Telugu Global
Family

ధృతరాష్ట్రుడు (For Children)

దర్యోధన దుశ్శాసనులైన కౌరవులు వందమంది. తోడ ఒకసోదరి. నూటొక్క మందికి తండ్రి ధృతరాష్ట్రుడు! తల్లి గాంధారి. ధృతరాష్ట్రుడు విచిత్ర వీర్యుని క్షేత్రజ పుత్రుడు. క్షేత్రజుడంటే దేవరాచి న్యాయంతో భార్యకు పుట్టిన వాడని అర్థం. విచిత్రవీరుని మరణంతో సంతానానికి దూరమైన అంబిక, అంబాలికలలో – అంబికకు ఆమె అత్తయిన సత్యవతి ఆజ్ఞతో – భీష్ముని అనుమతితో – వేద వ్యాసునికి పుట్టినవాడే ధృతరాష్ట్రుడు. వ్యాసుని ముని రూపాన్ని చూసి అసహ్యించుకుంటూ అంబిక కళ్ళు మూసుకుంది. అందువల్లనే పుట్టుగుడ్డిగా పుట్టాడు […]

దర్యోధన దుశ్శాసనులైన కౌరవులు వందమంది. తోడ ఒకసోదరి. నూటొక్క మందికి తండ్రి ధృతరాష్ట్రుడు! తల్లి గాంధారి. ధృతరాష్ట్రుడు విచిత్ర వీర్యుని క్షేత్రజ పుత్రుడు. క్షేత్రజుడంటే దేవరాచి న్యాయంతో భార్యకు పుట్టిన వాడని అర్థం. విచిత్రవీరుని మరణంతో సంతానానికి దూరమైన అంబిక, అంబాలికలలో – అంబికకు ఆమె అత్తయిన సత్యవతి ఆజ్ఞతో – భీష్ముని అనుమతితో – వేద వ్యాసునికి పుట్టినవాడే ధృతరాష్ట్రుడు. వ్యాసుని ముని రూపాన్ని చూసి అసహ్యించుకుంటూ అంబిక కళ్ళు మూసుకుంది. అందువల్లనే పుట్టుగుడ్డిగా పుట్టాడు ధృతరాష్ట్రుడు. భీష్ముని పెంపకంలో రాజ విద్యలు నేర్చుకున్నాడు. భీష్ముడే రక్షకుడిగా ఉండి ధృత రాష్ట్రునికి రాజ్యాభిషేకం చేసాడు. తమ్ముడు పాండురాజుకూడా అన్నకు అండదండలందించాడు. ఇష్టపడి ఏరికోరి చేసుకున్నభార్య గాంధారి కళ్ళు ఉండీ భర్త తోడిదే లోకమని కళ్ళకు గుడ్డ కట్టుకుంది. అనురాగమందించింది.

