Telugu Global
Editor's Choice

కార్గిల్ హీరోల‌ను మ‌రిచారా?

ఒన్ ర్యాంక్‌-ఒన్ పెన్ష‌న్ అమ‌లు ఎప్పుడు? ఇక్క‌డ మ‌నం స్వేచ్ఛ‌గా గాలి పీల్చుకుంటున్నామంటే దానికి కార‌ణం మ‌న సైనికులు. ఊపిరి కూడా అంద‌ని మైన‌స్ టెంప‌రేచ‌ర్‌లో స‌రిహ‌ద్దులకు కాప‌లా కాస్తున్నారు మ‌న వీర‌జ‌వానులు. హిమాల‌య‌మంత ఆత్మ‌విశ్వాసంతో దేశాన్ని కాపాడుతున్నారు. ఇటు పాకిస్థాన్‌-అటు చైనాలు ఏ విష‌వ్యూహంతో బుస‌లు కొడ‌తాయో తెలియ‌దు. ఎప్పుడు ఉగ్ర‌వాదులు విరుచుకుప‌డ‌తారో తెలియ‌దు.  అయినాస‌రే గుండెనిండా దేశ‌భ‌క్తితో సాహ‌సోపేతంగా విధులు నిర్వ‌ర్తిస్తున్నారు. గుజ‌రాత్‌లోని ర‌ణ్ ఆఫ్ క‌చ్‌కు క‌వ‌చంలా, అటు కాశ్మీరును ప్రాణ‌ప్ర‌దంగా కాపాడుతూ..దేశానికి […]

కార్గిల్ హీరోల‌ను మ‌రిచారా?
X
ఒన్ ర్యాంక్‌-ఒన్ పెన్ష‌న్ అమ‌లు ఎప్పుడు?
ఇక్క‌డ మ‌నం స్వేచ్ఛ‌గా గాలి పీల్చుకుంటున్నామంటే దానికి కార‌ణం మ‌న సైనికులు. ఊపిరి కూడా అంద‌ని మైన‌స్ టెంప‌రేచ‌ర్‌లో స‌రిహ‌ద్దులకు కాప‌లా కాస్తున్నారు మ‌న వీర‌జ‌వానులు. హిమాల‌య‌మంత ఆత్మ‌విశ్వాసంతో దేశాన్ని కాపాడుతున్నారు. ఇటు పాకిస్థాన్‌-అటు చైనాలు ఏ విష‌వ్యూహంతో బుస‌లు కొడ‌తాయో తెలియ‌దు. ఎప్పుడు ఉగ్ర‌వాదులు విరుచుకుప‌డ‌తారో తెలియ‌దు. అయినాస‌రే గుండెనిండా దేశ‌భ‌క్తితో సాహ‌సోపేతంగా విధులు నిర్వ‌ర్తిస్తున్నారు. గుజ‌రాత్‌లోని ర‌ణ్ ఆఫ్ క‌చ్‌కు క‌వ‌చంలా, అటు కాశ్మీరును ప్రాణ‌ప్ర‌దంగా కాపాడుతూ..దేశానికి శిరోభాగంలాంటి సియాచిన్‌లో స‌గ‌ర్వంగా జాతీయ ప‌తాకాన్నిరెప‌రెప‌లాడిస్తున్నా
రు భార‌త సైనికులు. ప్ర‌పంచంలోనే ఎత్తైన యుద్ధ‌క్షేత్రమైన సియాచిన్ బేస్‌క్యాంప్‌లో..గ‌డ్డ‌క‌ట్టించే చ‌లిలో..న‌ర‌న‌రానా ఉప్పొంగే దేశ‌భ‌క్తితో అడుగులువేస్తూ.. స‌రిహ‌ద్దుల‌ను ర‌క్షిస్తున్నారు.
