Telugu Global
Family

కర్మ ఎక్కడ ఉంటుంది? ఏ మవుతుంది? (Devotional)

ఇక్కడ కార్యకారణ సంబంధంలో కర్మ కీలకం అయినప్పటికీ కార్యంలో కర్మ కనిపించదు. నిజం చెప్పాలంటే కర్మ తన ఫలితాన్నే వ్యక్తీకరిస్తుంది. తానుమాత్రం కార్యం పూర్తయ్యాక కనుమరుగవుతుంది. కర్మ కారణాల నామరూపాల్ని మార్చేస్తుంది. నూతన ఫలితాన్ని ఆవిష్కరిస్తుంది. ఉదాహరణకు.. ఒక పాత్రలో బియ్యం, నీరు తీసుకొని వేడిచేస్తాం. కొంత సేపటికి పాత్రలో ప్రత్యేకంగా బియ్యం ఉండవు. నీరు ఉండదు. వేడీ ఉండదు. ‘అన్నం’ మాత్రమే ఉంటుంది. అంటే అన్నం వండటం అనే పని లేదా కర్మ కొన్ని కారణాల […]

కర్మ ఎక్కడ ఉంటుంది? ఏ మవుతుంది? (Devotional)
X

ఇక్కడ కార్యకారణ సంబంధంలో కర్మ కీలకం అయినప్పటికీ కార్యంలో కర్మ కనిపించదు. నిజం చెప్పాలంటే కర్మ తన ఫలితాన్నే వ్యక్తీకరిస్తుంది. తానుమాత్రం కార్యం పూర్తయ్యాక కనుమరుగవుతుంది. కర్మ కారణాల నామరూపాల్ని మార్చేస్తుంది. నూతన ఫలితాన్ని ఆవిష్కరిస్తుంది.

ఉదాహరణకు..

ఒక పాత్రలో బియ్యం, నీరు తీసుకొని వేడిచేస్తాం. కొంత సేపటికి పాత్రలో ప్రత్యేకంగా బియ్యం ఉండవు. నీరు ఉండదు. వేడీ ఉండదు. ‘అన్నం’ మాత్రమే ఉంటుంది. అంటే అన్నం వండటం అనే పని లేదా కర్మ కొన్ని కారణాల ద్వారా అన్నం అనే కార్యాన్ని సాధించింది. కర్మ ముగిశాక లేదా కార్యం జరిగాక ఆ పదార్థాలన్నీ కొత్త నామ, రూపాలతో పుడతాయి. వాటి నుండే పుట్టినా ఆ కొత్తగా పుట్టిన సంఘటన లక్షణం వేరు. ధర్మం వేరు. రంగూ, రూపూ వేరు. ఇదంతా ఒక ‘కర్మ’ ప్రవాహం.

కారణాల సముచ్ఛయాన్ని వియోగ, సంయోగ, సంస్కారాల ద్వారా జరిపించిన ప్రక్రియ.

ఇప్పుడు చెప్పండి.. ఈ ప్రక్రియలో కర్మ ఏమైంది? కారణాలే.. కొత్తకార్యంగా మారాయి గదా! బియ్యం, నీరు, వేడి ఇవే అన్నంగా మారాయి కదా! మరి ‘కర్మ’ ఏమైంది?

దీనికి రకరకాల సమాధానాలున్నాయి.

కొందరు: కార్యం పుట్టుకతోనే కర్మ నశిస్తుంది అన్నారు.

ఇంకొందరు: కర్మ అనేదే లేదు. అది ఒక సంకల్పం, ‘అనుకోవడం’ మాత్రమే అన్నారు.

కానీ, బౌద్ధులు ‘కర్మ నశించదు, అది మనో నిర్మాణంలో ఉండిపోతుంది’ అన్నారు. అదీ ఒక ప్రవాహమే. కర్మకూడా మారుతూ ప్రవహిస్తూ ఉంటుంది. అది ఒక అనుభవాల, ప్రభావాల ముద్ర అని చెప్పారు. అంటే కర్మ అనుభవంగా మిగిలుతుందన్నమాట.

దీన్ని ఇలా చూద్దాం.

ఒక వ్యక్తి కొత్తగా అన్నం వండటం నేర్చుకుంటున్నాడు.

మొదటిరోజు బియ్యంలో సరిపోయేంత నీరు పోయలేదు.

అయినా అన్నం తయారైంది. పొలుకు పొలుకుగా ఉంది.

ఇక్కడ ‘అన్నం’ తయారవగానే ఆ కర్మ నశించితే అతను మరో రోజుకూడా అలాగే అన్నం వండేవాడు.

కానీ, ఆ అనుభవంతో మరోసారి నీరు ఎక్కువగా పోశాడు.

అప్పుడూ అన్నం తయారైంది. కానీ చిమిడి పోయింది.

ఇప్పుడు ఈ కర్మ అతనికి మరో అనుభవాన్నిచ్చింది. ఆ అనుభవసారంతో మూడోరోజు ‘తగినంతగా’ నీరుపోశాడు. ‘అన్నం’ సరిపడా ఉడికింది. ఇలా ‘సరిగా’ అన్నం వండటానికి ఎన్నెన్నో అనుభవాలు ఉంటాయి. అవి నీటి విషయంలో కావచ్చు.. ఉష్ణోగ్రతల విషయంలో కావొచ్చు, పాత్రల విషయంలో కావచ్చు..

అంటే.. కొన్ని వందల వేల అనుభవాల సారంతో ఒక కార్యం సరిగ్గా జరిగిందన్న మాట.

దీనర్థం ఏంటి?

‘కర్మ’ పరిణామమే ‘కార్యం’ గదా! కర్మ నశించేదే అయితే, కర్మ మనోనిర్మితి లేనిదైతే, కర్మ అనుభవానికి రానిదైతే..

విశ్వనిర్మాణం లేదు..

జీవ పరిణామం లేదు..

మానవ నాగరికతా వికాసమే లేదు..

చివరికి కూడు, గూడు, గుడ్డ…ఏదీ లేదు.

అంటే కర్మ ‘అనుభవం’గా బ్రతుకుతూ ఉంటుంది.

ఆ అనుభవమే ‘కర్మ’గా మనల్ని నడుపుతూ ఉంటుంది.

– బొర్రా గోవర్థన్‌

First Published:  23 Aug 2015 1:01 PM GMT
Next Story