Telugu Global
Family

విందు (For Children)

ఒక కాశ్మీర్‌ ప్రాంత జమీందారుకు ఒక పంజాబీ వ్యక్తి మిత్రుడయ్యాడు. ఏదో సందర్భంలో వాళ్ళు కలిశారు. మాటలు కలిసాయి. అభిప్రాయాలు నచ్చాయి. ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. దాంతో కాశ్మీర్‌ ప్రాంతానికి చెందిన సంపన్నుడయిన అతను పంజాబ్‌కు చెందిన తన మిత్రుణ్ణి తన ఇంట్లో గడపడానికి ఆహ్వానించాడు. పంజాబీ సంతోషంతో ఆమోదం తెలిపాడు. ఆ సందర్భం వచ్చింది. కాశ్మీర్‌ వచ్చిన పంజాబీ ఆ చెట్లు, పర్వతాలు, ఎత్తయినా ఆ జమీందారీ భవనం, దగ్గరనే ఒక సరస్సు ఇవన్నీ చూసి […]

ఒక కాశ్మీర్‌ ప్రాంత జమీందారుకు ఒక పంజాబీ వ్యక్తి మిత్రుడయ్యాడు. ఏదో సందర్భంలో వాళ్ళు కలిశారు. మాటలు కలిసాయి. అభిప్రాయాలు నచ్చాయి. ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. దాంతో కాశ్మీర్‌ ప్రాంతానికి చెందిన సంపన్నుడయిన అతను పంజాబ్‌కు చెందిన తన మిత్రుణ్ణి తన ఇంట్లో గడపడానికి ఆహ్వానించాడు. పంజాబీ సంతోషంతో ఆమోదం తెలిపాడు.

ఆ సందర్భం వచ్చింది. కాశ్మీర్‌ వచ్చిన పంజాబీ ఆ చెట్లు, పర్వతాలు, ఎత్తయినా ఆ జమీందారీ భవనం, దగ్గరనే ఒక సరస్సు ఇవన్నీ చూసి అద్భుతలోకంలో ఉన్నట్లు అనుభూతి చెందాడు. మిత్రుని కళ్ళల్లో మెరుపును కాశ్మీరీ గ్రహించాడు. ఇంకొన్ని అద్భుతాల్ని అతనికి ప్రదర్శించాలనుకున్నాడు.

కమ్మని సంగీతంతో సాయంత్రాన్ని మృదుమధురంగా మార్చాడు. లేతగాలిలో ఉద్యానవనంలో సాయం సంధ్యలో ఇద్దరూ కూచుని మధుసేవనం చేశారు.

అదయ్యాకా డైనింగ్‌రూంలోకి వెళ్ళారు. జమీందారు “ఎవరక్కడ?” అన్నాడు గంభీరంగా. సేవకులు “జీహుజూర్‌” అంటూ తలలు వంచుకుని నమస్కరిస్తూ వచ్చారు.

భోజనాలు సిద్ధం చేయండి అని ఆజ్ఞాపించాడు.

రకరకాల వంటలు, రంగురంగుల పళ్ళు, ఫలహారాలు, తినుబండారాలు లెక్కలేనన్ని టేబుల్‌ మీదకు వచ్చాయి.

ఆరోజు అద్భుతమయిన శాకాహార వంటకాల్తో మిత్రున్ని సంతోషపెట్టాలని భావించాడు. ఆయన కనుసన్నల్లో సేవకులు మెదిలారు. చాలా నైపుణ్యంతో ఒక్కో వంటకాన్ని ఒక్కో పనివాడు వడ్డించాడు. ఎంతమోతాదులో వడ్డించాలి. ఎక్కడ వడ్డించాలి. అన్నది కూడా వాళ్ళకు తెలుసు. అందులో వాళ్ళు శిక్షణ పొందినవాళ్ళు.

ఇక మిత్రులిద్దరూ భోంచెయ్యడం ఆరంభించారు. జమీందారు. పంజాబీ మిత్రుణ్ణి గమనించాడు. తన విందుకు అతనెట్లా ఆనందిస్తున్నాడో పరిశీలించాడు. పంజాబ్‌ ప్రశాంతంగా తిన్న తరువాత విందు గురించి, వంటలు గురించి అడిగాడు. పంజాబీ ‘మిత్రమా! నీ విందు అద్భుతం! వంటలు అపూర్వం కానీ మాఇంటి వంటల్తో వీటిని పోల్చలేం’ అన్నాడు. ఆ మాటల్తో జమీందారు ఆశ్చర్యపోయాడు.

మరుసటిరోజు మరింత ఆర్భాటంతో మిత్రుని సంతోష పెట్టడానికి జమీందారు రకరకాల మాంసాలతో ఘుమఘులాడే వంటల్ని సిద్ధం చేయించాడు. పొగలు చిమ్మే వంటల్ని ఒకరి తరువాత ఒకరు వడ్డించారు. పంజాబీ ‘ఈసారికూడా వంటలు అద్భుతం, చాలారుచిగా ఉన్నాయి. కానీ మా ఇంట్లో రుచుల్ని వీటితో పోల్చలేం’ అన్నాడు.

జమిందారుకు ఆశ్చర్యం వేసింది. మరుసటి రోజే పంజాబీతో బాటు అతని గ్రామానికి బయల్దేరాడు. అతను మామూలు రైతు కుటుంబానికి చెందినవాడు. అతని తల్లి వేడివేడి రొట్టెలు. పప్పు వడ్డించి ప్రేమతో ‘తిను నాయనా!’ అని జమీందారుని బతిమలాడింది. ఇట్లా రెండ్రోజుల పాటు అదే ఆప్యాయతతో ఆమె రొట్టెలు, పప్పు పెట్టింది.

జమీందారు మూడో రోజు ‘మిత్రమా! ఇవా నా వంటలకన్నా రుచికరమైనవన్నావు!’ అన్నాడు.

పంజాబీ ‘మిత్రమా! నా వంటల్ని నీ వంటలకన్నా రుచికరంగా ఉంటాయనలేదు. వాటిని ఎంత ప్రేమగా నా తల్లి వడ్డిస్తుందో చూసి వీటితో నీ వంటకాల్ని పోల్చలేనని చెప్పాను’ అన్నాడు.

ఆ మాటల్తో జమీందారు కళ్ళు తెరుచుకున్నాయి. అనురాగానికి మించిన రుచి లేదని తెలుసుకున్నాడు.

– సౌభాగ్య

First Published:  22 Aug 2015 1:02 PM GMT
Next Story