Telugu Global
Family

కర్ణుడు (For Children)

కర్ణుడు దాన గుణం కలవాడు. వీరగుణం కలవాడు. శూరుడిగా ప్రకాశించినవాడు. అందుకనే దాన వీర శూర కర్ణుడిగా పేరు పొందాడు. భారతంలో ప్రత్యేకత ఉన్న పాత్రేకాదు, ప్రాధాన్యత ఉన్న పాత్ర! అదుకనే “కర్ణుడి లేని భారతమా?” అని నానుడీ వచ్చింది! స్నేహానికి చిరునామా కూడా కర్ణునిదే! దాన వీర గుణాలకే కాదు, విషాదానికీ అతడే! “కర్ణుడి చావుకి వంద కారణాలు” తెలియాలంటే పుట్టుక నుండి చావు వరకూ అడుగడుగునా స్వార్ధాలతో శాపాలతో నిండివున్న అతని కథ తెలుసుకోవాల్సిందే! […]

కర్ణుడు దాన గుణం కలవాడు. వీరగుణం కలవాడు. శూరుడిగా ప్రకాశించినవాడు. అందుకనే దాన వీర శూర కర్ణుడిగా పేరు పొందాడు. భారతంలో ప్రత్యేకత ఉన్న పాత్రేకాదు, ప్రాధాన్యత ఉన్న పాత్ర! అదుకనే “కర్ణుడి లేని భారతమా?” అని నానుడీ వచ్చింది! స్నేహానికి చిరునామా కూడా కర్ణునిదే! దాన వీర గుణాలకే కాదు, విషాదానికీ అతడే! “కర్ణుడి చావుకి వంద కారణాలు” తెలియాలంటే పుట్టుక నుండి చావు వరకూ అడుగడుగునా స్వార్ధాలతో శాపాలతో నిండివున్న అతని కథ తెలుసుకోవాల్సిందే!

కర్ణుని కన్నతల్లి కుంతి. దూర్వాసుడిచ్చిన వరాన్ని పరీక్షించి సూర్యునివల్ల కర్ణుని కన్నది. పెళ్ళికాకుండా బిడ్డని కనడం వల్ల గంగలో వదిలిపెట్టింది. అతిరధుడనే సూతుడికి దొరికాడు. అతని భార్య రాధ పెంచిన తల్లయింది. రాధ పెంచింది కాబట్టి రాధేయుడైనాడు. సూర్యతేజస్సుతో సహజ కవచ కుండలాలతో పుట్టాడు కాబట్టి కర్ణుడైనాడు. సూత కులపు వాడిగా కర్ణునికి ధనుర్విద్యను నేర్పినా, బ్రాహ్మణుడని అబద్దం చెప్పినా నేర్చిన విద్య మిగల్లేదు. పరుశురాముడు కర్ణుడి ఒడిలో తలపెట్టుకొని నిద్రిస్తున్న వేళ కీటకం తొడను దొలిచింది. రక్తం స్రవిస్తున్నా గురువుగారు లేస్తారని ఓపిక పట్టాడు. లేచి చూచిన పరుశురాముడు సహనం వల్ల బ్రాహ్మణుడువి కాదని గ్రహించి, అసలు విషయం తెలుసుకొని శపించాడు. అవసర మొచ్చినప్పుడు నువ్వు నేర్చుకున్న విద్య నీకు జ్ఞాపకం రాదు, పనికిరాదు అని. కులం తక్కువని అర్జునునిపై పోటీకి దిగిన కర్ణుణ్ణి కృపాచార్యుడు కాదన్నాడు. కాని దుర్యోధనుడు కర్ణుణ్ణి అంగరాజ్యానికి అధిపతిని చేసి అవమానాన్ని అధిగమించడమే కాదు, రాజపుత్రులతో సమానమైన హోదా కల్పించాడు. కర్ణుడు దుర్యోధనుని తన స్నేహితునిగా భావించి చివరివరకూ అతని వైపే నిలబడ్డాడు. కన్న మమకారానికి కాదు కదా దేనికీ లొంగ లేదు. అయితే దుర్యోధనుని ఎత్తుగడలను కాదని యుద్ధం ద్వారానే విజయం సాధించాలని రాజనీతిని నమ్మి నడిచాడు. స్నేహితుని అభీష్టము తెలిసి కౌరవపాండవుల మధ్య సంధిని కాదన్నాడు. దాంతో భీష్ముని వల్ల నిష్టూరమూ పడ్డాడు. యుద్ధంలో భీష్మునికి సాయపడనని చెప్పి, చివరి వరకూ ఆ కురు వృద్ధునితో మౌనంగానే ఉన్నాడు.

