Telugu Global
Family

బౌద్ధం చెప్పిన కర్మ అంటే.. (Devotional)

ప్రపంచ తత్త్వవేత్తల్లో ‘కర్మ’కు బుద్ధుడిచ్చినంత ప్రాధాన్యత మరే తత్త్వవేత్తా ఇవ్వలేదు. ఇతర మతాల్లో ఆధ్యాత్మిక కేంద్రం ”దేవుడు”. ఉపనిషత్తుల్లాంటి దర్శనాల్లో ఈ కేంద్రం ”పరమాత్మ”.   బౌద్ధంలో ఈ కేంద్రం ”కర్మ”. కర్మలో ఒక భాగమైన ‘శ్రమ’ను తీసుకుని కార్ల్‌మార్క్స్‌ తన సామ్యవాద సిద్ధాంతాన్నే నిర్మించాడు. ఈ విషయాన్ని చర్చించబోయేముందు అసలు ‘కర్మ’ అంటే ఏమిటో చూద్దాం. ‘కార్యవిరోధి కర్మ’ అంటుంది వైశేషికం. ఎలాగంటే… కొన్ని కారణాలు కలిసి ఒక కార్యం జరుగుతుంది గదా! విభిన్న అంటే […]

బౌద్ధం చెప్పిన కర్మ అంటే.. (Devotional)
X

ప్రపంచ తత్త్వవేత్తల్లో ‘కర్మ’కు బుద్ధుడిచ్చినంత ప్రాధాన్యత మరే తత్త్వవేత్తా ఇవ్వలేదు.

ఇతర మతాల్లో ఆధ్యాత్మిక కేంద్రం ”దేవుడు”.

ఉపనిషత్తుల్లాంటి దర్శనాల్లో ఈ కేంద్రం ”పరమాత్మ”.

బౌద్ధంలో ఈ కేంద్రం ”కర్మ”.

కర్మలో ఒక భాగమైన ‘శ్రమ’ను తీసుకుని కార్ల్‌మార్క్స్‌ తన సామ్యవాద సిద్ధాంతాన్నే నిర్మించాడు. ఈ విషయాన్ని చర్చించబోయేముందు అసలు ‘కర్మ’ అంటే ఏమిటో చూద్దాం.

‘కార్యవిరోధి కర్మ’ అంటుంది వైశేషికం.

ఎలాగంటే…

కొన్ని కారణాలు కలిసి ఒక కార్యం జరుగుతుంది గదా! విభిన్న అంటే ‘మట్టిని సేకరించే పని’ నుండి, పని పూర్తయిన వరకూ అంటే ఆవం నుండి ‘కుండ’ తీసేవరకూ.. జరిగినదంతా కర్మే. పనే. కుండ ఏర్పడ్డాక, ఇక ఆ కుండను నిర్మించడానికి అవసరమైన ఏ కారణంతో ఆ ‘కుండ’కు పనిలేదు. అంటే.. ‘కుండ’ ఏర్పడ్డంతోనే ఆ పని పూర్తయింది. అంటే ‘కర్మ’ ముగిసింది.

అందుకే దీన్ని ”కార్య విరోధి కర్మ” అంటారు.

ఇలా మొదలు కావడం, జరగడం, ముగించటం అనే మూడు రకాలుగా కర్మ ప్రక్రియ కొనసాగుతుంది.

దీన్ని తేలిగ్గా తెలుసుకోడానికి మరో ఉదాహరణ చూద్దాం.

ఒక చెట్టు మొదట్లో ఒక ‘రాయి’ ఉందనుకుందాం. ఒకడు ఆ రాతిని దూరంగా విసిరాడు. అది కొంతదూరం పోయి ఒక స్థంభం దగ్గర ఆగిపోయింది. ఇక్కడ రెండు ప్రదేశాలున్నాయి. ఒకటి చెట్టు, రెండు స్థంభం. ఈ రెండు ప్రదేశాల మధ్య రాయి తన స్థానాన్ని మార్చుకుంది.

దీన్లో చెట్టు దగ్గర ఉన్న రాయి స్థానాన్ని కర్మ ప్రకారం ‘వియోగం’ అంటారు. లేదా పూర్వకర్మ అంటారు. ఇంకా చెప్పాలంటే పాతపని అనొచ్చు. ప్రారంభం అనొచ్చు.

అలాగే.. స్థంభం దగ్గరకు చేరిన రాయి స్థానాన్ని ‘కర్మ’ ప్రకారం- సంయోగం లేదా పరకర్మ, లేదా కొత్తపని, లేదా ముగింపు అనొచ్చు. ఈ రెండు ప్రదేశాల మధ్య ఆ రాయి కదలికను ‘సంస్కారం’ అంటారు. ఇక్కడ జరిగిన పని కదలడం కాబట్టి పనిరీత్యా దీన్ని ‘వేగ సంస్కారం’ అంటారు. సాధారణ భాషలో మధ్యకాలం అంటాం.

