Telugu Global
Others

సీమాంధ్ర ఎంపీల్లో చేవ చచ్చిందా?: పవన్‌ ఆగ్రహం

ప్రజలకు న్యాయం చేయలేని పార్లమెంటు సభ్యులు పదవుల్లో ఉండి ప్రయోజనం ఏమిటని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు. మీ వ్యాపారాల కోసం పదవుల్లో కొనసాగవద్దని ఆయన ఎంపీలకు హితవు చెప్పారు. పార్లమెంట్‌ సీట్ల కోసం ఎన్నికల సందర్బంగా వెంపర్లాడిన నేతలు గెలిచి ఇపుడు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. పార్లమెంట్‌కు వెళ్ళి అక్కడ గోడలు చూస్తూ కూర్చుంటారా అని ఆయన ప్రశ్నించారు. ప్రశ్నించాల్సిన ఎంపీలే మౌనంగా ఉంటే ప్రజా సమస్యలు ఎవరు తీరుస్తారని ఆయన ఎంపీలను […]

సీమాంధ్ర ఎంపీల్లో చేవ చచ్చిందా?: పవన్‌ ఆగ్రహం
X
ప్రజలకు న్యాయం చేయలేని పార్లమెంటు సభ్యులు పదవుల్లో ఉండి ప్రయోజనం ఏమిటని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు. మీ వ్యాపారాల కోసం పదవుల్లో కొనసాగవద్దని ఆయన ఎంపీలకు హితవు చెప్పారు. పార్లమెంట్‌ సీట్ల కోసం ఎన్నికల సందర్బంగా వెంపర్లాడిన నేతలు గెలిచి ఇపుడు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. పార్లమెంట్‌కు వెళ్ళి అక్కడ గోడలు చూస్తూ కూర్చుంటారా అని ఆయన ప్రశ్నించారు. ప్రశ్నించాల్సిన ఎంపీలే మౌనంగా ఉంటే ప్రజా సమస్యలు ఎవరు తీరుస్తారని ఆయన ఎంపీలను నిలదీశారు. తాను ఈ మధ్య తన వద్దకు వచ్చిన కొంతమంది కార్యకర్తలు ప్లకార్డులు పట్టుకుని ఉన్నారని, వారి ప్లకార్డులపై కనిపించిన ఓ నినాదాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ‘తిడితే కేసీఆర్‌లా తిట్టండి… లేదా పౌరుషం లేని సీమాంధ్ర ఎంపీల్లా పడి ఉండండి’ అన్నమాటలను తాను ఓ ప్లకార్డుపై చూశానని, ఈరోజు పరిస్థితి చూస్తే అలాగే ఉందని ఆయన ఆవేశంగా అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్రతిపత్తి ఇస్తామని యూపీఏ మాట ఇచ్చిందని, ఆ తర్వాత ఎన్డీయే కూడా దాన్ని సాకారం చేయడానికి ప్రయత్నించిందని, ఇపుడు ఏమైందని ఆయన ప్రశ్నించారు. ఆంధ్ర ప్రయోజనాలను కాపాడకుండా వ్యాపారాల కోసమే మీరు ఎంపీలయ్యేరా అని అవంతి శ్రీనివాస్‌ను, తోట నరసింహంను, సృజనాచౌదరిని, కేశినేని నానిని, రాయపాటి సాంబశివరావుని ఆయన ప్రశ్నించారు. యూపీఏ ఏమనుకుంటుందో, ఎన్డీయే ఏమనుకుంటుందో అని అనుకునే పనైతే మీరు పదవుల నుంచి వైదొలగండి అంటూ ఆయన ఎంపీలను దునుమాడారు. మీ చేతకాని తనాన్ని ప్రజలకు చెబితే వారే తదుపరి కార్యాచరణను రూపొందించుకుంటారని ఆయన ఆవేశంగా అన్నారు. ఆంధ్రకు ప్రత్యేక ప్రతిపత్తి లభించకుండా ఉంటున్న ఈ సమయంలో దీన్ని ప్రశ్నించడానికి ఎంపీలకు ఏంటి సమస్యని అన్నారు. ఇదంతా చూస్తే సీమాంధ్ర ఎంపీలకు ఆత్మగౌరవం అన్నది లేదా అనే సందేహం కలుగుతుందని ఆయన అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో తెలంగాణా ప్రాంత ఎంపీలు ఎంత పోరాడారో కళ్ళారా చూసిన ఎంపీలకు తమకు ప్రత్యేక ప్రతిపత్తి రాని