Telugu Global
Family

ఆవు శాపం (For Children)

సంతాల్‌ పరగణాలల్లో గోవాలా అన్న తెగ జనం ఉన్నారు. వాళ్ళు ఆవును ఎంతో ప్రేమగా చూసుకుంటారు. దాని వెనుక ఒక కథ ఉంది. పూర్వం ఒకప్పుడు ఒక పెళ్ళి ఊరేగింపు జరుగుతోంది. పెళ్ళికొడుకు పల్లకీలో పెళ్ళికూతురు ఇంటికి వెళుతున్నాడు. వెంట బంధుమిత్రులు భారీస్థాయిలో ఉన్నారు. బాజా భజంత్రీలు మోగుతున్నాయి. అంతా ఆర్భాటంగా సాగుతోంది. ఊరుదాటి ఊరేగింపు రోడ్డుమీదకు వచ్చింది. రోడ్డు పక్కన ఒక చెరువు ఉంది. ఆ చెరువులో బురద నీళ్లలో ఒక ఆవు చిక్కుకుపోయింది. ఆ […]

సంతాల్‌ పరగణాలల్లో గోవాలా అన్న తెగ జనం ఉన్నారు. వాళ్ళు ఆవును ఎంతో ప్రేమగా చూసుకుంటారు. దాని వెనుక ఒక కథ ఉంది.

పూర్వం ఒకప్పుడు ఒక పెళ్ళి ఊరేగింపు జరుగుతోంది. పెళ్ళికొడుకు పల్లకీలో పెళ్ళికూతురు ఇంటికి వెళుతున్నాడు. వెంట బంధుమిత్రులు భారీస్థాయిలో ఉన్నారు. బాజా భజంత్రీలు మోగుతున్నాయి. అంతా ఆర్భాటంగా సాగుతోంది.

ఊరుదాటి ఊరేగింపు రోడ్డుమీదకు వచ్చింది. రోడ్డు పక్కన ఒక చెరువు ఉంది. ఆ చెరువులో బురద నీళ్లలో ఒక ఆవు చిక్కుకుపోయింది. ఆ ఆవు పెళ్ళికొడుకును చూసి నేను ఇక్కడ నీళ్ళలో ఇరుక్కుపోయాను. దయచేసి నన్ను కాపాడావంటే నీకంతా మేలు జరిగేలా చేస్తానంది. పెళ్ళికొడుకు ఇప్పుడు నేను చాలా హడావుడి పనిలో ఉన్నాను. ఇప్పుడు నేను సాయం చెయ్యలేను’ అన్నాడు.

ఆవుకు కొంచెం కోపమొచ్చింది. ‘నేను కష్టంలో ఉండే కాపాడమంటే నిర్లక్ష్యం చేస్తున్నావు. నన్ను కాదని వెళ్ళి పెళ్ళి చేసుకున్నావంటే నీ భార్య నిన్ను తాకిన మరుక్షణం నువ్వు గాడిదగా మారి పోతావు’ అని శపించింది.

ఆ దెబ్బతో దిగివచ్చిన పెళ్లికొడుకు పల్లకీనించీ దిగి వచ్చి ఆవును బురద నీళ్ళ నుంచి రక్షించాడు. ఆవు సాధు జంతువు కదా! అతన్ని చూసి ‘ఏదో కోపంలో అన్నాను. ఏమీ అనుకోకు. నీ భార్య వల్లనే నీకు మామూలు రూపం వస్తుందిలే’ అంది.

పెళ్ళి ఊరేగింపు పెళ్ళికూతురి ఇంటికి వెళ్ళింది. పెళ్లిపీటల మీద కూర్చుని తాళికడుతూ ఉంటే పెళ్ళికూతురు శరీరం తగిలి పెళ్లికొడుకు గాడిదగా మారిపోయాడు.