అంటే…

కర్మ అంటే…. వియోగం, సంస్కారం, సంయోగాలు కూడినదని అర్థం. ఈ మూడు ప్రక్రియలు లేకుండా కర్మ ఉండదు.

బౌద్ధులు ‘కర్మ’కూ, ‘పని’కి తేడా ఉంది అని చెప్తారు. కర్మ మానసిక మైనదనీ, పని బాహ్యప్రపంచానికి చెందిన ప్రక్రియ అనీ వీరు అంటారు.

‘పని’ని కర్మ అని వ్యవహారంలో వాడుతూ ఉంటాం. కానీ, పనియొక్క ఫలితానే ‘కర్మ’ అనాలి.

ఉదాహరణకు ఒక పిల్లవాడు ‘అ’ అక్షరాన్ని పలకమీద దిద్దుతూ ఉంటాడు. ఇలా బలపంతో దిద్దడాన్ని కర్మ అనకూడదు. క్రియ అనే అనాలి. ఇలా దిద్దాక, ఆ దిద్దిన దాని ఫలితం ఉంటుంది చూడండి, అది ‘కర్మ’. ఆ దిద్దిన అక్షరం తాలూకు ‘భావన, గుర్తింపు’ మన మనస్సులో నిలిచిపోతుంది కదా! ఆ మనోముద్రే ‘కర్మ’.

ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే… ఒక ఇరవై ఏళ్ళ యువతి ఉందనుకోండి. ఆ అమ్మాయిని ఇద్దరు మగవాళ్ళు ముద్దు పెట్టుకున్నారు అనుకుందాం. ఒక వ్యక్తి ఆ అమ్మాయి తండ్రి, రెండో వ్యక్తి ఆ అమ్మాయి ప్రియుడు. ఇక్కడ ‘ముద్దు పెట్టుకోవడం’ అనేది క్రియ. ఆ అమ్మాయిని ముద్దు పెట్టుకున్నప్పుడు తండ్రి పొందిన అనుభూతి వేరు, ప్రియుడు పొందిన అనుభూతి వేరు. అలాగే… తండ్రి ముద్దుకు, ప్రియుని ముద్దుకు ఆమెలో కలిగే అనుభూతులు కూడా వేరు వేరే. ఈ అనుభూతులేవైతే ఉన్నాయో అవే ”కర్మ”లు.

అంటే, ఒక క్రియను మనం రాగద్వేషాల్ని ఆపాదించి చూడ్డమే ‘కర్మ’.

‘కర్మ’కు, ‘కర్మ ఫలితాల’కు బౌద్ధం ఇచ్చినంత ప్రాముఖ్యత మరే మతంగానీ, మరే తత్త్వశాస్త్రం గానీ ఇవ్వలేదు. వైదిక గ్రంథాల్లో, ఉపనిషత్తుల్లో, దర్శనాల్లో ఆయా సందర్భాల్లో ‘కర్మ’ గురించిన ప్రస్థావన ఉంది తప్ప, ‘సాంఖ్యం’, ‘న్యాయం’, ‘యోగం’ లాగా ‘కర్మ’ మీద ప్రత్యేక దర్శనం అంటూ ఏదీ లేదు. కానీ బౌద్ధ దర్శనానికి పునాదే ‘కర్మ’. బౌద్ధుల కర్మ సిద్ధాంతం పరలోకాన్నీ, దేవుణ్ణీ, ఆత్మను తీసి తుంగలో తొక్కింది. కాబట్టి, అలా తొక్కేసిన తుక్కును తీసి సరిచేయడానికి భగవద్గీతలో కర్మమీద ప్రత్యేకంగా ఒక అధ్యాయం ఇరికించాల్సి వచ్చింది. బౌద్ధుల కర్మవాదాన్నే మసిపూసి, మారేడు చేసి, దానికో కొత్త అర్థాల్ని చెప్పాల్సిన అఘాయిత్యం శంకరునికి పట్టింది!

ఏతావాతా తేల్చేదేమంటే- మనం తెలిసో తెలియకో ‘కర్మ కర్మ’ అంటూ మాట్లాడే కర్మవాదానికి పునాది బౌద్ధమే.

బౌద్ధంలో భగవంతుడు లేడు. ఆస్థానంలో ‘కర్మే’ ఉంది.

‘పని’కి భౌతికశాస్త్రం ఇచ్చే నిర్వచనం ఇది – ”రెండు అవధుల మధ్య జరిగే సంఘటన” అని. లేదా ”కొంతశక్తిని ప్రయోగించి వస్తువులో కలిగించే స్థానభ్రంశం” అనీ.

ఇంకా విశాలంగా చూస్తే.. పని అంటే రెండు కాలవ్యవధుల మధ్య జరిగే మార్పే.

అంటే.. కాలమే పని… పనే కాలం.. కాబట్టి భౌతికశాస్త్రంలో పనంటే క్రియే.

– బొర్రా గోవర్థన్‌

First Published:  22 Aug 2015 1:01 PM GMT
Next Story