Telugu Global
Family

మన అనంతరం (Devotional)

ఆ గ్రామంలో మోషేష్లోమో మంచి వ్యాపారి. ఆయన భార్య రివ్‌కా. ఇద్దరూ దైవభక్తులు. సహృదయులు. ఎన్నో ధార్మిక సంస్థలకు ఎన్నో దానధర్మాలు చేసేవాళ్ళు, అందరికీ వాళ్ళంటే ఎంతో అభిమానం.             వాళ్ళకు ఆస్తులున్నాయి, అంతస్థులున్నాయి. మంచి పేరువుంది. కానీ వాళ్ళకు పిల్లలు లేరు. వాళ్ళకు పెళ్ళయి పదిహేను సంవత్సరాలయినా సంతానం లేదు, వాళ్ళకున్న దిగులల్లా అదే. ఎన్ని మంచి పనులు చేసినా, ఎంతగా ప్రార్థనలు చేసినా వాళ్ళకు పిల్లలు కలగలేదు.             బాల్‌ షెమ్‌తోవ్‌ సుప్రసిద్ధుడైన రబ్బీ. […]

ఆ గ్రామంలో మోషేష్లోమో మంచి వ్యాపారి. ఆయన భార్య రివ్‌కా. ఇద్దరూ దైవభక్తులు. సహృదయులు. ఎన్నో ధార్మిక సంస్థలకు ఎన్నో దానధర్మాలు చేసేవాళ్ళు, అందరికీ వాళ్ళంటే ఎంతో అభిమానం.

వాళ్ళకు ఆస్తులున్నాయి, అంతస్థులున్నాయి. మంచి పేరువుంది. కానీ వాళ్ళకు పిల్లలు లేరు. వాళ్ళకు పెళ్ళయి పదిహేను సంవత్సరాలయినా సంతానం లేదు, వాళ్ళకున్న దిగులల్లా అదే. ఎన్ని మంచి పనులు చేసినా, ఎంతగా ప్రార్థనలు చేసినా వాళ్ళకు పిల్లలు కలగలేదు.

బాల్‌ షెమ్‌తోవ్‌ సుప్రసిద్ధుడైన రబ్బీ. ఎందరి కష్టాల్నో తీర్చిన వాడాయన. ఆయన ఆశీర్వాదం పొందితే తమకు సంతానం కలగవచ్చన్న ఆశతో ఆ దంపతులిద్దరూ ఆయన సందర్శనానికి వచ్చారు.

బాల్‌షెమ్‌తోవ్‌ ఆ దంపతుల్ని ఆదరంగా ఆహ్వానించాడు. వాళ్ళు తమకు పిల్లలు లేని విషయం చెప్పి తమకు సంతానం కలగాలని భగవంతున్ని ప్రార్థించమని కోరారు.

బాల్‌షెమ్‌తోవ్‌ వాళ్ళకు ఐశ్వర్యం పెరగాలని, ఆరోగ్యంగా వుండాలని, చిరకాలం వాళ్ళు జీవించాలని, సంతోషంగా వుండాలని దేవుణ్ణి ప్రార్థించాడు. వాళ్ళు రబ్బీ దగ్గర సెలవు తీసుకుని వెళ్ళాక రబ్బీ శిష్యులు ”ఎందుకు మీరు వాళ్ళకు సంతానం కలగాలని దేవుణ్ణి ప్రార్థించలేదు?” అని అడిగారు. రబ్బీ వారి ప్రశ్నకు ఎలాంటి సమాధానం చెప్పలేదు.

కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. మోషేష్లోమో, రివ్‌కా ఇద్దరూ మళ్ళీ బాల్‌షెమ్‌తోవ్ని కలవడానికి వచ్చారు. ఈ మధ్యకాలంలో వాళ్ళ వ్యాపారం ఎంతగానో అభివృద్ధి చెందింది. ఎంతో సంపన్నులయ్యారు. విరివిగా దానధర్మాలు చేశారు. ఏకోశానా వాళ్ళు దిగులు పడడానికి ఎట్లాంటి పరిస్థితులూ లేవు.

తనని చూడడానికి వచ్చిన ఆ దంపతుల్ని పరామర్శించి బాల్‌షేమ్‌తోవ్‌ “అంతా క్షేమమే కదా! ఎందుకంత దిగులుగావున్నారు?” అని అడిగాడు.

