Telugu Global
Family

వసుదేవుడు (For Children)

వసుదేవుడంతటివాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడని జాతీయం! ఎంతటివాడు? శ్రీకృష్ణునికి సాక్షాత్తు తండ్రి. హృదికినికి మనవడు. మాధురము, శూరసేనము అనే దేశాల్ని ఏలి శూరసేనునిగా పిలవబడ్డ దేవమీఢునికి మారిషకు పుట్టినవాడు. ఉగ్రసేనుని తమ్ముడైన దేవసేనుని కుమారై దేవకిని పెళ్ళాడిన వాడు! అంతేకాదు, వసుదేవుడు పుట్టినప్పుడు ఆకాశంలో దందుభులు మోగాయి. అందుకే “ఆనక దుందుభి”గా పేరు పొందాడు. తొమ్మిది మంది అన్నదమ్ములలో అగ్రజుడు. ఏడుగురు అక్కచెల్లెళ్ళతోడ పుట్టిన అన్నయ్య. దేవకితోడ పుట్టిన శాంతిదేవ, ధృతదేవలతో కలిపి ఆరుగురునీ పెళ్ళాడినవాడు. ఇంకా […]

వసుదేవుడంతటివాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడని జాతీయం! ఎంతటివాడు? శ్రీకృష్ణునికి సాక్షాత్తు తండ్రి. హృదికినికి మనవడు. మాధురము, శూరసేనము అనే దేశాల్ని ఏలి శూరసేనునిగా పిలవబడ్డ దేవమీఢునికి మారిషకు పుట్టినవాడు. ఉగ్రసేనుని తమ్ముడైన దేవసేనుని కుమారై దేవకిని పెళ్ళాడిన వాడు! అంతేకాదు, వసుదేవుడు పుట్టినప్పుడు ఆకాశంలో దందుభులు మోగాయి. అందుకే “ఆనక దుందుభి”గా పేరు పొందాడు. తొమ్మిది మంది అన్నదమ్ములలో అగ్రజుడు. ఏడుగురు అక్కచెల్లెళ్ళతోడ పుట్టిన అన్నయ్య. దేవకితోడ పుట్టిన శాంతిదేవ, ధృతదేవలతో కలిపి ఆరుగురునీ పెళ్ళాడినవాడు. ఇంకా రోహిణి, కౌసల్య, పౌరవిలనూ పెళ్ళాడాడు!

రోహిణితో బలరాముడు, గదుడు, సారణుడు మొదలగు వారినీ – పౌరవితో సుభద్రుడు మొదలగువారినీ – మదిరితో నందోప నందాదులునీ – దేవ రక్షితతో గదాదులనీ – దేవకితో కీర్తిమంతుడూ సుషేణుడూ భద్రసేనుడూ ఋజువూ సమదనుడూ భద్రుడూ సంకర్షణుడూ – అష్టమ కృష్ణుడూ పుట్టారు.

