Telugu Global
WOMEN

ముందు న‌టిద్దాం...త‌రువాత నిజం చేసుకుందాం!

ప్ర‌పంచ జ‌నాభాలో స‌గం కంటే కాస్త ఎక్కువ‌గానే మ‌హిళ‌ల సంఖ్య ఉంది. కానీ సినిమా, టివి రంగాల్లో వారి ప్రాతినిధ్యాన్ని గురించి చెప్పాలంటే ముగ్గురు మ‌గ‌వారుంటే ఒక మ‌హిళ మాత్ర‌మే ఉంది. ఇది ఏదో ఒక దేశానికి ప‌రిమితం కాదు, ప్ర‌పంచ‌మంతా ప‌రిస్థితి ఇలాగే ఉంది. మ‌హిళ‌లు, అమ్మాయిలు ధ‌రిస్తున్న పాత్ర‌లు సైతం అంత‌గా ప్రాధాన్యత లేనివే అయి ఉంటున్నాయి. ఇవి ఆషామాషీగా చెబుతున్న‌వివ‌రాలు కాదు. గీనా డెవిస్ ఇన్‌స్టిట్యూట్ ఆన్ జండ‌ర్ ఇన్ మీడియా అనే సంస్థ అనేక అధ్య‌య‌నాలు చేసి తేల్చిన నిజాలు. […]

ముందు న‌టిద్దాం...త‌రువాత నిజం చేసుకుందాం!
X

ప్ర‌పంచ జ‌నాభాలో స‌గం కంటే కాస్త ఎక్కువ‌గానే మ‌హిళ‌ల సంఖ్య ఉంది. కానీ సినిమా, టివి రంగాల్లో వారి ప్రాతినిధ్యాన్ని గురించి చెప్పాలంటే ముగ్గురు మ‌గ‌వారుంటే ఒక మ‌హిళ మాత్ర‌మే ఉంది. ఇది ఏదో ఒక దేశానికి ప‌రిమితం కాదు, ప్ర‌పంచ‌మంతా ప‌రిస్థితి ఇలాగే ఉంది. మ‌హిళ‌లు, అమ్మాయిలు ధ‌రిస్తున్న పాత్ర‌లు సైతం అంత‌గా ప్రాధాన్యత లేనివే అయి ఉంటున్నాయి. ఇవి ఆషామాషీగా చెబుతున్న‌వివ‌రాలు కాదు. గీనా డెవిస్ ఇన్‌స్టిట్యూట్ ఆన్ జండ‌ర్ ఇన్ మీడియా అనే సంస్థ అనేక అధ్య‌య‌నాలు చేసి తేల్చిన నిజాలు. గీనా డెవిస్ అమెరికా న‌టి, ర‌చ‌యిత‌, ఫ్యాష‌న్ మోడ‌ల్‌, నిర్మాత‌. ఆస్కార్‌, గోల్డెన్ గ్లోబ్ అవార్డుల‌ను అందుకున్న ఆమె, మీడియాలో మ‌హిళా పాత్ర‌ల చిత్రీక‌ర‌ణ‌పై విశ్లేష‌కురాలిగా, స‌ల‌హాదారుగా ఉన్నారు. ఐక్య‌రాజ్య‌స‌మితి మ‌హిళా విభాగం, రాక్‌ఫెల్ల‌ర్ ఫౌండేష‌న్‌లతో క‌లిసి, త‌న సంస్థ ద్వారా, సినిమాల్లో మ‌హిళ‌ల పాత్ర‌లపై మొద‌టి అధ్య‌య‌న‌ నివేదిక‌ను విడుద‌ల చేశారు. గీనా డెవిస్ ఇన్‌స్టిట్యూట్ ఆన్ జండ‌ర్ ఇన్ మీడియా, ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినిమాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని ఈ అధ్య‌య‌నం నిర్వ‌హించింది. ఆ అధ్య‌య‌నం వెల్ల‌డించిన నిజాలు ఆశ్చ‌ర్య‌క‌రంగా ఉన్నాయి.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినిమాలు, టివిల్లో మ‌హిళ‌లు త‌క్కువ ప్రాదాన్య‌త ఉన్న పాత్ర‌ల‌నే పోషిస్తున్నారు. మ‌హిళ‌ల న‌ట‌న‌కు కాక ఆమె అందానికే తొలి ప్రాధాన్య‌త‌ను ఇస్తున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా తెర‌మీద క‌న‌బ‌డుతున్న న‌టీన‌టుల్లో మ‌హిళ‌ల సంఖ్య‌ నాలుగో వంతుక‌న్నా త‌క్కువ‌గా ఉంది. వారి జ‌నాభాతో పోలిస్తే ఈ ప్రాతినిధ్యం చాలా త‌క్కువ‌. డాక్ట‌ర్లు, న్యాయ‌మూర్తులు ఇంకా ఇలాంటి ఉన్న‌త వృత్తులు, నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలున్న పాత్ర‌ల్లో మ‌హిళ‌లు త‌క్కువ‌గా క‌న‌బ‌డుతున్నారు. మ‌గ‌వారికంటే రెండింత‌లు ఎక్కువ‌గా వారు అస‌భ్య‌మైన దుస్తులను ధ‌రించే పాత్రల్లోనూ, సెక్స్ సింబ‌ల్స్ గానూ క‌న‌బ‌డుతున్నారు. రేడియో, టివి, ప్రింట్ మీడియా వీటిల్లో మ‌హిళ‌ల గురించి విన‌బ‌డుతున్న వార్తలు, విష‌యాలు కేవ‌లం నాలుగో వంతు మాత్ర‌మే ఉంటున్నాయి. వీటిలో ప్ర‌సార‌మ‌వుతున్న కార్యక్ర‌మాల్లో స‌గం వ‌ర‌కు స్త్రీ పురుషుల అస‌మాన‌త్వాన్ని ప్ర‌తిబింబించేలా ఉంటున్నాయి.

