Telugu Global
Family

గోదావరి (For Children)

ఇది పుష్కరాల కాలం! పన్నెండేళ్ళ కాలానికి వచ్చేవి పుష్కరాలు! ఇప్పుడు జరుగుతున్నవి గోదావరి పుష్కరాలు! పుష్కర స్నానాన్ని పుణ్యస్నానంగా భావిస్తారు! నదిని సంరక్షించుకోవడమే పుష్కరాల అంతరార్ధమని పెద్దలు చెబుతారు! పాపాల్ని కడిగేసుకొని పుణ్య ఫలాన్ని దక్కించుకోవాలని భక్తులు ఆశిస్తారు. అయితే గోదావరి పుట్టుక గురించిన కథలోనూ గౌతముడు తన పాపాల్ని కడిగేసుకొని పుణ్యఫలాన్ని దక్కించుకోవడం కనిపిస్తుంది. అయితే ఆ ఫలాన్ని ప్రజల ప్రయోజనం కోసమే వెచ్చించాడు. దాని ఫలితమే గోదావరి! భారతదేశంలో గంగానది తర్వాత రెండవ అతిపెద్దనది […]

ఇది పుష్కరాల కాలం! పన్నెండేళ్ళ కాలానికి వచ్చేవి పుష్కరాలు! ఇప్పుడు జరుగుతున్నవి గోదావరి పుష్కరాలు! పుష్కర స్నానాన్ని పుణ్యస్నానంగా భావిస్తారు! నదిని సంరక్షించుకోవడమే పుష్కరాల అంతరార్ధమని పెద్దలు చెబుతారు! పాపాల్ని కడిగేసుకొని పుణ్య ఫలాన్ని దక్కించుకోవాలని భక్తులు ఆశిస్తారు. అయితే గోదావరి పుట్టుక గురించిన కథలోనూ గౌతముడు తన పాపాల్ని కడిగేసుకొని పుణ్యఫలాన్ని దక్కించుకోవడం కనిపిస్తుంది. అయితే ఆ ఫలాన్ని ప్రజల ప్రయోజనం కోసమే వెచ్చించాడు. దాని ఫలితమే గోదావరి!

భారతదేశంలో గంగానది తర్వాత రెండవ అతిపెద్దనది గోదావరి. మహారాష్ట్రలోని నాసిక్‌ వద్ద గల త్రయంబకం (త్రయంబకేశ్వరం)లో పుట్టి 1465 కిలోమీటర్ల దూరం ప్రవహించి తనచుట్టూ ఉన్న జనజీవనానికి ఆకలి తీర్చి మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల గుండా వెళ్ళి బంగాళాఖాతంలో కలుస్తోంది!

గోదావరి పుట్టుక వెనుక యెన్నోకథలున్నాయి. వరాహపురాణంలో గంగానది శివుని జటా జూటము అంటే జడల గుంపులోని వొకపాయే ఈ గోదావరి అని – శివుని శిరస్సునుంచి గౌతముడనే ముని నేలకు దించాడన్న కథ వుంది. అప్పుడు మన దేశంలో మహాకాటకము రాజ్యమేలినప్పుడు మునులూ జనులూ గౌతముని ఆశ్రమంబాట పట్టారట. ఎందుకంటే వరం వల్ల గౌతముని పంటపొలాలు మాత్రం పచ్చదనంతో ఉండేవట. ఆయన అందరి ఆకలినీ తీర్చేవాడట. అది చూసి కొందరికి కన్ను కుట్టిందట. ఒక మాయ గో(ఆ)వును సృష్టించి పొలాలమీదకు వదిలారట. ఆ గోవు పంటపొలాలను మేయడంతో ఆగక నాశనం చేసిందట. ఇది తెలిసి గౌతముడు ఆ గోవును కొట్టలేక పొమ్మని నీటి బిందువులనో – గడ్డిపరకనో గోవుమీదకు విసిరాడట. గోవు చనిపోయిందట. గో హత్య మహాపాతకం నీ ఇంట తినమని మునులు లేచి వెళ్ళిపోబోయారట. వద్దని గౌతముడు వేడుకున్నాడట. పరిష్కారమార్గం చూపమన్నాడట. గంగను తీసుకువస్తే పాతకం పటాపంచలవుతుందని అన్నారట. అప్పుడు గౌతముడు శివుని గురించి ఘోరమైన తపస్సు చేసాడట. శివుడు ప్రత్యక్షమై తన జట నొకటి తీసి ఇచ్చాడట. ఆ జటను తెచ్చి గోవు మీద పిండాడట. గోవు ప్రాణమొచ్చి లేచిందట. జటను పిండినప్పుడు ప్రవహించిన నీరే గోదావరి నదయ్యిందట. గౌతముడు తెచ్చాడనే “గౌతమి”గా పేరొచ్చిందట. ఇదీ కథ!

ఈ కథ వెనుక కూడా మరో కథ ఉంది. గంగను శివుడు నెత్తిమీద పెట్టుకు మోయడం పార్వతికి నచ్చలేదట. గంగ గర్వం చూసి ఓర్వలేక పోయిందట. సహించలేక కొడుకులైన వినాయకునికీ కుమారస్వామికీ తల్లిగా తన బాధ చెప్పుకుందట. అప్పుడు వినాయకుడి వ్యూహంలో భాగమే మాయ గోవు అని – శివుణ్ణి ఆరాధించి నేలకు గంగను దించమని చెప్పిందీ మారు రూపున ఉన్న వినాయకుడేనని – ఏదయితేనేం గంగ నేలకు దిగింది. నేల పండింది. జనుల ఆకలి దప్పికలు తీర్చింది కదా?

అయితే గౌతముని కాదని వెళ్ళిన మునులు వెనక్కి వచ్చారట. గౌతముని అభినందించారట. తమ పేర్లని గోదావరికి ఉపనదులుగా పెట్టమని కోరారట. సప్త ఋషులైన గౌతముడు, వసిష్ఠుడు, కౌశికుడు, వసుదేవుడు, భరద్వాజుడు, అత్రి, జమదగ్నిల పేర్లే ఉపనదులకు పెట్టారట!

బ్రహ్మ వైవర్తపురాణం కథ ప్రకారం అయితే – తీర్థయాత్రలకు వెళ్తున్న బ్రాహ్మణకాంతను చూసి మోహించి బలత్కారము చేసాడట అశ్వని కుమారుడు. కొడుకు కూడా పుట్టాడట. భర్త సుతపుని దగ్గరకు వెళితే వద్దని వదిలి పెట్టాడట. యోగము చేత ఆమె నది అయ్యిందట. అదే గోదావరి అట! గోదావరి అంటే “ఒక బ్రహ్మాండమైన అనంతమైన జలరాశి” అని అర్థం!.

– బమ్మిడి జగదీశ్వరరావు

First Published:  24 July 2015 1:02 PM GMT
Next Story