Telugu Global
Family

ఆత్మభావన (Devotional)

వేదాల్లో ఆత్మభావన ఉంది. అయితే అది ఉపనిషత్తులు చెప్పిన ఆత్మభావన కాదు. మన శరీరానికి సంబంధం లేకుండా మనలో ఒక ఆత్మ ఉందని వేద ఋషులు నమ్మారు. ఈ ఆత్మ వృక్షాల నుండి, వనస్పతి నుండి, అంతరిక్షం నుండి మనకు లభిస్తుందని చెప్పారు. నిజం చెప్పాలంటే ప్రాణాన్నే ‘ఆత్మ’గా భావించారు. ఈ ఆత్మ తిరిగి పుడుతుందని మాత్రం వేద ఋషులు నమ్మలేదు. పునర్జన్మ భావన వేదంలో ఎక్కడా లేదు. మరణం తర్వాత తిరిగి పుడతాం అని వేదం […]

వేదాల్లో ఆత్మభావన ఉంది. అయితే అది ఉపనిషత్తులు చెప్పిన ఆత్మభావన కాదు. మన శరీరానికి సంబంధం లేకుండా మనలో ఒక ఆత్మ ఉందని వేద ఋషులు నమ్మారు. ఈ ఆత్మ వృక్షాల నుండి, వనస్పతి నుండి, అంతరిక్షం నుండి మనకు లభిస్తుందని చెప్పారు. నిజం చెప్పాలంటే ప్రాణాన్నే ‘ఆత్మ’గా భావించారు. ఈ ఆత్మ తిరిగి పుడుతుందని మాత్రం వేద ఋషులు నమ్మలేదు.

పునర్జన్మ భావన వేదంలో ఎక్కడా లేదు. మరణం తర్వాత తిరిగి పుడతాం అని వేదం నమ్మలేదు. కానీ, మంచి చేస్తే స్వర్గానికి, చెడు చేస్తే నరకానికి పోతామని వేద ఋషులు భావించారు. స్వర్గం ఆకాశంలో, నరకం పాతాళంలో ఉంటుందని చెప్పారు. మనం చేసిన పనులను బట్టి స్వర్గానికో, నరకానికో పోతాం. అక్కడే ఉంటాం. అంతే. తిరిగి మరలా, మరలా పుట్టం- ఇదీ వేద ఋషుల నమ్మకం.

స్వర్గం దక్కాలంటే మంచి పనులు చేయాలి. వారికి తెలిసిన మంచి పనులు యజ్ఞాలు చేయడం, దేవతలకు జంతువుల్ని బలివ్వడం, ఇవే వారు అనుకున్న మంచిపనులు.

అయితే…..ఉపనిషత్తులు వేదం చెప్పిన మంచి పనుల్ని చెడ్డపనులుగా భావించాయి.వేదం చెప్పని పునర్జన్మ భావాన్ని ప్రతిష్టించాయి. పునర్జన్మకు విపరీతమైన ప్రచారం ఇచ్చాయి కూడా.

ఇలాంటి తాత్త్విక భూమిక ఈ భారత భూభాగంపై ఉన్నప్పుడు బుద్ధుడు పుట్టాడు. బుద్ధుని కాలానికి అటు వేదం చెప్పిన యజ్ఞయాగాది కర్మకాండలూ, ఇటు ఉపనిషత్తులు ఊదరగొడుతున్న పునర్జన్మవాదాలూ- పోటీపడుతున్నాయి.

బుద్ధుని కాలానికి ఉన్న వేదాలు మూడే.

ఉపనిషత్తులూ దాదాపుగా మూడే. ఈశోపనిషత్తు, ఛాందోగ్యోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తులు. అలాగే బుద్ధుని సమకాలికాలని చెప్పే మరో రెండు ఉపనిషత్తులున్నాయి. ఐతరేయ, తైత్తరీయోపనిషత్తులు.

ఛాందోగ్యం

పునర్జన్మ భావాన్ని మొట్టమొదటిగా ప్రకటించిన ఉపనిషత్తు ఛాందోగ్యం.

