Telugu Global
Family

గురువచనం (Devotional)

ఒక ఊళ్ళో ఇద్దరు వ్యాపారస్థులు ఉండేవాళ్ళు. ఇద్దరికీ దైవం గురించి, సత్యం గురించి తెలుసుకోవాలన్న కోరికవుండేది. వాళ్ళ పేర్లు స్వామిదాసు, రామదాసు. వాళ్ళలో స్వామిదాసు సాత్వికుడు. రామదాసు కొంత ఉద్రేక స్వభావం గలవాడు. ఒకరోజు ఆ ఊరికి గురునానక్‌ వస్తున్నట్లు తెలిసింది. మహాజ్ఞాని ఐన గురునానకే ఆ రోజుల్లో భారతదేశంలో సుప్రసిద్ధుడు. ఆ సిక్కుల గురువు ప్రతిభ దశదిశలా వ్యాపించింది. ఆయన బోధనలు వినడానికి ఎంతోమంది వెళ్ళేవాళ్ళు. జ్ఞానవంతులయి తిరిగి వాళ్ళేవాళ్ళు. ఆయన ఎన్నో ప్రాంతాల్లో తిరిగి […]

ఒక ఊళ్ళో ఇద్దరు వ్యాపారస్థులు ఉండేవాళ్ళు. ఇద్దరికీ దైవం గురించి, సత్యం గురించి తెలుసుకోవాలన్న కోరికవుండేది. వాళ్ళ పేర్లు స్వామిదాసు, రామదాసు. వాళ్ళలో స్వామిదాసు సాత్వికుడు. రామదాసు కొంత ఉద్రేక స్వభావం గలవాడు.

ఒకరోజు ఆ ఊరికి గురునానక్‌ వస్తున్నట్లు తెలిసింది. మహాజ్ఞాని ఐన గురునానకే ఆ రోజుల్లో భారతదేశంలో సుప్రసిద్ధుడు. ఆ సిక్కుల గురువు ప్రతిభ దశదిశలా వ్యాపించింది. ఆయన బోధనలు వినడానికి ఎంతోమంది వెళ్ళేవాళ్ళు. జ్ఞానవంతులయి తిరిగి వాళ్ళేవాళ్ళు. ఆయన ఎన్నో ప్రాంతాల్లో తిరిగి బోధనలు చేసేవాడు. బసచేసేవాడు. ఆ క్రమంలో ఆ గ్రామంలో బసచేశాడు. గురుబోధనలు వినడానికి వచ్చి ఆయన దగ్గరకూచోడాన్ని సత్సంగం అనేవాళ్ళు.

గురునానక్‌ వచ్చిన విషయం తెలిసి సంతోషంతో స్వామిదాసు బయల్దేరి తన మిత్రుణ్ణి కూడా పిలిచాడు. ఇద్దరూ కలిసి బయల్దేరారు. దారిలో ఒక వేశ్యాగృహం ఉంది. ఆ ఇంటి కిటికీనించి ఒక అందమైన వేశ్య రామదాసును చూసి నవ్వింది. రామదాసు “నువ్వువెళ్ళు” అని స్వామిదాసును పంపేశాడు. స్వామిదాసు విస్తుపోయి గురునానక్‌ బసకు వెళ్ళి జ్ఞానబోధనలు విని ఆనందంతో తిరిగివచ్చాడు. మరుసటిరోజూ అదే వ్యవహారం. ఇలా నెలరోజులు గడిచాయి. “చివరిరోజుయిది. గురునానక్‌గారు వెళ్ళిపోతారు రేపు. ఈ రోజుయినా రా” అన్నా రామదాసు రాలేదు. రామదాసు వేశ్యాగృహానికి వెళితే అక్కడ వేశ్య లేదు. ఇంటికి తిరిగి వచ్చాడు. కాలితో నేలను గీటితే ఏదో తగిలింది. సందేహించి మట్టి తొలగించి చూస్తే కాలికి ఏదో పెట్టె తగిలింది. తవ్వి తీస్తే అందులో నిండుగా రాళ్ళు ఉన్నాయి. కానీ ఒక వజ్రం కనిపించింది.

ఆలస్యంగా కుంటుకుంటూ స్వామిదాసు రావడం చూశాడు. ఏమైందన్నాడు. పెద్దముల్లు కాలిలో దిగి రక్తం కారుతోందన్నాడు. కాలు కడిగి కట్టు కట్టాడు. రామదాసు ఒక్కసారిగా పగలబడి నవ్వాడు. ఎందుకు నవ్వుతున్నావన్నాడు స్వామిదాసు.

“నెలనించీ నువ్వు గురునానక్‌ బోధనలు వినడానికి వెళితే చివరిరోజు ఫలితమిది. నెలరోజులు నేను వేశ్య దగ్గరికి వెళ్ళి వస్తే ఫలితమిది” అన్నాడు రామదాసు. ఆ మాటల్తో స్వామిదాసు మనసు చివుక్కుమంది. దిగులు కమ్మింది. ఐనా ధైర్యం కూడగట్టుకుని “సరే! నువ్వు చెప్పినదాంట్లో సత్యాసత్యాల్ని గురుదేవుణ్ణి అడిగే తేల్చుకుందాం” అని రామదాసుతో కలిసి గురునానక్‌ బసకు వచ్చాడు.

నిద్రకు సిద్ధమవుతున్న గురువు వాళ్ళను చూసి “ఏమిటి విషయం?” అన్నాడు. స్వామిదాసు జరిగిందంతా వివరించి “స్వామి! నాకు ఈ ధర్మ సందేహాన్ని తీర్చండి. లేకుంటే నాకు మనశ్శాంతి ఉండదు” అన్నాడు.

రామదాసు మొత్తానికి గురువును ఇరకాటంలో పెట్టాను అనుకున్నాడు.

గురుదేవులు చిరునవ్వు నవ్వి రామదాసు వేపు చూసి ”నాయనా! నువ్వు పూర్వజన్మలో వజ్రాల వర్తకుడివి. ధర్మబద్ధమయిన జీవితం గడిపినందువల్ల దైవం ఈ జన్మలో నీకు అసంఖ్యాకమయిన వజ్రాల నిధినియివ్వాలనుకుంది. కానీ నువ్వు వేశ్యని వదిలి ఒక్కరోజే ఉండడం వల్ల నీకు ఒక్క వజ్రమే మిగిలింది. తక్కినవి రాళ్ళయ్యాయి. స్వామిదాసు పూర్వజన్మలో నియంత. ఎందర్నో చంపాడు. ఈ జన్మలో సాత్విక జీవితం గడిపాడు. ఛాయా మాత్రంగా ఉన్న అతని పాపం ముల్లుగా మాత్రమే అతనికి గుచ్చుకుంది. దాంతో అతను పూర్తిగా పవిత్రుడయ్యాడు” అన్నాడు.

ఆ మాటల్తో కన్నీటి పర్వంతమయి రామదాసు గురువు పాదాలపై పడ్డాడు.

– సౌభాగ్య

First Published:  16 Aug 2015 1:01 PM GMT
Next Story