ధృతరాష్ట్రుడు పాండురాజు మరణానికి కలత చెందాడు. కుంతిని చేరదీసాడు. పాండవులూ తన పిల్లలేనని భావించాడు. భీష్ముడూ ధర్మరాజుకు పట్టముకట్టాలనుకోవడం దుర్యోధనునికి నచ్చలేదు. కన్న కొడుకులపై మమకారంతో కుంతినీ ఆమె కొడుకులను వారణాసి పంపించాడు, దారి మధ్యలో ప్రమాదంలో పడి పాండుపుత్రులు మరణించారని తెలిసి చాలా దుఃఖపడ్డాడు. తర్పణాలు వదిలాడు. కొంత కాలానికి వారంతా దృపద నగరంలో ఉన్నారని తెలిసింది. అప్పటికే వారి పట్ల కొంత ద్వేషం పెంచడంలో దుర్యోధనుడు కృత కృత్యుడయ్యాడు. ధృతరాష్ట్రునికి భీష్మ ద్రోణులు బుద్ది చెప్పారు. పాండవులు తమ శక్తియుక్తులతో రాజ్యాన్ని గెలుచుకుంటారని విదురుడు భయపెట్టడంతో అర్ధరాజ్యమివ్వడానికి అంగీకరించాడు. ఖాండవ ప్రస్థంలో రాజధాని నిర్మించుకోమన్నాడు. అంతేకాదు, ధర్మరాజు రాజసూయ యాగం చేసాడని తెలిసి సంతోషించాడు. ఇంతలో శకుని పాండవులను మాయాజూదంలో ఓడించి వారి సిరిని దుర్యోధనుని చేతిలో పెడతానన్నాడు. ఇది తెలిసిన ధృతరాష్ట్రుడు యుద్ధం కంటే జూదమే మేలనుకున్నాడు. విదురుడికి చెప్తే కాదన్నాడు. కాని ధర్మరాజుని దుర్యోధనుడు సవాల్‌ చేయడంతో జూదంలో అన్నిటితో పాటు అర్థాంగిని ఓడడం – ద్రౌపదీ వస్త్రాపహరణానికి దారి తీయడం ఇన్ని జరిగినా ధృతరాష్ట్రుడు నోరు విప్పలేదు. తప్పు గ్రహించి తరువాత కొడుకు తరుపున మన్నింపుని కోరడమే కాదు, ద్రౌపదికి వరాలిచ్చాడు. జూదంలో రాజ్యాన్ని కోల్పోయి పాండవులు అడవులపాలయితే బాధపడ్డాడు. బాధపడడమెందుకు? అర్ధరాజ్యమిస్తే అవస్థలు తీరుతాయని విదురుడు అంటే బాధ స్థానంలో కోపం చోటు చేసుకుంది. విదురున్ని పొమ్మన్నాడు. పాండవుల్లో కలిసాడని వెనక్కి రమ్మన్నాడు. కృష్ణ దైపాయనుని మాటలతో తనకొడుకులదే తప్పనుకున్నాడు. పతనం తప్పదేమోననీ భయపడ్డాడు. బాధపడ్డాడు. సంజయునితో సంధి రాయభారం పంపాడు. అలాగని దుర్యోధనునికెదురు చెప్పలేక పోయాడు. అందుకని విచారించకుండా ఉండలేకపోయాడు. యుద్ధ సమయం రానే వచ్చింది. పద్దెనిమిది రోజుల యుద్ధాన్ని సంజయుడికళ్ళతో చూసాడు. తన చెవులతో విన్నాడు. బిడ్డల్ని కోల్పోయాడు. వేదనలో దుఃఖంలో మునిగిపోయాడు. విజయం వరించి ఆశీర్వాదం కోరి వచ్చిన భీముణ్ని కౌగిలించుకోబోతుండగా కృష్ణుడు వెనక్కిలాగాడు. అదే ఆకారంలో ఉన్న ఇనుప విగ్రహాన్ని ముందుకు పెట్టడంతో ధృతరాష్ట్రుడు కౌగిలించుకొని పిండిపిండి చేసాడు. తన కొడుకుని చంపిన వాడి మీద ఆగ్రహమది. పుత్రశోకంతో ఉన్న ధృతరాష్ట్రున్ని కృష్ణుడు ఊరడించాడు. తన దివ్య దృష్టితో మృతి చెందిన వారిని చూపించాడు. ఆ తర్వాత నగరాన్ని వదిలి అడవికి గాంధారితో వెళ్ళాడు. సంజయుడు సహకరించాడు. తపోవృత్తిలోకి దిగాడు. ఒకరోజు అడవంతా దావానలం వ్యాపించగా సంజయుణ్ని పంపివేసి సతీసమేతంగా అగ్నికి ఆహుతయ్యాడు.

కడుపుతీపికీ రాజనీతికీ మధ్య రగిలి నలిగిపోయిన ధృతరాష్ట్రుని స్వభావం మానవమాత్రుల్లో స్పష్టంగా కనిపిస్తుంది!.

– బమ్మిడి జగదీశ్వరరావు

First Published:  28 May 2015 1:02 PM GMT
Next Story