Telugu Global
NEWS

రాజుకుంటున్న ఓయూ భూముల వ్య‌వ‌హారం!

రోజురోజుకు ఓయూ భూముల వ్య‌వ‌హారం పెద్ద‌ద‌య్యేలా ఉంది. తెలంగాణ‌లో కాంగ్రెస్ జాతీయ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ప‌ర్య‌ట‌నతో ఆ పార్టీలో కొత్త ఉత్సాహం నింపింది. అదే ఊపుతో ఓయూ భూముల ప‌రిర‌క్ష‌ణ నినాదాన్ని కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం (ఎన్ఎస్‌యూఐ) భుజాల‌నెత్తుకుంది. దీనికి ఆపార్టీ సీనియ‌ర్‌నేత‌, ఎమ్మెల్సీ ష‌బ్బీర్ అలీ, మాజీఎంపీ పొన్నం ప్ర‌భాక‌ర్‌లు మ‌ద్ద‌తు తెలుపుతున్నారు. ఇదే అంశంపై ఇరుపార్టీల మ‌ధ్య మాట‌ల పోరు రోజురోజుకు తీవ్ర‌మ‌వుతోంది. ‘వ‌ర్సిటీ స్థ‌లాల జోలికి వ‌స్తే త‌రిమికొడ‌తాం’ అంటూ విద్యార్థులు […]

రాజుకుంటున్న ఓయూ భూముల వ్య‌వ‌హారం!
X
రోజురోజుకు ఓయూ భూముల వ్య‌వ‌హారం పెద్ద‌ద‌య్యేలా ఉంది. తెలంగాణ‌లో కాంగ్రెస్ జాతీయ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ప‌ర్య‌ట‌నతో ఆ పార్టీలో కొత్త ఉత్సాహం నింపింది. అదే ఊపుతో ఓయూ భూముల ప‌రిర‌క్ష‌ణ నినాదాన్ని కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం (ఎన్ఎస్‌యూఐ) భుజాల‌నెత్తుకుంది. దీనికి ఆపార్టీ సీనియ‌ర్‌నేత‌, ఎమ్మెల్సీ ష‌బ్బీర్ అలీ, మాజీఎంపీ పొన్నం ప్ర‌భాక‌ర్‌లు మ‌ద్ద‌తు తెలుపుతున్నారు. ఇదే అంశంపై ఇరుపార్టీల మ‌ధ్య మాట‌ల పోరు రోజురోజుకు తీవ్ర‌మ‌వుతోంది. ‘వ‌ర్సిటీ స్థ‌లాల జోలికి వ‌స్తే త‌రిమికొడ‌తాం’ అంటూ విద్యార్థులు ప్ర‌భుత్వానికి హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. ప్ర‌తిగా ముఖ్య‌మంత్రి సైతం ఘాటుగానే బదులిచ్చారు. ‘పేద‌ల‌కు ఇళ్లిస్తే త‌ప్పా! ఆ పేద‌ల జాబితాలో మీ ఇళ్లు ఉంటే ఇలాగే స్పందిస్త‌రా? ఏదేమైనా క‌ట్టి తీరుతాం. ఎవ‌డ‌య్య‌కు భ‌య‌ప‌డేది లేద‌ని’ గ‌ట్టిగానే స‌మాధానం చెప్పారు.
కేసీఆర్‌కు అంత ప‌ట్టుద‌ల ఎందుకు?..
ఓయూ ప‌రిస‌ర ప్రాంతాల‌లో నివ‌సించేది రోజు కూలీలు.వీరంతా తెలంగాణ జిల్లాల‌నుంచి వ‌ల‌స వ‌చ్చిన‌వారు. 2002లో హైద‌రాబాద్ కార్పోరేష‌న్ ఎన్నిక‌ల్లో గెలిచిన ఒకే ఒక్క కార్పొరేట‌ర్ సీటు కూడా వ‌డ్డెర‌బ‌స్తీ నుంచే కావ‌డం విశేషం. న‌గ‌రంలో రెండుసార్లు సికింద్రాబాద్ అసెంబ్లీ సీటు గెల‌వ‌డంలోనూ వీరిదే ప్ర‌ధాన‌పాత్ర‌. మొద‌టి నుంచి ఇక్క‌డ తెలంగాణ వాదం బ‌లంగా ఉండ‌టంతో ఈ ప్రాంతంలో పార్టీ పునాదుల‌ను మ‌రింత బ‌లోపేతం చేయాల‌ని కేసీఆర్ ఆలోచ‌న‌గా క‌నిపిస్తోంది. మ‌రోవైపు ఇంత‌వ‌ర‌కూ క్రియార‌హితంగా ఉన్న కాంగ్రెస్ నాయ‌కులు గ్రేట‌ర్ ఎన్నిక‌లు స‌మీపిస్తుండ‌టంతో ఈ అంశంపై ఇప్పుడిప్పుడే స్వ‌రం పెంచుతున్నారు. అయితే, ఓయూ భూముల వ్య‌వ‌హారాన్ని వ్య‌తిరేకిస్తున్న వారిలో న‌గ‌ర కాంగ్రెస్ నాయ‌కులు ఎవ‌రూ లేక‌పోవ‌డం విశేషం.
ఇంకా స్పందించ‌ని టీడీపీ..
తెలంగాణ‌లో గ‌త ప్రాభ‌వాన్ని కోల్పోతున్న టీటీడీపీ ఉనికిని చాటుకునే ప్ర‌య‌త్నాల్లో త‌ల‌మున‌క‌లైంది. ఉన్న ఎమ్మెల్యేల‌ను కాపాడుకుంటూ.. గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో ల‌బ్ధి పొందాల‌ని మినీ మ‌హానాడులు నిర్వ‌హిస్తూ కార్య‌క‌ర్త‌ల్లో ఉత్సాహం నింపే ప్ర‌య‌త్నం చేస్తోంది. నిజానికి టీడీపీ ఏనాడూ ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పై పోరాడింది లేదు. బ‌ల‌మైన మీడియా అండ‌దండ‌ల‌తోనే ప్రెస్‌మీట్ల‌తోనే కాలం గ‌డుపుతూ వ‌స్తోంది. ఇంత‌వ‌ర‌కూ ఈ అంశంపై టీడీపీ స్పందించ‌లేదు. వాస్త‌వానికి టీడీపీ అనుబంధ విభాగ‌మైన టీఎన్ఎస్ఎఫ్‌ అగ్ర‌నేత‌లను టీ ఆర్ ఎస్ ఏనాడో ఎగ‌రేసుకుపోయింది. దీంతో ఓయూలో ఆ విభాగం ఉందో? లేదో ? తెలియ‌డం లేదు. సికింద్రాబాద్‌లో టీడీపీకి బ‌ల‌మైన కేడ‌ర్ ఉంది. ప్ర‌తిసారీ అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో స్థానికేత‌రుల‌కు టికెట్ ఇస్తుండటంతో వారంతా అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. 2014 ఎన్నిక‌ల్లో ఆ ప్ర‌భావం స్ప‌ష్టంగా క‌నిపించింది. ఓయూ భూముల వ్య‌వ‌హారంలో టీడీపీ వైఖ‌రి ఎలా ఉంటుందో ?
First Published:  19 May 2015 11:47 PM GMT
Next Story