కార్గిల్ విజ‌యం:
భార‌త సైనికుల ప‌రాక్ర‌మం ప్ర‌పంచానికి తెలుసు. ఇండియ‌న్ ఆర్మీ ఫీల్డ్‌లోకి ఎంట‌రైతే వార్ ఒన్‌సైడ్ అని పాకిస్థాన్‌కి ఇంకా బాగా తెలుసు! అప్ప‌టికే రెండుసార్లు ఓడిపోయినా బుద్ధిరాని దాయాది దేశం.. 1999లో కార్గిల్ సెక్టార్‌లోకి ఉగ్ర‌వాదుల‌ను ఉసిగొల్పింది. అంతేకాదు.. లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి..మ‌న భూభాగంలోకి చొచ్చుకువ‌చ్చారు పాక్ సైనికులు. అప్పుడే ఇండియ‌న్ ఆర్మీ ఆప‌రేష‌న్ విజ‌య్ చేప‌ట్టింది. తుపాకుల పేలుళ్ల‌తో, ఫిరంగుల మోత‌తో కార్గిల్ సెక్టార్ ద‌ద్ద‌రిల్లింది. ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్ కూడా తోడ‌వ‌డంతో పాక్ సైనికుల‌ను తరిమికొట్టింది. వీరోచితంగా పోరాడి ముష్క‌రుల‌ను మ‌ట్టుబెట్టింది.1999 మే నుంచి జులై వ‌ర‌కు కార్గిల్‌ వార్ జ‌రిగింది. చివ‌రకు భార‌త సైనికుల‌కు ఎదురొడ్డ‌లేక పాక్ మోక‌రిల్లింది. త‌మ బ‌ల‌గాల‌ను వెన‌క్కితీసుకుంది. 1999 జులై 26న ఎల్వోసీలోని మ‌న భూభాగంలోని అన్ని పొజిష‌న్స్‌ని భార‌త సైనికులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. అలా కార్గిల్ సెక్టార్‌లో జాతీయ‌ప‌తాకం మ‌ళ్లీ స‌గ‌ర్వంగా రెప‌రెప‌లాడింది. ఆప‌రేష‌న్ విజ‌య్ విజ‌య‌వంత‌మ‌యింది. మ‌న సైనిక శ‌క్తికి, జ‌వానుల త్యాగ‌నిర‌తికి ఈ గెలుపు నిద‌ర్శ‌నంగా నిలుస్తుంది. అందుకే ఏటా జులై 26ని విజ‌య్ దివ‌స్‌గా జ‌రుపుకొంటున్నాం.
ఒన్ ర్యాంక్-ఒన్ పెన్ష‌న్‌
దేశంలో ఏ అల‌జ‌డి జ‌రిగినా ఇండియ‌న్ ఆర్మీ రావాలి. ఉగ్ర‌వాదుల ఆట‌క‌ట్టించాల‌న్నాఆర్మీ క‌మాండోలు రంగంలోకి దిగాలి. కేదార్‌నాథ్‌వంటి ఏ ప్ర‌కృతి విల‌యాలు సంభ‌వించినా జ‌వానులు లేక‌పోతే ప్రాణాలు నిల‌బ‌డ‌వు. కుటుంబాల‌ను వ‌దిలి..త‌మ య‌వ్వ‌నాన్నంతా దేశ సేవ‌కు అర్పించే సైనికుల‌కు మ‌నం ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగ‌లం? కానీ మ‌న పాల‌కుల‌కు సైనికుల‌ను వాడుకోవ‌డంత‌ప్ప వారి బాగోగులు ప‌ట్ట‌డం లేదు. రిటైరైన త‌ర్వాత సైనికులు దుర్భ‌ర జీవితం గ‌డుపుతున్నారు. 15 నుంచి 20 ఏళ్లు సైన్యంలో ప‌నిచేసినా..చాలీచాల‌ని పెన్ష‌న్‌తో పేద‌రికంలో మ‌గ్గుతున్నారు. మ‌న దేశంలో సైన్యంలో ఉన్నంత‌వ‌ర‌కే సైనికుల‌కు విలువ! బ‌య‌ట‌కువ‌స్తే ఎక్స్‌స‌ర్వీస్‌మెన్‌కి గౌర‌వం లేదు. వారు చేసిన సేవ‌ల‌కు త‌గ్గ ఉద్యోగాలు అస‌లే లేవు. ఇర‌వై ఏళ్లుగా మ‌న సైనికులు కోరుతున్న‌ది ఒక్క‌టే.. ఒన్ ర్యాంక్‌-ఒన్ పెన్ష‌న్! దీనివ‌ల్ల‌ ఒకే ర్యాంకులో రిటైరైన జ‌వాన్లంద‌రికీ ఒకే ర‌క‌మైన పెన్ష‌న్ ల‌భిస్తుంది. అయితే ఆ డిమాండ్ ఇప్ప‌టికీ నెర‌వేర‌లేదు. గ‌త యుపిఎ ప్ర‌భుత్వం మాజీ సైనికుల‌కు ఇచ్చిన మాట నిల‌బెట్టుకోలేక‌పోయింది. ఎన్నిక‌ల‌కు ముందు బీజేపీ కూడా ఒన్ ర్యాంక్-ఒన్ పెన్ష‌న్ ప‌థ‌కం అమ‌లు చేస్తామ‌ని హామీ ఇచ్చింది. అయితే మోదీ స‌ర్కారు అధికారంలోకి వ‌చ్చి ఏడాది గ‌డిచినా..ఇప్ప‌టికీ కార్య‌రూపం దాల్చ‌లేదు. ఎప్పుడు అమ‌లు చేస్తారో స్ప‌ష్టత ఇవ్వ‌డం లేదు.
