Telugu Global
NEWS

ఎమ్మెల్యేల బాహాబాహీ... ఒకరికి చెంపదెబ్బ

మహబూబ్‌నగర్‌ జిల్లా సర్వసభ్య సమావేశం రణరంగంగా మారింది. అధికార, ప్రతిపక్షాల ఎమ్మెల్యేలు బాహాబాహీకి దిగారు. అచ్చంపేట టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిని చెంపదెబ్బ కొట్టారు. దీంతో సమావేశం రసాబాసగా మారింది. ప్రభుత్వం మహబూబ్‌నగర్‌ను కరువు జిల్లాగా ప్రకటించకపోవడంపై కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు జెడ్పీ సమావేశంలో ఆందోళనకు దిగారు. శుక్రవారం జిల్లా సర్వసభ్య సమావేశం జరుగుతున్న సందర్భంగా వీరంతా ప్లకార్డులు చేతపట్టి నిరసన చేపట్టారు. కేవలం టీఆర్ఎస్ సభ్యులకు మాత్రమే […]

ఎమ్మెల్యేల బాహాబాహీ... ఒకరికి చెంపదెబ్బ
X

మహబూబ్‌నగర్‌ జిల్లా సర్వసభ్య సమావేశం రణరంగంగా మారింది. అధికార, ప్రతిపక్షాల ఎమ్మెల్యేలు బాహాబాహీకి దిగారు. అచ్చంపేట టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిని చెంపదెబ్బ కొట్టారు. దీంతో సమావేశం రసాబాసగా మారింది. ప్రభుత్వం మహబూబ్‌నగర్‌ను కరువు జిల్లాగా ప్రకటించకపోవడంపై కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు జెడ్పీ సమావేశంలో ఆందోళనకు దిగారు. శుక్రవారం జిల్లా సర్వసభ్య సమావేశం జరుగుతున్న సందర్భంగా వీరంతా ప్లకార్డులు చేతపట్టి నిరసన చేపట్టారు. కేవలం టీఆర్ఎస్ సభ్యులకు మాత్రమే నిధులు మంజూరు చేస్తున్నారంటూ కాంగ్రెస్ సభ్యులు ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. ఈ క్రమంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్రవాగ్వాదం, తోపులాట జరిగింది. మాట్లాడేందుకు మైక్ ఇవ్వటం లేదని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి వాదనకు దిగారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య మాటా మాటా పెరగడంతో రామ్మోహన్ రెడ్డిపై గువ్వల బాలరాజు చెయ్యి చేసుకున్నారు. దీంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఇరు పక్షాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. వెంటనే కల్పించుకున్న పోలీసులు ఇరువర్గాలను జెడ్పీ భవన్‌ నుంచి బయటకి పంపించారు.
మైక్ అడిగితే గుండాయిజం చేస్తారా?: జానా
చిట్టెం రామ్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి ఘటన ప్రజాస్వామ్యానికే విఘాతం అని తెలంగాణ సీఎల్పీ నేత జానారెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ సర్వసభ్య సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చేయి చేసుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. మాట్లాడేందుకు మైక్ అడిగితే గుండాయిజం చేస్తారా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎమ్మెల్యేపై దాడి ఘటనను స్పీకర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ విషయంపై సీఎం కేసీఆర్ జోక్యం చేసుకోవాలని, దాడికి పాల్పడ్డ బాలరాజుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని జానారెడ్డి డిమాండ్ చేశారు.
గొడవపై మూడు కేసులు నమోదు
జెడ్పీ సమావేశంలో చోటుచేసుకున్న గోడవపై టూటౌన్ పీఎస్‌లో మూడు కేసులు నమోదయ్యాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఫిర్యాదుతో.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై 323, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గవ్వల బాలరాజు ఫిర్యాదుతో.. రామ్మోహన్ రెడ్డిపై అట్రాసిటీ, 323 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నాగర్‌కర్నూల్ జెడ్పీటీసీ మణెమ్మ ఫిర్యాదుతో.. జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్‌పై 504, 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

First Published:  4 Sep 2015 11:59 AM GMT
Next Story