”కర్మల్ని బట్టి మళ్ళీమళ్ళీ పుడతారు” అని చెప్పింది ఈ ఉపనిషత్‌.

ఛాందోగ్యంలో (5-10-7)లో ఇలా ఉంది:

”మంచి ఆచరణ కలవారు రమణీయమైన యోనిలో – బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య – యోనుల్లో పుడతారు.

చెడ్డ ఆచరణ కలవారు నీచ యోనిలో – కుక్క, పంది, ఛండాల యోనుల్లో పుడతారు”

ఈ ఉపనిషత్తులో చనిపోయాక ”ఆత్మ” ఎలా తన యాత్ర కొనసాగిస్తుందో చెప్పే వివరణ ఉంది.

ఈ యాత్ర 2 యానాలుగా ఉంది.

1. పితృయానం, 2. దేవయానం.

పితృయానంలో జీవుడు చనిపోయాక ఆత్మ తొలుత పొగలోకి వెళ్తుంది. అక్కడ నుండి రాత్రికి, రాత్రి నుండి కృష్ణపక్షానికి, అక్కడి నుండి దక్షిణాయనానికి , అటునుండి 6 మాసాలకు, ఆ తర్వాత పితృలోకం, అక్కడినుండి ఆకాశం, ఆకాశం నుండి చంద్రమండలం చేరుతుంది.

ఆ ఆత్మ గడువు తీరేదాకా అక్కడే ఉంటుంది. గడువు తీరాక తిరిగి భూలోక ప్రయాణం చేస్తుంది. తిరుగు ప్రయాణంలో …

తిరిగి ఆకాశం, అక్కడి నుండి వాయువును, వాయువు నుండి పొగకూ, పొగనుండి మేఘాలకు చేరి, వర్షంతో కలిసి భూమికి చేరుతుంది. అక్కడ వరిధాన్యంగానో, ఔషధిగానో, వనస్పతిగానో, అపరాలుగానో మారుతుంది. ఇలా వివిధ ఆహార పదార్థాల నుండి ఆత్మ తిరిగి జీవుడిగా జన్మిస్తుంది”

ఇదీ .. ఛాందోగ్యోపనిషత్‌లో ఆత్మ షటిల్‌ సర్వీస్‌.

ఆత్మ వృక్షాలు, వనస్పతులు, అంతరిక్షం నుండి వస్తుందని చెప్పిన వేద ఋషుల భావాలకు ఒక నిర్దిష్టరూపం ఈ ఉపనిషత్తు కల్పించింది. ఈ భావనే భగవద్గీతలో ”అన్నాద్భవంతి భూతానీ…” అనే శ్లోకంలో కన్పిస్తుంది.

ఇక, రెండోయాత్ర దేవయానం. ఈ యాత్ర ముక్తిపొందిన వారిది. జీవన్ముక్తులు ఈ యాత్ర కొనసాగిస్తారు. వీరిది నిష్కామకర్మ. వీరు తిరిగి మరలా పుట్టరు. వీరి ఆత్మకు మానవ జీవనం నుండి విముక్తి కల్గుతుంది.

ఛాందోగ్యం వీరి యాత్ర ఇలా కొనసాగుతుందని చెప్పింది…

”మరణించిన వారి ఆత్మ మొదటిగా కిరణాల్ని చేరుతుంది. అక్కడి నుండి పగలు, అక్కడి నుండి శుక్లపక్షం, అక్కడి నుండి ఉత్తరాయనం 6 నెలలు, అక్కడి నుండి సంవత్సరం, అక్కడి నుండి సూర్యలోకం అక్కడి నుండి చంద్రలోకం, అక్కడి నుండి విద్యుత్తుకు చేరి అక్కడ నుండి బ్రహ్మలోకం పోతుంది. అక్కడ ‘అ-మానవులు’ ఉంటారు. వారు ఈ జీవుణ్ణి బ్రహ్మ దగ్గరకు తీసుకుపోతారు. ఆత్మ అక్కడే ఉండిపోతుంది.