ఇర‌వై సంవ‌త్స‌రాల క్రితం ప్ర‌పంచ నాల్గ‌వ మ‌హిళా స‌ద‌స్సు జ‌రిగిన‌పుడు అందులో పాల్గొన్న దేశాలు సినిమాలు, టివిలు, న్యూస్ పేప‌ర్లు, ఆన్‌లైన్ స‌ర్వీసుల్లో మ‌హిళ‌ల పాత్ర పెంచాల‌నే నిర్ణయం తీసుకున్నాయి. కానీ అది ఆచ‌ర‌ణ‌లో సాధ్యం కాలేదు. అస‌లు మ‌రొక ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యం ఏమిటంటే 1946లో సినిమాల్లో మ‌గ‌వారితో పోలిస్తే ఎంత త‌క్కువ సంఖ్య‌లో మ‌హిళా పాత్ర‌లు ఉన్నాయో ఇప్పుడూ అదే నిష్ప‌త్తిలో ఉంటున్నాయి.

తెర‌మీద క‌న‌బ‌డుతున్న మ‌హిళ‌ల పాత్ర‌లు వారిలో ఏ మాత్రం ఆత్మ విశ్వాసాన్ని పెంచ‌డం లేదు. మ‌గ‌వారు వారిని మ‌రింత‌గా లైంగిక దృక్ప‌థంతో చూస్తున్నారు.

మ‌హిళ‌ల వెనుక‌బాటు, వివ‌క్ష అన‌గానే మ‌న‌కు చాలా విష‌యాలు గుర్తొస్తాయి. విద్య‌, మ‌హిళా చ‌ట్టాలు, చ‌ట్ట స‌భ‌ల్లో ప్రాతినిధ్యం లాంటి ఎన్నో విష‌యాల‌ను గురించి మాట్లాడ‌తాం కానీ సృజ‌నాత్మ‌క రంగంలో వారి సంఖ్య‌, వారిని చిత్రిస్తున్నతీరు గురించి మాట్లాడం… అది చాలా ముఖ్య‌మైన విష‌యం అంటున్నారు గీనా డెవిస్.

మ‌హిళ‌ల విలువ‌, స‌మాజంలో వారి పాత్ర‌లను స‌రిగ్గా చూప‌క‌పోతే వారి జీవితాల్లో మార్పు రాద‌ని ఆమె చెబుతున్నారు. భ‌విష్య‌త్తులో మ‌హిళ ఎలా ఉండాల‌ని మీరు ఆశిస్తున్నారో అలాంటి మ‌హిళను సినిమాలు, టివిల్లో చూపాల‌ని ఆమె కోరుకుంటున్నారు. బ‌య‌ట ప్ర‌పంచంలో మ‌న‌కు చాలా కొద్ది మంది మాత్ర‌మే మ‌హిళా సిఇఓలు ఉన్నారు. కానీ తెర‌మీద చాలామందిని చూపించ‌వ‌చ్చుఅంటున్నారు ఆమె. మారిన మ‌హిళ‌ను ముందు తెర‌మీద ఆవిష్క‌రించ‌మంటున్నారు. అందుకు గీనా చెబుతున్న తేలిక ప‌రిష్కారం ఏమిటంటే మ‌గ‌వారికి సృష్టించిన పాత్ర‌ల్లో స్త్రీల‌ను న‌టింప‌చేయ‌డం. ఆ మొద‌టి అడుగైనా త్వ‌ర‌గా ప‌డుతుంద‌ని ఆశిద్దాం.

First Published:  23 May 2015 12:55 AM GMT
Next Story