వాళ్ళు “మీ ఆశీర్వాదంతో అంతా బాగానే వుంది. కానీ మాకు సంతానం లేదు. ఎన్ని వున్నా మన పేరు నిలిపే సంతానం లేని వ్యక్తి జీవితం వ్యర్థం. ఇంత సంపద ఉన్నా ఇది ఎవరికోసం? వంద ఏళ్ళ తరువాత ఈ నేలలో మా పేరు చెప్పుకునేవాళ్ళు ఉండరు. మాకు వారసత్వమే ఉండరు. ఈ జీవితానికి అర్థమే ఉండదు.” అంటూ కన్నీళ్ళు పెట్టుకున్నారు.

బాల్‌షెమ్‌తోవ్‌ వాళ్ళని ఓదార్చి సానునయంగా కొన్ని మాటలు చెప్పాడు. ప్రార్థన నిర్వహించాడు. అనంతరం “రేపు నేను, నా శిష్యులతో బాటు ఒక ప్రాంతానికి వెళుతున్నాం. మీరు కూడా మాతో బాటు రండి. కొత్త స్థలానికి వెళితే మీ మనసు తేలిక పడవచ్చు” అన్నాడు.

రబ్బీ ఆహ్వానాన్ని అంగీకరించి వాళ్ళు ఆయనతోబాటు ఆ కొత్త చోటికి వెళ్ళడానికి అంగీకరించారు. మరుసటి రోజు అందరూ బయల్దేరారు. రెండు రోజులు ప్రయాణం చేశాకా ఒక పట్టణంలో ఆగారు.

బాల్‌షేమ్‌తోవ్‌ ఆ దంపతుల్తో ఆ పట్టణంలో తిరిగి వింతలు, విశేషాలు తెలుసుకుందామన్నాడు. దంపతులు సరేనన్నారు. వాళ్ళు ముగ్గురూ కలిసి కొన్ని వీధులు తిరిగాకా ఒకచోట ఇసుకలో ఆడుకుంటున్న పిల్లల దగ్గరకు వెళ్ళారు. బాల్‌షెమ్‌తోవ్‌ ఆ పిల్లల్ని చూసి ఆనందించాడు. ఒక పసివాణ్ణి చూసి “నీ పేరేమిటి?” అని అడిగాడు.

ఆ కుర్రడు “బారూక్‌ మోషే” అన్నాడు. రబ్బీ యింకో కుర్రాణ్ణి నీపేరేమని అడిగాడు. ఆ కుర్రాడు కూడా “నా పేరు బారూక్‌ మోషే” అన్నాడు. రబ్బీ మూడో కుర్రాణ్ణి పేరడిగాడు. మూడో కుర్రాడు “మోషే అవ్‌రామ్‌” అన్నాడు. నాలుగో కుర్రాణ్ణి అడిగితే “నాపేరు బారూక్‌ మోషే” అన్నాడు.

అక్కడున్న కుర్రాళ్ళల్లో ఐదారుమంది అందరూ తమ పేరు బారూక్‌మోషే అని చెప్పారు. వాళ్ళు అక్కడినించీ కొంత దూరం వెళితే అక్కడున్న ఇసుకలో కొంతమంది చిన్ని అమ్మాయిలు ఆడుకుంటూ కనిపించారు.

బాల్‌ షెమ్‌తోవ్‌ వాళ్ళలో ఒకమ్మాయిని చూసి “నీపేరేమిటి?” అని అడిగాడు. ఆ అమ్మాయి “బ్రాచాలీ” అంది. అక్కడున్న అమ్మాయిల్లో ఎక్కువమంది పేర్లు “బ్రాచాలీ”గా వుండడం చూసి రబ్బీ ఆశ్చర్యపోయాడు.

అక్కడి నించీ వాళ్ళు సమీపంలోని కొన్ని పాఠశాలలకు వెళ్ళారు. అక్కడే చాలామంది కుర్రాళ్ళు బారూక్‌ మోషే అని, చాలామంది అమ్మాయిల పేర్లు “బ్రాచాలీ”గా ఉండడం చూశారు. అక్కడినించీ సినగాగ్‌ వెళ్ళి ప్రార్థన ముగించుకుని స్థానిక రబ్బీతో ఇక్కడ స్కూళ్ళల్లో ఉన్న చాలామంది పేరు ఒకేలా ఉండడానికి కారణమేమని అడిగాడు.

