Telugu Global
Family

'సంతాన'మే పునర్భవం (Devotional)

తల్లికిగానీ, తండ్రికి గానీ, బిడ్డలే ‘పునర్జన్మ’లు. అంటే తాను ఉండగానే తిరిగి ‘జన్మించడం’ అనేది జీవుల ప్రధాన లక్షణం. మనం సైన్సుపాఠాల్లో చదువుతాం. జీవులకూ-నిర్జీవులకూ తేడా ఏమిటి? అని. జీవులు తమలాంటి సంతానాన్ని ఉత్పత్తి చేస్తాయి. నిర్జీవులు చేయలేవు. అంటే… ఒకజీవి తను బ్రతికుండగానే పునర్జన్మిస్తుంది. ఇక్కడ పునర్జన్మ అంటే ఆత్మ, శరీరం కాదు. ఒక జీవి నుండి మరో జీవి రావడం. అయితే ఈ ‘జన్మ’కు కారణం ఒకటి కాదు. ఒకరిది కాదు. బౌద్ధం చెప్పినట్లు […]

తల్లికిగానీ, తండ్రికి గానీ, బిడ్డలే ‘పునర్జన్మ’లు. అంటే తాను ఉండగానే తిరిగి ‘జన్మించడం’ అనేది జీవుల ప్రధాన లక్షణం. మనం సైన్సుపాఠాల్లో చదువుతాం. జీవులకూ-నిర్జీవులకూ తేడా ఏమిటి? అని. జీవులు తమలాంటి సంతానాన్ని ఉత్పత్తి చేస్తాయి. నిర్జీవులు చేయలేవు.

అంటే… ఒకజీవి తను బ్రతికుండగానే పునర్జన్మిస్తుంది. ఇక్కడ పునర్జన్మ అంటే ఆత్మ, శరీరం కాదు. ఒక జీవి నుండి మరో జీవి రావడం. అయితే ఈ ‘జన్మ’కు కారణం ఒకటి కాదు. ఒకరిది కాదు. బౌద్ధం చెప్పినట్లు ఎన్నో కారణాలు ఉంటాయి. ఇది ఓ కారణసమూహం.

ఒక వ్యక్తి జన్మకి అతని తల్లిదండ్రులు అతిదగ్గరి కారణాలు మాత్రమే. ఆ తల్లికి ఆమె తల్లిదండ్రులు, ఆ తండ్రికి అతని తల్లిదండ్రులు- మరలా ఆ తాతలకు తాతముత్తాతలు… ఆ ముత్తాతలకు ముదిముది తాతలు, తాతమ్మలు, నానమ్మలు, అమ్మమ్మలు- ఇలా ఎందరో కారణం-

ఈ కారణాల్ని ఇలా పెంచుకుంటూ పోతే ఇది కొండవీటి చాంతాడుని మించి పోతుంది. మనిషి, నరవానరం, వానరం, క్షీరదాలు, పక్షులు, ఇలా ఇలా… వెనక్కి వెనక్కిపోయి ఏకకణ జీవుల దగ్గర ఆగుతుంది.

అంటే… ఇన్ని కోట్ల సంవత్సరాల జీవపరిణామమంతా మనలోనే ఉంటుంది. మన జన్మకు మన తల్లో, తండ్రో మాత్రమే కారణం కాదు. ఈ భూమ్మీది మొదటిగా పుట్టిన అమీబా కూడా కారణమే. అమీబాల కంటే ముందున్న కొయిసర్వేట్లు (ప్రాథమిక జీవాణువులు) కూడా కారణమే. అనంత జీవపరిణామమంతా మనలో ప్రతి ఒక్కరిలో ఉంటుంది. మనం తొలిక్షణంలో తల్లి అండం లో, తండ్రి శుక్ర కణంలో సగం క్రోమోజోములే ఉన్న రెండు అసంపూర్ణ కణాలుగా ఉంటాం. ఆ తర్వాత తల్లికడుపులో ఏకకణ జీవిగా బ్రతుకు ప్రారంభిస్తాం. బహుకణ జీవిగా, చేపగా, కప్పగా, తాబేలుగా, పక్షిగా, చివరికి కోతిగా… ఈ అన్ని అవతారాలూ తల్లి కడుపులో ఎత్తేస్తాం. ఈ అవతారాలన్నీ దాటి, చివరికి మానవాకారంలో తల్లికడుపు నుండిి బైటకు వచ్చేస్తాం. ఇదంతా ఈనాడు ఆధునిక విజ్ఞానం ఋజువు చేసింది.