పెళ్ళికూతురు గాడిదగా మారినంత మాత్రాన నేను నా భర్తని వదిలిపెట్టను. ఏదో కారణం లేనిదో ఇట్లా జరగదు. ఎప్పటికయినా ఆయనకు అసలు రూపాన్ని తెప్పిస్తానని శపథం చేసి గాడిదగా మారిన భర్తతో తనపుట్టినింటికి బయలుదేరింది. దారిలో ఒక బావి దగ్గర దాహం తీర్చుకోవడానికి ఆగింది.

ఆ బావి దగ్గర రాజుగారి పొలం ఉంది. ఆ పొలంలో పనివాళ్లు పనిచేస్తున్నారు. మధ్యాహ్నమయింది. రాజు ఇంటినించీ పనిమనిషి అన్నం తీసుకొచ్చింది. ఆమె వెంట ఒక పసివాడున్నాడు. రెండేళ్ళ కుర్రాడు. ఆమె అందరికీ అన్నం వడ్డించింది. అంతలో ఏదో పెద్ద పెళ్ళి ఊరేగింపు ఆ దారంటే వచ్చింది. పనిమనిషి ఆ ఊరేగింపుని చూస్తూ బావి దగ్గర తాడును బక్కెటకు కట్టడానికి బదులు తన బిడ్డ మెడకు వేసి బావిలో దించింది. కాసేపటికి చూస్తే బిడ్డ నీళ్ళలో మునిగి చనిపోయి కనిపించాడు. ఇదంతా పెళ్లి బాజాల శబ్దంలో హడావుడిలో ఆమె గమనించలేదు. ఒక్కసారిగా తన బిడ్డ శవమై కనిపించడంతో ఆమె గొల్లుమంది. అందరూ చూస్తే ఈ విషయం తన నెత్తికే వచ్చి ప్రమాదం కలుగుతుందని భయపడి తన బిడ్డను తీసుకెళ్ళి రాజుగారి ముందు పెట్టి తను ఆహారం ఆలస్యంగా తెచ్చానన్న కోపంతో పనివాళ్ళు తన బిడ్డను చంపారని ఆరోపణ చేసింది. సాక్ష్యమెవరు? అని రాజు అడిగాడు. బావి దగ్గర ఉన్న ఒక స్త్రీ అంది. పనివాళ్ళనడిగితే మాకు ఏ పాపమూ తెలియదు. కావాలంటే బావి దగ్గర ఇదంతా చూసిన ఆవిడే సాక్ష్యమన్నాడు.

రాజు ఆమెను పిలిపించాడు. ఆమె గాడిదతో బాటు వచ్చింది. మొదట గాడిదను అనుమతించలేదు. తరువాత ఆమె గాడిద లేని పక్షంలో నేను రానంది. అందువల్ల ఆమెను అనుమతించారు.

ఆమె రాజు ముందుకు గాడిదతో వచ్చింది. రాజు గాడిదను చూసి ఆశ్చర్యపడ్డాడు. ఆమె ఆకాశంలోకి చూసి భగవంతుడా! నేను చూసినదంతా చూసినట్లు చెబుతాను. నేను సత్యం చెబితే నా భర్త గాడిద రూపాన్ని వదిలి మనిషి రూపం ధరించాలి. నేను అబద్ధం చెబితే నేను కూడా గాడిదగా మారిపోవాలి’ అంది. బావి దగ్గర తనుచూసింది చూసినట్లు పూసగుచ్చినట్లు వివరించింది.

అంతే మరుక్షణం గాడిద మనిషిగా మారిపోయింది. రాజు ఆశ్చర్యపోయి ఆమె సత్యశీలతకు ఆనందించి ఆమె భర్తకు తన ఆస్థానంలో ఉద్యోగమిచ్చాడు.

అబద్ధం చెప్పిన పనిమనిషిని నీ తప్పును ఇతర్ల మీద వేయకూడదని మందలించాడు.

– సౌభాగ్య

First Published:  2 Sep 2015 1:02 PM GMT
Next Story