Telugu Global
Family

ప్రపంచాన్ని మార్చడం (Devotional)

బయాజిద్‌ సూఫీ మార్మికుడు. ఆయన ఆత్మకథ రాసుకున్నాడు. దాంట్లో అద్భుతమయిన ఒక విషయం చెప్పాడు. అది ఆయన జీవితానికి సంబంధించిన సారాంశం. ఆయన ఇట్లా అన్నాడు. నేను యువకుడుగా ఉన్నపుడు నా ప్రార్థనలో దేవుణ్ణి ఇట్లా కోరేవాణ్ణి. దేవుడా! నాకు శక్తిని ఇవ్వు. చైతన్యాన్నివ్వు, బలాన్నివ్వు. నేను ఈ ప్రపంచాన్ని మార్చాలనుకుంటున్నాను. నువ్వు నా పట్ల దయతలిస్తే అదేమంత కష్టం కాదు! అందరూ వింతగా నన్ను చూసేవాళ్ళు. నేను విప్లవకారుణ్ణని అనుకున్నారు. నేను మధ్యవయస్కుణ్ణయ్యాను. జీవితంలో ఎన్నో […]

బయాజిద్‌ సూఫీ మార్మికుడు. ఆయన ఆత్మకథ రాసుకున్నాడు. దాంట్లో అద్భుతమయిన ఒక విషయం చెప్పాడు. అది ఆయన జీవితానికి సంబంధించిన సారాంశం.

ఆయన ఇట్లా అన్నాడు.

నేను యువకుడుగా ఉన్నపుడు నా ప్రార్థనలో దేవుణ్ణి ఇట్లా కోరేవాణ్ణి. దేవుడా! నాకు శక్తిని ఇవ్వు. చైతన్యాన్నివ్వు, బలాన్నివ్వు. నేను ఈ ప్రపంచాన్ని మార్చాలనుకుంటున్నాను. నువ్వు నా పట్ల దయతలిస్తే అదేమంత కష్టం కాదు!

అందరూ వింతగా నన్ను చూసేవాళ్ళు. నేను విప్లవకారుణ్ణని అనుకున్నారు.

నేను మధ్యవయస్కుణ్ణయ్యాను. జీవితంలో ఎన్నో ఆటుపోట్లకు లోనయ్యాను. బరువు బాధ్యతలు మీదపడ్డాయి. వెనకటి ఆవేశం తగ్గింది. అప్పుడు దేవుణ్ణి. “దేవా! ప్రపంచాన్ని మార్చాలన్నది బహుశా నా తలకుమించిన భారమనుకుంటాను. నా చేతుల్లో ఉన్నది. నేను చేయగలిగింది చెయ్యాల్సిందిపోయి పెద్దపెద్ద ఆలోచనలు చేశాను. నాకో కుటుంబముంది. నాది చిన్ని కుటుంబం. ఆ కుటుంబాన్ని మార్చే, సరయిన మార్గంలో పెట్టే శక్తి నువ్వు”.

అట్లా జీవితం గడిచిపోయింది. వృద్ధాప్యంపైన పడింది. అప్పటికి నాకు తెలిసివచ్చింది. ప్రపంచాన్ని మార్చడం ఊహల్లో సంగతి, కానీ కుటుంబాన్ని మార్చడం కూడా తలకు మించిన భారం. నేను చేయగలిగిన పనల్లా నన్ను నేను మార్చుకోవడం. అది నా చేతుల్లో పని. ఇతరులని కాదు, నన్ను నేను ఉద్ధరించుకోవాలి. ఇప్పటికి నేను సరయిన దారికి వచ్చానని దేవుడితో “దేవా! ఇప్పుడు నాకు జ్ఞానోదయమయింది. నేను మారాలి. నన్ను నేను మార్చుకునే శక్తిని నాకు ప్రసాదించు” అని ప్రార్థించాను. అన్నాళ్ళకి, అన్నేళ్ళకి దేవుడు కరుణించి ప్రత్యక్షమై “నువ్వు చెప్పింది అక్షరాల నిజం. నిన్ను నువ్వు మార్చుకోవడమన్నది మాత్రమే నువ్వు చెయ్యగలవు. కానీ ఈ కోరిక నువ్వు మొదట కోరాల్సింది. చివర్న కోరావు” అని మాయమయ్యాడు.

– సౌభాగ్య

First Published:  22 July 2015 1:01 PM GMT
Next Story