Telugu Global
Family

మానవుడు " దానవుడు (Devotional)

ఒకప్పుడు ఒక చిత్రకారుడుండేవాడు. అతనెంత ప్రతిభావంతుడంటే అతను దేన్ని చూసినా యథాతదంగా చిత్రించే వాడు. అతని చిత్రాలు ఎంతో సజీవంగా ఉండేవి. అతను చిత్రకారుడేకాక ఉదాత్తమయిన ఉద్దేశాలు ఉన్నవాడు. అందర్నీ ఆనందపెట్టడమే కాదు. అందరూ మరచిపోలేని మహోన్నత చిత్రాల్ని చిత్రించాలన్నది అతని ఆశయం. అవి మనుషులకు ఉపయోగపడాలి. వాళ్ళని ఆలోచింప చెయ్యాలి అనుకునేవాడు. ఒకసారి ఆ చిత్రకారుడికి ఒక ఆలోచన వచ్చింది. ప్రపంచంలో కెల్లా ప్రశాంతమయిన వ్యక్తి రూపురేఖల్ని చిత్రించాలనుకున్నాడు. ఆ శాంతమూర్తిని ఎవరయినా చూస్తే వాళ్ల […]

ఒకప్పుడు ఒక చిత్రకారుడుండేవాడు. అతనెంత ప్రతిభావంతుడంటే అతను దేన్ని చూసినా యథాతదంగా చిత్రించే వాడు. అతని చిత్రాలు ఎంతో సజీవంగా ఉండేవి. అతను చిత్రకారుడేకాక ఉదాత్తమయిన ఉద్దేశాలు ఉన్నవాడు. అందర్నీ ఆనందపెట్టడమే కాదు. అందరూ మరచిపోలేని మహోన్నత చిత్రాల్ని చిత్రించాలన్నది అతని ఆశయం. అవి మనుషులకు ఉపయోగపడాలి. వాళ్ళని ఆలోచింప చెయ్యాలి అనుకునేవాడు. ఒకసారి ఆ చిత్రకారుడికి ఒక ఆలోచన వచ్చింది. ప్రపంచంలో కెల్లా ప్రశాంతమయిన వ్యక్తి రూపురేఖల్ని చిత్రించాలనుకున్నాడు. ఆ శాంతమూర్తిని ఎవరయినా చూస్తే వాళ్ల మనసులోని ఆందోళనలన్నీ మాయమయిపోవాలి. ఆ వదనం అంత నిర్మలంగా ఉండాలి. అతన్ని చూస్తే దైవం గుర్తు రావాలి.

అంత పవిత్రమైన రూపం కోసం అతను బయలు దేరాడు. ఎన్నో నగరాలు చూశాడు. ఎన్నో పట్టణాలకు వెళ్లాడు. లెక్కలేనన్ని గ్రామాలు తిరిగాడు. ఎక్కడా అతనికి అతను ఊహించిన నిర్మలమయిన మనిషి కనిపించలేదు. అన్నీ ఆందోళన నిండినట్లున్న ముఖాలే. ఎక్కడా నిశ్చింతగా నిర్మలంగా ఉన్న ఒక్క ముఖం కూడా కనిపించలేదు. చాలా నిరాశతో తన ప్రయత్నం విరమించుకునే దశలో అతను ఒక గ్రామం గుండా వెళుతున్నాడు. అక్కడ ఒక కుర్రాడు బీడు భూముల్లో గొర్రెల్ని కాచుకుంటూ కనిపించాడు. అతన్ని చూసి చిత్రకారుడు ఆగిపోయాడు. నిష్కపటమయిన, నిర్మలమయిన అతని వదనంలో గొప్ప దైవత్వం, తన్మయత్వం, సంతృప్తి కనిపించాయి. అన్నాళ్లూ తను వెతుకుతున్న వ్యక్తి తనకు కనిపించడం తన అదృష్టంగా భావించాడు.