విషయంలో వారి పోరాటాన్ని స్ఫూర్తిగా చేసుకుని పార్లమెంట్‌లో ప్రశ్నించలేరా మీకు ఆ మాత్రం దమ్ము లేదా అని ప్రశ్నించారు. పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా టికెట్‌ కోసం ఎన్నో కబుర్లు చెప్పిన కేశినేని నాని ఎంపీగా గెలిచి ఏం చేస్తున్నారని, పార్లమెంట్‌లో గోడలు చూస్తూ ఆనందిస్తున్నారా అని నిలదీశారు. బీజేపీకి ఇద్దరు ఎంపీలున్నారు. వారు అధిష్టానం న్యాయం చేస్తుందంటున్నారు. ఏది న్యాయం అంటూ ప్రశ్నించారు. ప్రత్యేక ప్రతిపత్తికి వారెంచేస్తున్నారు అని ప్రశ్నించారు. ప్రత్యేక రాష్ట్రం అంశంలో ఉత్తరాది ఎంపీలతో తన్నులు తిన్నవారు సైతం ఇప్పుడు ఎందుకు మాట్లాడలేక పోతున్నారని, ఎంతోమంది సీనియర్‌ ఎంపీలుండి కూడా ప్రత్యేక ప్రతిపత్తి సాధించుకోలేకపోవడం చేతకాని తనమని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. తాను ఇంకా రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా రాలేదని, వచ్చినప్పుడు తనేమిటో చూపిస్తానని పవన్‌ అన్నారు
సెక్ష‌న్-8 డిమాండుకు దారులు తెర‌వ‌ద్దు: ప‌వ‌న్ హెచ్చ‌రిక‌
ఆంధ్రోళ్ళు, సెటిలర్స్‌ అనే పదాలు ఉపయోగించవద్దని చాలాసార్లు చెప్పానని, బాధ్యతగల పదవుల్లో ఉన్నవారు ఇలాంటి మాటలు మాట్లాడితే అది ప్రజల్లోకి వ్యతిరేక సంకేతాలను పంపుతుందని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ హెచ్చ‌రించారు. ఆంధ్ర అనేది ఒక జాతి అని, అది ఒక పార్టీకో, ఒక వ్య‌క్తికో, ఒక కులానికో సంబంధించిన‌ది కాద‌న్న విష‌యం నాయ‌కులు గుర్తించాల‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు. కులాల గురించి మాట్లాడడమంటే తనకు చిరాకని, కాని ఆంధ్ర అనే పదం కులానికి చిహ్నంలాగ‌, అదేదో చంద్రబాబుకు మాత్ర‌మే వ‌ర్తించే ప‌ద‌మ‌న్న‌ట్టు మాట్లాడుతున్నారని, చంద్రబాబునిగాని, తెలుగుదేశంనుగాని తిట్టాలంటే వారి పేర్లతోనే తిట్టాలని ఆయన హిత‌వు చెప్పారు. ఇటీవ‌ల ఓ స‌భ‌లో ఆంధ్రోళ్ళ పార్టీ అని మంత్రి హ‌రీష్‌రావు అన‌డాన్ని ప్ర‌స్తావిస్తూ చంద్రబాబుని, తెలుగుదేశం పార్టీని తిట్టడానికి ఆంధ్రోళ్ళ పార్టీ అనిగాని, ఆంధ్రోళ్ళనిగాని అంటే అది ఆంధ్రుల మనోభావాలను దెబ్బతీస్తుందని, ఇలాంటప్పుడే సెక్షన్‌ -8 అమలుకు అందరూ డిమాండు చేస్తారని, ఆ పరిస్థితి తేవద్దని టీఆర్‌ఎస్ నాయ‌కుల‌కు హితవు చెప్పారు. ఆంధ్రులు అన్ని పార్టీల్లో ఉన్నార‌నే విష‌యం మ‌రిచిపోవ‌ద్ద‌ని ఆయ‌న గుర్తు చేశారు. ఆంధ్రుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసే ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌కుండా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందడుగు వేయాలని పవన్‌ కోరారు. వాస్తవానికి సెక్షన్‌ -8కి తాను వ్యతిరేకమని, కాని దాన్ని అమ‌లు చేయాల‌న్న డిమాండు తీసుకురాకుండా నాయ‌కులు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ఆయ‌న సూచించారు.
