Telugu Global
Family

సందేశం (Devotional)

ఒక సూఫీ గురువు హజ్‌యాత్రకు మక్కాకు బయల్దేరాడు. అతను చాలా దూరప్రాంతంనించీ తీర్థయాత్ర చేశాడు. మార్గమధ్యంలో ఎన్నో గ్రామాలు, పట్టణాలు వచ్చాయి. ప్రతిచోటా అందరూ ఆ సూఫీ గురువును గౌరవించి ఏమయినా సందేశమివ్వమని అభ్యర్థించారు. కానీ ఆయన ఏమీ బదులివ్వకుండా చిరునవ్వు నవ్వేవాడు.             కానీ ఒక పట్టణంలో వాళ్ళు ఆయన్ని గౌరవించి తమకు ఏదయినా సందేశమివ్వాలని కోరారు. కానీ ఆయన చిరునవ్వునవ్వి ముందుకు సాగడానికి ప్రయత్నించాడు కానీ వాళ్ళు వదిలిపెట్టలేదు. ఇక తప్పదని ఆయన సమీపంలో […]

ఒక సూఫీ గురువు హజ్‌యాత్రకు మక్కాకు బయల్దేరాడు. అతను చాలా దూరప్రాంతంనించీ తీర్థయాత్ర చేశాడు. మార్గమధ్యంలో ఎన్నో గ్రామాలు, పట్టణాలు వచ్చాయి. ప్రతిచోటా అందరూ ఆ సూఫీ గురువును గౌరవించి ఏమయినా సందేశమివ్వమని అభ్యర్థించారు. కానీ ఆయన ఏమీ బదులివ్వకుండా చిరునవ్వు నవ్వేవాడు.

కానీ ఒక పట్టణంలో వాళ్ళు ఆయన్ని గౌరవించి తమకు ఏదయినా సందేశమివ్వాలని కోరారు. కానీ ఆయన చిరునవ్వునవ్వి ముందుకు సాగడానికి ప్రయత్నించాడు కానీ వాళ్ళు వదిలిపెట్టలేదు. ఇక తప్పదని ఆయన సమీపంలో ఉన్న మసీదులోకి వెళ్ళాడు. అందరూ అనుసరించారు. ఆయన సందేశమివ్వడానికి అంగీకరించారు. అందరూ ఆసక్తిగా చూశారు.

ఆ సూఫీ గురువు జనాల్ని చూసి “నేను ఏం చెప్పబోతున్నానో మీకు తెలుసా!” అని అడిగాడు.

వాళ్ళు “గురువు గారూ! మీరు ఏం చెప్పబోతున్నారో మాకెలా తెలుస్తుంది?

మేము అజ్ఞానులం. మీరేం చెబుతారో మాకెలా తెలుస్తుంది?” అన్నారు. దానికి సూఫీ గురువు “నేను ఏం చెప్పబోతున్నానో కనీసం తెలుసుకోలేని అజ్ఞానులకు నేను ఏం చెప్పాలి? అందుకని ఏమీ చెప్పను” అన్నాడు.

సూఫీ గురువు అక్కడినించీ బయటికి వచ్చి వెళ్ళసాగాడు. జనాలు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకున్నారు. ఆ హఠాత్‌ పరిణామాన్ని వాళ్ళు ఊహించ లేదు. వెంటనే పరిగెత్తి గురువుగార్ని మళ్ళీ మసీదులోకి తీసుకొచ్చి “నిజమే – మీరు చెప్పింది సరైందే. మీరు మళ్ళీ అడగండి. మా సమాధానం తప్పు – మాకు ఇంకో అవకాశమివ్వండి” అన్నారు.

గురువు “నేను ఏం చెప్పబోతున్నానో మీకు తెలుసా?” అన్నాడు.

వాళ్ళు “అవును. మీరు ఏం చెప్పబోతున్నారో మాకు తెలుసు” అన్నారు.

గురువు “అయితే నేను చెప్పాల్సిందేమీ లేదు. మీకు నేను చెప్పబోయేది ఇప్పటికే తెలిసివుంటే నేను చెప్పడంలో అర్థం లేదు. మీరందరూ జ్ఞానుల్లా ఉన్నట్లున్నారు. ఇక నేను చెప్పడమెందుకు?” అన్నాడు.

ఆ మాటల్తో జనాలు మళ్ళీ గందరగోళంలో పడ్డారు.

మళ్ళీ గురువు గారు మసీదునించీ బయట పడ్డాడు.

మళ్ళీ జనం వాళ్ళలో వాళ్ళు గుసగుసలాడుకున్నారు.

ఆ సుఫీ గురువు ఆ రాత్రి ఆ పట్టణంలోనే బస చేశాడు.

జనం చర్చించుకుని అర్ధరాత్రి వెళ్ళి గురువు గారిని నిద్రలేపి “గురువు గారూ! మేము ఇచ్చిన సమాధానం తప్పు. దయ చేసి మళ్ళీ అడగండి. ఈసారి సరయిన సమాధానమివ్వడానికి ప్రయత్నిస్తాం” అన్నారు.

సుఫీ గురువు మళ్ళీ మసీదుకు వచ్చాడు. జనం అనుసరించారు. గురువు “నేను ఏం చెప్పబోతున్నానో మీకు తెలుసా?” అని అడిగాడు.

జనంలో సగం మంది “తెలుసు” అన్నారు.

సగం మంది “తెలీదు” అన్నారు.

వాళ్ళ తెలివి తేటలకు గురువు నవ్వి “మంచిది. తెలిసినవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలియని వాళ్ళకు చెప్పండి. మీకు మీరే సమాధాన పడండి. నా అవసరం లేదు” అని తన దారంట తాను వెళ్ళాడు.

ఇక ఏం చెప్పి గురువుగార్ని వెనక్కి తీసుకురావాలో ఎవరికీ తోచలేదు.

– సౌభాగ్య

First Published:  6 July 2015 1:01 PM GMT
Next Story