Telugu Global
Others

సబ్‌ కలెక్టరేట్‌ ముట్టడిలో ఉద్రిక్తత... అరెస్ట్‌లు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మున్సిపల్‌ కార్మికుల స‌మ్మె మ‌రింత ఉధృత‌మ‌య్యింది. త‌మ‌ డిమాండ్లను పరిష్కరించాలంటూ కార్మికులు ఆందోళ‌న‌ల‌ను తీవ్ర‌త‌రం చేశారు. ప్రభుత్వం దిగివచ్చి తమ డిమాండ్లు తీర్చాలంటూ మున్సిపల్‌ కార్మికులు, ఉద్యోగులు విజ‌య‌వాడ‌లో స‌బ్ క‌లెక్ట‌ర్ కార్యాల‌యం ముట్టడికి చేసిన యత్నం వికటించి ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ సందర్బంగా జరిగిన తోపులాటలో సిపిఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి, మాజీ పార్లమెంట్‌ సభ్యుడు పి. మధు, వై.ఎస్‌.ఆర్‌. కాంగ్రెస్‌ నాయకుడు గౌతమ్‌రెడ్డి గాయపడ్డారు. దర్నా చేస్తు‌న్న మున్సి‌ప‌ల్ కార్మి‌కుల‌కు మ‌ద్ద‌తుగా వామపక్షాలతోపాటు […]

సబ్‌ కలెక్టరేట్‌ ముట్టడిలో ఉద్రిక్తత... అరెస్ట్‌లు
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మున్సిపల్‌ కార్మికుల స‌మ్మె మ‌రింత ఉధృత‌మ‌య్యింది. త‌మ‌ డిమాండ్లను పరిష్కరించాలంటూ కార్మికులు ఆందోళ‌న‌ల‌ను తీవ్ర‌త‌రం చేశారు. ప్రభుత్వం దిగివచ్చి తమ డిమాండ్లు తీర్చాలంటూ మున్సిపల్‌ కార్మికులు, ఉద్యోగులు విజ‌య‌వాడ‌లో స‌బ్ క‌లెక్ట‌ర్ కార్యాల‌యం ముట్టడికి చేసిన యత్నం వికటించి ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ సందర్బంగా జరిగిన తోపులాటలో సిపిఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి, మాజీ పార్లమెంట్‌ సభ్యుడు పి. మధు, వై.ఎస్‌.ఆర్‌. కాంగ్రెస్‌ నాయకుడు గౌతమ్‌రెడ్డి గాయపడ్డారు. దర్నా చేస్తు‌న్న మున్సి‌ప‌ల్ కార్మి‌కుల‌కు మ‌ద్ద‌తుగా వామపక్షాలతోపాటు వై.ఎస్‌.ఆర్‌. కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు కూడా ఆందోళన కార్యక్రమంలో పాల్గొనడంతో ధర్నా చేస్తున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. జనాన్ని అదుపు చేయలేని పరిస్థితుల్లో విజయవాడ కలెక్టరేట్‌ కార్యాలయానికి తాళాలు వేసేశారు. దీంతో మున్సిపల్‌ ఉద్యోగులు, కార్మికులు కలెక్టరేట్‌ ముందు బైఠాయించి ధర్నా పాటించారు. ఈ నిరసన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా కార్మికులు ఎదురు తిరిగారు. వారితో వాగ్వివాదానికి దిగారు. ఈనేపథ్యంలో తాళాలేసిన గేటును విరగ్గొట్టి కార్యాలయం లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించారు. దీనివల్ల గేటు విరిగిపోయి ఒక్కసారిగా తెరుచుకుంది. ఒక్క ఉదుటున ఇది తెరుచుకోవడంతో కార్యకర్తలంతా లోపలికి దూసుకువెళ్ళే ప్రయత్నం చేశారు. ఈ యత్నంలో ఒకరిపై ఒకరు పడి తొక్కిసలాటకు దారి తీసింది. దీంతో కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. మరికొంత మంది సోమ్మ‌సిల్లి‌ పడిపోయారు. వీరిలో పి.మ‌ధు, గౌతమ్‌రెడ్డి, విజ‌య‌వాడ న‌గ‌ర కార్య‌ద‌ర్శి బాబురావులు కూడా ఉన్నారు. వీరిని వెంటనే అంబులెన్స్ లో చికిత్స నిమిత్తం ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ నేపథ్యంలో సబ్ కలెక్టరేట్ వద్ద బైఠాయించి ధర్నా చేస్తున్న నేతలను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు… వారందరిని పోలీసులు అరెస్టు చేసి లారీల‌లోకి ఎక్కించి అక్క‌డ నుంచి తరలించారు. నాయ‌కుల‌ను, మ‌హిళ కార్య‌క‌ర్త‌లని కూడా చూడ‌కుండా వారిని ఈడ్చు‌కుంటూ తీసుకువెళ్లి ‌నుల‌లోనూ,లారీల‌లోనూ ఎక్కించి తరలించారు.
విజయవాడ డిప్యూటీ మేయర్‌ హామీ
విజయవాడలో మున్సిపల్ కార్మికులు స్థానిక‌ సింగ్‌నగర్ లోని నగరపాలక సంస్ధ డిప్యూటీ మేయర్ గోగుల రమణ ఇంటిని ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మున్సిపల్ కార్మికుల ఆందోళన తీవ్రతరం చేయడంతో ఇంటి నుంచి బయటకొచ్చిన డిప్యూటీ మేయర్ సిఐటియు నాయకులతో మాట్లాడారు. మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మె సరైందేనని, త్వరలోనే మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్ళి సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. పేదల ఓట్ల తో గద్దెనెక్కిన టిడిపి ప్రభుత్వం వాళ్ల పొట్టలే కొడుతోంద‌ని సీపీఎం నేతలు విమర్శించారు. రాజధాని పేరుతో పేదల భూములను లాక్కొని చైనాకు కట్టబెడుతున్న చంద్ర‌బాబు పేద‌ల గురించి ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మునిసిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమ బాట పట్టి రాష్ట్రాన్ని స్తంభింపచేస్తామని హెచ్చరించారు.
కదం తొక్కిన పారిశుద్ధ్య కార్మికులు
గ‌త 15రోజులుగా స‌మ్మె చేస్తు‌న్న మున్సి‌ప‌ల్ కార్మి‌కుల ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని, కార్మి‌కుల ప‌ట్ల ప్ర‌భుత్వ మొండి వైఖ‌రి విడాల‌ని మున్సి‌ప‌ల్ కార్మి‌కులు ఒంగోలు కలెక్టరేట్ మట్టడించారు. సిపిఎం, సిపిఐ, వైసిపి, సిపిఐఎంఎల్, న్యూడెమోక్రసీ, ఒపిడిఆర్ పార్టీ ల నాయకులు హాజరై మద్దతు తెలిపి ముట్ట‌డిలో పాల్గొ‌న్నా‌రు. సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు చేతికి సంకేళ్లు వేసుకుని ర్యాలీ నిర్వహించారు. కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంద‌ని మండిపడ్డారు. సమస్యలను పరిష్కరించే వరకు ఉద్యమాన్ని విరమించేది లేదని.. ప్రభుత్వం దిగిరాకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విజయనగరం కలెక్టరేట్‌ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. ఇక్కడ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మద్దతివ్వడంతో భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. పోలీసులు వీరందరినీ నియంత్రించడంతో ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది.
First Published:  24 July 2015 3:14 AM GMT
Next Story