ఆ స్థానిక రబ్బీ దానికి సంబంధించి ఒక కథ చెప్పాడు. వంద ఏళ్ళకు ముందు ఈ ఉళ్ళో “బారూక్‌ మోషే” అన్న వ్యక్తి ఉండేవాడు. అతని తండ్రి కసాయి. తండ్రికి కొడుకు వ్యాపారంలో సహాయ పడేవాడు. కొన్నాళ్ళకి కొడుకు ప్రయోజకుడయ్యాకా “బ్రాచాలీ” అన్న అమ్మాయినిచ్చి అతనికి పెళ్ళి చేశాడు. కొంత కాలానికి తండ్రి కాలం చేశాడు. బారూక్‌ మోషే, బ్రాచాలీ ఆదర్శ దంపతులు. దానధర్మాలు చేసేవాళ్ళు. అందరి దగ్గరా మంచిపేరు తెచ్చుకున్నారు. వాళ్ళకున్న లోటల్లా వాళ్ళకు పిల్లలు లేరు. వందేళ్ళు గడిచాకా ఈ ప్రపంచంలో తమ గురించి అనుకునే వాళ్ళు ఉండరని దిగులు పడ్డారు.

ఒకసారి బారూక్‌ మోషే సినగాగ్‌లో ఉంటే ఒక రబ్బీ తాల్మద్‌ చదువుతూ “ఎవరయినా అతని స్నేహితుడి కొడుక్కి తోరా చదివి చెబితే అతను ఆ కుర్రాడికి జన్మనిచ్చినవాడవుతాడు” అన్నాడు.

ఆ మాటలు విని బారూక్‌ మోషే కన్నీళ్ళు నింపుకున్నాడు.

కారణం అతనికి పిల్లలు లేకపోగా అతనికి తోరా చదివే జ్ఞానం కూడా లేకపోవడమే. ప్రార్థన ముగిశాకా అతను రబ్బీతో ప్రత్యేకంగా ఒక విషయం గురించి చర్చించాలన్నాడు.

రబ్బీ అంగీకరించాడు. బారూక్‌ మోషే తనకు సంతానం లేదని, పిల్లలకు తోరా అధ్యయనం చేయించే జ్ఞానం తనకు లేదని దిగులు పడ్డాడు.

రబ్బీ “మీరు తోరా అధ్యయనం చెయ్యలేదని, పిల్లలకు బోధించలేదని దిగులు పడవద్దు. పిల్లలకు తోరా చెప్పడానికి ఇతర్లను మీరు నియమించినా ఆ గౌరవం మీకు దక్కుతుందని” చెప్పాడు.

దాంతో ఆ దంపతులిద్దరూ తమకున్న సమస్త సంపదనూ తోరా బోధనకు ఇచ్చేసి సాధారణ జీవితం గడిపాడు. నిరాడంబరంగా జీవించారు. అని కథముగిస్తూ రబ్బీ “అంత త్యాగమూర్తుల స్మృతి చిహ్నంగా మేము మా పిల్లలకు వాళ్ళిద్దరి పేర్లు పెట్టుకుంటున్నాం. తరతరాలుగా ఇది కొనసాగుతోంది. ఎందుకంటే వాళ్ళు అసాధారణమయిన దంపతులు. త్యాగమూర్తులు. వాళ్ళ పేర్లు అజరామరంగా ఈ భూమిపై ఉంటాయి. రాబోయే తరాలు కూడా వాళ్ళ పేర్లు గుర్తుంచుకుంటారు” అన్నాడు.

బాల్‌షెమ్‌తోవ్‌, అతని శిష్యులు, ఆ దంపతులు అందరూ ఆ రబ్బీకి కృతజ్ఞతలు చెప్పి తిరుగు ప్రయాణానికి సిద్ధపడ్డారు.

ప్రత్యేకించీ అందరూ ఆ ప్రయాణంలోని పరమార్ధాన్ని గ్రహించారు. ముఖ్యంగా మోషేష్లోమో, రివ్‌కాలు.

తిరిగి తమ ఊరు చేరిన వెంటనే మోషేష్లోమో, రివ్‌కాలు కొంత మంది ఉపాధ్యాయుల్ని ఎంపిక చేసి పేద విద్యార్థుల విద్యాబోధన కోసం వాళ్ళని నియమించారు. వాళ్ళ దాతృత్వం కారణంగా డజన్ల సంఖ్యలో పేదవిద్యార్ధులు తోరా అధ్యయనం చేశారు.

తరువాతి తరం ఆ పట్టణాన్ని దర్శిస్తే అందులో చాలామంది పిల్లలకు “మోషేష్లోమో, రివ్‌కా” ల పేర్లు వుంటే ఎవరూ ఆశ్చర్య పడరు.

– సౌభాగ్య

First Published:  16 May 2015 1:01 PM GMT
Next Story