఒకరికి దగ్గరగా ఒకరు కూచోవడంవల్ల వెచ్చదనం ఏర్పడింది. పరిచయాలు ఏర్పర్చుకున్నారు. ఒకరి జీవితం గురించి ఒకరు చెప్పుకున్నారు. మాటల్లోపడి మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. కూర్చునే కునుకు తీశారు. అంతలో ఎవరో తలుపు తోస్తున్నట్టు శబ్ధం వచ్చింది. అందరికీ మెలకువ వచ్చింది. తలుపు తోస్తున్నది గాడిద. అది వర్షం బారి నుంచి తప్పించుకోవాలనుకుంది. మార్గాంతరం లేదు. ఇంటి యజమాని తప్ప అందరూ ఎట్టి పరిస్థితుల్లోనూ తలుపు తియ్యడానికి వీల్లేదన్నారు. పైగా ఆ వచ్చింది మనిషికాదు. జంతువు. పైగా గాడిద పేదవాడు ”గొప్పవాళ్ళు యింటిముందు మనం వెళ్ళి నిలబడితే వాళ్ళు మనల్ని జంతువులకన్నా హీనంగా చూస్తారు. కానీ ఇది పేదవాడి గుడిసె. దీనిముందు జంతువు నిలబడినా మనిషిలాగే చూస్తాను. కాబట్టి దయచేసి తలుపు తెరవండి” అన్నాడు. తలుపు దగ్గరున్న వ్యక్తి ‘తలుపు తెరిస్తే గాడిద లోపలికి వస్తుంది. కనీసం ఒక మనిషి బయటికి పోతే కానీ గాడదలోపలికి రాలేదు’ అన్నాడు. పేదవాడు ”ఫర్వాలేదు. అందరం కూచునే ఉన్నాం. నేను బయటకి వెళతాను. అప్పుడు గాడిద లోపలికి రాగలుగుతుంది” అన్నాడు. ప్రేమ ఉన్న హృదయముంటే అది ప్రపంచానికే ఆశ్రయమివ్వగలుగుతుంది.

– సౌభాగ్య

First Published:  4 Sep 2015 1:01 PM GMT
Next Story