ఇదంతా ఎందుకంటే ”పునర్భవం” అంటే ఇదే. మనం అమీబాలమో, కోతులమో కాము. కానీ, మన ప్రయాణంలో ఆ దశలు కూడా మనకు ఉన్నాయి.- ఇన్ని దశల ఈ అనుభవసారమంతా మన డి.ఎన్‌.ఎ. లో పదిల పరచి ఉంది. మన తాతముత్తాతల ఆకారాలు, అనుభవాలు, విజ్ఞానం అంతా ఈ డిఎన్‌ఎ లో పదిలంగా నిక్షిప్తమై ఉంది. ప్రతి జీవికి పుట్టగానే వచ్చే ‘సహజాత’ లక్షణాలు ఇవే. ఇలానే వస్తాయి.

ఈనాటి డి.ఎన్‌.ఎ. ను విశ్లేషించుకుంటే బౌద్ధుల విచ్ఛిన్నప్రవాహం అంటే ఏమిటో చక్కగా అర్థమవుతుంది. నేను మీకు మరోసారి గుర్తుచేసే విషయం ఏమంటే.. ఈ డి.ఎన్‌.ఎ. పరిశోధన బుద్ధుడు చేయలేదు. బౌద్ధం చెప్పలేదు. బౌద్ధం ప్రతీత్యసముత్పాదం అంటే ఏమిటో చెప్పింది. ఈ విశ్వ నిర్మాణ రహస్యపేటికను విప్పిన తొలి శాస్త్రీయ పరిశీలన అది. ఆ పరిశీలన శాస్త్రీయం కాబట్టి, ఈ విశ్వంలో ఏ పదార్థమైనా, ఏ స్థితిలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా- ఆ విశ్వ ధర్మానికి భిన్నంగా ఉండలేదు. ఉండి మనలేదు.

కాబట్టి ‘శక్తి-పదార్థాల’ రచనలో ఐన్‌స్టీన్‌ ప్రతిపాదించిన జుొఎష2 కు ఎంత ప్రాధాన్యత ఉందో.. మొత్తం మానవ విజ్ఞాన శాస్త్రాలన్నింటిలో బౌద్ధం చెప్పిన ప్రతీత్యసముత్పాద సిద్ధాంతానికి అంతకంటే ఎక్కువ ప్రాధాన్యతే ఉంది. సర్వశాస్త్ర ప్రమాణాలన్నీ దానిలో ఒదిగి పోవాల్సిందే. అది విశ్వ విజ్ఞాన శాస్త్రమైనా, మనో విజ్ఞాన శాస్త్రమైనా, సామాజిక ఆర్థిక శాస్త్రాలైనా సరే. సరే, అసలు విషయాని కొద్దాం. ఒక జీవి పుట్టుక ఆ జీవి స్వంతానిది కాదు. ఆ పుట్టుక వెనుక ఎన్నో జీవుల, ఎన్నో వేల సంవత్సరాల పరిణామం ఉంది. అందుకే దీన్ని మహాకవి శ్రీశ్రీ ఒకే ముక్కలో తేల్చేశాడు.

”వేలవేల వత్సరాల కేళిలో మానవుడుదయించిన శుభవేళలో…” అని. అంటే మన పుట్టుక మన వ్యక్తిగతం కాదు. మనలో ఉన్న పదార్థం, చైతన్యం (వైదిక సంప్రదాయం ప్రకారం ఆత్మ, శరీరం) ఏవీ మన వ్యక్తిగతం కాదు. మన స్వార్జితం అంతకంటే కాదు. అదంతా సమాజానిదే. సమస్త జీవ కోటిదే. ఈ అనంత జీవ కోటిలో మనమూ అంతర్భాగాలం మాత్రమే. కాబట్టి సమస్త ప్రాణి కోటి శ్రేయస్సే మన శ్రేయస్సు.

”బహుజన హితాయ

బహుజన సుఖాయ

లోకానుకంపాయ ”- అని బౌద్ధం గట్టిగా చెప్పింది ఇందుకే. జీవకారుణ్యం, భూతదయ గురించి బుద్ధుడు బోధించిందీ ఇందుకే. ఈనాడు ఆధునికులు ‘పర్యావరణ పరిరక్షణ’ అని నెత్తీనోరూ కొట్టుకుంటుందీ ఇందుకే- ఈ విశ్వరచన ఓ విచ్ఛిన్న ప్రవాహం. ఓ ప్రతీత్యసముత్పాదం.

