Telugu Global
Family

ఆదర్శదొంగ (For Children)

అతను గజదొంగ. అతనిపేరు మహాదేవుడు. అతను ఎంత నైపుణ్యం కలిగిన దొంగ అంటే అతని ప్రావీణ్యానికి అందరూ విస్తుపోయేవారు. అతను కాశ్మీరు లోయలో అన్ని ప్రాంతాల్లో దొంగతనాలు చేశాడు. అతను అక్కడ దొంగతనాలు చేశాడని అందరికీ తెలుసు. ప్రభుత్వానికి తెలుసు, న్యాయస్థానానికి తెలుసు. రాజభటులకు తెలుసు. కానీ ఎవరూ అతనిపై ఎప్పుడూ నేరారోపణ చెయ్యలేదు. ప్రభుత్వం అతన్ని బంధించలేదు. కారణం అతను దొంగతనం చేసినట్లు ఎట్లాంటి నిరూపణలూ చెయ్యలేకపోవడమే. అతను తనమీద ఎట్లాంటి సందేహం కలగనివ్వడు. ఏ […]

అతను గజదొంగ. అతనిపేరు మహాదేవుడు. అతను ఎంత నైపుణ్యం కలిగిన దొంగ అంటే అతని ప్రావీణ్యానికి అందరూ విస్తుపోయేవారు. అతను కాశ్మీరు లోయలో అన్ని ప్రాంతాల్లో దొంగతనాలు చేశాడు. అతను అక్కడ దొంగతనాలు చేశాడని అందరికీ తెలుసు. ప్రభుత్వానికి తెలుసు, న్యాయస్థానానికి తెలుసు. రాజభటులకు తెలుసు. కానీ ఎవరూ అతనిపై ఎప్పుడూ నేరారోపణ చెయ్యలేదు. ప్రభుత్వం అతన్ని బంధించలేదు. కారణం అతను దొంగతనం చేసినట్లు ఎట్లాంటి నిరూపణలూ చెయ్యలేకపోవడమే. అతను తనమీద ఎట్లాంటి సందేహం కలగనివ్వడు. ఏ ఆధారాలు లేనప్పుడు ఆరోపణలు ఎట్లా చేస్తారు?

ఇట్లా ఎప్పుడూ అతను దొరికిపోయిన దాఖలాలు లేవు. స్వేచ్ఛగా, దర్జాగా తిరిగేవాడు.

‘మరొక ముఖ్యమయిన విషయమేమిటంటే లక్షల రూపాయల దొంగతనం చేసినా కేవలం తన కనీస అవసరాలకు సరిపోయిన డబ్బును మాత్రమే ఉంచుకునేవాడు. తక్కినదంతా పేదవాళ్ళకు పంచేవాడు. అతను ఎప్పుడూ పేదవాళ్ళ ఇళ్ళల్లో దొంగతనం చేసి ఎరగడు. కేవలం సంపన్నుల ఇళ్ళనే దోచుకునేవాడు. ఆ రకంగా అతను విలువలు కలిగిన వ్యక్తి. ఆదర్శవంతుడయిన దొంగ అనవచ్చు. దొంగలందరూ అతనంటే ఈర్ష్యపడేవారు. కారణం అతని పనితనం, నైపుణ్యం. చడీచప్పుడు లేకుండా ఎంత పెద్ద దొంగతనాన్నయినా అవలీలగా చేసే అతని ప్రతిభ వాళ్ళని ఆశ్చర్యపరిచేది.

ఒకరోజు దొంగలందరూ సమావేశమై మహాదేవుని ముందు ఒక ప్రతిపాదన చేశారు.

‘ఇది చాలా కష్టమయిన పని. అగ్నిగుండంలో దిగడంలాంటిది. దీన్ని నువ్వు నిర్వహిస్తే మేమందరం నీకు తలవంచుతాం. నీ నాయకత్వానికి లోబడి ఉంటాం. కష్టమే కానీ నీ పెద్దతనాన్ని నిరూపించుకోవాలంటే నువ్విది చెయ్యాల’ అన్నారు.

‘ఏమిటిది?’ అన్నాడు.

‘అంతఃపురంలోకి వెళ్ళి రాజుగారి పడక గదిలో ప్రవేశించి రాజుగారికి తెలియకుండా రాజుగారు వేసుకున్న పైజామా విప్పి తీసుకొస్తే నీ నాయకత్వాన్ని మేము అంగీకరిస్తాం’ అన్నారు.

మహాదేవుడు ‘ఇంత చిన్న విషయానికే మీరు ఇంత ఆందోళనపడ్డారా? ఒక వారం రోజులు సమయమివ్వండి. మీ కోరిక తీరుస్తా’నన్నాడు.

ఆరురోజుల పాటు ఆలోచించి పథకం వేశాడు. ఆరోరోజు రాత్రి ఒళ్ళంతా తైలం పట్టించి రాజభవనం కింద సాగే నీటి కాలువలోకి వెళ్ళాడు. అక్కడినించీ అంతఃపురంలో రాజు పడకగది నించీ కిందకు దిగిన నీటి పైపులోకి ఎక్కి రాజు పడకగదిలోకి వెళ్ళాడు. రాజు నిద్రపోతున్నాడు. అక్కడికి వెళ్ళి మెడలో కట్టుకొచ్చిన సీసా మూతవిప్పి అందులోని చీమల్ని రాజు పాదాల దగ్గర వదిలి తెరచాటున నిల్చున్నాడు. రాజు నిద్రలోనే ‘అరే! ఎవడ్రా అది. దురదపెడుతున్నాయి కాళ్ళు. పైజామా మార్చండి అన్నాడు. చీకట్లో తెరనించీ పక్కకు జరిగి వచ్చి సేవకుడిలా పైజామా విప్పి మహాదేవుడు వచ్చిన దారిగుండానే బయటపడ్డాడు.

మరుసటి రోజు దొంగల గుంపు సమావేశంలోకి దర్జాగా రాజు పైజామా ధరించి మహాదేవుడు ప్రవేశించాడు. ఆశ్చర్యంతో దొంగలందరూ మహాదేవుని ముందు తలలు వంచారు.

– సౌభాగ్య

First Published:  17 Aug 2015 1:02 PM GMT
Next Story