Telugu Global
Others

గన్నవరం రైతులపై కన్నేసిన ప్రభుత్వం!

రాజధానికి భూసేకరణకు వెనక్కి తగ్గిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇపుడు గన్నవరం విమానాశ్రయం వైపు దృష్టి మరల్చింది. మెజార్టీ రైతుల అభిప్రాయాలకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం గన్నవరం విమానాశ్రయ భూసమీకరణకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయంతో రైతుల్లో అలజడి రేగింది. విమానాశ్రయ విస్తరణకు 750 ఎకరాలు అవసరమని అంచనా వేశారు. కృష్ణాజిల్లా గన్నవరం మండలం దావాజిగూడెం గ్రామం సమీపంలో 100 ఎకరాలు, బుద్దవరం సమీపంలో 280, కేసరపల్లి సమీపంలో 240, అల్లాపురంలో 130 ఎకరాలు […]

గన్నవరం రైతులపై కన్నేసిన ప్రభుత్వం!
X
రాజధానికి భూసేకరణకు వెనక్కి తగ్గిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇపుడు గన్నవరం విమానాశ్రయం వైపు దృష్టి మరల్చింది. మెజార్టీ రైతుల అభిప్రాయాలకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం గన్నవరం విమానాశ్రయ భూసమీకరణకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయంతో రైతుల్లో అలజడి రేగింది. విమానాశ్రయ విస్తరణకు 750 ఎకరాలు అవసరమని అంచనా వేశారు. కృష్ణాజిల్లా గన్నవరం మండలం దావాజిగూడెం గ్రామం సమీపంలో 100 ఎకరాలు, బుద్దవరం సమీపంలో 280, కేసరపల్లి సమీపంలో 240, అల్లాపురంలో 130 ఎకరాలు సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈనాలుగు గ్రామాల్లో మొదటి విడతగా 480 ఎకరాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. బోయింగ్‌ విమానాలు దిగేందుకు వీలుగా రన్‌వేను 3,216 మీటర్ల పొడవున విస్తరించాల్సిన అవసరం ఉంది. కార్‌ పార్కింగ్‌ జోన్‌ కింద 104 ఎకరాలు, టెర్మినల్‌ భవనానికి వెళ్లే రహదారి కోసం 20 ఎకరాలు ఇతర అవసరాలకు వీలుగా భూమిని వినియోగించనున్నారు. ప్రస్తుతం రన్‌వే పొడవు 1,745 మీటర్లు, వెడల్పు 45 మీటర్లు ఉంది. విమానాశ్రయంలో ఇప్పటికీ ఖాళీగా 350 ఎకరాల భూమి ఉంది. దీనిలో సుబాబుల్‌ పెంచుతున్నారు. ఆ భూములను అభివృద్ధి చేయకుండా కొత్తగా సమీకరణకు దిగడం సరికాదని రైతులంటున్నారు. రెవెన్యూ అధికారులు మాత్రం రైతులపై ఒత్తిడిని తీవ్రం చేశారు. దీంతో 180 ఎకరాలకే రైతులు అంగీకార పత్రాలు ఇచ్చారు. ఎక్కువగా భూములు కోల్పోయే చిన్న, సన్నకారు రైతులు తమకు మార్కెట్‌ రేటు ప్రకారం గరిష్టంగా నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు విమానాశ్రయ విస్తరణలో 184 ఇళ్లు కూడా పోతున్నాయి. వీరికి ప్రత్యామ్నాయం గురించి అధికారులు నోరు మెదపడం లేదు. ప్రజాప్రతినిధుల మాటలు నమ్మిన రైతులకు నష్టం కలిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
First Published:  28 Aug 2015 11:46 PM GMT
Next Story