Telugu Global
Family

కబీరు విందు (Devotional)

కబీరు బోధనలు విలువైనవి. సంప్రదాయానికి భిన్నమైనవి. కబీరు దేవుడు హిందువు కాడు, ముస్లిం కాడు. కబీరు బోధనలు మార్మికమయినవి.           కబీరు కాశిలో నివాసమేర్పరచుకుని అపుర్వమయిన తన వాణిని వినిపించాడు. ఆయన మణిపూసలాంటి మాటలకు ఎందరో ఆకర్షింపబడ్డారు. పేదలు, సంపన్నులు, అన్ని మతాల వాళ్లు, వర్గాల వాళ్ళు ఆయన వాక్కులు విని తరించే వాళ్ళు. కబీరు నేత పని వాడు. మగ్గంలో  నేసిన వస్త్రాలు అమ్మి జీవించే వాడు. నిరాడంబరుడు.           సాంప్రదాయ వాదులయిన హిందువుల,ముస్లింల మత […]

కబీరు బోధనలు విలువైనవి. సంప్రదాయానికి భిన్నమైనవి. కబీరు దేవుడు హిందువు కాడు, ముస్లిం కాడు. కబీరు బోధనలు మార్మికమయినవి.

కబీరు కాశిలో నివాసమేర్పరచుకుని అపుర్వమయిన తన వాణిని వినిపించాడు. ఆయన మణిపూసలాంటి మాటలకు ఎందరో ఆకర్షింపబడ్డారు. పేదలు, సంపన్నులు, అన్ని మతాల వాళ్లు, వర్గాల వాళ్ళు ఆయన వాక్కులు విని తరించే వాళ్ళు. కబీరు నేత పని వాడు. మగ్గంలో నేసిన వస్త్రాలు అమ్మి జీవించే వాడు. నిరాడంబరుడు.

సాంప్రదాయ వాదులయిన హిందువుల,ముస్లింల మత పెద్దలు కబీర్ మీద కక్ష పెంచుకున్నారు. ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. కారణం ఆయన బోధనలు భిన్నమైనవి. రెండు మతాల చందసాన్ని విమర్శించేవి.

కబీరు మనుషులు దేవుణ్ణి అన్వేషించాలి. అయితే దేవుడు బయట లేడు. మనుషుల హృదయాల్లో వున్నాడు. ఎవరికి వారు దేవుణ్ణి వాళ్ళ హృదయాల్లోనే వెతకాలి. గుళ్ళకు, మసీదులకు వెళితే దేవుడు కనిపించడు అన్నాడు.

అందువల్ల మత పెద్దలు ఆయనపట్ల ద్వేషం పెంచుకున్నారు. కానీ కబీరు అదేమీ పట్టించుకునే వాడు కాదు. తన మార్గం లో తను బోధనలు చేసేవాడు. ఆయన బోధనలు వినడానికి అన్ని చోట్ల నుండి విశేషంగా జనం వచ్చే వాళ్ళు.

కబీర్ ను దెబ్బకొట్టడానికి మత పెద్దలంతా కలసి ఒక ప్రణాళిక వేసారు. కబీరు గొప్ప సంపన్నుడని ఫలానా రోజు ఆయన గొప్ప యజ్ఞం చేయబోతున్నాడని ఆ రోజు మంచి విందు భోజనం పెడుతున్నాడని, జనం తండోప తండాలుగా తరలి రావాలని ప్రకటించారు. ఆ రోజు రానే వచ్చింది. యిదంతా కబీరు కు తెలీదు. జనం గుంపులు గుంపులు గా వచ్చారు. పరిసరాలు కిటకిటలాడిపోయాయి.

కబీర్ కు అప్పుడు అసలు నిజం తెలిసింది. ఆయన పేద నేత పనివాడు. ఇంత మందికి అతిధ్య మిచ్చే స్థోమత లేని వాడు. ఇట్లాంటి పరిస్థితి లో ఏమీ తోచక ఆయన కాశీని వదిలి వూరు చివరికి వెళ్ళిపోయాడు. ఒక చెట్టు కింద కూచుని ఏమి చెయ్యాలో తెలీక దిగాలు పడ్డాడు.

ఆయన వెళ్ళిన వెంటనే దేవుడు రంగంలోకి దిగాడు. ఎవరి ప్రమేయం లేకుండా విందు భోజనాలు ప్రత్యక్షమయ్యాయి. అద్భుతమయిన విందు. ఆ భోజనాలు తిని జనమంతా ‘కబీరు మహానుభావుడు, దాత’ అని కీర్తిస్తూ వెళ్లారు.

ఆ సంగతేమీ కబీర్ కు తెలీదు. జనం తన గురించి నిందించుకుంటూ ఉంటారని ఆయన చీకటి పడ్డాక యింటి వేపు వచ్చారు. చూస్తే అక్కడ పరిస్థితి వేరుగా వుంది. సుష్టుగా భోం చేసి జనం వెళ్ళారని యింట్లో వాళ్ళు చెబితే ఆశ్చర్య పోయాడు. ఆయన ఈ దైవ లీలకు కన్నీళ్ళు పర్యంతమయ్యారు. దేవునికి కృతజ్ఞతలు ప్రకటించారు.

ఆ సందర్భంగా ఆయన యిలా అన్నారు.

ఇది నేను చెయ్య లేదు, నేను చెయ్య లేను కూడా.

ఈ శరీరం యివేవి చెయ్యగల సామర్ద్యం లేనిది.

ఏది జరిగినా అదంతా దేవుడు చేసిందే.

ఆయన దయ వల్ల జరిగింది.

ఫలితమేమో కబీరుకు దక్కింది.

– సౌభాగ్య

First Published:  25 May 2015 1:01 PM GMT
Next Story