Telugu Global
Family

తెలివి తక్కువ రాజు (For Children)

పూర్వకాలం కాశ్మీర్‌లో ఏ నగరానికి ఆనగరం ఒక రాజు పరిపాలనలో ఉండేది. అట్లా ఒక నగరాన్ని ఒక రాజు పాలించేవాడు. పళ్లతోటలతో, పూలతోటలతో, పంటపొలాలతో ఆ నగరం కళకళలాడేది. తమాషా ఎక్కడంటే ఆ నగరంలో ఏ వస్తువైనా ఒకేధర. బంగారం, ఉప్పు, పప్పు, ధాన్యం ఏదయినా సమానమయిన వెలకే దొరికేవి. ఒకరోజు ఆ నగరానికి ఒక సన్యాసుల గుంపు వచ్చింది. ఆ నగరంలో పరిస్థితి గమనించి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ప్రతి వస్తువూ ఒకే ధరకు దొరకడం వాళ్ళని […]

పూర్వకాలం కాశ్మీర్‌లో ఏ నగరానికి ఆనగరం ఒక రాజు పరిపాలనలో ఉండేది. అట్లా ఒక నగరాన్ని ఒక రాజు పాలించేవాడు. పళ్లతోటలతో, పూలతోటలతో, పంటపొలాలతో ఆ నగరం కళకళలాడేది.

తమాషా ఎక్కడంటే ఆ నగరంలో ఏ వస్తువైనా ఒకేధర. బంగారం, ఉప్పు, పప్పు, ధాన్యం ఏదయినా సమానమయిన వెలకే దొరికేవి. ఒకరోజు ఆ నగరానికి ఒక సన్యాసుల గుంపు వచ్చింది. ఆ నగరంలో పరిస్థితి గమనించి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ప్రతి వస్తువూ ఒకే ధరకు దొరకడం వాళ్ళని ఆకర్షించింది. సన్యాసులు ఇంత తక్కువ ధరకు అన్నీ దొరుకుతున్న ఈ నగరంలో కొన్నాళ్ళు మనం హాయిగా బస చేయవచ్చు అనుకున్నారు.

కాని ఆ సన్యాసుల గురువు ‘ఇది ఆకర్షణీయంగా అనిపించవచ్చు కానీ ఇది ప్రమాదకరమయిన విషయం. ఎందుకంటే ప్రతిదీ సమాన ధరతో దొరుకుతుందంటే ఇక్కడ విచక్షణకు అవకాశం ఉండదు. న్యాయం కూడా ఇక్కడ అతి చవకగా దొరికే వీలుంది. అట్లాగే ఎంతటి అన్యాయమయిన అవలీలగా చేసే వీలుంది. మనమిక్కడ బస చేయవద్దు. ఇంకో నగరానికి వెళ్లిపోదాం పదండి’ అన్నాడు.

ఒక శిష్యుడు మాత్రం ‘గురువుగారు నేను ఒకరోజు ఇక్కడ ఉండి వస్తాను. అనుమతించండి’ అన్నాడు. గురువు సరేనన్నాడు.

గురువు శిష్యబృందంతో పక్క నగరానికి వెళ్ళిపోయాడు. శిష్యుడు ఈ నగరంలోనే ఉండిపోయాడు.

ఆరోజు రాత్రి రాజభవనంలో దొంగతనం జరిగింది. రాజు ఆగ్రహించి ‘నగరంలో ఎవరయినా కొత్తవ్యక్తి కనిపిస్తే వెంటనే అతన్ని బంధించండి’ అన్నాడు.

సైనికులు వెతికితే శిష్యుడు కనిపించాడు. అతని మాటలు కూడా వినిపించుకోకుండా సైనికులు బంధించి రాజు ముందు హాజరు పరిచాడు.

గురువుగారి మాటలు విననందుకు తనని తనే నిందించుకుంటూ శిష్యుడు కన్నీళ్ళు పెట్టుకున్నాడు.

