Telugu Global
POLITICAL ROUNDUP

యోగాను మించిన  కళలు

ఆర్థిక ప్రయోజనాలు మాత్రమే అంతిమమని యుద్ధాలకు సైతం వెనుకాడని చాలా ప్రపంచ దేశాలు ‘మరణం’ అనే అంతుచిక్కని విషయం దగ్గరకు వచ్చే సరికి భారతీయ తత్వాన్ని నమ్ముతాయి. ‘మళ్లీ పుట్టుక’ను ఒకానొక ఇండియన్‌ ఫిలాసఫీగా స్థిరపరచిన చాలా మంది ఆధ్యాత్మిక వేత్తలు తద్వారా విదేశీయులను బాగానే ఆకట్టుకోగలిగారు. జీవితాన్ని ఎంతో అనుభవించిన మానవుడు చావు అనే వాస్తవిక సత్యం దగ్గర చివరకు ఏమీ కాకుండా పోవడాన్ని అంత సులువుగా జీర్ణించుకోలేడు. మనిషి దేనిగురించైనా ఆలోచిస్తాడు కానీ మృత్యవును […]

యోగాను మించిన  కళలు
X

ఆర్థిక ప్రయోజనాలు మాత్రమే అంతిమమని యుద్ధాలకు సైతం వెనుకాడని చాలా ప్రపంచ దేశాలు ‘మరణం’ అనే అంతుచిక్కని విషయం దగ్గరకు వచ్చే సరికి భారతీయ తత్వాన్ని నమ్ముతాయి. ‘మళ్లీ పుట్టుక’ను ఒకానొక ఇండియన్‌ ఫిలాసఫీగా స్థిరపరచిన చాలా మంది ఆధ్యాత్మిక వేత్తలు తద్వారా విదేశీయులను బాగానే ఆకట్టుకోగలిగారు. జీవితాన్ని ఎంతో అనుభవించిన మానవుడు చావు అనే వాస్తవిక సత్యం దగ్గర చివరకు ఏమీ కాకుండా పోవడాన్ని అంత సులువుగా జీర్ణించుకోలేడు. మనిషి దేనిగురించైనా ఆలోచిస్తాడు కానీ మృత్యవును కనీసం ఊహల్లోకి కూడా రానీయడు. ఆర్థిక వెసులుబాటుతో సకల భోగాలను అనుభవిస్తున్న నేటి ‘ఆధునికుడు’ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ముఖ్యంగా పదిలమైన ఆరోగ్యంతో ఆయుష్షును పెంచుకోవాలన్న అంశంలో రాజీపడటం లేదు.త భారత ప్రభుత్వం ప్రచారం చేస్తున్న యోగా పట్ల ప్రపంచ దేశాల ఆసక్తి వెనుక ఇదే ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

ఇక -ఆరోగ్యాన్ని కాపాడి ఆయుష్షును పెంచే మహత్తరమైన శక్తి యోగాకు ఉందా? అతి ప్రాచీనమైన భారతదేశ మూలాల్లో యోగా పుట్టుకను వివరిస్తున్న చాలామంది దీని కంటే ముందు ఇంకేదైనా మన జీవనంలో భాగంగా ఉంటూ వచ్చిందా? అన్నదానిని కూడా వివరించాల్సిన తరుణమిది. ఎంచేతనంటే యోగాను మించిన కళలు ఉన్నాయి కాబట్టి. ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన దేశాల్లో చైనా ఒకటి. అయితే అదే ప్రపంచానికి పెద్దగా తెలియని విషయం ఏమిటంటే -అక్కడ ఉన్నన్ని మార్షల్‌ ఆర్ట్స్‌ ఇంకెక్కడా లేవు అని. విచిత్రమేమిటంటే మనం యోగా అవసరాన్ని ప్రపంచానికి చాటాలనుకున్నట్టుగా చైనా వాళ్లు ఆ కళల గురించి అందరీకీ చెప్పాలనుకోవడం లేదు. వాటి గురించి శిక్షణ ఇవ్వాలనీ అనుకోవడం లేదు. దానికి వేరే కారణాలున్నాయి. ఎందుకంటే అవి యోగా కంటే అద్భుతమైనవి. ఇంకా చెప్పాలంటే యోగా వాటిలో నుంచి పుట్టిన ఒక చిన్నపాయ మాత్రమే. మన దేశం నుంచి బౌద్ధం తరలిన దారిలోనే ఈ కళలు కూడా వెళ్లిపోయాయి.