రాయబారిగా వచ్చిన కృష్ణుడు కర్ణుని రథమెక్కించి ఏకాంత ప్రదేశానికి తీసుకు వెళ్ళి ధర్మరాజుకన్నా నీవే పెద్దవాడవని, నీకే పట్టాభిషేకమని పాండవులతో కలవమని ఆశ చూపాడు – కాదన్నాడు కర్ణుడు. ధర్మరాజుకే ఆ హక్కు గెలిస్తే ఉంటుందన్నాడు. అన్నీ తెలిసి కుంతినిగాని, పాండవులను గాని దూషించలేదు. తర్వాత కుంతి యుద్ధ సమయంలో రహస్యంగా కలిసినప్పుడూ అంతే. గెలిచినా ఓడినా దుర్యోధనునితోనే ఉంటానన్నాడు. అయితే కర్ణుడికి కన్నపేగునూ కన్నీరునూ చూపించి ఒక్క అర్జునునికి తప్ప మరెవరికీ ప్రాణ హాని తలపెట్టననేలా మాట తీసుకుంది కుంతి. అందుకే యుద్ధంలో ధర్మరాజు, సహదేవులను చంపే అవకాశం వచ్చినా వదిలేసాడు కర్ణుడు. ఘటోత్కచుని వంటి రాక్షసజాతి వీరుణ్ని చంపింది కర్ణుడే!

సారధిగా ఉండాల్సిన శల్యుడూ సూత పుత్రుడని కర్ణున్ని అవమానించాడు. దుర్యోధనుని వల్ల సారధిగా ఉన్నా నిత్యమూ కర్ణుని తక్కువ చేసి శత్రువులను ఎక్కువ చేసి కర్ణుని ఓటమి కారకుల్లో ఒకడయ్యాడు. తండ్రిముందే హెచ్చరించినా మారువేషంలో అర్థించిన ఇంద్రునికి కవచకుండలాలు కోసి ఇచ్చాడు. ఇంద్రుడు సహితం కర్ణుని త్యాగానికి తలదించుకున్నాడు. కొడుకు అర్జునుణ్ని కాపాడాలన్న స్వార్ధంతో ఇంద్రుడలా చేసాడు. కవచ కుండలాలున్నంతవరకూ కర్ణుణ్ణి ఎవరూ గెలవలేరు. యుద్ధంలో ఉండగా సారధి శల్యుడు లక్ష్యాన్ని తప్పిస్తుండగా మరోవైపు రథచక్రం భూమిలోకి దిగింది. దానికీ కారణం ఉంది. పరశురాముని దగ్గర విద్య నేర్చుకున్న సమయంలో కర్ణుడు తెలియక వేసిన బాణం ఆవు ప్రాణాలు తీసింది. అది యాగ ధేనువు. దాంతో ఆ బ్రాహ్మణుడు “యుద్ధంలో నీ రథచక్రం భూమిలోకి కృంగిపోతుంది” అని శపించాడు. ఆ సమయంలోనే శ్రీకృష్ణుని ఆజ్ఞానుసారం అర్జునుడు రథం యెత్తుతున్న కర్ణున్ని బాణమేసి చంపాడు.

కర్ణుడికి వసుసేనుడని పేరు పెట్టినా కర్ణుడిగానే లోకం చెప్పుకుంది. కవచకుండలాలు కోసి ఇవ్వడం వల్ల అంటే కర్తనం చేయడం వల్ల “కర్ణుడు” అని పేరు అచ్చమైన నిర్వచనమైంది. అవమానాలు అధిగమించి స్నేహానికి ప్రాణమిచ్చి దానానికి తనని మించినవారు లేరని కర్ణుని కథ మనకు చెపుతుంది!.

– బమ్మిడి జగదీశ్వరరావు

First Published:  23 Jun 2015 1:02 PM GMT
Next Story