Telugu Global
Family

బామతి (Devotional)

ఒక గొప్ప పనివెనక కేవలం ఒక వ్యక్తి శ్రమ మాత్రమే ఉండదు. పేరుమాత్రం ఆ పనిని నిర్వహించిన ఆ వ్యక్తికే వస్తుంది. గొప్ప ఆవిష్కారాలు చేసిన వారికి పేరు ప్రతిష్టలు వస్తాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా దానికి సహకరించిన వాళ్ళు అజ్ఞాతంగానే ఉండిపోతారు. అట్లాంటి అజ్ఞాత వ్యక్తులపట్ల కృతజ్ఞత ప్రకటించిన వాళ్ళు అరుదుగా ఉంటారు.             భారతీయ ప్రాచీన వాఙ్మయంలో “బ్రహ్మసూత్రాలు” మహోన్నత గ్రంథం. ఎందరినో ప్రభావితం చేసిన అత్యున్నత ఆధ్యాత్మిక గ్రంథమది.             వాచస్పతి మిశ్రుడు బ్రహ్మసూత్రాలకు […]

ఒక గొప్ప పనివెనక కేవలం ఒక వ్యక్తి శ్రమ మాత్రమే ఉండదు. పేరుమాత్రం ఆ పనిని నిర్వహించిన ఆ వ్యక్తికే వస్తుంది. గొప్ప ఆవిష్కారాలు చేసిన వారికి పేరు ప్రతిష్టలు వస్తాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా దానికి సహకరించిన వాళ్ళు అజ్ఞాతంగానే ఉండిపోతారు. అట్లాంటి అజ్ఞాత వ్యక్తులపట్ల కృతజ్ఞత ప్రకటించిన వాళ్ళు అరుదుగా ఉంటారు.

భారతీయ ప్రాచీన వాఙ్మయంలో “బ్రహ్మసూత్రాలు” మహోన్నత గ్రంథం. ఎందరినో ప్రభావితం చేసిన అత్యున్నత ఆధ్యాత్మిక గ్రంథమది.

వాచస్పతి మిశ్రుడు బ్రహ్మసూత్రాలకు అపూర్వమయిన వ్యాఖ్యానం రాశాడు. ఆయన ఆ పనిని ఆయన గురువు ఆదేశంతో చేశాడు. ఆ గురువు బ్రహ్మ సూత్రాలకు భాష్యం రాయమని చెప్పడమే కాక తన కూతుర్ని వాచస్పతి మిశ్రుడి కిచ్చి పెళ్ళి చేశాడు. కొంత కాలానికి గురువు చనిపోయాడు.

వాచస్పతి మిశ్రుడు బ్రహ్మసూత్రాలకు వ్యాఖ్యానం రాయడంలో సర్వాత్మనా లీనమైపోయాడు. ప్రపంచాన్నే మరచిపోయాడు. అదే జీవితంగా నిరంతర ధ్యానంలో నిమగ్నమయిపోయాడు. ఒకటి, రెండు, అలా ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి.

ఆయన ఆ రచనలో మునిగిపోయి కాలాన్ని మరచిపోయాడు. పరిసరాల్ని విస్మరించాడు. తన ఉనికినే మరచిపోయాడు. చివరికి బ్రహ్మసూత్ర భాష్యం సిద్ధమయింది. అప్పుడు ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. వ్యాఖ్యానం పూర్తయింది. ఇప్పుడు దానికి పేరు పెట్టడమొక్కటే మిగిలింది.

అది సాయం కాలం. ఒక వృద్ధురాలు దీపం వెలిగిస్తోంది. ఆమె తెల్లటి వెంట్రుకులపై దీపం కాంతి ప్రతిఫలిస్తోంది. వాచస్పతి మిశ్రుడు ఆమెను చూసి “అమ్మా! మీరు ఎవరు?” అన్నాడు. ఆమె “మీరు రాసుకుంటున్నారు కదా! మీ పని కానివ్వండి” అంది. వాచస్పతి మిశ్రుడు “నేను రాయడం పూర్తి చేశాను. ఇంతకూ మీరెవరో చెప్పండి” అన్నాడు.

ఆమె వాచస్పతి మిశ్రుడి కళ్ళలోకి చూసి “నేను మీ భార్యను” అంది.

వాచస్పతి మిశ్రుడు దిగ్బ్రాంతి చెందాడు. కారణం ముప్పయ్యేళ్ళపాటు అతను భార్యను, ప్రపంచాన్ని విస్మరించాడు. అతనికి ఏ ఆటంకం కలగకుండా అన్ని పనులూ అన్నేళ్ళుగా చేస్తూవుంది. వాచస్పతి మిశ్రుడు కన్నీళ్ళతో “ఇన్నేళ్ళుగా నువ్వు ఎందుకు నాతో మాట్లాడలేదు?” అన్నాడు.

ఆమె “మీరు వ్యాఖ్యాన రచనలో మునిగిపోయారు. మిమ్మల్ని ఆటంకపరచాలని నాకు అనిపించలేదు” అంది. అతను “నువ్వు గొప్ప స్త్రీవి. నాకోసం నీ సమస్త యవ్వనాన్ని, జీవితాన్ని త్యాగం చేశావు. అంత గొప్ప త్యాగానికి నేను నీకు ఏమివ్వగలను” అన్నాడు పశ్చాత్తాపంగా.

ఆమె చేతులు జోడించి “అంతమాట అనకండి. నేను త్యాగం చెయ్యలేదు. మీకు అన్నీ అమర్చి పెట్టడంలో ఆనందం పొందాను. మీ పవిత్ర కార్యంలో భాగస్వామిని కాగలగడం నా అదృష్టంగా భావించాను. అంతకుమించి నేను ఏమీ ఆశించలేదు” అంది.

వాచస్పతి మిశ్రుడి కంఠం గద్గదమయింది. కళ్ళనించి నీళ్ళు జలజలా రాలాయి. “నేను నిజానికి నీకు ఏమీ ఇవ్వడానికి అసమర్థుణ్ణి. జీవితమిచ్చినా నీ రుణం తీరదు. నేను చెయ్యగల పని ఒకటే. నా జీవితమంతా శ్రమపడి రాసిన ఈ వ్యాఖ్యానానికి నీ పేరు పెడుతున్నా” అన్నాడు. ఆ భాష్యం పేరు బామతి. వాచస్పతి మిశ్రుడి భార్యపేరు “బామతి”.

– సౌభాగ్య

First Published:  4 July 2015 1:01 PM GMT
Next Story