Telugu Global
Family

ఆకు (Devotional)

ఆ ఊళ్ళో రబ్బీ అంటే అందరికీ గౌరవం. ఆయన నవ్యరీతిలో భగవంతుని సృష్టి గురించి, పవిత్ర గ్రంథాల గురించి ప్రవచిస్తూవుంటే జనం ఎంతో ఆశ్చర్యంతో వినేవాళ్ళు. ఆయన తన అద్భుతమయిన వాక్పటిమతో, ఆకర్షణీయమయిన రీతితో వినిపిస్తూ ఉంటే అదొక అద్భుతమయిన అనుభవంగా జనం అనుభూతి చెందేవాళ్ళు.             ఒకరోజు ఒక మిత్రుడు రబ్బీని కలవడానికి వచ్చాడు. రబ్బీ అతనికి ఆతిధ్యమిచ్చి సంతృప్తిగా విందుచేసి అతన్ని సంతోషపెట్టాడు. రబ్బీతో బాటు సినగాగ్‌ వెళ్ళి ప్రార్థనలో పాల్గొన్నాడు. మిత్రుడికి కూడా […]

ఆ ఊళ్ళో రబ్బీ అంటే అందరికీ గౌరవం. ఆయన నవ్యరీతిలో భగవంతుని సృష్టి గురించి, పవిత్ర గ్రంథాల గురించి ప్రవచిస్తూవుంటే జనం ఎంతో ఆశ్చర్యంతో వినేవాళ్ళు. ఆయన తన అద్భుతమయిన వాక్పటిమతో, ఆకర్షణీయమయిన రీతితో వినిపిస్తూ ఉంటే అదొక అద్భుతమయిన అనుభవంగా జనం అనుభూతి చెందేవాళ్ళు.

ఒకరోజు ఒక మిత్రుడు రబ్బీని కలవడానికి వచ్చాడు. రబ్బీ అతనికి ఆతిధ్యమిచ్చి సంతృప్తిగా విందుచేసి అతన్ని సంతోషపెట్టాడు. రబ్బీతో బాటు సినగాగ్‌ వెళ్ళి ప్రార్థనలో పాల్గొన్నాడు. మిత్రుడికి కూడా రబ్బీ మంత్ర బద్ధమయిన మాటలంటే ఆసక్తి. అతను కూడా అందరిలాగా రబ్బీ ప్రవచనాల్ని ఆసక్తిగా విన్నాడు.

ప్రార్థన ముగిసింది. రబ్బీ, మిత్రుడు ఇద్దరూ సాయంత్ర వ్యాహ్యాళి కోసం ఊరి బయటికి వెళ్ళారు.

ఆకాశం నిర్మలంగా ఉంది. సంధ్యాకాంతి లోకమంతా నిండి చూపరుల్ని సంభ్రమాశ్చర్యాలకు లోను చేస్తోంది.

రబ్బీ భగవంతుని సృష్టికి మనసులో కృతజ్ఞత ప్రకటించాడు. మిత్రడు రబ్బీని ఆశ్చర్యంగా చూస్తున్నాడు. రబ్బీ మొఖంలోని ప్రశాంతతని పరవశంగా గమనిస్తున్నాడు.

రబ్బీ ఒక్కసారిగా మిత్రుణ్ణి చూసి పట్టలేని ఆనందంతో “చూడు! ఈ నీలాకాశాన్ని చూడు లోకమంతా వ్యాపించిన ఈ సంధ్యా కాంతిని చూడు. చల్లగాలికి కదుల్తొన్న, ఉల్లాసంగా ఊగుతున్న ఈ వృక్షాల్ని చూడు. గూటికోసం వెళుతున్న ఈ పక్షుల్ని చూడు. ఇదంతా ఎంత అద్భుత దృశ్యం. ఇట్లాంటి ప్రపంచాన్ని సృష్టించిన భగవంతుని పట్ల మనం కృతజ్ఞత ప్రకటించాలికదా” అన్నాడు.

మిత్రుడు “అవును. నువ్వు సత్యం పలికావు” అన్నాడు రబ్బీ” ఇది వాస్తవం. మన కళ్ళముందు కనిపించేదంతా భ్రమకాదు. మన అనుభవంలోకి వచ్చే ఈ ప్రపంచం వాస్తవం. దాని సృష్టికర్తకు మనం తలవంచాలి. దేవునికి తరతమ భేదాలు లేవు. సమస్త సృష్టిలోని ప్రతి ప్రాణి ఒక ప్రయోజనం కోసం ఇక్కడికి వచ్చింది” అన్నాడు.

రబ్బీ మాటలు వింటూ అప్రయత్నంగా మిత్రుడు పక్కనున్న చెట్టునించీ ఒక రెమ్మను తెంపి నడుస్తూనే ఆ రెమ్మలోని లేత ఆకుల్ని నలిపి నేలకు విసురుతూ, లేత కొమ్మల్ని విరుస్తూ సాగాడు.

రబ్బీ అతని చర్యను గమనిస్తున్నాడు. అసంకల్పితంగా అతను చేసే అసంగత చర్యను చూస్తున్నాడు.

మిత్రుడితో రబ్బీ “మన పవిత్ర గ్రంథం తాల్మడ్‌లో మనిషి తన చర్యలకు తనే బాధ్యుడు అన్నమాట వుంది. మనం ఇంత వరకూ సృష్టిలోని సౌందర్యం గురించి మాట్లాడుకున్నాం. చరాచరాలన్నీ ప్రాణవంతమయినవని చెప్పుకున్నాం. నువ్వు ఆ మాటలు వింటూనే ఆనాలోచితంగా ఆ రెమ్మను తెంపి ముక్కలు చేసి విసురుతున్నావు. ఎవరయినా దేవుని సృష్టిపట్ల అంత నిర్దయగా ఎందుకుంటారు? దేవుడు వృక్షాన్నయినా ఒక ప్రయోజనాన్ని ఉద్దేశించి సృష్టించాడు కదా! నువ్వేమో ఆ కొమ్మను ముక్కలు ముక్కలు చేశావు. దానికీ శరీరముంది, ప్రాణముంది. అది ఆత్మలో ఒక భాగం. అట్లాంటి ఆత్మలో ఒక భాగాన్ని నువ్వు నిర్దయగా నలిపేశావు. నువ్వు చలనమున్న మనుషుల పట్ల ఎంత స్పృహతోవుంటావో, ప్రాణం లేదనుకున్న దృష్టితో చెట్టును చూస్తున్నావు. కొమ్మని తుంచితే మనిషి చెయ్యి విరిగినట్లు బాధపడిన రీతిలోనే తన కొమ్మ విరిగితే చెట్టు బాధపడుతుంది” అన్నాడు.

అంతవరకూ ఆకుల్ని నలుపుతున్న మిత్రుడు స్పృహలోకి వచ్చి కొమ్మను విసిరి పశ్చాత్తాపంగా దానివైపు చూశాడు.

మిత్రుడు సత్యాన్ని గ్రహించినట్లు స్నేహం నిండిన చూపుల్తో రబ్బీ మిత్రుణ్ణి చూశాడు.

– సౌభాగ్య

First Published:  31 May 2015 1:01 PM GMT
Next Story