ఆ కుర్రాణ్ణి తన ముందు కూచో బెట్టుకుని తదేక దీక్షతో అతని చిత్రాన్ని వేశాడు. ఆ కుర్రాడు తన బొమ్మ చూసుకుని ఎంతో ఆనందించాడు. చిత్రకారుడు ఆ కుర్రాడికి కొంత ముట్టజెప్పి తన ప్రయత్నం సఫలమయినందుకు సంతోషించాడు. దేశదేశాల్లో అతని చిత్రానికి ఎంతో పేరు వచ్చింది. ఆ చిత్రానికి ఎన్నో బహుమతులు వచ్చాయి.

కాలం ఆగదు కదా! ఇరవయ్యేళ్లు గడిచిపోయాయి. సృజనకారులకు ఏవో ఆలోచనలు వస్తూ ఉంటాయి. చిత్రకారుడికి ఈసారి ప్రపంచంలోకెల్లా క్రూరుడు,దుర్మార్గుడు అయిన వ్యక్తిని చిత్రించాలని కోరిక కలిగింది. అత్యంత దుర్మార్గుడు,దానవుడు ఎవరని వెతుక్కుంటూ బయల్దేరాడు. మంచివాళ్లని వెతకడం కష్టం. కానీ దుర్మార్గుల్ని వెదకడం కష్టం కాదు. అయితే అందరికన్నా దుర్మార్గుణ్ణి వెతకటం కష్టమే. గొప్ప దుర్మార్గుడు మన నగరంలోనే జైల్లో ఉన్నాడని అతను నరరూపరాక్షసుడని ఎంతమందిని చంపాడో, ఎన్ని దోపిడీలు చేశాడో లెక్కలేదని ఎవరో చెప్పారు. జైలు అధికారిని సంప్రదించి చిత్రకారుడు ఆ దుర్మార్గుణ్ణి చూశాడు. నల్లని కండలు తిరిగిన శరీరం, ఎర్రటి కళ్లు చూస్తూనే భయం వేసింది. అతన్ని తన ముందు కూచోబెట్టుకుని లీనమై అతని చిత్రాన్ని గీశాడు. తను గీసిన చిత్రం చూసి తనకే భయం వేసింది. అక్కడి నుంచి వెళ్లబోతుంటే ఎవరో సన్నగా ఏడుస్తున్న శబ్ధం వినిపించింది.

చూస్తే ఆ దుర్మార్గుడు, గజదొంగ రోదిస్తున్నాడు. ఆ గజదొంగ చిత్రకారుడి కాళ్లమీద పడి ”స్వామీ నన్ను గుర్తు పట్టలేదా?! ఇరవైఏళ్ల క్రితం గొర్రెలు మేపుకుంటున్న నా బొమ్మ గీశారు. ఈ ఇరవైయేళ్ళలో నేను ఎంత పతనమయ్యానో తలచుకుని కుమిలిపోతున్నాను” అని పశ్చాత్తాప పడ్డాడు. ప్రశాంత జీవితం గడిపే నేను పతనమయిపోయాను” అని పరితపించాడు.ప్రతి మనిషిలోనూ రెండు రూపాలుంటాయి. దేవుడుంటాడు. రాక్షసుడుంటాడు. మనిషిలో స్వర్గముంటుంది,నరకముంటుంది. మనిషి ఈ రెండింటి మధ్య వూగిసలాడుతూ

ఉంటాడు. ఏది ఎన్నుకోవాలన్నది మన చేతుల్లో ఉంటుంది. మనిషికి వేరుగా మంచితనం, చెడ్డతనం ఉండవు. రెండూ మనిషిలోనే ఉంటాయి. మనం దేనికి ప్రాముఖ్యమిస్తామన్న దాని మీద మన జీవితం ఆధారపడి ఉంటుంది.

– సౌభాగ్య

First Published:  2 Sep 2015 1:01 PM GMT
Next Story