విజ‌య్ దివ‌స్ రోజునే సైనికుల ఆందోళ‌న‌
విజ‌య్ దివ‌స్ సైనికులు, మాజీ సైనికులు సంబ‌రాలు చేసుకోవాల్సిన రోజు. కానీ ఒన్ ర్యాంక్‌-ఒన్ పెన్ష‌న్ అమ‌లు కోసం ల‌క్ష‌ల‌మంది మాజీ సైనికులు ఆందోళ‌నబాట ప‌ట్టారు. విజ‌య్ దివ‌స్‌రోజునే ఢిల్లీలో ఆందోళన చేప‌ట్టారు.నెల‌రోజులుగా జంత‌ర్‌మంత‌ర్ ద‌గ్గ‌ర దీక్ష‌లు చేస్తున్నా ప‌ట్టించుకోక‌పోవ‌డంతో.. ఆదివారం భారీ ఎత్తున బ‌హిరంగ స‌భ నిర్వ‌హించారు.
అన్నా హ‌జారే మ‌ద్ద‌తు:
ఒన్ ర్యాంకు-ఒన్ పెన్ష‌న్ కోసం మాజీ సైనికులు చేప‌ట్టిన ఆందోళ‌న‌కు అవినీతి వ్య‌తిరేక పోరాట యోథుడు అన్నాహ‌జారే మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. భార‌త సైన్యంలో 15 ఏళ్ల‌పాటు సేవ‌లందించిన హ‌జారే, త‌న‌కు మాజీ సైనికుల బాధ‌లు తెలుసున‌న్నారు. త‌న స‌హ‌చ‌రుల కోసం దీక్ష చేప‌డ‌తాన‌ని ప్ర‌క‌టించారు.
మాజీ ఎంపీలకు పెన్ష‌న్‌ పెర‌గాలి.. మాజీ సైనికులకు వ‌ద్దా?
పార్టీల‌క‌తీతంగా ఎంపీలంతా ఇటీవ‌ల ఏక‌తాటిపై నిల‌బ‌డ్డారు. ఎందుకో తెలుసా? త‌మ జీతాలు 100 శాతం పెంచాల‌ని! ప్ర‌స్తుతం ఎంపీ జీతం రూ.50 వేలు. దాన్ని ల‌క్ష రూపాయ‌ల‌కు పెంచాల‌ని జీత‌భ‌త్యాల‌కు సంబంధించిన 15మంది స‌భ్యుల‌ పార్ల‌మెంట‌రీ క‌మిటీ కేంద్రానికి సిఫార్సు చేసింది. అలాగే మాజీ సైనికుల‌కు ఇప్పుడిస్తున్న 20వేల పెన్ష‌న్‌ని 35వేల‌కు పెంచాల‌ని కూడా సూచించింది. మాజీ ఎంపీల కుటుంబంలో భార్య‌తోబాటు పెళ్ల‌యిన పిల్ల‌ల‌కు కూడా ఆరోగ్య బీమా ఉండాల్సిందేన‌ని తేల్చింది.