ఈ భావనే ఆ తర్వాత కైవల్యంగా మారింది. శైవులు శివైక్యం పొందటం, విష్ణు భక్తులు నారాయణ పథం చేరడం (వైకుంఠానికి పోవడం) జైనులు, బౌద్ధులు నిర్వాణం పొందడం- ఇలా విభిన్న పద్ధతులుగా వ్యక్తం అయ్యింది.

అయితే, ఛాందోగ్యంలో గమనించాల్సిన విషయం ఒకటుంది. ముక్తి పొందిన ఆత్మ- వేదాల్లో సూపర్‌ పవర్‌గా ఉన్న ఇంద్రలోకం పోలేదు. కొత్తగా రూపొందిన బ్రహ్మలోకం వెళ్ళింది. ఇది వేదాన్ని బలంగా తిరస్కరించడమే.

బృహదారణ్యకం

”జీవుడు చనిపోయాక అతని శరీరంలోని ఇంద్రియాలు తిరిగి భూతాల్లో కలిసిపోతాయి. ఆత్మ మాత్రం ఆకాశంలో కలిసిపోతుంది” – అని బృహదారణ్యకోపనిషత్‌లో వుంది.

ఈ ఉపనిషత్‌ ‘ఆత్మ’ అనేది ‘ఆకాశం’ అనే ఇంద్రియానికి సంబంధించిందిగా చెప్పింది.

అయితే, మనం ఇక్కడే ఒక విషయాన్ని గుర్తించుకుంటే బావుంటుంది.

బుద్ధుడు ఉపనిషత్తులు చెప్పిన పంచభూతాల్లో ”ఆకాశం” అనే భూతాన్ని ఒప్పుకోలేదు. అలాగే ఆకాశభూత నిర్మితిగా చెప్పిన ”ఆత్మ”నూ అంగీకరించలేదు.

ఐతరేయం

ఈ ఉపనిషత్‌ లో ”పునర్జన్మ” భావాలు ఒక కల్పనగానే కన్పిస్తాయి. దీనికి ముందున్న ఉపనిషత్తులు పునర్జన్మ గురించి ఎంతగా చెప్పినా అది ఈ ఉపనిషత్‌ కాలానికి ఈ దేశప్రజల్లో బలంగా నాటుకుపోలేదు. ఈ ఉపనిషత్‌ జన్మల్ని 3 రకాలుగా వర్గీకరించింది.-

మొదటి జన్మ: పాలలో వెన్నలా, చెరకురసంలో బెల్లంలా పురుషుని దేహంలో ”రేతస్సు”(వీర్యం) ఉంటుంది. ఇది స్త్రీ గర్భంలో పడడమే మొదటి జన్మ. గర్భధారణ ప్రక్రియ మూలం పురుషుడేే. స్త్రీ కాదు. అని చెప్తుంది ఈ ఉపనిషత్‌.

రెండవ జన్మ: స్త్రీ గర్భాశయంలో పెరిగి పెద్దయి- పుట్టడం జీవుని రెండో జన్మ.

మూడవ జన్మ: ఈ జీవుడు పెరిగి పెద్దవాడై, తండ్రిగా మారి, తిరిగి పుత్రునిగా పుట్టడం మూడో జన్మ-

ఇలా ప్రతి జీవికి తను తల్లి కడుపున పుట్టడం, భూమ్మీద పడడం, తిరిగి తను భార్యవలన బిడ్డగా పుట్టడం ఈ మూడు జన్మలూ ఒక పరంపరగా ఉంటాయి. ఇలా ఈ లోకం ‘సంతానం’ రూపంలో తెంపు లేకుండా ఉంటుంది. – అంటుంది ఈ ఉపనిషత్‌. ఈ భావాలు బౌద్ధంలోని ప్రతీత్య సముత్పాదానికి నకలే.

