Telugu Global
Family

కత్తెర " సూది (Devotional)

ఫరీద్‌ గొప్ప సూఫీ మార్మికుడు. ఒకరోజు ఆయన్ని కలవడానికి ఒకరాజు వచ్చాడు. రాజులందరూ పూర్వం సన్యాసుల్ని సందర్శించి వాళ్ళ ఆశీర్వాదం, సలహాలు తీసుకోవడం ఆనవాయితీగా ఉండేది. ఆరాజు తన స్థాయికి తగినట్లు ఫరీద్‌కు ఏదయినా బహుమతి ఇవ్వాలనుకున్నాడు. వింతయిన బహుమతి ఇవ్వాలని ఉద్దేశించాడు. ఒక కత్తెరను – బంగారు కత్తెరను, వజ్రాలతో పొదిగిన ధగధగలాడే కత్తెరను ఇవ్వాలనుకున్నాడు. ఫరీద్‌ను సందర్శించి నమస్కరించి తాను తెచ్చిన వజ్రాల తాపడమున్న బంగారు కత్తెరను సమర్పించాడు. ఫరీద్‌ ఆ కత్తెరను చూసి […]

ఫరీద్‌ గొప్ప సూఫీ మార్మికుడు. ఒకరోజు ఆయన్ని కలవడానికి ఒకరాజు వచ్చాడు. రాజులందరూ పూర్వం సన్యాసుల్ని సందర్శించి వాళ్ళ ఆశీర్వాదం, సలహాలు తీసుకోవడం ఆనవాయితీగా ఉండేది.

ఆరాజు తన స్థాయికి తగినట్లు ఫరీద్‌కు ఏదయినా బహుమతి ఇవ్వాలనుకున్నాడు. వింతయిన బహుమతి ఇవ్వాలని ఉద్దేశించాడు. ఒక కత్తెరను – బంగారు కత్తెరను, వజ్రాలతో పొదిగిన ధగధగలాడే కత్తెరను ఇవ్వాలనుకున్నాడు.

ఫరీద్‌ను సందర్శించి నమస్కరించి తాను తెచ్చిన వజ్రాల తాపడమున్న బంగారు కత్తెరను సమర్పించాడు. ఫరీద్‌ ఆ కత్తెరను చూసి అటూఇటూ తిప్పి తిరిగి రాజుకు ఇచ్చేసి “రాజా! మీరు ఎంతో అభిమానంతో నాకోసం ఇంత అందమయిన, ఖరీదయిన కత్తెర తెచ్చినందుకు కృతజ్ఞతలు. కానీ దీంతో నాకు ఉపయోగంలేదు. మీరు నాకో సూది ఇస్తే సంతోషిస్తాను. నాకు కత్తెర అవసరం లేదు, సూది అవసరముంది” అన్నాడు.

రాజు “మీరు చెప్పేది నాకు అర్థం కావడం లేదు, మీకు సూది అవసరమెంతో కత్తెరతో కూడా అంతే అవసరముంటుంది కదా!” అన్నాడు.

ఫరీద్‌ “నేను రూపకంగా చెబుతున్నాను. కత్తెరల అవసరం నాకు లేదు. ఎందుకంటే కత్తెర కత్తిరించేది, వేరు చేసేది. సూది ఎందుకు అవసరమంటే అది కలిపేది. వేరయినవాటిని ఒకటి చేసేది. కలసివున్నవాటిని వేరు చేసేదానికన్నా విడిపోయిన వాటిని కలిపేది ఉపయోగకరం కదా! నేను ప్రేమను బోధిస్తాను. నా బోధనలన్నీ ప్రేమను ఆధారం చేసుకున్నవే. జనాల్ని దగ్గరకు చేర్చేవి. నాకు సూది ఎందుకు అవసరమంటే నేను జనాల్ని కలిపే వాణ్ణి. కత్తెర్లు నిరుపయోగం. అవి వేరు చేస్తాయి, విడగొడతాయి ఇంకోసారి వచ్చినపుడు తప్పక సూది తీసుకురండి” అన్నాడు.

ఫరీదు తిరిగిఇచ్చిన కత్తెరను తీసుకుని రాజు ఫరీదు అంతరార్థాన్ని గ్రహించాడు.

– సౌభాగ్య

First Published:  19 July 2015 1:01 PM GMT
Next Story