ఎంపీలు, మాజీ ఎంపీలు అనుభ‌విస్తున్న‌జీతాలు, స‌బ్సిడీలు అన్నీ ఇన్నీకావు. ఎంపీల‌కు జీతంతోబాటు నెల‌కు 45వేల‌ కాంస్టిట్యుయెన్సీ ఎల‌వెన్స్ ల‌భిస్తుంది. ఢిల్లీలో నివాసం ఉచితం. ఏడాదికి ల‌క్ష‌న్న‌ర రూపాయ‌ల వ‌ర‌కు ఫోన్‌కాల్స్ ఫ్రీ. ఇంకా ఏడాదికి 50 వేల‌ యూనిట్ల క‌రెంటు ఫ్రీ. అలాగే ఏటా 75వేల రూపాయ‌ల విలువ జేసే ఫ‌ర్నీచ‌ర్ కొనుక్కోవ‌చ్చు. ఇంకా కిలోమీట‌రుకు 16 రూపాయ‌లు చొప్పున‌ ప్ర‌భుత్వ‌మే కారులో పెట్రోల్ పోస్తుంది. కంప్యూట‌ర్‌వంటి ఎల‌క్ట్రానిక్ ప‌రిక‌రాలు కొనుక్కోవ‌డానికి మూడుల‌క్ష‌లు ఇస్తుంది. ఆస్ప‌త్రి ఖ‌ర్చ‌లు ఫ్రీ. భ‌యంక‌ర‌మైన స‌బ్సిడీతో కేంటీన్ స‌దుపాయం ఎలాగూ ఉంటుంది. ఎగ్జిక్యుట‌వ్ క్లాస్ విమాన ప్ర‌యాణం, ఫ‌స్ట్ క్లాస్ రైలు స‌దుపాయం కామ‌న్‌! ఎంపీతోబాటు ఆయ‌న భార్య‌కు కూడా ప్ర‌యాణ ఖ‌ర్చులుండ‌వు. ఇన్ని రాయితీలు పొందుతూ కూడా ఇంకా 100శాతం జీతాలు పెంచుకుంటున్నారు మ‌న ఎంపీలు. త‌మ జీతాలను తామ పెంచుకునే అవ‌కాశం వీళ్ల‌కే ఉంది. ఆశ్చ‌ర్యం ఏమిటంటే ఎంపీల జీతాల పెంపు కోసం 27సార్లు చ‌ట్టాన్ని స‌వ‌రించారు. మ‌రోసారి పెంచ‌డానికి రంగం సిద్ధ‌మ‌వుతోంది. కానీ దేశం కోసం ప్రాణాలకు తెగించి సేవ‌లందించి, వైక‌ల్యంతో బాధ‌ప‌డుతున్న‌మాజీ సైనికులకు ఒన్ ర్యాంక్‌-ఒన్ పెన్ష‌న్ అమ‌లు చేయ‌డానికి మాత్రం పాల‌కుల‌కు చేతులు రావ‌డం లేదు.
వార్ మెమోరియ‌ల్ కూడా నిర్మించ‌లేదు:
దుర‌దృష్ట‌మేమిటంటే మ‌న‌కు స్వాతంత్ర్యం వ‌చ్చి 68 గ‌డిచినా ఇంవ‌ర‌కు మ‌న ప్ర‌భుత్వాలు వార్ మెమోరియ‌ల్ కూడా నిర్మించ‌లేదు. 101 ఏళ్ల క్రితం బ్రిటీష్ పాల‌కులు నిర్మించిన ఇండియా గేట్ మాత్ర‌మే ఇప్ప‌టికీ అమ‌ర జ‌వానుల స్మృతి చిహ్నంగా కొన‌సాగుతోంది. మొద‌టి ప్ర‌పంచ యుద్ధంలో వేలాదిమంది భార‌తీయ సైనికులు అమ‌రుల‌య్యారు. వారి త్యాగానికి గుర్తుగా తెల్ల‌దొర‌లు ఇండియా గేట్ నిర్మించారు. భార‌తీయ సైనికులపై బ్రిటీష్ ప్ర‌భువుల‌కు ఉన్న గౌర‌వం కూడా మ‌న పాల‌కుల‌కు లేక‌పోవ‌డం అస‌లైన విషాదం!
First Published:  26 July 2015 1:13 AM GMT
Next Story