ఇక ఆ తర్వాత ఉపనిషత్తుల్లో ‘ఆత్మ’ భావాలు ఎన్నెన్ని ఉన్నా అవన్నీ బుద్ధుని తర్వాత కాలానివే. దాదాపుగా ఇదే కాలంలో కొందరు స్వతంత్ర దార్శనికులు ఉన్నారు. వారు కూడా ‘ఆత్మ’ ‘దేవుడు’ ‘పునర్జన్మ’ మీద తమ తమ అభిప్రాయాలు చెప్పారు. వాటినీ చూద్దాం-

చార్వాకుడు: ‘భగవంతుడు లేడు. ఆత్మలేదు. పునర్జన్మలేదు. పరలోకం లేదు.’ అని చెప్పాడు.

అజితకేశకంబళి: పరలోకం లేదు. మూర్ఖుడైనా, పండితుడైనా చనిపోగానే ఉచ్ఛిన్నుడవుతాడు.

మక్కలిగోశాలి: ”జీవుల పాపపుణ్య కర్మలు ముందే నిర్ణయించబడతాయి. ప్రత్యేక పూజల వల్ల, శీలం వల్ల, దానం వల్ల అవి మారవు. ఆరు జన్మల వరకూ జీవులు సుఖదుఃఖాలు అనుభవించాల్సిందే.

ప్రకృథ కాత్యాయన్‌: ప్రతి వస్తువూ అచలమైంది. నిత్యమైంది. ఏ కర్మా దాని మూలాన్ని మార్చలేదు. (అంటే కర్మ ప్రభావం వస్తువు మీద పడదు) కాబట్టి పాపపుణ్యాలు అంటవు.

పూరణ కశ్యపుడు: ‘ఎంత మంచిపని చేసినా పుణ్యం రాదు. ఎంతచెడ్డ పనిచేసినా పాపం అంటదు’- అంటాడు. ఆయన అక్రియతావాది. అహేతువాది. అ ప్రత్యయవాది. అంటే కార్యకారణవాదాన్ని ఒప్పుకోడు. అసత్తు నుండి (లేని దాన్నుండి) సత్‌ (ఉన్నది) ఉత్పత్తి అవుతుంది అంటారు. ఈయన వాదాన్ని ‘అదిత్య సముత్పాదం’ అంటారు.

జైనం: జైనంలో జీవం అంటేనే ఆత్మ.

ఈ ఆత్మ లేదా జీవం జీవుల శరీరం ఎంత పరిమాణంలో ఉంటే అంత పరిమాణంలో ఉంటుంది. చీమ ఆత్మ చీమంత, ఏనుగు ఆత్మ ఏనుగంత ఉంటుంది.

ఆత్మకూడా శరీరంతోపాటు పెరుగుతూ, తరుగుతూ ఉంటుంది. ఆత్మ సర్వవ్యాప్తి కాదు. అలాగని అణువూ కాదు. అలాగే ముక్తివాదాన్ని జైనం అంగీకరించింది. ఈ ప్రపంచంలో ఇప్పటి వరకూ ఒకటీ రెండు ‘జీవుల గుంపులు’ మాత్రమే ముక్తిపొందాయి. ఇంకా లెక్కలేనన్ని జీవగుంపులు ఉన్నాయి. జీవులన్నీ ముక్తి పొందేస్థితి, ఈ సంసారం విచ్ఛిన్నం అయ్యే స్థితి మాత్రం ఎప్పటికీ రాదు.

జీవుల్లో కర్మ ప్రవహిస్తుంది. కర్మ క్షయమే మోక్షం.- అయితే, ఆత్మ విషయంలో వీరు తేల్చి చెప్పరు. ”కావొచ్చు” ”అయ్యుండొచ్చు” అని చెప్తారు. ఇలా చెప్పడాన్ని స్యాత్‌ (కావొచ్చు) అంటారు. కాబట్టి దీన్ని ‘స్యాద్వాదం’ అంటారు.

‘ఆత్మ ఉండొచ్చు. ఆత్మ లేకపోవొచ్చు. ఆత్మ ఇదని చెప్పలేనిది కావొచ్చు…’ అని మహావీరుడు చెప్పాడు.

ఇవీ, బుద్ధుని కాలం వరకూ ఉన్న దైవ, ఆత్మ, పునర్జన్మ భావాలు.