ఆ వ్యక్తి దొంగా, మామూలు మనిషా! ఎక్కడివాడు! ఇవన్నీ ఏమాత్రం పట్టించుకోకుండా రాజు మరుసటి రోజు ఇతనికి ఉరిశిక్ష. అదీ బహిరంగంగా ఉరిశిక్ష విధించాడు. తన జీవితం ఇంత అర్థాంతరంగా ముగిసిపోయినందుకు శిష్యుడు కుంగిపోయాడు. దైవాన్ని ప్రార్థించుకుంటూ ఆ రాత్రి చెరసాలలో గడిపాడు.

ఈ వార్త పక్క నగరంలో ఉన్న గురువుగారికి చేరింది. ఆయన బయల్దేరి శిష్యున్ణి బంధించిన చెరసాల దగ్గరికి వచ్చాడు. గురువును చూస్తూనే శిష్యుడు బావురుమన్నాడు. గురువు అతన్ని ఓదార్చి రేపు నిన్ను ఉరికంబం ఎక్కించే ముందు నేను వస్తాను. నేను రాజుతో ‘రాజుగారూ! మీరు అతన్ని ఉరితీయకండి నన్ను ఉరితీయండి’ అంటాను. నువ్వేమో వద్దు వద్దు. అతన్ని కాదు, నన్ను ఉరితీయండి అను. తక్కిన విషయం నేను నడిపిస్తాను’ అన్నాడు.

శిష్యుడు ఆశ్చర్యపోయాడు. గురువు ఇలా ఎందుకన్నాడో, దాంతో ఏం జరుగుతుందో అతనికి తోచలేదు. అయినా గురువు మీది నమ్మకంతో సరేనన్నాడు.

మరుసటిరోజు బహిరంగ ప్రదేశంలో ఉరికంబం సిద్ధం చేశారు. రాజు రథం మీద అక్కడికి వచ్చాడు. వస్తూనే గురువు రాజుగారి పాదాల మీద పడి ‘ప్రభూ! అతన్ని వదిలి దయచేసి నన్ను ఉరితీయండి’ అన్నాడు. వెంటనే శిష్యుడు ‘రాజుగారూ! ఆ పనిమాత్రం మీరు చేయకండి. నన్ను మాత్రమే ఉరితీయండి’ అన్నాడు.

ఇట్లా ఇద్దరూ పదేపదే చనిపోవడానికి ఉత్సాహం ప్రదర్శించారు.

రాజుగారికి ఇదంతా చిత్రంగా కనిపించింది. ఎవడయినా చనిపోవడానికి ఇంత ఉత్సాహం ప్రదర్శిస్తారా? మరి వీళ్ళెందుకు ఇంత ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు? అనుకున్నాడు. రాజు ‘మీరెందుకు ఇంత ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు? దీంట్లో ఏదయినా రహస్యముందా?’ అని అడిగాడు.

గురువు ‘రాజుగారూ! మీకు తెలీదా? మన పవిత్ర గ్రంధాల్లో ఈరోజు పరమ పవిత్రమయిన రోజు. ఈరోజు ఎవరయితే చనిపోతారో వాళ్ళు స్వర్గానికి వెళతారు. స్వర్గంలో వాళ్ళకి ప్రత్యేకస్థానం దొరుకుతుంది. అందుకనే మాకీ తొందర’ అన్నాడు.

రాజు ఉన్నట్లుండి జనం వేపు తిరిగి ‘ప్రజలారా! విన్నారు కదా! మన పవిత్ర గ్రంథాల్లో వున్న సంగతి బట్టి ఇది పవిత్రదినం. నేను ఎప్పట్నించో స్వర్గానికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఈ అమాయకులిద్దర్నీ వదిలి నన్ను ఉరితీయండి’ అన్నాడు.

జనానికి తమ రాజు ఎంత తెలివి తక్కువవాడో తెలుసు. ఇంతకు మించిన అవకాశం తమకు మళ్ళీ రాదని అందరూ అతన్ని ఉరితీసి పండగ చేసుకున్నారు.

– సౌభాగ్య

First Published:  19 Aug 2015 1:02 PM GMT
Next Story