దేవకిని పెళ్ళాడిన వసుదేవుణ్ణి కంసుడు రాచమర్యాదలతో దిగబెడుతుండగా – ఆకాశవాణి మాట విని అష్టమ గర్భంలో పుట్టినవాడితో తనకు మరణం ఉన్నదని తెలిసి కత్తిదూస్తే – కంసుణ్ణి కరుణించమని వేడుకున్నాడు. పుట్టిన ప్రతిబిడ్డనూ అప్పగిస్తామన్నాడు. మాట తప్పక అలాగే అప్పగించడంతో కంసుని వంటివాడు కరిగిపోయి బిడ్డను విడిచిపెట్టాడు. కాని నారదుడు కంసుని మనసు మార్చాడు. వసుదేవాదులు దేవతలజాతి అని – కంసునిది రాక్షస జాతి అని – ఆగర్భవైరమున్నదని – అష్టమ గర్భమున పుట్టినవాడు విష్ణువని – చెప్పడంతో వాసుదేవసుతులందరినీ కంసుడు చంపేసాడు. చాలక దేవకీ వసుదేవులను చెరసాలలో బంధించాడు. అయినా వసుదేవుడు దేవకిని వదులుకోలేదు. తోడుగా జీవించాడు. ఆరుగురు పిల్లలు హతులయ్యాక, ఏడోసంతానంగా ఉన్న బలరాముణ్ణి పిండదశలోనే యోగమాయతో రోహిణి గర్భంలో ప్రవేశపెట్టడం – గర్భం పోయిందని అనుకున్నారు. అష్టమ (ఎనిమిదవసారి) గర్భం తెలిసి కంసుడు చెరసాలలో మరింత నిర్భందించాడు. గర్భంలోనే చంపడానికి కంసుడు ప్రయత్నించాడు. కాని దేవకికి నమ్మకాన్ని ఇచ్చి దేవునిపై భారం వేసాడు వసుదేవుడు. కృష్ణుడు పుట్టినప్పుడు కాపలావాళ్ళు నిద్రపోయారు. పుట్టిన శిశువుని దేవకికి కూడా తెలియకుండా బుట్టలో పెట్టుకొని రేపల్లెకు బయల్దేరాడు వసుదేవుడు. అది చూసి గాడిద అరవబోతే – విని అందరూ నిద్రలేస్తారని – దాని కాళ్ళుపట్టుకున్నాడు. కోట దాటాడు. చీకటి… చిత్తడి చిత్తడి వాన! పసిబిడ్డ తడవకుండా వేయితలల సర్పం ఆది శేషువు గొడుగు పట్టిందనీ – యమునా నది దగ్గరకు రాగానే నది చీలి దారిచ్చిందనీ – బాల కృష్ణుణ్ణి యశోదమ్మ పక్కలోపెట్టి – ఆ పసిపాపను తిరిగి బుట్టలో పెట్టుకొని మధురలోని చెరసాలకు తిరిగి వచ్చాడనీ – ఆపాపని దేవకి పక్కన పడుకోబెట్టడంతో ఆ పాప ఏడ్చిందనీ – ఏడుపువిని కాపలా దారులు నిద్రలేచారనీ – కంసుడూ వచ్చాడనీ – అన్నా ఆడబిడ్డన్నా వదల్లేదనీ – వధించబోతే నిన్నుచంపేవాడు భూమ్మీదే ఉన్నాడని చెప్పడంతో కంసుడు తన ప్రయత్నాలు తాను చేశాడనీ – చివరికి శ్రీకృష్ణుని చేతిలో హతమయ్యాడనీ మనం యెరిగిన కథ!

కంసుని హతమార్చిన కృష్ణుడు కన్నతలిదండ్రుల్ని విడిపించాడు. వసుదేవుడు ముందుజన్మలో సుతపుండను రాజు. ఆ రాజ దంపతులు ఘోరమైన తపస్సు చేసారట. విష్ణువు ప్రత్యక్షమయ్యాడట. ఆ దంపతులు తమ కడుపున పుట్టమని కోరారట. ఇచ్చిన మాటకోసం ఆ విష్ణువే శ్రీకృష్ణునిగా వసుదేవునికి పుట్టాడట!

వసుదేవుడు పూర్వజన్మలో కశ్యపుడని – భార్య అదితి కోరివస్తే కాదని, మరో భార్య కద్రువతో ఉన్నాడని – అందుకు కోపించిందని – మనిషి జన్మయెత్తమని శపించిందని – ఆశాపంవలనే కశ్యపుడు వాసుదేవునిగా పుట్టాడని బ్రహ్మ వైవర్తపురాణం చెపితే – ఇందుకు భిన్నమైన కథని హరవిలాసం చెప్తోంది!.

– బమ్మిడి జగదీశ్వరరావు

First Published:  26 July 2015 1:02 PM GMT
Next Story