Telugu Global
Family

అజీర్ణం (Devotional)

ఒక వ్యక్తి సూఫీ గురువయిన బహాయుద్దీన్‌ నష్క్‌బంద్‌ దగ్గరికి వచ్చాడు. తన అనుభవాల్ని ఆ సూఫీ గురువుకు వివరించాడు. “నేను ఒక గురువు దగ్గర్నించీ ఇంకో గురువు దగ్గరకు వెళ్ళాను. వాళ్ళు చెప్పినవన్నీ విన్నాను. వాళ్ళు సూచించిన మార్గాల్లో నడిచాను. అవన్నీ నాకు ఎంతో నేర్పాయి. ఎంతో జ్ఞానాన్ని సంపాదించాను. యిప్పుడు మీ దగ్గరకు వచ్చాను. మీ శిష్యుడుగా చేరుదామని సంకల్పించాను. అప్పుడు నేను జ్ఞానమనే బావి నించీ నీళ్ళు తోడి తాగుతాను. అప్పడు నేను మరింత […]

ఒక వ్యక్తి సూఫీ గురువయిన బహాయుద్దీన్‌ నష్క్‌బంద్‌ దగ్గరికి వచ్చాడు. తన అనుభవాల్ని ఆ సూఫీ గురువుకు వివరించాడు. “నేను ఒక గురువు దగ్గర్నించీ ఇంకో గురువు దగ్గరకు వెళ్ళాను. వాళ్ళు చెప్పినవన్నీ విన్నాను. వాళ్ళు సూచించిన మార్గాల్లో నడిచాను. అవన్నీ నాకు ఎంతో నేర్పాయి. ఎంతో జ్ఞానాన్ని సంపాదించాను. యిప్పుడు మీ దగ్గరకు వచ్చాను. మీ శిష్యుడుగా చేరుదామని సంకల్పించాను. అప్పుడు నేను జ్ఞానమనే బావి నించీ నీళ్ళు తోడి తాగుతాను. అప్పడు నేను మరింత ఎదుగుతాను. విద్యాధికుణ్ణవుతాను. మార్మిక మార్గంలో బహుదూరం సాగుతాను” అన్నాడు.

అతను చెప్పిన దంతా బహాయుద్దీన్‌ విన్నాడు. బదులు చెప్పలేదు. అప్పుడు భోజన సమయమయింది. అతన్ని భోంచెయ్యమని చెప్పాడు. గురువుగారి ఆహ్వానం అంగీకరించి అతను భోంచెయ్యడానికి అంగీకరించాడు. బహాయుద్దీన్‌ స్వయంగా తానే అతనికి వడ్డించాడు. అది అతనికి మరింత ఆనందదాయకమయింది.

ఆ వ్యక్తి ప్లేటులో పెట్టినవన్నీ తినేశాడు. అతను తింటున్నంత సేపు బహాయుద్దీన్‌ అతన్నే చూస్తూ నిల్చున్నాడు. అతను లేవబోతోంటే గురువు అతన్ని వారించి కూర్చోమని చెప్పాడు. మళ్ళీ ప్లేటులో రొట్టెలు, కూరలు వేశాడు. తినమన్నాడు. గురువు గారి అభిమానానికి అతను మొహమాట పడి వాటిని కూడా కష్టపడి తిన్నాడు. కడుపు నిండిపోయింది. మరీ ఎక్కువగా తినాల్సి రావడంతో ఆయాసం వచ్చింది.

ఖాళీ ప్లేటులో బహాయుద్దీన్‌ మళ్ళీ వడ్డించాడు. అతను వద్దు వద్దని వారించాడు. గురువు తినాలి అన్నాడు. అతను ప్లేటులోని రొట్టెల్లో ఒక రొట్టెను, కూరను అతి కష్టంమీద తిని “ఇక నావల్ల కాదు, నేను తినలేను” అన్నాడు.

అప్పుడు బహాయుద్దీన్‌ “ఇప్పటికే అలవి మీరినంత, అరగలేనంత తిన్నావు. అట్లాగే అందరి గురువుల దగ్గర జీర్ణించుకోలేనంత ఆధ్యాత్మిక ఆహారాన్ని తిన్నావు. భోజనం మానేశావు కానీ ఆధ్యాత్మిక భోజనం ఇంత వరకు తిన్నది అరగకున్నా మళ్ళీ ఇంకా కావాలని నా దగ్గరకు వచ్చావు. నేను చెప్పిన మార్గాన్ని అనుసరిస్తే నీ ఆధ్యాత్మిక ప్రయాణంలో స్పష్టత ఏర్పడేలా చేస్తాను. అప్పుడు నీకు అది అరుగుతుంది. ఆహారం అరిగి శరీరానికి బలం చేకూరినట్లు నీకు ఆధ్యాత్మిక బలం మనసుకు సమకూరుతుంది” అన్నాడు.

అతను గురువు మాటలకు తలవొగ్గి గొప్ప జ్ఞానవంతుడయ్యాడు. భవిష్యత్తులో గొప్ప సూఫీ గురువయిన ఖలీల్‌ అహ్రఫ్‌ జూదా అతనే.

– సౌభాగ్య

First Published:  14 July 2015 1:01 PM GMT
Next Story