Telugu Global
Family

 మరణం లేని చోటు (Devotional)

మనిషి పుట్టడం, పెరగడం, మరణించడం సహజంగా ప్రకృతిలో జరిగే విషయాలు. కాని మనిషి మరణించి మట్టిలో కలిసిపొవడాన్ని శివ జీర్ణించుకోలేక పోయాడు. పైగా సృష్టిలో ఎక్కడో మరణం లేని చోటు ఉంటుంది. తాను అక్కడికి వెళ్లి నిశ్చింతగా ఉండిపోవచ్చు అనుకున్నాడు. ఒక రోజు ఇంటి నుండి బయలు దేరాడు. తల్లి, తండ్రి, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు ఎంత బతిమలాడినా వినలేదు. మరణం లేని చోటును తను కనిపెడతాను అని దృఢ నిశ్ఛయంతో  ఇల్లు విడిచి పోయాడు. అతని కుటుంబం […]

మనిషి పుట్టడం, పెరగడం, మరణించడం సహజంగా ప్రకృతిలో జరిగే విషయాలు. కాని మనిషి మరణించి మట్టిలో కలిసిపొవడాన్ని శివ జీర్ణించుకోలేక పోయాడు. పైగా సృష్టిలో ఎక్కడో మరణం లేని చోటు ఉంటుంది. తాను అక్కడికి వెళ్లి నిశ్చింతగా ఉండిపోవచ్చు అనుకున్నాడు. ఒక రోజు ఇంటి నుండి బయలు దేరాడు. తల్లి, తండ్రి, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు ఎంత బతిమలాడినా వినలేదు. మరణం లేని చోటును తను కనిపెడతాను అని దృఢ నిశ్ఛయంతో ఇల్లు విడిచి పోయాడు. అతని కుటుంబం అతని కోసం ఎంతో విలపించింది.

శివ కొన్ని రోజులు ప్రయాణించి ప్రయాణించి మరణం లేని చోటు గురించి కనిపించిన వాళ్ళనల్లా ప్రశ్నిస్తూ సమాధానం రాకున్నా పట్టుదల వదలకుండా సాగిపోయాడు. అలా ఒకరోజు వెళుతూ ఉంటే ఎదురుగా పెద్ద గుట్ట కనిపించింది. అది రాళ్ళతో నిండి ఉంది. తెల్లటి గడ్డమున్న ఒక ముసలి వ్యక్తి ఆ రాళ్ళను తోపుడు బండిలో నింపి తీసుకుపోతున్నాడు. శివ ఆ ముసలి వ్యక్తితో మరణం లేని చోటు గురించి అడిగాడు ముసలతను ఆ సంగతి అయితే తెలీదు కానీ ఈ గుట్టలోని రాళ్ళను తీసేసి చదును చేసేంత వరకు నేను బతుకుతాను, నువ్వు నాతో బాటుంటే అన్నాళ్ళు బతుకుతావు అన్నాడు. “ఎన్నాళ్ళు?” అన్నాడు శివ. వంద సంవత్సరాలు అన్నాడు ముసలతను. ఐతే వంద సంవత్సరాల తరువాత ఉండవన్న మాట. నేను వెళుతున్నా అని శివ సాగిపోయాడు. మరుసటి రోజు ఒక అరణ్య మార్గంలో వెళుతూ ఉంటే ఒక ముసలతను చెట్టు నరుకుతూ కనిపించాడు. శివ మరణం లేని చోటు గురించి అడిగాడు. ఆ వృద్ధుడు ఆ సంగతేమో కానీ ఈ అడవిని నరికే పనిలో ఉంటే చాలా కాలం జీవించవచ్చు అన్నాడు. ఎన్నేళ్ళు అని శివ అడిగితే మూడు వందలేళ్ళు అన్నాడు వృద్దుడు. అంతేనా అని పెదవి విరిచి శివ సాగిపోయాడు. కొన్నాళ్ళకు ఒక సముద్ర తీరానికి చేరుకున్నాడు. అక్కడ ఒక బాతు సముద్రం నీళ్ళు తాగుతుంది. ఒక ముసలివాడు చూస్తున్నాడు. మరణం లేని చోటు గురించి శివ అడిగాడు. “మరణం లేని చోటు సంగతేమో గాని ఈ బాతు సముద్రం నీళ్ళు తాగేదాకా మనం బతికి ఉండ వచ్చు” అన్నాడు. ఎన్నేళ్ళని శివ అడిగితే ఐదు వందలేళ్ళు అన్నాడు ముసలాడు. తరవాత ఎలా అనుకుంటూ శివ సాగిపోయాడు.

ఒక రోజు నిర్జన ప్రదేశంలో సాగిపోతొంటే ఆ సాయంత్రం వెండి రంగులో దగ దగ లాడుతున్న భవనం కనిపించింది. శివ వెళ్లి తలుపు తట్టాడు. మోకాళ్ళ దాక తెల్లటి గడ్డమున్న వృద్ధుడు తలుపు తెరిచాడు. “మరణం లేని చోటు” అని శివ అనగానే “ఇదే! నువ్వు నిర్మలంగా ఉండొచ్చు” అని ఆహ్వానించాడు. నిద్ర, ఆహారం, ఆకలి వేటితోను నిమిత్తం లేకుండా హాయిగా, ఉల్లాసంగా కాలం సాగిపోయింది. ఒక రోజు శివ “మా కుటుంబం వాళ్ళని చూడాలనుంది” అన్నాడు. వృద్ధుడు వాళ్లెప్పుడో చనిపోయరన్నాడు. “పోనీ మా ఊరు చుసొస్తా” అన్నాడు. వృద్దుడు ఒక తెల్ల గుర్రాన్ని ఇచ్చి “వెళ్లిరా, కానీ గుర్రం మాత్రం దిగకు” అన్నాడు.

శివ ఉత్సాహంగా గుర్రమెక్కి వాయు వేగంతో తన ఊరు చేరాడు. కానీ మారిపోయిన పరిసరాలతో కలత పడి తిరిగి బయల్దేరాడు. గుర్రం మీద సాగుతూ ఉంటే పాత చెప్పుల కుప్పను తోపుడు బండిలో నింపుకున్న వృద్దుడొకడు “బాబూ ! బండిని అక్కడిదాకా తీసుకెళ్ళడానికి సాయం చెయ్యి” అన్నాడు. తనకు టైం లేదని శివ అన్నాడు. కానీ వృద్ధుడు దీనంగా బతిమలాడాడు. తప్పని సరై ఒక కాలు మాత్రం నేల మీద పెట్టాడు. వృద్దుడు వెంటనే వింత ఆకారంలోకి మారి శివను నేల పైకి లాగి “నేను ఎవరనుకున్నావు ? మరణాన్ని. నీ కోసం తిరిగి అరిగిపోయిన చెప్పులు ఇవన్నీ. ఇన్నాళ్ళకు దొరికావు” అంది మృత్యువు.

శివ జీవితం అలా ముగిసింది.

– సౌభాగ్య

First Published:  20 May 2015 1:01 PM GMT
Next Story