ఒక జీవి బ్రతికుండగానే పునర్భవం పొందుతుంది. అది సంతానరూపంలో.

ఈ సంతాన ప్రక్రియ పెద్ద ప్రక్రియ. ఈ ప్రక్రియలో తల్లిదండ్రులు తిరిగి పుడతారు. అంటే పునర్భవం పదార్థం నశించాకో, మనం మామూలుగా మాట్లాడుకునే మాట ‘చచ్చాకో’ కాదు. బ్రతికుండగానే. ఒకజీవి బ్రతికి ఉండగానే పునర్భవిస్తుంది. మనకు బిడ్డలు, మనుమలు, ముదిమనుమలు లుగుతారు. అలాగే.. మరణం కూడా.. తను బ్రతికుండగానే మరణిస్తూ ఉంటుంది. తలిదండ్రులు, తాతముత్తాతలూ మన ముందే మరణిస్తారు. అసలు జననమరణాలు ప్రతిక్షణం ఆ జీవి దేహంలోనే పరంపరలుగా సాగుతూనే ఉంటాయి. ఈ జనన మరణాల ప్రవాహమే ”బ్రతకడం”.

ఇంతకీ చివరిగా చెప్పేదేమంటే ‘సంతానం’ అంటే తల్లిదండ్రులు ‘చచ్చాక’ కలిగే పునర్జన్మ కాదు. తల్లిదండ్రులు జీవించి ఉండగానే కలిగే ఓ పరిణామ ప్రవాహం. అందుకే బుద్ధుడు ప్రతీత్య సముత్పాదాన్ని ‘సంతాన’ అన్నాడు. ఈ సంతానం శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది.

ఈ పదం చాలా తేలిగ్గా, మామూలుగా కనిపించవచ్చు. కానీ, ‘సంతాన’ పదానికి అమరకోశం ఇచ్చిన వివరణ చూస్తే అదేమంత తేలికపదం కాదనిపిస్తుంది. ‘సంతానా’నికి విస్తరించడం అనే అర్థం ఉంది కదా! అదే ఇది.

విజ్ఞానం విస్తరిస్తూ ఉంటుంది. విశ్వపదార్థం విస్తరిస్తూ ఉంటుంది. ప్రస్తుతం మనం విస్తరిస్తున్న విశ్వంలో గడుపుతున్నాం. బిగ్‌బ్యాంగ్‌ జరిగాక విశ్వ విస్తరణ ప్రారంభమైంది. అప్పటి నుండి ఈ విస్తరణ కొనసాగుతోంది. కాబట్టి ఈ విశ్వంలో ఉన్న పదార్థాల స్వభావాలన్నీ ఈ ‘విస్తరణకు’ అనుకూలంగానే ఉంటాయి. ఉండాలి. ఉండి తీరాలి. కాబట్టే.. ఒకప్పుడు లక్షల్లో లేని మానవజాతి ఈనాడు వందలకోట్లకు చేరింది. అంటే జనాభా పెరిగింది. పెరుగుతూంది. పెరుగుతూనే ఉంటుంది.

ఈ విషయాన్ని అందరం ఒప్పుకుంటాం. కానీ, పునర్జన్మను కూడా ఒప్పుకుంటాం. ఇదే వ్యతిరేక అంశం అంటే. వైదికం ప్రకారం ఆత్మే కర్మఫలాలతో తిరిగి తిరిగి పుడుతూ ఉంటే.. జనాభా ఎప్పుడూ ఒకే సంఖ్యలో ఉండాలి. పెరక్కూడదు. తగ్గకూడదు. ఎందుకంటే ఆ ఆత్మలే ”కొత్త చొక్కాలు” తొడుక్కుంటాయి అని కదా వైదిక ఆత్మవాదం (ముఖ్యంగా భగవద్గీత) చెప్తుంది. కానీ బౌద్ధం చెప్పిన పునర్భవం అలాంటిది కాదు. అది ”సంతాన” అంటే విస్తరించేది-

బౌద్ధాన్ని మహోన్నత శాస్త్రీయ సిద్ధాంతంగా చెప్పుకోడానికి ఇంతకంటే గొప్పవిషయం కోసం వెతుక్కోనక్కరలేదు.

అందుకే… ప్రతీత్యసముత్పాదం(అనిత్యం,విఛ్ఛిన్న ప్రవాహం,సంతాన) అంటే ఒక శాస్త్రీయ సిద్ధాంతం.

– బొర్రా గోవర్థన్‌

First Published:  28 Aug 2015 1:01 PM GMT
Next Story