ఇవి నిజాలైనా కాకపోయినా, సత్యాలైనా కాకపోయినా మానవ విజ్ఞాన ప్రవాహంలో ఇవన్నీ మైలురాళ్ళే. తీసిపారేయాల్సినవి కావు. ప్రపంచంలో ఈనాటికీ ఈ భావాలన్నీ ఉన్నాయి. ఇంకా బ్రతికే ఉన్నాయి. అక్కడక్కడా కొద్దిగా రూపుమార్చుకున్నాయి తప్ప, దాదాపుగా అన్ని ధోరణులూ ఏదొక ప్రాంతంలో, ఏదొక జాతిలో బ్రతికే ఉన్నాయి.

ఇవి మైలురాళ్ళని ఎందుకన్నానంటే… ఒక్కసారి చిన్నతనంలో ‘ఆవు-పెద్దపులి’ పాఠంలోని ఒక పద్యం గుర్తుకు తెచ్చుకుంటే ఈ విషయం తేలిగ్గా అర్థం అవుతుంది.

”నుతజల పూరితంబులగు నూతులు నూరిటికంటే…” అనే పద్యాన్ని చూద్దాం. దాని అర్థం ఇది…..

వంద మంచినీటి కయ్యలకంటే ఒక బావిమేలు.
వంద బావులకంటే ఒక్క జలాశయం మేలు
వంద జలాశయాల కంటే ఒక్క క్రతువు మేలు
వంద క్రతువుల కంటే ఒక్క కొడుకు మేలు
వందమంది కొడుకుల కంటే ఒక సత్యవాక్యం మేలు…”

అలాగే…

జనన మరణాల గురించి పట్టించుకోని ఇతర జీవప్రపంచం కంటే …
జననమరణాల ప్రాధాన్యతను గురించి మానవులకు తొలిగా కలిగిన భావనలు వందరెట్లు మేలు.
దానికంటే …మరణానంతర సంస్కారాలు సాగించడం వందరెట్ల మేలైన ఆలోచన.
ఈ ఆలోచనే మరణానంతర జీవితం గురించి ఆలోచించడానికి పునాది అయ్యింది కాబట్టి.. దేవుడు, దైవలోక భావనలు వందరెట్లు మేలు.
ఈ దైవభావనలో మానవ సమాజ జీవనానికీ, సామాజిక నియమాలకూ సంబంధించిన మంచి-చెడులకు ముడిపెట్టి ”స్వర్గ-నరకాలు” భావన చేయడం ఇంకా మేలైన ఆలోచనే. ఈ మంచి చెడులతో తిరిగి మరలా, మరలా పుడతాం అనే ఆలోచన ఇంకాస్తమేలు.
ఇలా తిరిగి పుట్టేది ఒకటుందనీ, అదే ”ఆత్మ” అని ఆలోచించడం, ఈ ఆలోచన దేవుడనే వ్యక్తినుండి బైటపడేసిన ఒక ”స్థితి”భావన కాబట్టి ఇది మరింత మేలు.ఆత్మభావన నుండి పుట్టిన పదార్థభావన (పంచభూతాలు) వందరెట్లు మేలు.
పదార్థ భావన నుండి పుట్టిన కార్యకారణ వాదం వందరెట్లు మేలు.
ఈ కార్యకారణవాదం నుండి పుట్టిన ‘ప్రతీత్య సముత్పాదం’ మరో వందరెట్లు మేలు. ఇలా ప్రతి భావనా దాని తర్వాతవచ్చే మరింత మెరుగైన భావనకు దారి తీసింది. ఈ దైవ, ఆత్మ, అనాత్మ, ప్రతీత్య సముత్పాద భావాలు కూడా ఒక దాన్నుండి ఒకటి వచ్చినవే. అవీ ప్రతీత్యసముత్పాదాలే. ”సర్వం ప్రతీత్య సముత్పాదాలే” – కావడమే బౌద్ధం విశిష్టత.

– బొర్రా గోవర్థన్‌

First Published:  30 Aug 2015 1:01 PM GMT
Next Story