Telugu Global
Family

మరణం తర్వాత (Devotional)

‘మరణం’ మతానికి పునాది. అలాగే మతం ‘దైవా’నికి పునాది. మనం ఈనాడు చెప్పుకునే ఆత్మ-పరమాత్మల గొడవలేవీ, పునర్జన్మల ప్రహసనాలేవీ ఆదిమానవులకి తెలియదు… మనిషి వస్తువుల్ని ఉత్పత్తి చేసినప్పటినుండీ- ఈ మనిషినీ, ఈ జీవుల్నీ ఉత్పత్తి చేసేవాడు ఒకడుండాలి గదా! అనుకున్నాడు. అలా పుట్టినవాళ్ళే దేవతలు. మనిషికి ఆటవిక, అనాగరిక దశల్లోనే మరణానికి చెందిన సంస్కారాలున్నాయి. మరణభయం మనిషి ఒక్కడిదే కాదు. జీవులన్నింటిదీ. అయితే ఏయే జీవులకు మరణానంతర సంస్కారాలున్నాయో మనకి తెలియదు. ఒక చీమ చనిపోతే చీమలన్నీ […]

‘మరణం’ మతానికి పునాది. అలాగే మతం ‘దైవా’నికి పునాది.

మనం ఈనాడు చెప్పుకునే ఆత్మ-పరమాత్మల గొడవలేవీ, పునర్జన్మల ప్రహసనాలేవీ ఆదిమానవులకి తెలియదు…

మనిషి వస్తువుల్ని ఉత్పత్తి చేసినప్పటినుండీ- ఈ మనిషినీ, ఈ జీవుల్నీ ఉత్పత్తి చేసేవాడు ఒకడుండాలి గదా! అనుకున్నాడు. అలా పుట్టినవాళ్ళే దేవతలు.

మనిషికి ఆటవిక, అనాగరిక దశల్లోనే మరణానికి చెందిన సంస్కారాలున్నాయి. మరణభయం మనిషి ఒక్కడిదే కాదు. జీవులన్నింటిదీ. అయితే ఏయే జీవులకు మరణానంతర సంస్కారాలున్నాయో మనకి తెలియదు. ఒక చీమ చనిపోతే చీమలన్నీ దాని చుట్టూ చేరతాయి. దాన్ని ఎక్కడికో లాక్కుపోతాయి. ఒక కుక్క చనిపోతే కుక్కలన్నీ బాధగా మోరలెత్తి కూస్తాయి.

ఒక పశువు చనిపోతే.. దాని కళేబరాన్ని చూసి మిగతా పశువులు వింతగా భయంగా ప్రవర్తిస్తాయి. నాకు తెలిసినంత వరకూ… చీమలకు సమష్టి జీవనం ఉంది. కాబట్టి వాటికి కొద్దిపాటి మరణ సంస్కారాలుండొచ్చు.

ఇకపోతే… ఆటవిక, అనాగరక దశలోని మానవులకి కూడా శవ సంస్కారాలున్నాయి. శవాన్ని రాళ్ళతో కప్పివేయడం, శవంతోపాటు కొంత ఆహార పదార్థాల్ని ఉంచడం, కొన్ని రంగులు చల్లడం, ఆకులు కప్పడం- ఇలాంటివి ఎన్నో పురాతన ఆధారాలు దొరికాయి. అప్పటికి దేవుడు ఉన్నాడో లేడో తెలియదు. కానీ.. మరణ సంస్కారాలున్నాయి. అంటే మతం ఉంది. ఆ తర్వాత దేవుడు పుట్టాడు. మనకు తెలిసినంత వరకూ వేదాలు పురాతన ఆధారాలు కాబట్టి వేదకాలంలో దేవుళ్ళ తీరుతెన్నులు చూద్దాం.

ఈ దేవుళ్ళ తీరు తెన్నులు వేదంలో ఐదు దశలుగా కన్పిస్తాయి.
1. నానా దేవతలు ఉన్నదశ మొదటిది. ఈ దశలో దేవతల్లో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అనే భావం లేదు.
2. ఏ దేవతను స్తుతిస్తుంటే ఆ దేవతే గొప్పదని చెప్పడం రెండోదశ.
3. దేవతల్ని వారి వారి స్వభావాల్ని బట్టి వేరుచేసి చూపడం మూడోదశ.
4. ఈ దేవతలంతా ఏదో ఒక పెద్దదేవుని అదుపాజ్ఞల్లో ఉండడం నాలుగోదశ. వేదంలో ఈ పెద్దదేవుడు ‘ఇంద్రుడు’.
5. ఇంతమంది దేవతలు లేరు. ఉన్నది ఒక్కడే. దేవుడు ఒక్కడే. ఇంద్రుడనీ, వరుణుడనీ, వాయువనీ… రకరకాల పేర్లతో పిలుస్తాము. అని చెప్పడం ఐదోదశ.

ఈ ఐదు దశల్నీ పరిశీలిస్తే… ఇందులో మానవ సమాజ పరిణామ వికాసం కన్పిస్తుంది. మొదటిదశలో మానవ సమాజంలోని మొదటిదశ, ఆదిమ కమ్యూనిజం దశ కన్పిస్తుంది. అలాగే.. మిగిలిన దశల్లో బానిస, గణతంత్ర వ్యవస్థలు కనిపిస్తాయి. చివరి దశలో ఫ్యూడల్‌ ఏక కేంద్రరాజ్య వ్యవస్థ కనిపిస్తుంది. సమాజ క్రమానికి అనుగుణంగానే దేవుళ్ళు కూడా తమ రూపురేఖలూ, స్థానవిలువలూ మార్చుకున్నారు.

అయితే.. ఇదంతా దేవుడు ఒక వ్యక్తిగా ఉన్నాడనేది.. దైవభావం.

కానీ.. ప్రకృతి, ప్రపంచ పరిశీలన మనిషిని ముందుకు నడిపించింది. దైవభావం నుండి పదార్థవాదానికి మనిషి భావనలు మారాయి. ఈ పదార్థవాద బీజాలు కూడా కనిపించీ, కనిపించకుండా వేదాల్లోనే పడ్డాయి.

ఋగ్వేదం నాసదీయ సూక్తంలో ఇలా ఉంది…

”ఈ విశ్వానికి మూలం ఏది?”

”ఈ సృష్టి ఎలా జరిగింది?”… అని.

ఈ ప్రశ్నల్లో ”ఈ విశ్వానికి మూలం ఎవరు?”, ”ఈ సృష్టిని ఎవరు చేశారు?” – అని లేదు. ”ఏది?”, ”ఎలా జరిగింది?” అనే ఉంది. ప్రశ్న శాస్త్రీయం కాబట్టి జవాబూ శాస్త్రీయం వైపే ఉంటుంది. ఈ ప్రశ్నలకి జవాబులే ఉపనిషత్తులు. ”దేవుడు” అనే వ్యక్తి లేడంటూనే ”ఆత్మ” అనే భావానికి పెద్దపీటలు వేశాయి ఉపనిషత్తులు. అయితే.. ఈ ఆత్మభావం.. పదార్థవాదంగా మళ్ళకుండా.. మరింత స్థిరమైన దైవభావాన్నే పాదుకొల్పాయి.

– బొర్రా గోవర్థన్‌

First Published:  29 Aug 2015 1:01 PM GMT
Next Story