విభ‌జ‌న ద్వారా ఆంధ్ర‌కు ఆన్యాయం నిజ‌మే
విభజన ద్వారా ఆంధ్రకు అన్యాయం చేశారని, ఏపీ పాలకులు అన్యాయాన్ని దిగమింగుకోవాలని పవన్‌ అన్నారు. ఈ అన్యాయాన్ని సరిదిద్ద వ‌ల‌సిన బాధ్య‌త కేంద్ర ప్ర‌భుత్వం తీసుకోవాల‌ని, సీమాంధ్ర ఎంపీలు లోక్‌స‌భ‌లో గ‌ళం ఎత్తితే జ‌రిగిన న‌ష్టం భ‌ర్తీ అవుతుంద‌ని ఆయ‌న చెప్పారు. ఇరు రాష్ట్రాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ పరిస్థితులు మారకపోతే శ్రీ‌లంక‌లో వ‌చ్చిన‌ట్టు జాతుల మ‌ధ్య వైరం ఏర్ప‌డుతుంద‌ని, ఇది క్రమంగా సివిల్‌ వార్‌కు దారి తీస్తుందని, ఇప్పటికిప్పుడు జరగకపోయినా ద‌శాబ్దం త‌ర్వాతో, రెండు దశాబ్దాల తర్వాతో ఈ పరిస్థితి ఏర్ప‌డుతుంద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ హెచ్చ‌రించారు. మీడియా స్వేచ్ఛ‌ను రాజ‌కీయ పార్టీలు హ‌రిస్తున్నాయ‌ని, దీనివ‌ల్ల ప్ర‌జల‌కు విష‌యాలు తెలియ‌వ‌నుకుంటే అంత‌క‌న్నా అజ్ఞానం మ‌రొక‌టి ఉండ‌ద‌ని ప‌వ‌న్‌ అన్నారు.
ఫోన్ ట్యాపింగ్ తీవ్ర‌మైన నేరం
ఫోన్‌ ట్యాపింగ్‌ అనేది చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను గాలికొదిలేసి ఫోన్ ట్యాపింగ్‌ల‌పై దృష్టి పెట్ట‌డం ప్ర‌జా ద్రోహ‌మ‌ని జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు. చాలా త‌క్కువ‌గా మాట్టాడినా తన అభిప్రాయాలు తనకున్నాయని, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎవరు మాట్లాడినా బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన అవసరం ఉందని పవన్‌ అన్నారు. రాజకీయ నాయకులు నోరు పారేసుకోవడం మంచిది కాదని, ఇది ప్రజలకు చేటు చేస్తుందని ఆయన అన్నారు. తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ టీడీపీని వదిలి టీఆర్‌ఎస్‌లోకి వెళ్ళినా ఆయన సనత్‌నగర్‌ ప్రజల నమ్మకాన్ని తన వెంట తీసుకెళ్ళ‌గలరా అని ఈసంద‌ర్భంగా ప‌వ‌న్‌ ప్రశ్నించారు. కంట్లో దూలాలు పెట్టుకుని ఎదుటి వాళ్ళ కళ్ళలో నలుసులు వెదుకుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని ప‌వ‌న్‌ అన్నారు. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో ఉన్న యూపీయే, ఎన్డీయే పార్టీల‌కు చెందిన నాయ‌కులతో ఓ కమిటీని వేయాలని, ఇక్కడ జరుగుతున్న పరిణామాలను నిష్పక్షపాతంగా నేరుగా పీఎంఓ కార్యాలయానికి రిపోర్టు చేసేలా ఆ క‌మిటీ ఉండాల‌ని, దీనివల్ల సమస్యలు పరిష్కారమవుతాయని పవన్‌ కల్యాణ్‌ సూచించారు.
తెలుగువారి స‌యోధ్య‌కు కేసీఆర్ మార్గ‌ద‌ర్శ‌కుడు
యాదాద్రికి ఆర్కిటెక్ట్‌గా విజయనగరం జిల్లాకు చెందిన ఓ వ్యక్తిని నియమించడం ద్వారా తెలుగు జాతి ఐక్యతకు కేసీఆర్‌ తొలి అడుగు వేశారని పవన్‌ కితాబిచ్చారు. తెలుగు జాతి ఐక్యత జాతీయ సమగ్రతలో ఒక భాగమని దేశ ప్రధాని నరేంద్రమోడి చెప్పిన విషయం తనకు ఎప్పుడూ గుర్తొస్తుందని ఆయన అన్నారు. ప్రజా సమస్యలు తీర్చడం మానేసి, నెల రోజుల నుంచి ఇరు ప్రభుత్వాలు కేసులపైనే దృష్టి పెట్టి ముందుకు వెళుతున్నాయ‌ని, సయోధ్యతో కలిసి పని చేయాల్సిన ప్రభుత్వాలు ఘర్షణాత్మక వైఖరి అవలంభిస్తున్నాయ‌ని, ఇది అంతర్గత ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తుందని ఆయన అన్నారు.
First Published:  6 July 2015 6:50 AM GMT
Next Story