Telugu Global
Family

వెంట వచ్చేవి (Devotional)

ఒక వ్యాపారస్థుడు పరమలోభి. కాకికి కూడా చెయ్యి విదల్చని వాడు. ఇవ్వడమే తప్పని, తీసుకోవడమే ఒప్పని భావించే రకం. ఎప్పుడూ మాసిన బట్టలు వేసుకునేవాడు. సరయిన తిండి తినేవాడు కాదు. అతనికి స్నేహితులెవరూ లేరు. ఒక వ్యక్తి ఉండేవాడు. అతను టైలర్‌. కొంతకాలం క్రితమే అతను చనిపోయాడు. వ్యాపారస్థుడు కోట్లు కూడ బెట్టాడు. ఒకరోజు హఠాత్తుగా అనారోగ్యం పాలయి మంచమెక్కాడు.             ఎటువంటి నీచుణ్ణయినా చివరిక్షణాల్లో అందరూ చూడడానికి వస్తారు. ఇరుగుపొరుగు జనాలు వచ్చి పరామర్శించారు.             […]

ఒక వ్యాపారస్థుడు పరమలోభి. కాకికి కూడా చెయ్యి విదల్చని వాడు. ఇవ్వడమే తప్పని, తీసుకోవడమే ఒప్పని భావించే రకం. ఎప్పుడూ మాసిన బట్టలు వేసుకునేవాడు. సరయిన తిండి తినేవాడు కాదు. అతనికి స్నేహితులెవరూ లేరు. ఒక వ్యక్తి ఉండేవాడు. అతను టైలర్‌. కొంతకాలం క్రితమే అతను చనిపోయాడు. వ్యాపారస్థుడు కోట్లు కూడ బెట్టాడు. ఒకరోజు హఠాత్తుగా అనారోగ్యం పాలయి మంచమెక్కాడు.

ఎటువంటి నీచుణ్ణయినా చివరిక్షణాల్లో అందరూ చూడడానికి వస్తారు. ఇరుగుపొరుగు జనాలు వచ్చి పరామర్శించారు.

చనిపోయిన టైలర్‌కు ఒక కొడుకున్నాడు. అతను ఇరవై ఏళ్ళ యువకుడు. బుద్ధిమంతుడు, వివేకవంతుడు. ఆ యువకుడు కూడా తన తండ్రి మిత్రుడయిన వ్యాపారస్థుణ్ణి చివరిచూపు చూడడానికి వచ్చాడు. అది తన ధర్మంగా భావించాడు.

పడకమీద ఉన్న వ్యాపారస్థుడు ఆ యువకుణ్ణి చూసి తన మిత్రుణ్ణి చూసినంత సంబరపడిపోయి ఆనందించాడు. క్షేమ సమాచారాలు విచారించాడు. “ఇవి నా చివరి ఘడియలు” అన్నాడు. యువకుడు “మీరు దిగులుపడకండి, మీరు కోలుకుంటారు, ఆరోగ్యవంతులవుతారు” అని ఓదార్పుగా అన్నాడు. వ్యాపారస్థుడు లేదు నేను చనిపోతానని నాకు తెలుసు. అంతేకాదు, నేను స్వర్గానికి కూడా వెళతాను. సందేహం లేదు. మీ నాన్న కూడా స్వర్గంలో ఉంటాడు. మీ నాన్నకు ఏమైనా చెప్పాలా? అన్నాడు.

యువకుడు వ్యాపారస్థుణ్ణి పరిశీలించి చూసి “మా నాన్న స్వర్గంలో ఉన్నాడని నాకు తెలుసు అంతేకాదు. అక్కడ దేవుని బట్టలు కుడుతున్నాడు. అయితే వెళ్ళేటప్పుడు సూది తీసుకుపోవడం మరచిపోయాడు. నేను తెచ్చిస్తాను. అది మాత్రం తప్పక మానాన్నకు అందచేయండి” అన్నాడు. వ్యాపారస్థుడు “తప్పకుండా అంతకంటేనా?” అన్నాడు.

యువకుడు ఇంటికి వెళ్ళి సూది తీసుకొచ్చి వ్యాపారస్థుడికి ఇచ్చాడు. యువకుడు వెళ్ళిపోయాకా వ్యాపారస్థుడు ఆలోచనలో పడ్డాడు. స్వర్గానికి వెళ్ళేటప్పుడు జోబులో పెట్టుకుంటే ఎలా ఉంటుంది? అని ఆలోచించాడు. మరి బట్టల్తో బాటు శరీరాన్ని తగల బెడతారు కదా! నోట్లోపెట్టుకుంటే ఎలా ఉంటుంది? అనుకున్నాడు. శరీరమే కాలిపోతే నోటి సంగతి ఏం చెప్పాలి? అనుకున్నాడు. చివరికి సూదిని స్వర్గానికి తీసుకెళ్ళడం అసంభవం అని నిర్ణయానికి వచ్చాడు. యువకుణ్ణి పిలిపించమని కబురు పంపాడు. యువకుడు వచ్చాడు.

“ఈ సూదిని నాతోబాటు తీసుకెళ్ళడం కష్టమయ్యా! ఎంత ఆలోచించినా అది అసంభవమనిపిస్తోంది” అన్నాడు.

యువకుడు “మీరు అన్యధా భావించకండి. మీరు స్వర్గానికి వెళతానని ఏ నమ్మకంతో చెబుతున్నారు! మీరు మీ జీవితకాలంలో ఎప్పుడూ ఎవరికీ ఏ సాయం చేయనివారు. మంచిపని అంటే ఏమిటో మీకు తెలీదు. అందర్నీ దోచుకుని కోట్లు కూడ బెట్టారు. సూదినే వెంట తీసుకెళ్ళలేని వారు కోట్లని ఎలా వెంట తీసుకెళతారు. మీరు నిజంగా స్వర్గానికి వెళ్ళదలచుకుంటే దానధర్మాలు చేయండి. పేదలకు సాయపడండి. జీవితానికి అర్థం ఏర్పడుతుంది. ఈ లోకంలో అర్థవంతమయిన జీవితం గడిపితే పరలోకంలోనూ అర్థవంతంగా ఉంటుంది” అన్నాడు.

ఆ మాటలు వ్యాపారస్థుడి గుండెల్లో గుచ్చుకున్నాయి. వెంటనే తన ఆస్తిని దానధర్మాలకు, ధర్మ సత్రాలకు, ఆలయాలకు రాసేశాడు.

అనుకోకుండా హఠాత్తుగా అతని ఆరోగ్యం బాగుపడింది. వ్యాపార బాధ్యతల్ని కొడుకులకు అప్పగించి వాళ్ళపై అజమాయిషీకి ఈ యువకుణ్ణి నియమించి ఆధ్యాత్మిక చింతనలో శేష జీవితం గడిపాడు.

– సౌభాగ్య

First Published:  27 Jun 2015 1:01 PM GMT
Next Story