భారతదేశ ప్రాచీన యుద్ధ కళలైన ‘తాయి -చీ’, ‘కుంగ్‌ -ఫూ’, ‘నీ -కుంగ్‌’, ‘చీ-కుంగ్‌’ ఇవన్నీ చైనాకు అంతరాత్మలైపోయాయి. మన పూర్వీకులు తాయి -చీని ‘చలనయోగ’గాను, కుంగ్‌ -ఫూను ‘ధనుర్విద్య’, నీ -కుంగ్‌ ను ‘వీర్య విద్య’, చీ-కుంగ్‌ను ‘ప్రాణవిద్య’ గానూ పిలిచేవారు. క్రీస్తుపూర్వమే ఇవి మనకు దూరమయ్యాయి. మాతంగి కశ్యపుడు, బౌద్ధరశ్మి -వీరిద్దరూ మన ఈ ప్రాచీన కళలను అనువదించి చైనాకు అందజేశారు. టావోయిజాన్ని ఎదుర్కొని చైనాలో బౌద్ధాన్ని వ్యాప్తిలోకి తీసుకురావడానికి బౌద్ధధర్మ ఈ విద్యలను అక్కడి వాళ్లకు వివరించారన్నది చరిత్ర. అయితే, వీటి ఫలాలను పొందిన చైనా దేశీయులు మాత్రం క్రీ.శ 19 శతాబ్దం వరకు ఈ కళల గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియకుండా దాచేయగలిగారు. స్వతహాగా మార్షల్‌ ఆర్ట్స్‌ గురువైన బ్రూస్‌ -లీ తన సినిమాల్లో ఈ విన్యాసాలను చూపించడంతో లోకం దృష్టి వీటిపై పడింది. అలా ప్రాచుర్యంలోకి తెచ్చినందుకు బ్రూస్‌ -లీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. బ్రూస్‌ -లీ, అతని తనయుడు బ్లాండన్‌ -లీ ఇద్దరినీ చైనా ప్రభుత్వం చంపించిందని ఆరోపణలున్నాయి.

తదనంతరం ఈ యుద్ధకళల్లోని మర్మాలను క్రమంగా వెలుగులోకి తెచ్చిన జపాన్‌, కొరియా, థాయ్‌లాండ్‌ వంటి దేశాల్లో వీటికి కొత్త పేర్లు పెట్టి వ్యాపారాలు చేయడం మొదలుపెట్టారు. మన ప్రాచీన యుద్ధ విద్యలు రకరకాల పేర్లతో ఆ విధంగా మనకు కొత్త ముఖాలయ్యాయి. అయితే, ఈ విద్యలను కేవలం ఆత్మరక్షణమే కోసమే కాదు, రుగ్మతలను నివారించడానికి కూడా మన పూర్వీకులు ఉపయోగించేవారు. తద్వారా దేహాన్ని పరిపుష్టం చేసుకోవడానికి ఇవి దోహదపడేవి. సాధారణ రుగ్మతలను, మానసిక, శారీరక దుర్భలతలను మాత్రమే కాకుండా, శరీరంలోని భిన్న అవయవాలకు సోకే ప్రత్యేక వాధులకు వీటి ద్వారా మన ప్రాచీనులు పరిష్కారం కనుగొనేవాళ్లు. ప్రకృతిలోని జీవ శక్తిని వీటి ద్వారా సంగ్రహించి వ్యాధులను జయించడానికి లేదా దరిచేరకుండా నిరోధించడానికి రక్షణ కవచాలుగా ఈ కళలు తోడ్పడేవి. అంతేకాకుండా వీటిని నేర్చుకోవడం ద్వారా ఆత్మవిశ్వాసం పొందవచ్చు. భౌతిక దాడులను సునాయాసంగా తిప్పికొట్టవచ్చు. వీటి పాయగా పుట్టిన యోగాలో ఇలాంటి వెసులుబాటు, శక్తి లేవన్నది నిర్వివాదాంశం.

ఇలాంటి అపురూప సంపద మనకు దూరం కావడం శోచనీయం. ఇంతటి విషాదంలోనూ ఉన్న ఉపశమనం ఏమిటంటే వీటిని తెలిసిన వాళ్లు ఇంకా మనమధ్య ఉండడం. మానసిక -శారీరక ఆరోగ్యానికి యోగా అవసరాన్ని నొక్కి చెబుతున్న భారత ప్రభుత్వం దానికి మూలమైన ఈ విద్యలపైన కూడా దృష్టిసారించాలి. ప్రకృతితో మమేకమై సాగే ‘తాయి -చీ’, ‘కుంగ్‌ -ఫూ’, ‘నీ -కుంగ్‌’, ‘చీ-కుంగ్‌’ వంటివి శక్తి ఉత్ప్రేరకాలు. వీటి ద్వారా ప్రకృతి నుంచి శక్తిని తీసుకుని శరీరంలోని రుగ్మతలను తరిమేయవచ్చు. ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కొనే ఆత్మవిశ్వాసం పొందవచ్చు. ఇంతటి అద్భుత సంపదను కాదని కేవలం యోగాకు ప్రచారం చేయడం తగదు. పైగా యోగాలోని శ్లోకాలు వగైరా మత వాసనలతో పెనవేసుకుని ఉంటాయి. అంచేత కొన్ని మతాల వారు యోగాకు దూరం జరగవచ్చు. కానీ ఈ కళల్లో అలాంటి జాడలు ఉండవు. భారతీయులందరికీ అవసరమైనవీ. ఆమోదయోగ్యమైనవి. యోగా కంటే వేల రెట్లు శక్తిమంతమైనవి ఈ అద్భుత కళలు.

-సంఘమిత్ర

(నేడు ప్రపంచ యోగా దినోత్సవం)

First Published:  21 Jun 2015 1:00 AM GMT
Next Story